రాయమని నా పెన్ను ఉరుకులాడినా నా తెలంగాణ ఇంట్ల పీనుగుంటే
రాయమని నా పెన్ను ఉరుకులాడినా
నా తెలంగాణ ఇంట్ల పీనుగుంటే
రాయనీకె నా మనసొప్పుత లేదు...
ఎడమ చేతి పిడికిలి లాగ కుడి చేతిలో పెన్నుగూడ
బిర్రుగ బిగుసుకుంది... సుక్కవెట్టనీకే కూడా కదలక
కన్నీటి సుక్కలతో కాయితం తడిశిపోతుంది...
ఏం రాయాలి "మీ" గురుంచి..?
ఆత్మ బలిదానం చేసిన వీరులనా..?
అంతరాత్మ ను జయించలేని పిరికోల్లనా..?
అన్ని మరిచి...
అన్నదమ్ములను అమ్మ నాన్నను
అయిన వారిని కాని వారిని...
ఆగమైన ఆ గుండెలను...
ఆత్మ వంచన చేసుకోమంటిరి
వినూత్న రూపాలలో తెలంగాణ ప్రజానీకం
నిరసన తెల్పుతున్నదనీ
ఇంకే కళ మీకు లేనట్టు... రానట్టు...
చావే ఒక కళ అనుకుంటిరనా..?
అటికే కింది మషి బొట్టు దిష్టి సుక్కలాగ
నీ సావుతో సకల జనుల సమ్మెకు దిష్టి తీస్తిరనా..?
తెలంగాణ ఇండ్లల్ల ఏడుపు పెడబొబ్బలు కరువైనవనుకుంటిరనా..?
ఇంతటి త్యాగం ఇంకెవడు చెయ్యలేడనుకుంటిరనా..?
ఊరి బయటి బొందల గడ్డ మీద మీకు కన్ను పడ్తదని
పాపం... ఏ ఊరు కలగంటది రా..?
ఇట్ల సచ్చినోల్లకు పిండంబెడ్తే
తెలంగాణ నల్ల రేగట్ల పండిన అన్నం మెతుకుగూడ
నారాజ్ అయితదేమో...
ఆగరా ఇంకా..? ఈ సావులు ఆపరా ఇంకా..?
ఆలోచించుండ్రి...
ఆగం కాకుండ్రి...
మమ్లను ఆగం జెయ్యకుండ్రి...
-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి
0 comments:
Post a Comment