Tuesday, January 31, 2012
కొనబోతే కొరివి
- వినియోగదారుడు విలవిల
- దిగుబడి తక్కువ.. డిమాండ్ ఎక్కువ
- దళారులదే రాజ్యం
- రైతుకు దక్కని మద్దతు
- ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
- మార్కెట్‌లో స్టోరేజీల కొరత
- పెరిగిన రవాణా చార్జీలు
- బెండకాయలు కిలో రూ. 40
- వంకాయలు కిలో రూ. 30ఏది కొన్నా జేబుకు చిల్లే
- చుక్కల్లో కూరగాయల ధరలు
చిక్కుడు... కొండెక్కింది..! చింతపండు మరీ పులుపెక్కింది..! కాకరకాయ చేదునే మిగులుస్తున్నది..! ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ, ఊర్ల గడ్డ.. ఏ కూరగాయలు తీసుకున్నా భగ్గుమంటున్నాయి. పాలకూర, మెంతికూర, చుక్కకూర.. ఏ ఆకుకూర అయినా ముట్టుకుంటేనే మూర్ఛ వచ్చేలా ఉంది. ఎన్నడూ లేనంతగా మార్కెట్‌లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. పొద్దస్తమానం కాయకష్టం చేసి వాటిని పండించే రైతుకు మాత్రం మద్దతు ధర దక్కడం లేదు. దళారుల రాజ్యంలో ఇటు రైతు, అటు వినియోగదారుడు నిండా మునిగిపోతున్నారు. వారం వ్యవధిలో మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయల ధరలు ఊహించని స్థాయిలో పెరిగి పోయాయి. వంద రూపాయలు తీసుకొని మార్కెట్‌కు పోతే... ఒకటీ, రెండు కూరగాయలు తప్ప ఏమీ కొనలేని పరిస్థితి.
ఇన్నాళ్లు 15 రూపాయలకు కిలో దొరికిన బెండకాయలు ఇప్పుడు రూ.40 పెట్టినా గానీ దొరకడం లేదు. రవాణా చార్జీలు, ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోవడంతో రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు మొగ్గుచూపడం లేదు. దీనికి కరువు పరిస్థితులూ తోడై దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గి పోవడం తోనే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటు న్నారు. తాము పంట పండించినా మార్కెట్‌లో అమ్ము కోవడానికి ప్రభుత్వ సహకారం లభించడం లేదని, ఫలితంగా దళారులను ఆశ్రయిస్తున్నా మని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వినియోగదారులు కూరగాయల ధరలు పెరిగి పోవడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.
(టీ న్యూస్-నెట్‌వర్క్): గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడవి.. అన్నట్లుంది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 69,42,562 హెక్టార్లలో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు పెరిగిపోతే వాటిని పండించిన రైతులు ప్రయోజనం పొందాలి. కానీ వారికి మద్దతు ధర దక్కడం లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. దళారులు మాత్రమే బాగుపడుతున్నారు. రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కూరగాయాలకు వారే ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. మార్కెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 650 వరకు రైతు బజార్లు ఉన్నాయి.
హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ప్రధానమైనవి 16 రైతు బజార్లు ఉన్నాయి. ఏ ఒక్క రైతు బజారులోనూ రైతులు కూరగాయలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు అప్పటికప్పుడు అమ్ముకొని పోవాల్సి వస్తోంది. లేకుంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైతుల నుంచి టామాటలను కిలోకు ఒక్క రూపాయి చొప్పున దళారులు కొంటారు. వాటిని వినియోగదారులకు రూ. 6 చొప్పున అమ్ముతారు. దళారుల దందా మూలంగా ఇటు రైతులు, అటు వినియోగదారులు మోసపోతున్నారు.
రవాణా చార్జీలు పెరగడం కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పెరిగిన డీజిల్ ధరలు రైతులపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపుతున్నాయి. పంట వేసేందుకు ట్రాక్టర్‌తో దుక్కి దున్నింది మొదలు మార్కెట్‌కు కూరగాయలను తరలించే వరకు డీజిల్ ధరల ప్రభావం వారిపై పడుతున్నది. రైతులు నష్టపోవడానికి ఇదీ ఓ కారణం. రైతులు పండించిన పంటలు బహిరంగ మార్కెట్‌లో వారే ధర నిర్ణయించుకుని అమ్ముకునే అవకాశం కల్పించినట్లయితే ప్రయోజనం ఉంటుందన్న అభివూపాయం వ్యక్తమవుతోంది.
హైబ్రీడ్ విత్తనాలతో రైతుల బేజారు
విత్తనాలను ఉత్పత్తి చేసే సంస్థలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రకరకాల కంపెనీల పేరుతో హైబ్రీడ్ విత్తన సంస్థలు పుట్టుకొచ్చాయి. హైబ్రీడ్ విత్తనాల పంటలు ఏపుగా పెరుగుతున్నాయి తప్ప కాత కాయడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు కాంప్లెక్స్ ఎరువులు విరివిగా వాడుతున్నారు. దీంతో భూసారం కోల్పోతున్నది తప్ప పంట దిగుబడి రావడం లేదు. హైబ్రీడ్ విత్తనాలతో వచ్చిన తొలి పంటను రిలయన్స్ వంటి సంస్థలు కొనుగోలు చేస్తాయి. మలి పంటను తీసుకోవడానికి ఈ సంస్థలు నిరాకరిస్తాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ రైతులు మార్కెట్‌కు తరలించే పరిస్థితి ఏర్పడుతున్నది.
చైతన్యం నింపని సదస్సులు
ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రైతు చైతన్య సదస్సులు రాజకీయ సదస్సులుగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏ కాలంలో ఏయే పంటలు వేయాలి.. ఏ మోతాదులో ఎరువులు వాడాలి.. పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పంటను మార్కెట్‌కు తరలించినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి? దళారుల బారిన పడకుండా పంటను ఎలా విక్రయించుకోవాలి తదితర విషయాల్లో రైతులకు ఈ సదస్సుల ద్వారా అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం మొక్కుబడిగా వీటిని నిర్వహించి చేతులు దులుపుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్‌కు ధరల సెగ
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఎన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోయాయి. మరో 20 రోజుల్లో ఉత్పత్తి పడిపోనుంది. వారం రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం కిలోకు సుమారు రూ.15 నుంచి రూ.1 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం పడిపోవడం, కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు వాటిని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా సరిపడా కూరగాయలు దిగుమతి కావడం లేదు. నగరంలో రోజుకు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 500 మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం కేవలం 200-300 మెట్రిక్ టన్నులు దిగుమతి అవుతున్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ కూరగాయలు లేకపోవడంతో దళారులదే రాజ్యంగా మారుతోంది. వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మార్కెట్‌లో 40 శాతం ధరలను పెంచి వారు సొమ్ము చేసుకుంటున్నారు.
దళారుల ధరలు..
రైతుబజార్లలో ధరలకు సంబంధించి 1999లో ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. వాటి ధరలు సమీపంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ల ధరలకు దగ్గరగా ఉండాలి. ఎస్టేట్ అధికారులు, రైతులు కలిసి నాణ్యత ప్రమాణంగా ధర ఖరారు చేయాలి. కానీ హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఇది జరగడం లేదు. బోయిన్‌పల్లి మార్కెట్‌లోని కూరగాయల రేట్ల ఆధారంగా హైదరాబాద్ నగరంలోని రైతుబజార్లలో ధరలు నిర్ణయిస్తున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌కు తక్కువ కూరగాయలు దిగుమతి అయితే అక్కడ సాధారణంగా ధరలు పెంచుతారు. ఆ ప్రభావం నగరంలోని అన్ని రైతుబజార్లపై పడుతుంది. వాస్తవంగా అక్కడి కూరగాయలకు, రైతుబజార్లలో రైతులు తీసుకువచ్చే వాటికి ఎలాంటి సంబంధం లేదు.
మెదక్‌లో కూర‘గాయాలు’: రాష్ట్ర రాజధాని మెదక్ జిల్లాకు ఆనుకొని ఉండటంతో నగరవాసుల కూరగాయల అవసరాల్లో సింహభాగం మెదక్ జిల్లానే తీరుస్తున్నది. జిల్లాలోని వర్గల్, ములుగు, గజ్వేల్, తూప్రాన్, జగదేవపూర్, తొగుట, గుమ్మడిదల, జిన్నారం వంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కువ సంఖ్యలో కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వంటిమామిడిలోని కూరగాయల మార్కెట్ నుంచి ప్రతిరోజూ సుమారు 170 నుంచి 200 టన్నుల కూరగాయలు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుంటాయి. నగరవాసుల అవసరాలు తీరుస్తున్నా స్థానికంగా మాత్రం కూరగాయల రేట్లు మండిపోతున్నాయి.
మహబూబ్‌నగర్, ఖమ్మంలో కష్టాలు
జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితుల్లో లేరు. ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయ బోర్లలో నీటి శాతం తగ్గింది. వాటితో పాటు ఇటీవల ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల కూరగాయలు ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. దీంతో జిల్లాలో కూరగాయల సాగు పడిపోయింది. నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యులకు కూరగాయలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఖమ్మం జిల్లాలోనూ కూరగాయల ధరలు భగ్గున మండుతున్నాయి. ధరలు చుక్కలనంటుతుండటంతో సామాన్యులు మార్కెట్లో కూరగాయలు కొనలేని దుస్థితి ఏర్పడుతోంది. అంగట్లో అదిరిపోయే ధరలతో సామాన్యుల దిమ్మ తిరుగుతోంది. పూటగడవని కూలీలకు పచ్చళ్ళే పంచభక్షపరమాన్నాలుగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర అందటంలేదు.
ఆదిలాబాద్ అతలాకుతలం
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మార్కెట్లలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత పక్షం రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయని వినియోగదారులు ఆందోళన చెందుతుండగా, వర్షాభావ పరిస్థితులు, సాగు ఖర్చులు పెరగడం, రవాణా చార్జీలు తడిసి మోపెడు కావడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక కొన్ని కూరగాయలు మార్కెట్‌లలో దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. మార్కెట్‌లో క్యాలిఫ్లవర్, తోటకూర, బీరకాయ, గోరుచిక్కుడు, దోసకాయ, చిక్కుడుకాయ లాంటి కూరగాయలు అంతంత మాత్రంగానే దొరుకుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే టమాట, ఆనిగపుకాయ, బెండకాయ, కాకరకాయ, ఆకుకూరలైన పాలకూర, మెంతికూర, దిగుబడి 50 శాతం మేరకు తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు. మిర్చి, వంకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, క్యాబేజీ పంట దిగుబడులు చివరి దశకు చేరుకున్నాయి.
కరీంనగర్‌లో తగ్గిన విస్తీర్ణం
కరువు కారణంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. రబీలో సాధారణ విస్తీర్ణం 2,65 హెక్టార్లు కాగా 700 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. లేబర్ కొరత కారణంగా కూరగాయలు సాగు మాని పత్తిపంట వైపు రైతులు మొగ్గు చూపారు. పత్తిపంటకు గత ఏడాది మద్దతు ధర ఎక్కువ రావడంతో అటువైపు మొగ్గుచూపారు. ఎక్కువ కూరగాయల ఉత్పత్తులు జరిగే కరీంనగర్ మండలాన్నే తీసుకుంటే గత ఏడాది 1500 ఎకరాల్లో సాగు జరిగితే ఈ ఏడాది ఐదు వందల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. బోయినపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో ఏటా ఐదు వందల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే ఈ ఏటా రెండువందల ఎకరాల్లో మాత్రమే సాగుజరిగింది. జిల్లాలో ఒక్క టమాట మినహా అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక వరంగల్, నిజామాబాద్, నల్లగొండతో పాటు సీమాంవూధలోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
Take By: T News
నేడు వేతన ఒప్పందం ఖరారు!
- రెండు ప్రధాన డిమాండ్లకు కోలిండియా ఓకే
గోదావరిఖని/ కోల్‌బెల్ట్, : ఏడు నెలలుగా ఊరిస్తున్న బొగ్గు గని కార్మికుల తొమ్మిదో వేతన ఒప్పందంపై మంగళవారం ఎంఓయూ కుదిరే అవకాశముంది. కొంతకాలంగా వేజ్‌బోర్డు చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఓం ప్రకాశ్ జైస్వాల్‌తో జేబీసీసీఐ కోర్‌కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు డిమాండ్లపై సానుకూలత వ్యక్తమైనట్లు ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి ‘టీన్యూస్’కు తెలిపారు. కోల్ ఫీల్డ్ అల 4 శాతం, హెచ్‌ఆర్‌ఏ 2 శాతం పెంచేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం. కార్మిక సంఘాలు కోల్‌ఫీల్డ్ అల 5 శాతం, హెచ్‌ఆర్‌ఏ 10 శాతం పెంచాలని డిమాండ్ చేసినప్పటికీ కొంత పట్టు విడవడంతో చర్చల్లో ప్రతిష్టంభన తొలగినట్లయింది. ఐదు దఫాలుగా కోలిండియా యాజమాన్యంతో జాతీయ కార్మిక సంఘాలు జరిపిన చర్చల్లో 25 శాతం వేతనాల పెరుగుదలపై ఇప్పటికే అవగాహన కుదిరింది. అలాగే ఇప్పుడిస్తున్నఅల శాతం పెంచేందుకు కూడా అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో వేతన ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేసే అవకాశముంది. ఈ లెక్కన సగటున ఓ కార్మికుడికి రూ. 3500 వేతనం పెరిగే అవకాశం ఉంది. సింగరేణి సీఎండీ నర్సింగరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, సీఐటీయూ సింగరేణి విభాగం అధ్యక్షుడు నర్సింహారావు, ఐఎన్టీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీ వెంకవూటావు, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తదితరులు సోమవారం ఢిల్లీ వెళ్లారు. మంగళవారం తుదిచర్చల్లో పాల్గొని వేతన ఒపందాన్ని ఖరారు చేస్తారని తెలిసింది.