- అందుకే ‘పార్లమెంటు’ ఎగ్గొట్టి నాటకాలు
- ‘బిచ్చగాళ్ల’ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అవమానం
- 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేనిది ఐదేళ్లలో రాహుల్ ఎలా చేస్తారు?
- లక్నో ఎన్నికల ర్యాలీలో మాయావతి
లక్నో, నవంబర్ 27: ఉత్తరవూపదేశ్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ తనపై గుప్పించిన ఆరోపణలను అంతే తీవ్రస్థాయిలో యూపీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత మాయావతి తిప్పికొట్టారు. తన పార్టీ గుర్తు అయిన ‘ఏనుగు’ను చూస్తే రాహుల్‌కు పీడకలలు వస్తున్నాయని, అందుకే పార్లమెంటు సమావేశాలను ఎగ్గొట్టి మరీ ఆయన నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ‘బీఎస్పీకి ఉన్న జనాదరణను చూసి కాంగ్రెస్ బెంబేపూత్తుతోంది. అందుకే ‘యువరాజు’ పార్లమెంటు సమావేశాలను ఎగ్గొటి మరీ యూపీకి వచ్చి నాటకాలాడారు. బీఎస్పీ గుర్తు ‘ఏనుగు’ కాంగ్రెస్ నేతలను కలలో సైతం వెంటాడుతున్నట్లుంది.
‘ఏనుగు’ మరోసారి తమను కాళ్ల కింద తొక్కేసినట్లు పీడకలలు కంటూ.. వారు నిద్రకు దూరమయినట్లు కనిపిస్తోంది. అందుకే దాని పేరిట నిరాధార ఆరోపణలు గుప్పిస్తున్నారు’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ ఐదురోజుల యూపీ పర్యటనలో భాగంగా కేందం పంపుతున్న నిధులన్నీ ‘ఏనుగు’ మెక్కుతోందని, మాయావతి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. లక్నోలో ఆదివారం జరిగిన ‘దళిత-ఓబీసీ’ల భారీ ర్యాలీతో మాయావతి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. యూపీ ప్రజలు పొరుగు రాష్ట్రాల్లో ‘బిచ్చగాళ్లు’గా మారారన్న రాహుల్ వ్యాఖ్యలు రాష్ట్రవూపజలను అవమానపరిచాయని తెలిపారు. యూపీని అభివృద్ధి పరచడంలో వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమవ్వడం వల్లే రాష్ట్ర ప్రజలు పొరుగు రాష్ట్రాలకు బతుకుదేరువు కోసం వలస వెళుతున్నారని పేర్కొన్నారు.
తమకు అధికారం ఇస్తే ఐదేళ్లలో యూపీని నెంబర్ వన్ చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలు ‘రాజకీయ గిమ్మిక్కు’ అని ఆరోపించారు. ‘40 ఏళ్లు పాలించిన ఆయన పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో విఫలమైంది. ఇక ఆయన ఎలా ఐదేళ్లలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్ చేస్తారు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళితులను, ఓబీసీలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం అమలులో వివక్షకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. చౌకబారు ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడిన వారిపై తన సర్కారు కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. పథకాల కింద కేంద్రం నుంచి నిధులు పొందే హక్కు రాష్ట్రానికి ఉందని, ఎవరి దయాదాక్షిణ్యం వల్ల ఇవ్వడం లేదని తేల్చిచెప్పారు. కేంద్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం కింద 365 రోజులూ పని కల్పిస్తామని ప్రకటించారు.
చిన్న చిన్న ఘటనలపై పెద్ద రాద్ధాంతం చేస్తూ కేంద్రం యూపీకి మాత్రమే కమిషన్లను పంపుతోందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెద్ద పెద్ద దుర్మార్గాలు జరిగినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి వచ్చే 15 ఏళ్లు దళిత ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఓబీసీ ముఖ్యమంత్రి ఉండేలా చూడటమే తన ధ్యేయమని, దీనివల్ల ఈ సామాజిక వర్గాల సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. తనకు గట్టి మద్దతుగా ఉన్న ఈ సామాజిక వర్గాలను సంతృప్తిపరిచే వరాలు కురిపించారు. ఉత్తరవూపదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే దళితులు, వెనకబడిన వర్గాలు తన వెంటే ఉన్నారని చాటడానికే ఆమె భారీస్థాయిలో ఈ ర్యాలీ నిర్వహించినట్లు భావిస్తున్నారు.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Mayawathi
Read more...