-లోక్‌సభలో రోజంతా చర్చ..
-లొసుగులపై విపక్షాల రచ్చ
-తొందరేంలేదు.. మళ్లీ తీసుకురండి
-2, 3 నెలలైనా ఫర్వాలేదు: సుష్మ
-అవినీతిపై పోరుకు సహకరించండి
-లోక్‌పాల్‌ను ఆమోదించండి
-పార్లమెంటుకు ప్రధాని విజ్ఞప్తి
-సీబీఐని చేర్చేది లేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 27:ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లోక్‌పాల్ బిల్లును మంగళవారం ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదించింది. ఒకవైపు బలమైన లోక్‌పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ముంబైలో నిరాహార దీక్షకు కూర్చోగా, మరోవైపు ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుపై పలు పార్టీలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో పార్లమెంటు ఆమోదం కోసం ప్రభుత్వం ముందుకొచ్చింది. బిల్లుపై చర్చలో భిన్నాభివూపాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తి లోపాలతో ఉన్న బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త బిల్లును తేవాలని బీజేపీ డిమాండ్ చేయగా, మార్పులు అవసరమని వివిధ పార్టీలు సూచించాయి. సమతుల్యతతో రూపొందించిన బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం కోరింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య పలుమార్లు తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు నేతలు తమదైన శైలిలో విమర్శలు, విసుర్లు, ఛలోక్తులతో ఆసక్తి కలిగించారు.లోక్‌సభలో బిల్లు పెడుతున్న సందర్భంగా మంత్రి నారాయణస్వామి పార్లమెంటు ఔన్నత్యం గురించి నొక్కిచెప్పారు. ‘‘మనం ఈ సభకు మాత్రమే తలవంచాలి. అంతేతప్ప మరెవరికీ కాదు’’ అని పరోక్షంగా అన్నాను ఉద్దేశించి అన్నారు. అవినీతికి సంబంధించిన నేరానికి పాల్పడ్డట్లు విశ్వసించిన పక్షంలో అలాంటివారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రతిపాదిత బిల్లు ప్రకారం అధికారం లభిస్తుందని, లోక్‌పాల్, లోకాయుక్త బిల్లుకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయని మంత్రి చెప్పారు. లాలు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాల లోకాయుక్తలకు సంబంధించి కూడా జోక్యం చేసుకోవడం రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. లోకాయుక్తల ఏర్పాటు గురించి, గుజరాత్‌లో అవినీతి నిరోధక వ్యవస్థ లేకపోవడం గురించి మంత్రి ప్రస్తావిస్తుండగా ఏఐఏడీఎంకే, బీజేపీ సభ్యులు లేచి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బిల్లు పూర్తి లోపాలతో ఉందని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు.
‘‘బిల్లును ఉపసంహరించాలి. హడావిడిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. తిరిగి స్థాయీసంఘానికి పంపించండి. 3, 4 నెలల తర్వాత తిరిగి ప్రవేశపెట్టండి. ఈ సమావేశాల్లోనే బిల్లు కావాలని మేం కోరాం. కాని, మేము ఇలాంటి బిల్లును కోరుకోలేదు’’ అన్నారు. రాష్ట్రాల్లో లోకాయుక్తలకు సంబంధించి ప్రభుత్వం తొలుత గందరగోళాన్ని తొలగించుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రాలు దానిని తప్పనిసరిగా అనుసరించాలా లేదా వాటి ఇష్టవూపకారం వ్యవహరించవచ్చా అన్నది స్పష్టం చేయాలన్నారు. మంత్రి కపిల్ సిబల్ ఐచ్ఛికమంటుంటే మరోమంత్రి నారాయణస్వామి విధిగా నెలకొల్పాల్సిందేనంటున్నారని ఆమె తప్పుబట్టారు. బిల్లు సమాఖ్య స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. లోక్‌పాల్‌లో మైనారిటీల రిజర్వేషన్‌కు సంబంధించి ఆమె రెండో అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ ప్రతిపాదన విభజనకు విత్తనాలను నాటుతుందని విమర్శించారు. రిజర్వేషన్లు లేకుండానే మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఉన్నత పదవులను నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె లాలూను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ కుటిలత్వాన్ని లాలు అర్థం చేసుకోలేకపోతున్నారనిపిస్తోంది. ఇప్పుడాయన తెలుసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆమె వ్యాఖ్యానించగా, ‘‘బీజేపీ దేశాన్ని విడదీయాలని కోరుకుంటోంది’’ అని లాలూ బదులిచ్చారు. లోక్‌పాల్‌ను ప్రభుత్వం అన్ని రకాలుగా నియంవూతించేలా ప్రస్తుత బిల్లు ఉందని, ప్రధానికి చాలా రక్షణలు కల్పించారని, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని సుష్మా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కపిల్‌సిబల్ బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. బిల్లును ఆలస్యం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. చర్చ సందర్భంగా యూపీఏ మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే కూడా లోకాయుక్తల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంతో విభేదించాయి. బలమైన లోక్‌పాల్ అవసరమని, ఆ వ్యవస్థ పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలని సీపీఎం నేత బసుదేవ్ ఆచార్య కోరారు.
-సీబీఐని లోక్‌పాల్‌లో చేర్చం
-ప్రధాని మన్మోహన్ స్పష్టీకరణ
లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐని తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్ తోసిపుచ్చారు. దేశ రాజ్యాంగ స్వరూపానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేప లేదని స్పష్టం చేశారు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన జోక్యం చేసుకుంటూ అవినీతిపై పోరాటంలో ఫెడరలిజం అడ్డంకి కాకూడదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అవినీతి క్యాన్సర్‌పై పోరాటంలో కలిసిరావాలని, బిల్లు ఆమోదానికి సహకరించాలని ఆయన కోరారు. ‘‘సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావడమనే ప్రతిపాదన సరికాదు. దానివల్ల పార్లమెంటుకు వెలుపల ఒక కార్యనిర్వాహక నిర్మాణం ఏర్పడుతుంది.. అది ఎవరికీ జవాబుదారీకాకుండాపోతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది’’ అని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు. అవినీతి, దాని పర్యవసానాలు ఎలా దారితీస్తున్నాయో గుర్తుంచుకోవాలని, గత ఏడాది కాలంలోనే ప్రజాక్షిగహం ఎలా వ్యక్తమయిందో గమనించాలని అన్నారు. అందుకే ప్రతిపాదిత బిల్లును ఆమోదించాలని కోరారు. బిల్లును రూపొందించే ముందు విసృ్తతంగా సంప్రతించామని, రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. లోక్‌పాల్‌పై రోజంతా చర్చ కొనసాగగా, ప్రధానమంత్రి అలాగే కూర్చున్నారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, అవినీతిపై పోరాటంలో సభ అభివూపాయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉందని అన్నారు. లోకాయుక్తల ఏర్పాటు అవసరాన్ని ప్రధానమంత్రి గట్టిగా సమర్థించారు. ‘ఆమ్ ఆద్మీ’ (సాధారణ పౌరుడు) పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నాడని ఆయన పేర్కొన్నారు. నీరు, విద్యుత్, మునిసిపల్ సేవలు, భూమి రికార్డులు, పోలీస్, రేషన్‌షాపులు.. తదితర నిత్యావసర సమస్యలన్నీ రాష్ట్రాలకు, స్థానిక అధికార సంస్థలకు సంబంధించినవని, ఈ సమస్యల పరిష్కారానికి లోకాయుక్తల ఏర్పాటు అవసరమని ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘లోకాయుక్తలను ఏర్పరచకపోతే అవినీతి క్యాన్సర్ విస్తరిస్తుంది. ఈ విషయంలో మనం ఇంకెంతమాత్రం ఆలస్యం చేయరాదు’’ అని ఆయన అన్నారు.
లోక్‌పాల్‌తో అవినీతి పోదు: ములాయం
లోక్‌పాల్ బిల్లుతో అవినీతి సమసిపోదని, పార్లమెంటు మాత్రమే ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చలో పాల్గొంటూ- పార్లమెంటు కన్నా మరేదీ ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు. ‘‘లోక్‌పాల్ బిల్లు అవినీతిని నిర్మూలించదు. బిల్లులో చాలా లోపాలున్నాయి. అది చాలా అంశాలను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యం లోక్‌పాల్ కన్నా పెద్దది. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుంది. దానికన్నా మరేదీ ఉన్నతం కాదు. ప్రజలు తమను ఎన్నుకున్నారు కాబట్టి వారికి ఎంపీలు భయపడతారు’’ అని ఆయన అన్నారు. ‘‘సీబీఐపై చేసిన ఆరోపణలను లోక్‌పాల్‌పైనా చేయొచ్చు. ఈ లోక్‌పాల్ బిల్లు అమలుచేయాల్సినంత మంచిదేంకాదు’’ అని ములాయం వ్యాఖ్యానించారు.
సీబీఐకి స్వేచ్ఛ, కొత్త లోక్‌పాల్ అవసరం: జేడీ (యూ)
ప్రభుత్వం మెరుగైన బిల్లు తేవాలని, సీబీఐకి స్వేచ్ఛ కల్పించాలని జనతాదళ్ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు అవినీతిని నిరోధించలేదని ఆయన లోక్‌పాల్‌పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఫలితంగా కోర్టు కేసుల సంఖ్య పెరగడం తప్ప అసలైన ఫలితం ఉండదని ఆయన పేర్కొన్నారు. సభలో బీజేపీకి మంత్రి కపిల్ సిబల్ ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని చెప్పే బదులు బిల్లును మెరుగుపరచాలని సూచించారు.‘‘ప్రజలు ఈ నాటకాన్ని అర్థంచేసుకోవడం లేదని సిబల్ భావిస్తున్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు అవినీతిని నిర్మూలిస్తుందనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు. అవినీతి వ్యతిరేక చట్టాలను తేవాలనుకునేవారు బీహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
తొలి లోక్‌పాల్.. మన్మోహన్!
తొలి లోక్‌పాల్‌గా నిజాయితీపరుడైన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఎన్నుకోవాలని ఆర్‌జేడీ నేత లాలూవూపసాద్ యాదవ్ సూచించగా మంగళవారం లోక్‌సభలో నవ్వులు విరిశాయి. అందరు బిగ్గరగా నవ్వగా, ప్రధాని మన్మోహన్ చిరునవ్వుతో స్పందించారు. లోక్‌పాల్ ఎన్నిక ప్రక్రియ గురించి లాలూ మాట్లాడుతూ తనకు ఆయన కంటే నిజాయితీపరుపూవరో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు మరొకరిని ప్రధానమంవూతిగా చేసుకోండి’’ అని అధికార కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా అన్నా హజారే తీరుపై లాలూ మండిపడ్డారు.
Take By: T News
Read more...