ట్యాంక్ బండ్ మీద విగ్రహాల ధ్వంసం తర్వాత మళ్ళీ ఆంధ్రులకు జాతి, సంస్కృతి మీద గొంతు చించుకొని బుడి బుడి దీర్ఘాలు తీసే అవకాశం దొరికింది. బహుశా అలాంటి అవకాశం కల్పించడానికే ఈ సంఘటన జరగడానికి కావలసిన పరిస్థితులు కల్పించిందేమో, ప్రభుత్వం.ఈనాడు, వారి తాలూకు మహాత్ముల విగ్రహాలు కూలిపోతే, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు, దండలు వేస్తున్నారు, ఖండనలు చేస్తున్నారు.జాతికి అవమానం జరిగిందని,సంస్కృతికి నష్టం కలిగిందని,గొంతు చించుకొని అరుస్తున్నారు.
కాని తెలంగాణా పదమంటేనే వీరు భరించలేరు. తెలంగాణా చరిత్రను కనుమరుగు చేసే కుతంత్రము చేసారు. అసెంబ్లీలో తెలంగాణా పదాన్ని ఉచ్చరించడమే నిషేదించారు. ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే మహోన్నత ఘట్టమైన తెలంగాణా సాయుధ పోరాటాన్ని, పూర్తిగా చరిత్ర పుటల్లో తొక్కి పెట్టి ఉంచారు. ఆ నాడు స్వాతంత్ర్యం కొరకు ప్రాణత్యాగము చేసిన 4500 మంది తెలంగాణా వీరుల త్యాగం పై ముసుగు వేసి మూలకు ఉంచారు. తెలంగాణా సాహిత్యాన్ని, సంస్కృతిని వెటకారం చేసి వెలి వేసారు.
ఇదీ కాక, తెలంగాణా కిచ్చిన హామీలు ఒక్కొక్కటి అంచెలవారిగా తుంగలో తొక్కి అంతమొందించారు. సుప్రీంకోర్ట్ సమర్థించిన ముల్కిరూల్స్ ని పార్లమెంట్ సాక్ష్యంగా ఖననం చేసారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, ది ‘ ఆంధ్రా బుచ్చర్ ‘, మలబార్ పోలీసులను పెట్టి, 369 మంది ఆణి ముత్యాలవంటి తెలంగాణా విద్యార్థులను కాల్చి చంపి మారణహోమం చేశాడు. ఈ మలిదశ ఉద్యమంలో 600 మంది యువత ఆత్మార్పణం చేసుకుంటే, వాళ్ళేదో టెర్రరిస్త్లైనట్లు ఒక్క ఆంధ్రుడు కూడా కన్నీటి చుక్క విడువలేదు, వారి ఆత్మశాంతికి ప్రార్థించలేదు. నైజాం నే గడగడ లాడించిన ‘కొమురం భీం’ విగ్రహం పెట్టాలనే ప్రతిపాదన ఒప్పుకోవడానికి, యాభై ఏండ్లకు పైగా పట్టింది. అందుకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇప్పటికీ మనసొప్పలేదు. కాని, తెలంగాణా ప్రజలకు , ఏమీకాని, ఏమీ చెయ్యని, అసలు వాళ్ళంటే ఎవరో తెలియని , వారి ‘మహాత్ము’ల విగ్రహాలు పునః ప్రతిష్టించడానికి గంటల వ్యవధిలో 78 లక్షల రూ.లు మంజూరైనవి.
యూనివర్సిటీలను కాంసెంట్రేషన్ క్యాంపులుగా మార్చిండ్రు. ఏ ప్రజాస్వామ్య నిరసనకు పిలుపునిచ్చినా , పోలీసులు యూనివర్సిటీలు ముట్టడించి, విద్యార్థి, విద్యార్థినులను, గొడ్డులను బాదినట్లు బాదుతున్నారు. భాష్పవాయువు బుల్లెట్లు ప్రయోగిస్తున్నారు. హైకోర్ట్ లాయర్లను రోడ్ల మీద క్రిమినల్సులను కొట్టినట్లు
కొడుతున్నారు. ప్రజానీకాన్ని పశువులను బందెల దొడ్లో తోలినట్లు పోలీసు స్టేషన్లలో కుక్కుతున్నారు. యునివర్సిటీ అమ్మాయిలను, ఎమ్మార్వోల చేత బైన్దోవర్ చేయిస్తున్నారు. ఇంతటి మానవహక్కుల ఉల్లంఘన స్వాతంత్ర సమరం రోజుల్లో కూడా జరగలేదేమో అనిపిస్తుంది.
అయినా మన ఆంధ్ర సోదర సోదరీమణులకు, ఇవన్నీ ఏమీ పట్టవు, ఎందుకంటే ఈ బాధలు పడేవాళ్ళు ఆంధ్రావాళ్ళు కాదుగదా ! తెలంగాణా వాళ్ళంటే రెండో శ్రేణి ప్రజలు వారి దృష్టిలో.కాని ఆంధ్ర మహానుభావుల విగ్రహాలు కూలితే వారికి ఏడుపు వస్తది, హృదయం క్షోభిస్తది , వాళ్ళ జాతి గౌరవం, వాళ్ళ సంస్కృతి, నాగరికతలు గుర్తుకొస్తవి.
ఇంతటి ప్రాంతీయ దురభిమానము భారత దేశములో ఎక్కడైనా చూడగలమా? ఆదిలాబాద్ జిల్లాలో,బంగ్లా కాందిశీకులు ప్రాంత ప్రజలతో కలిసి పోయారు. తెలంగాణాలో కన్నడిగులు,మరాఠీలు, రాజస్తానీలు జై తెలంగాణా అంటూ, తెలంగాణా ప్రజలతో మమేకమైపోయారు. కాని ఒక్క జాతి, ఒక్క బాస అని అవసరమొచ్చినప్పుడల్లా ఆశాడభూతి వేషాలు వేసే ఈ ఆంధ్ర వలసవాదులు, తెలంగాణా నేలను అమ్ముకొని బ్రతికే వీళ్ళు ఈ ప్రాంతవాసులతో కలవరు.వారి భాషనూ సంస్కృతిని ఈసడిన్చుకుంటారు. వారిపై రోమన్లు,ఇంగ్లిష్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళ వలె దాష్టీకం చేస్తారు. అధికార మదంతో ‘తానాశాహి’ చలాయిస్తారు.
ఎందుకిట్లా జరుగుతుంది ? ఒక్క జాతి , ఒక్క భాష, ఒక్క సంస్కృతి ప్రసాదించే స్నేహార్ద్ర , సౌభ్రాత్రుత్వాలే మయినాయి. ఒక్క జాతి ప్రజల మధ్య, ఎందుకింత అసహనం, వివక్ష, కక్ష. అసలు ఆంధ్రులు, తెలంగానీ యులు ఒక్క జాతియేనా? వీళ్ళది ఒక్కటే భాషయేనా ? వీరిది ఒక్కటే సంస్కృతి యా? ఏమో ! చరిత్ర తిరగ వేచి చూస్తే ,మరియు ఈ సమకాలీన పరిస్థితులు విశ్లేషిస్తే అలా కాదనిపిస్తుంది. అసలు ఆంధ్ర, తెలుగు పదాలు కూడా ఒక్కటేనా అనే అనుమానం కలుగుతుంది. ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలా? ఆంధ్ర అనేది తెలుగుకు కాని, తెలుగు అనేది ఆంధ్రకు కాని ఎలా పర్యాయం చెందింది, అనేది మిలియన్ డాలర్ ప్రశ్న? తెలంగాణా భూమిపుత్రులు, సర్వ సాధారణంగా, ఎంత దరిద్రమున్నా తాత, తండ్రుల ఊరు వదలరు. ఎన్ని ఏండ్లు ఏ దేశ, విదేశాలకెల్లినా, తిరిగి వాళ్ళ ఊరు చేరుకుంటారు. ఎక్కడికెళ్ళినా ఆ జనంతో కలుస్తారు, వారి భాష నేరుస్తారు,వారి సంస్కృతిలో పాలుపంచుకుంటారు,కష్టపడి పనిచేస్తారు, తమ దేదో తాము తీసు
కుంటారు , కుదరక పోతే మాత్రం రామ్ రామ్ అంటారు, తిన్నింటి వాసాలు మాత్రం లెక్క పెట్టరు. వాళ్ళ దగ్గరకు ఎవరు వచ్చినా, కలుపుకుంటారు,ఆదరిస్తారు, అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. మరి మన ఆంధ్ర వలసవాదులకు ఎందుకో గాని, పని వుంటే తప్ప పరుల పొడగిట్టదు. ఎక్కడ పచ్చగుంటే అక్కడికి పరుగెత్తుదమంటారు.పచ్చగున్న పరాయి ప్రాంతమే బాగుందంటారు,రెండు చోట్లా మనదేనంటారు. ఆ ప్రాంత ప్రజల భాష నేర్వరు, వాళ్ళతో నన్నంటుకోకు అన్నట్లు ఉంటారు. కొంచెం సంఖ్య ఎక్కువైతే ‘ఆంధ్ర ఘేట్టోలు’ ఏర్పాటు చేసుకుంటారు.
అక్కడికి ఎవ్వరిని రానీయరు. అందితే జుట్టంటారు, అందకపోతే కాల్లంటారు. కష్టం కంటే మతలబుకు ఎక్కువ పని పెడతారు.అధికారం కొరకు అమిత యావ పడుతుంటారు. అధికారం చేత చిక్కితే ఇతరులను అణగ దొక్కుతరు.
ఆంధ్రులు,తెలంగాణా వాళ్ళు ఒక్కటే జాతైతే ఎందుకింత వైవిధ్యం? ఎందు కింత వైరుధ్య మైన ద్వంద్వ ప్రవృత్తి? దీనికి ఇదమిద్దమైన సమాధానం ఎక్కడా చూడలేదు. అయితే కొన్ని పౌరాణిక, చారిత్రక వ్యాఖ్యానాలు అక్కడక్కడ లభ్యమౌతున్నయి. వాటి ఆధారంగా కొందరు పండితులు తెలుగు భాష మీద చేసిన వ్యాఖ్యానాలను బట్టి చూస్తే,
‘ఆంధ్ర’ అనే ఒక తెగ భారతదేశం లోని ఒక ప్రాంతం నుండి కొన్ని కారణాంతరాలవల్ల వెలివేయబడి దేశమంతా తిరుగుతూ వచ్చి,గోదావరి, కృష్ణ పరీవాహిక ప్రాంతాలైన ‘త్రిలింగ’ దేశం లో వలస నేర్పరుచుకున్నారు . వారి భాష పేరు ‘దేశి’, ప్రాంతీయ తెగల భాష ‘తెలుగు’ .కాలక్రమేనా ప్రాంతీయ తెగల పై ఆధిపత్యం సంపాదించడానికి, ఆనాటి ‘linguafranca’ అయిన సంస్కృతానికి ,ప్రాకృతం, దేశి , తెలుగు భాషలను కలిపి వారి తెగ పేరు మీదుగా ‘ఆంధ్ర’ భాషను నిర్మించుకొన్నారు. ఈ విధంగా సంస్కృత ప్రాబల్యంతో , ప్రాంతీయ తెలుగు భాషను అణచడానికి ,ప్రాంతీయ ప్రజల సంస్కృతి పై అధిపత్యానికి పునాదులు వేశారని చెప్పుకోవచ్చును . అది నిరంతరంగా ఇప్పటివరకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది . దాని ప్రభావమే నేడు ఆంధ్ర , తెలంగాణా ప్రాంతాల మధ్య సాంస్కృతిక అగాధం. వారసత్వం గా వచ్చిన ఆ వలసతత్వము,సామ్రాజ్యవాధము,భాషా సంస్కృతుల దాష్టీకము, ఆంధ్రులలో ఈనాటికి కొట్టవచ్చినట్లు కనపడుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ,తెలంగాణ ప్రజలలో వారి వారసత్వపు భూమిని అంటిపెట్టుకొని ఉండే తత్వం, పుట్టిన మట్టిలోంచి వెలువడిన సువాసనలతో కూడుకొన్న సాంస్కృతిక అస్తిత్వం, అరమరికలులేని కలుపుగోలుతనము ఇప్పటికి కనిపిస్తూనే ఉన్నాయి.
ఆ విధంగా నిజమైన తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఎవరిదో అంచనా వేసుకోవచ్చు . ఈ సాంస్కృతిక వైరుధ్యానికి కారణం కూడా తెలుసుకోవచ్చు.ఇదేనా ఈ సాంస్కృతిక అగాథానికి కారణం అంటే, తెలిసిన చరిత్రను నేటి పరిణామాలను బేరీజు వేసి చూసుకుంటే ఇదే నిజం కావచ్చని అనిపిస్తుంది.
అది నిజమైనా కాకపోయినా, కారణ మేదైనా ఆంధ్రులకు, తెలంగానీయులకు భాషా, సంస్కృతుల విషయం లో సయోధ్య లేదనేది నిర్వివాదాంశము.ఈ సయోధ్య ఇకముందు వచ్చే అవకాశము కూడా తక్కువ.అది అవసరమో లేదో కూడా తెలియడము లేదు .రెండు వర్గాల ప్రజల మధ్య అగాధం పెరుగుతూ పోతుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము .ఏ సూడాన్, బురుండి, రువాండా లాంటి ఆటవిక దేశాల్లో లేము.మన తెగల మధ్య పోరు నాగరికంగా తేల్చుకోవచ్చు. ఎవరి రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఈ సామ్రాజ్యవాద పోకడలు, సాంస్కృతిక ఆధిపత్యం ఇలాగే కొనసాగితే అక్కడ జరిగిన చరిత్రలు ఇక్కడ కూడా పునరావృత్తం కావచ్చు.
- ఆదిత్య
Read more...