సీమాంధ్ర మంత్రులపై తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆగ్రహం
ద్రోహులతో కలిసుంటారా?
సీమాంధ్ర మంత్రులపై తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆగ్రహం
ఢిల్లీకి మంత్రి పొన్నాల.. అదే బాటలో మరికొందరు
బలవంతాన తాళి కడతామంటారా?: డీకే అరుణ
వారిని తెలంగాణలో తిరగనివ్వం: యాష్కీ
హైదరాబాద్, ఆగస్టు 7 : ప్రత్యేక తెలంగాణ కోరేవారు దేశద్రోహులంటూ శ్రీకృష్ణ కమిటీ ఎదుట చెప్పిన సీమాంధ్ర మంత్రులపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య సీమాంధ్ర మంత్రులపై విరుచుకుపడ్డారు. దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని తన సన్నిహితుల వద్ద పేర్కొన్నారు.
'మా ప్రాంతాన్ని మాకు వదిలి పెట్టండి మహాప్రభో అంటే దేశద్రోహమా? బలవంతాన తాళి కడతాం.. మీరు కట్టించుకోండి అన్నట్లుగా ఉంది. కలిసి ఉంచాలంటే తప్పేమీ లేదు. కానీ.. దేశద్రోహం అనడం సరికాదు. తెలంగాణ గురించి మాట్లాడేందుకు వారికేం హక్కుంది?' అని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'తెలంగాణ ఉద్యమం 55 ఏళ్ల పోరాటం. ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి.
ఇలా కించపరచడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. సీమాంధ్ర మంత్రులు తక్షణమే క్షమాపణ చెప్పాలి' అని మంత్రి నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు శనివారం విలేఖరులతో మాట్లాడుతూ .. సీమాంధ్ర మంత్రులు తాము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడమే భారతజాతిని అవమానించినట్లు.. దేశద్రోహానికి పాల్పడినట్లుగా నివేదికలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను దేశ ద్రోహులుగా చిత్రీకరించినప్పుడు తమతో ఎలా ఉండగలరని నిలదీశారు.
1956లోనే తాము అమాయకులమని.. తెలివైన సీమాం«ద్రులతో కలసి బతకలేమని తేల్చి చెప్పామన్నారు. విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలు గుప్పించారని అన్నారు. తమను వదిలేయాలని ప్రాధేయపడినా, అన్ని సదుపాయాలూ కల్పిస్తామని నమ్మబలికారని అన్నారు. సీమాంధ్ర ప్రాంతంవారు సీఎంలుగా పాలించి.. తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలన తాము చేసుకుంటామని.. ఇకనైనా విడిచిపెట్టాలని వీహెచ్ అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోరేవారు దేశ ద్రోహులని సీమాంధ్ర మంత్రులు పేర్కొనడం ద్వారా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందంటూ ప్రకటించిన కేంద్ర హోం మంత్రి చిదంబరం కూడా దేశద్రోహేనా అని సీమాంధ్ర మంత్రులను ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ నిలదీశారు. శ్రీకృష్ణ కమిటీకి రిపోర్టు ఇచ్చేటప్పుటు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకూడదని.. ఇతర ప్రాంతాల వారిని కించపరచకూడదని అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో మాట్లాడుతూ, డిసెంబర్ 9 ప్రకటనకు సీమాంధ్ర నేతలు కట్టుబడి ఉండాలన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను వంచించే విధంగా సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర ఉద్యమం చేపడుతున్నారని విమర్శించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ వాదులను దేశద్రోహులుగా పేర్కొన్న సీమాంధ్ర నేతలను, మంత్రులను తెలంగాణ ద్రోహులుగా ప్రకటించి, వారిని తెలంగాణ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ హెచ్చరించారు. వారి ఫోటోలతో పోస్టర్లు వేసి, తెలంగాణ మొత్తం ప్రచారం చేస్తామన్నారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు.
నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి పోరాడిన వారందరూ దేశ భక్తులేనని, సాయుధ పోరాటంలో పాల్గొన్న వారందరూ స్వతంత్ర సేనానులేనన్నారు. ఉద్యమాన్ని కాశ్మీరు తీవ్రవాదంతో పోల్చడం శోచనీయమన్నారు. తెలంగాణ లో ఉంటూ, కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకుంటూ వనరులను కొల్లగొడుతున్న వారందరూ వారి వ్యాపారానికే పరిమితమై ఉండాలని, లేకుంటే తెలంగాణ ప్రజలంతా ఏకమై బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఉద్యమాన్ని కించపరిచే నాయకులకు, వ్యాపారవేత్తలకు తెలంగాణలోని ప్రతి పౌరుడు రాజకీయాలకు అతీతంగా ఒక్కటై బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.