రహదారుల దిగ్బంధం
సంగారెడ్డి) పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగిన తెలంగాణ వ్యాప్త రాస్తారోకో జిల్లాలో విజయవంతమయింది. జిల్లాలో ప్రధానమైన తొమ్మిదో నెంబరు, ఏడో నెంబరు జాతీయ రహదారులు, రాజీవ్ రహదారితో పాటు అంతర్గత రహదారులపై కూడా ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు రాస్తారోకోలను నిర్వహించారు. జేఏసీ నాయకులతో పాటు టీఆర్ఎస్, తెలంగాణ ప్రజాఫ్రంట్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణవాదులు రాస్తారోకోలలో పాల్గొని విజయవంతం చేశారు.
జిల్లా వ్యాప్తంగా క్యాడర్‌ను ఏర్పరుచుకున్న టీఆర్ఎస్ అన్ని చోట్ల ముందుండి రాస్తారోకోలను నిర్వహించింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు అన్ని మండల కేంద్రాలలోనూ, ముఖ్యమైన కొన్ని గ్రామాల వద్ద కూడా నిరసనకారులు రాస్తారోకోలను నిర్వహించారు. ఫలితంగా ఆయా రహదారులపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు కూడా కొంత అసౌకర్యానికి గురయ్యారు.
అయితే నాయకులను బట్టి అరగంట నుంచి రెండు, మూడు గంటల వరకు రాస్తారోకోకు సమయమిచ్చిన పోలీసులు అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికిపైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు.
రాస్తారోకో సాగిన తీరు..
రాజీవ్ రహదారిపై పొన్నాల వద్ద టీఆర్ఎస్ శాసనసభ పక్షం ఉపనేత టీ.హరీష్‌రావు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. అదే రహదారిపై కొండపాక, కుకునూర్‌పల్లి, తిమ్మారెడ్డిపల్లి, మంగోలు క్రాస్‌రోడ్డు, దుద్దెడ, ప్రజ్ఞాపూర్, ములుగుల వద్ద కూడా రాస్తారోకో జరిగింది. సిద్దిపేట శివారులోని రంగీలా దాబా వద్ద తెలంగాణ ప్రజాఫ్రంట్, విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. అలాగే సిద్దిపేట నుంచి మెదక్ రోడ్డులో భూంపల్లి, ధర్మారం, మోతే, హబ్సీపూర్, తిమ్మాపూర్, పోతారెడ్డిపేటల వద్ద, మండల కేంద్రమైన మిరుదొడ్డిలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.
ఏడో నెంబరు జాతీయ రహదారిపై కాళ్లకల్, మనోహరాబాద్, తూప్రాన్, మాసాయిపేట, చేగుంట, రామాయంపేటల వద్ద రాస్తారోకో జరిగింది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రామలింగారెడ్డి, చేగుంటలో, ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేటలో రాస్తారోకోకు నాయకత్వం వహించారు.
తొమ్మిదో నెంబరు జాతీయరహదారిపై బీహెచ్ఇఎల్ క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ ఎం.రఘునందన్‌రావు, పటాన్‌చెరు వద్ద బీజేపీ మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, సంగారెడ్డి క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్ అశోక్‌కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎం.రాజేందర్‌లు రాస్తారోకోకు నాయకత్వం వహించారు. ఈ రహదారిపై ఇస్నాపూర్, కంది, మల్కాపూర్, పెద్దాపూర్, నందికంది, మద్దికుంట, బుధేరా, కంకోలు, కోహీర్ క్రాస్ రోడ్డు , జహీరాబాద్ తదితర ప్రాంతాలలోనూ రాస్తారోకో నిర్వహించారు.
దిష్టిబొమ్మల దహనం
న్యాల్‌కల్ మండలం రాంతీర్థలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రేగోడ్ మండలం పోచారంలో నిరసనకారులు రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించి దహనం చేశారు.
టేక్మాలులో రాస్తారోకో నిర్వహించిన ఆందోళనకారులు జస్టిస్ శ్రీ కృష్ణకమిటీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. నిరసనకారులు మిరుదొడ్డిలో దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి దిష్టిబొమ్మను, మంగోలు క్రాస్ రోడ్డులో గజ్వేల్ ఎమ్మెల్యే టీ.నర్సారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
వంటావార్పు- ఆటాపాట
రాస్తారోకో సందర్భంగా నర్సాపూర్, రేగోడ్ మండలం పోచారం, లింగంపల్లి, దేవునూర్‌లలో నిరసనకారులు రోడ్లపైనే వంటలు చేసి, అక్కడే భోజనాలు చేశారు. అంతకు ముందు ఆటలు ఆడారు, పాటలు పాడారు. మెదక్‌లో నిరసనకారులు పోలీసుల బూట్లకు పాలిష్ చేశారు. రోడ్డుపై ఆటలు నిర్వహించారు.
శివ్వంపేటలో లాఠీచార్జి, నేడు బంద్
మండల కేంద్రమైన శివ్వంపేటలో రాస్తారోకో సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. అయితే కార్యకర్తలు మాత్రం రోడ్డుపైనే ఉండిపోయారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. స్వల్ప లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు మంగళవారం శివంపేట బంద్‌కు పిలుపు ఇచ్చారు.
హైలైట్స్
రాస్తారోకో సందర్భంగా చేగుంటలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొబేషనరీ ఎస్ఐపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. మీలాంటి వారివల్లనే ఈ గొడవలన్నీ అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్ మండలం ర్యాకల్‌లో యువకుడు సెల్ టవర్ ఎక్కి తన నిరసన తెలిపారు. ఇక రాస్తారోకోలలో బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్‌తో పాటు ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పటాన్‌చెరులో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించగా, టేక్మాల్‌లో జరిగిన రాస్తారోకోలో టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
take By: Andrajyothi