ఆఖరు భేటీ
23 లేదా 24న అఖిలపక్ష సమావేశం..
ఇక తదుపరి చర్చలు ఉండవు
పార్టీల అభిప్రాయాలకు ప్రాధాన్యం..
తెలంగాణపై త్వరలోనే నిర్ణయం
క్యాబినెట్‌కు నోట్ సమర్పిస్తాం..
కేంద్ర హోంశాఖ వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ, హైదరాబాద్, జనవరి 17 : "ఇక మళ్లీ మళ్లీ పిలిచేది లేదు. మాట్లాడేది లేదు. విషయాన్ని నాన్చేది లేదు. వచ్చిన వాళ్లు చెప్పింది వింటాం. ఒక నిర్ణయం తీసుకుంటాం! త్వరలోనే ఒక స్పష్టత తీసుకు వస్తాం''.... తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇదేనా? కేంద్ర హోంశాఖ వర్గాలు ఈ ప్రశ్నకు 'ఔను' అనే సమాధానమే చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లోపు తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై వచ్చే వారమే రాష్ట్రానికి చెందిన 8 గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఈ నెల 23 లేదా 24 తేదీల్లో సమావేశం జరుగుతుందని కేంద్ర హోంశాఖ వర్గాలు చెప్పాయి. సోమవారం హోంశాఖ ఉన్నతాధికారులు సమావేశమైనప్పటికీ... అఖిలపక్షం తేదీపై మాత్రం ఒక నిర్ణయానికి రాలేదు. సోమవారం నాటి భేటీలో పశ్చిమ బెంగాల్, అసోం, జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలపై దృష్టి సారించాల్సి వచ్చిందని... ఒకటి రెండు రోజుల్లో తేదీ ఖరారు అవుతుందని హోంశాఖ వర్గాలు చెప్పాయి. అదే సమయంలో... తెలంగాణపై త్వరలోనే కేంద్రం అటో ఇటో తేల్చిచెబుతుందని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి.
"23 లేదా 24 తేదీల్లో జరిగే అఖిల పక్ష సమావేశమే చిట్టచివరిది అవుతుంది. ఈ భేటీకి పార్టీలు వచ్చినా, రాకున్నా మా వైఖరిపై ఓ నిర్ణయానికి వస్తాం. అఖిలపక్ష సమావేశ ఫలితంపై కోర్ కమిటీలో చర్చించి, కేంద్ర మంత్రి వర్గానికి ఒక నోట్ సమర్పిస్తాం. దానికి అనుగుణంగా తెలంగాణపై బడ్జెట్ సమావేశాల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం'' అని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ సూచించిన 6వ పరిష్కారానికే కేంద్రం మొగ్గు చూపుతున్నప్పటికీ... రాజకీయ పార్టీలు ఏం చెబుతాయన్న దానికీ ప్రాధాన్యమిస్తామని ఆయన చెప్పారు.
కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈనెల 6న నిర్వహించిన సమావేశానికి టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ గైర్హాజరయ్యాయి. తదుపరి సమావేశానికి కూడా ఇవి డుమ్మా కొడతాయా? లేక... 'ఇదే ఆఖరు' అని చెబుతున్నందున ఢిల్లీకి వెళతాయా? అనే అంశంపై స్పష్టత రావడంలేదు. ఈ అంశంపై నిర్వహించే సమావేశాలకు హాజరు కారాదని టీడీపీ నాయకత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, తాము చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పామని, కొత్తగా చెప్పేదేమీ లేదనే వైఖరి ప్రదర్శిస్తోంది.
కేంద్రం తనకు ఇబ్బంది వచ్చినప్పుడు దానిని అందరి మెడలకు చుట్టి బయటపడాలని చూస్తుందని, కాంగ్రెస్ వ్యూహంలో తాము ఇరుక్కోరాదని పార్టీలో మెజారిటీ నేతలు వాదిస్తున్నారు. "ఇప్పటికీ మా పార్టీ వైఖరి అదే. కానీ, ఈసారి పెట్టేది చివరి సమావేశమని చెబుతున్నారు. చిదంబరం నుంచి లేఖ వస్తే... దానిపై చర్చిస్తాం. ఈ భేటీ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువ'' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇక టీఆర్ఎస్ కూడా ఆహ్వాన లేఖ అందిన తర్వాత... అందులోని సారాంశం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
కాంగ్రెస్‌లో పెరిగిన వేడి
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకోవడం, రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరికి అవకాశం కల్పిస్తారని వార్తలు రావడంతో తెలంగాణ ఎంపీల్లో సందడి మొదలైంది. పదవులు తీసుకోవాలా వద్దా? తీసుకోవడం సమంజసమేనా? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణపై పోరాటానికి పదవులు అడ్డం కాదనే నిర్ణయానికి వచ్చారు. సోమవారం ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీలు సమావేశమయ్యారు. తమ తొలి ప్రాధాన్యం తెలంగాణకే అని, పదవులకు కాదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
అసలు మంత్రివర్గ విస్తరణకు, తెలంగాణకు సంబంధమేలేదన్నారు. అధిష్ఠానం తమను బుజ్జగిస్తోందనే వాదన సరికాదన్నారు. పదవులు, ప్రలోభాలు పని చేయవని... తెలంగాణ తప్ప మరి దేనికీ అంగీకరించేది లేదని మరో ఎంపీ రాజయ్య చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై అధిష్ఠానం నుంచి స్పష్టత పొందాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే ఎంపీలతో అధిష్ఠానం పెద్దలు మరోమారు భేటీ అయ్యే అవకాశముంది. ఇక తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా అధిష్ఠానాన్ని కలిసి ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టత పొందాలని భావిస్తున్నారు.
మంగళవారం వీరంతా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తెలంగాణ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలన్నింటిపై సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్‌ల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వైపు చూస్తున్నారు.
మరోవైపు... వైఎస్ జగన్, తెలంగాణ అంశాలు తమకు కొత్త కాదని, అందరి సహకారంతో ఈ సమస్యలను పరిష్కరించుకుంటామని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక... కొన్నాళ్లుగా తెలుగుదేశంలో కలకలం సృష్టిస్తున్న సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. తాను టీడీపీని వీడుతున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీకి దూరం కావాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
take by: Andrajyothi
0 comments:
Post a Comment