ఆర్థిక విధానాలపై నిరసన గళం ‘వాల్‌స్ట్రీట్ భరో...’
-మాన్‌హట్టన్‌లో చిన్నగా మొదలై.. ఉగ్రరూపం దాల్చిన ఉద్యమం
-ప్రపంచ దేశాలకు విస్తరించిన ఆందోళనలు
-ఉద్యమానికి వందమంది రచయితల మద్దతు
-లూథర్‌కింగ్ బతికివుంటే మద్దతిచ్చేవారు: ఒబామా
న్యూయార్క్, అక్టోబర్ 17:నెలరోజులుగా సాగుతున్న ‘వాల్‌వూస్టీట్ భరో’ ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. ప్రజాస్వామ్యంపై పెట్టుబడిదారుల, లాబీయిస్టుల ప్రభావాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రజలు ఈ ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సంపన్నవర్గాలకు అనుకూలంగా ప్రభుత్వాలు రూపొందిస్తున్న ఆర్థిక విధానాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఆర్థిక విధానాల్లోనూ సమన్యాయం పాటించాలని ఉద్యమిస్తున్నారు.
మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం ముందున్న జుకోటి పార్కులో నెలకిందట చిన్నగా మొదలైన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. మొదట కొంతమంది ఉద్యమకారులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ప్రారంభించారు. వారికి మద్దతుగా వేలాది మంది ముందుకొచ్చారు. అమెరికాలోని చిన్నా పెద్దా నగరాల్లో ఇప్పుడు వందల సంఖ్యలో ఉద్యమకారులు క్యాంపులు వేసుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొనడంతో పాలకులు పెట్టుబడిదారులకు వంతపాడుతూ, వారికి బెయిల్ అవుట్లు ప్రకటిస్తూ.. పేద, బలహీన వర్గాల సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులకు కోత పెడుతుండటంతో తీవ్రంగా ప్రభావితమవుతున్న ప్రజలు ఈ ఉద్యమానికి అండగా నిలిచారు.
అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలోని 80 దేశాల్లో శనివారం జోరుగా ఆందోళనలు జరిగాయి. నెలరోజులకు చేరిన ఉద్యమం అనుకున్న ఫలితాలను రాబడుతోందని ఉద్యమకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కొల్లగొడుతున్న కార్పొరేట్ సంస్థలు, పారిక్షిశామికవేత్తల ఆధిపత్యానికి, ప్రభావానికి తమ ఉద్యమంతో గండిపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక స్థిరమైన నాయకత్వంలో ఆందోళనలు సాగుతున్నట్లు కనిపించడం లేదు. ఈ ఉద్యమానికి ఓ ప్రత్యేకమైన డిమాండ్, లక్ష్యమంటూ లేదు. ‘తమ సొంత కారణాలతోనే ప్రజలు ఈ ఉద్యమం పాలుపంచుకుంటున్నారు. ఉద్యమించడానికి ఇది కారణమని ఎవరూ చెప్పడం లేదు’ అని ఓ ఉద్యమకారుడు చెప్పారు. ఈ ఉద్యమానికి లక్ష్యం ఉండాలని కొందరు, వద్దని మరికొందరు వాదిస్తుండటంతో గందరగోళం నెలకొంది.
మాన్‌హట్టన్‌లోని జుకోటి పార్కు ప్రస్తుత ఉద్యమానికి కేంద్రంగా ఉంది. తమకు మద్దతుగా శనివారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు ఉద్యమానికి కొత్త ఊపును, ఉద్యమకారులకు నూతన జవసత్వాలను ఇచ్చాయని, తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించామని ఉద్యమకారులు తెలిపారు. జుకోటి పార్కు నుంచి తమను ఖాళీ చేయించినా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యమానికి మద్దతుగా 3 లక్షల డాలర్లు ఉద్యమ వెబ్‌సైట్‌కు విరాళాలుగా వచ్చాయని ‘వాల్‌వూస్టీట్ భరో’ మీడియా బాధ్యుడు బిల్ డబ్స్ తెలిపారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ సహా అమెరికాలోని చిన్న, పెద్ద నగరాల్లో ఆదివారం, సోమవారం వాల్‌వూస్టీట్ భరో ఆందోళనలు ముంచెత్తాయి. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్ వద్ద 70 మందిని, షికాగోలో 175 మందిని, ఆరిజోనాలో 53 మంది ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు.
వందకు పైగా రచయితల మద్దతు
వాల్‌వూస్టీట్ భరో ఉద్యమానికి వందకు పైగా ప్రముఖ రచయితలు మద్దతు పలికారు. సల్మాన్ రష్దీ, నీల్ గైమన్, పులిట్జర్ అవార్డు గ్రహిత, నవలా రచయిత జెన్నిఫర్ ఈగన్, మైఖేల్ కన్నింగ్‌హమ్ తాము ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆక్యూపైరైటర్స్‌డాట్‌కామ్‌లో ఓ ప్రకటన వెలువరించారు.
లూథర్‌కింగ్ బతికివుంటే అండగా నిలిచేవారు...
వాల్‌వూస్టీట్ భరో ఆందోళనకారులకు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మద్దతు పలికారు. వాల్‌వూస్టీట్ ఉద్యోగులను దుర్మార్గులుగా చూడవద్దని ఆందోళనకారులు సూచించారు. ఇక్కడి నేషన్‌ల్ మాల్‌లో సోమవారం మార్టిన్ లూథర్ కింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. మార్టిన్ లూథర్‌కింగ్ బతికివుంటే వాల్‌వూస్టీట్ అతిని సవాలు చేస్తున్న ప్రస్తుత ఉద్యమానికి అండగా నిలిచేవారని పేర్కొన్నారు.
Occupy Wall Street protest, Obama administration