నమస్తే తెలంగాణ జోలికి రాకండి -అల్లం నారాయణ
కానీ తెలంగాణకు ఒక పత్రిక కావాలి. ఆ పత్రికలో స్వేచ్ఛగా, ఎలాంటి ఆటంక మూ, సంకోచమూ, వెనక నిలబడి శాసించే శక్తులు లేకుండా రాయగలిగిన వాతావరణం కావాలి. అదొక కల. నేనూ నాతో పాటు ఈ పత్రికలోకి వచ్చిన నా సహచరులు, అందరూ పేరుపేరునా నాకు తెలుసు. మా అందరి కలా ఒకటే. తెలంగాణ కోసమే ఒక పత్రిక కావాలి. ఆ కల ‘నమస్తే తెలంగాణ’తో నెరవేరింది. ఇదొక ఉమ్మడి స్వప్నం. ఈ స్వప్నం ఏడాదిగా కంటున్నాం. చివరికి నాలుగున్నర నెలలుగా పత్రిక తెస్తున్నాం. ఇప్పటి వరకు కేసీఆర్ ఈ పత్రికలో ఒక్కనాడూ జోక్యం చేసుకోలేదు. ఆయన పత్రిక స్వభావం పూర్తిగా తెలిసి ప్రజాస్వామికంగా వ్యవహరించారు. నేను ప్రజాస్వామ్య ఛాంపియన్లు అనుకున్నవారు మా వార్తలో, వ్యాసాలో ఎందుకు రాలేదని అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఆశ్చర్యంగా కేసీఆర్ ఎన్నడూ ఒక పల్లెత్తు మాట అనలేదు. జోక్యం చేసుకోలేదు. ఆయనమీద ‘నమస్తే తెలంగాణ’ ఆధారంగా అంత పెద్ద అభాండం ఎందుకు వేశారన్నది అర్థంకాని అంశం కాదు. నేను అబద్ధం ఆడలేదు. ఇది వరకు ఇలాంటి పత్రిక చదవలేదన్నప్పుడు, గౌరవనీయులు ఎస్వీ రామారావు లాంటివారు ఉత్తరం రాసినప్పుడు పొంగిపోయినాం. ఏముంది మీ పత్రికలో అంతా తెలంగాణ తప్ప అన్నప్పుడు కుంగిపోలేదు. కానీ, ఎట్లా..? ఒక సంపూర్ణ పత్రిక తేవాలని సమాలోచన లు చేశాం. ఏం చెయ్యాలి? అని మధనపడ్డాం నేను నా మిత్రులం. ఇదొక నిత్య కార్యాచరణగా పత్రికను ఉన్నతస్థాయికి తీసుకు ప్రయత్నాలు చేశాం. ఇతర వార్తలనూ ప్రముఖంగా ఇవ్వడంలో భాగంగానే, ఒక్క తెలంగాణ వార్తలే కాకుండా ఇతరేతర వార్తలను పెంచడంలో భాగంగానే రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు టెండర్లది ఒక వార్త వేశాం. అది పోలవరం వార్త. ఆ వార్త సంచలనం కలిగించింది. కొన్ని పదాలు అటూ ఇటు అయి ఉండవచ్చు. శీర్షికలోనూ, లోపలి పదాలలోనూ కొన్ని తెలంగాణకు కూడని పదాలు దొర్లి ఉండవచ్చు.
కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు... నేను రేవంత్‌డ్డిని పట్టించుకోను కానీ, దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరిలను ఖాతరు చేస్తాను. వాళ్లు పోలవరం టెండర్లు అక్రమం అని యుద్ధం చేస్తే నాకెలాంటి బాధాలేదు. మొత్తం పోలవరం తెలంగాణ వ్యతిరేక ప్రాజెక్టు కనుక రద్దు చేయాల్సిందే. ఎట్లా కడతారు పోలవరం అని అడిగితే విపరీతంగా సంతోషపడతాను. తెలంగాణవాదులకు ఊతం అనుకుంటాను. కానీ, ‘నమస్తే తెలంగాణ’ పత్రికపైన ఎందుకు కక్ష కట్టినట్టు. నమస్తే తెలంగాణ గొంతు నులమాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు? ‘నమస్తే తెలంగాణ’ పత్రిక హఠాత్తుగా ఆంధ్ర గుండెచప్పు డు అనడానికి నోరెలా వచ్చిందో? అంతుపట్టని విషయమేమీ కాదు. చంద్రబాబు.. మీడియా సృష్టించిన ఒక మహా విధ్వంస నాయకుడు. తెలంగాణ విధ్వంసానికి మూలపురుషుడు. ఏ అభివృద్ధి నమూనాకు నేను వ్యతిరేకమో, అభివృద్ధి పేరిట ఆశ్రీత పెట్టుబడిదారీ విధానానికి, ప్రభుత్వ యంత్రాంగము, ఉద్యోగి వర్గపు బడాబాబులు, కార్పొరేట్లు, రాజకీయ నేతల పకడ్బందీ బాజాప్తా దోపిడీ గుంపు సంస్కరణల ప్రవేశంతో ఏర్పడింది. పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు ఈ దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆ సంస్కరణలను పరాకాష్టకు తీసుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో భూమి బ్యాంకును బదలాయించి, భూ వనరును పెట్టుబడికి కీలకంగా మార్చినవాడు చంద్రబాబు. విజన్ 2020 కానీ, ఆతర్వాత అతను అనుసరించిన రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు కానీ తెలంగాణను తీవ్రంగా ప్రభావితం చేసి ధ్వంసం చేశాయి. మొత్తంగా సీమాంధ్ర పెత్తనం ప్రతిష్ఠాపనకు, ఆ సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను కబ్జా చేయడానికి, సినిమారంగం, రాజకీయం కలెగలిసి తెలంగాణ ఆత్మ మూలుగు కూడా వినిపించకుండా అణగదొక్కడానికి మూలపురుషుడు చంద్రబాబు.
ఆయనను పిచ్చివాడు లేదా, జైలులో పెట్టదగినవాడు అన్న ఏదో ఒక దేశపు ప్రధానితో నేను పూర్తిగా ఏకీభవిస్తూనే, తెలంగాణకు సంబంధించి ఆయన ఒక క్రూరమైన నమూనా అని, దాని కొనసాగింపే వై.ఎస్.రాజశేఖర్‌డ్డి పరమ క్రూరమైన నమూనా అని నా విశ్వాసం. ఇదే చంద్రబాబు వర్తమానంలో తెలంగాణకు అడ్డంపడ్డ ఏకైక రాష్ట్ర నాయకుడు అని నేను నమ్ముతాను. డిసెంబర్ 9 తర్వాతి వాతావరణాన్ని, ద్వేషాన్ని రెచ్చగొట్టి, ఆడిన మాట తప్పి, అబద్ధాలాడి, తెలంగాణ ప్రకటన వెనక్కిపోవడానికి మూల పురుషుడు చంద్రబాబే అని నేను నమ్ముతాను. ఈ విష యం తెలంగాణవాదులందరూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశం. కానీ రాజకీయాలు క్రూరమైనవి. చంద్రబాబు లాంటి వాళ్లు చేసే నిలు కుట్ర రాజకీయా లు మరీ క్రూరమైనవి. చంద్రబాబు అనుకూల పత్రికల్లో పనిచేసిన అనుభవం ఉంది నాకు. పత్రికకొక విధానం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో చంద్రబాబు ఎంత అడ్డగోలుగా , దుర్బేధ్యమైన అజ్ఞా నంతో మాట్లాడినా ఆకాశానికెత్తిన విధానాలు గల పత్రికల్లో నేను పని చేశాను. కానీ నా పేరిట నేను ఎన్నడూ ఆయన విధానాలకు అనుకూలం కాదు. రాయలేదు. ఆ తెర ఒకటి పాత్రికేయ వృత్తిలో వేలాడుతూ ఉంటుంది.
చివరికి ‘ఎడిసన్ బల్బు కనిపెట్టలేదు చంద్రబాబే అనే స్థాయిలో’ ఆయన ‘మీడియా మేడ్’ రాజకీయ నాయకుడు. కపటం, కుట్ర తప్ప ఆయనకు ఏ రాజకీయ విలువలూ లేవు. అలాం టి ఒక రాజకీయ నాయకుడి గొంతు దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరిల గొంతులగుండా వినడం తెలంగాణ దురదృష్టం. సీఎం రమేశ్‌కు పోలవరం టెండరు వస్తే తెలుగుదేశం ఈ నాయకులు మాట్లాడేవారా? ఇది సూటి ప్రశ్న. చంబ్రాబు చుట్టూ ఉండే సీమాంధ్ర నయా ఆశ్రీత పెట్టుబడిదారులు వీరికి తెలియదా? ముఖ్యంగా మాలాంటి వాళ్లం తీవ్రంగా మాట్లాడితే బాగుండదు కానీ, చంద్రబాబు కనుసన్నల్లో, ఆయన కుట్రల్లో భాగస్వాములవుతూ తెలంగాణ అని ఎంత మొత్తుకున్నా ఏ ఫలితమూ ఉండదన్న విషయం ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం నాయకులకు అర్థమై ఉంటుంది. దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరిలు వ్యక్తిగతంగా ఏం మాట్లాడతారో నాకూ కొంచెం తెలుసు. నాకు వాళ్లే కాదు. ఎర్రబెల్లి, నర్సింహులు, జైపాల్ యాదవ్ , దయాకర్‌డ్డిలు కూడా వ్యక్తిగతంగా తెలుసు. కానీ ఇది రాజకీయం. క్రూరమైనది. అది తనను తాను పోల్చుకోదని కాదు. తన ఆత్మను తాను పోల్చుకోదని కాదు. కానీ నోట ఒకటి మాట్లాడిస్తుంటుంది. అంతరంగం అణచివేత కొనసాగుతుంటుంది. ఇదొక శాశ్వత భ్రమ.
తెలంగాణ ప్రజలు ఇప్పటికీ తెలుగుదేశాన్ని అక్కున చేర్చుకోకపోవడానికి వారి ద్వంద్వ ప్రమాణాలు, విలువలు, నిజాయితీ రాహిత్యం వీటన్నిటికి తోడు చంద్రబాబు సాంగత్యం, నాయకత్వం అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగుదేశం తెలంగాణ నాయకుల అంతరంగానికి తెలు సు. నిజమే పోలవరం టెండర్లలో సీఎండీ ఎల్.రాజం ప్రత్యక్షంగానో, పరోక్షం గానో భాగస్వామ్యమున్న కంపెనీ ఉండొచ్చు. కాదనలేం. కానీ, ఆయన పెట్టుబడిపెట్టిన ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు పోలవరం టెండర్లకు ఏమిటి సంబంధం? పెట్టుబడులు ఎక్కడినుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? అని నేను ప్రధాన స్రవంతి పత్రికల్లో పనిచేసిన ఏ సందర్భంలోనూ ప్రశ్న రాలేదు. పెట్టుబడుల స్వభావం గురించి కూడా ఎన్నడూ చర్చ రాలేదు. ఎందుకంటే పత్రికలన్నీ పెట్టుబ డి పుత్రికలే. మారిన కాలమాన పరిస్థితుల్లో ఆదర్శంగా, సమాజహితం కోసం, నిక్కచ్చిగా పత్రికలు నడపడం సాధ్యం కాని స్థితి. అడ్వర్టయిజర్లు, క్లయింట్‌లు, కార్పొరేట్‌లు, పెట్టుబడి స్వభావమైన వార్తా సృష్టి, రాజకీయ పాక్షికత, వినోదం అన్నీ పత్రికా విలువలకు అవసరం కాదేమో కానీ, అనివార్యమైనవే. కానీ ఒకటి మాత్రం చెప్పగలను.
ఏ పత్రికైనా తెలంగాణ అంశాలకు సంబంధించి కానీ తెలంగాణకు జరిగిన అన్యాయాలకు సంబంధించి కానీ, ఉద్యమానికి సంబంధించి కానీ ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఇస్తున్నంత స్వేచ్ఛ ఇస్తుందనుకోలేను. ఇది ప్రత్యక్ష అనుభవం. పూర్తి స్వేచ్ఛ ఒక భ్రమ. కానీ ఏ పత్రికలో ఎవరు పెట్టుబడి పెట్టారు? ఎవరు బినామీలు? ఏ ఛానల్‌లో ఎవరి పెట్టుబడులున్నాయి.. అనేది అన్నింటికి సంబంధించిన చర్చ. కానీ ఒక్క ‘నమస్తే తెలంగాణ’ పెట్టుబడులు మాత్రమే ఎందుకు చర్చనీయాంశం అయ్యా యి? ఎందుకంటే ‘నమస్తే తెలంగాణ’ గొంతు నులిమెయ్యాలి. అది తెలంగాణ వైపు నిలబడింది. ఉద్యమంలో ఉంది. అది తెలంగాణ నిఖార్సయిన సంస్కృతిని నిలబెడుతున్నది. తెలంగాణ సిర్ఫ్ హమారా అని చెప్పుకునే అంశాలను ప్రతిబింబిస్తున్నది. సిల్‌సిలాను, ఒక వారసత్వ చరివూతను పునర్‌లిఖిస్తున్నది. ట్యాంక్‌బండ్ మీద లేని విగ్రహాల గురించి రాస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’ శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ కుట్రలను బయటపెట్టింది. హైదరాబాద్‌లో పుట్లుగా నిండిన సీమాంధ్ర ఉద్యోగులు, అధికారుల లెక్కలను బయటపెట్టింది. దాంతో పాటే ఒక సంపూర్ణ పత్రికగా అది ఎడారి విప్లవాలను కలగన్నది. గడాఫీ మృత్యురహస్యంలో అమెరికా అహంకారాన్ని కనుగొన్నది.
మనకు తెలియని మన వీరులను ప్రదర్శిస్తున్నది. అది అచ్చంగా తెలంగాణ సకల జనుల సమ్మె కేతనంగా ఎగిరింది. అదీ అసలు సమస్య. చంద్రబాబునాయుడుకు కంటగింపు, కన్నెర్ర ఉంటే అర్థం ఉన్నది. ఆయన తటస్థుడు కాదు. సీమాంధ్ర పక్షపాతి. సమైక్యాంవూధవాది. తెలంగాణను దోచుకున్నవాడు. కానీ ఆయన అనుచరులైన తెలంగాణ వాళ్లకెందుకీ కుట్ర. ఎందుకీ కక్ష. ‘తెలంగాణ ప్రాంతం నుంచి పెట్టుబడిదారులు ఎదగకపోవడమే ఇప్పటి అరిష్టం’ అని తెలంగాణకు చెందిన ఒక మాజీ డీజీపీ అన్నారు. నేనలా అనలేను. కానీ నిజమే. ఇన్నాళ్లకు ఒక పత్రిక పెట్టే మొనగాడు ఎల్.రాజం అయినందుకు, ఆయన మా ఊరి వాడైనందుకు నేను గర్వపడుతున్నాను. నిజమే, ఆయన పెట్టుబడుల మూలాలతో నాకు సంబంధం లేదు. వాటి గురించి నా అభివూపాయం తద్విరుద్ధమైనదే.
అన్ని పెట్టుబడుల మూలాలు ఒకటే అని నా నమ్మకం. పెట్టుబడి పత్రిక పుట్టుకకు, అది మనగలడానికి, నిలబడడానికి, అది తెలంగాణ ప్రజల జీవనాడి కావడానికి మూలమైనప్పుడు ఆ పెట్టుబడి నమస్తే తెలంగాణకు అవసరమైంది. అంతకుమించి విశేషమేమీలేదు. పెట్టుబడుల పవివూతత గురించి నేను మాట్లాడలేను. అన్ని పెట్టుబడుల సారం ఒక్కటే. వాటి ప్రయోజనాలు వాటికి ఉంటాయి. కానీ ‘నమస్తే తెలంగాణ’ను చిదమకండి. ఎదగనివ్వండి. అది మీకూ, మాకూ, సకల తెలంగాణ ప్రజలకు కావాల్సిన, రావాల్సిన పత్రిక.. ‘నమస్తే తెలంగాణ’ జోలికి రాకండి. టెండర్ల గురించి, పెట్టుబడుల గురించి ఎనై్ననా యుద్ధాలు చేసుకోండి. సెలవు. జై తెలంగాణ.
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, Allam Narayana,