సిద్దిపేట దీక్షలో 365 మంది
ప్రజాపోరాటానికి కేసీఆర్ ప్రతినిధి
శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గౌరవంగా మెలగాలి
సత్యాగ్రహం గ్రామాల నుంచే ప్రారంభం కావాలి
-ఎమ్మెల్సీ చుక్కా రామయ్య
సిద్దిపేట దీక్షలో 365 మంది
సిద్దిపేట, న్యూస్‌లైన్: ప్రజా పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరు అంకిత భావంతో ముందుకు నడవాలని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేటలో తెలంగాణ దీక్షలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమానికి నాభిలాంటి సిద్దిపేటలో ప్రజలు మరోసారి తమ ఆకాంక్షలను దీక్షల ద్వారా చాటుతున్నారని కొనియాడారు. తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యగా చూడటం శోచనీయం అన్నారు. పోలీసు బెటాలియన్‌లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ఎన్‌జీఓ, ఇంజినీర్ల బెటాలియన్‌లు సిద్ధమయ్యాయని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కాదని అరవై సంవత్సరాలుగా ప్రజల గుండె లోతుల్లోని బాధగా ఆయన అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమంపై లాఠీలు ఝుళిపించి, బాంబులేసి అణచివేయాలనుకుంటే అవివేకమని అన్నారు. డిసెంబరు 9 నాటి హోం మంత్రి ప్రకటన ప్రకారం తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా పోరాటానికి కేసీఆర్ ఒక ప్రతినిధి అన్నారు. లక్ష్య సాధనకు దృఢ సంకల్పం, క్రమశిక్షణ, అంకిత భావం అవసరమని అవన్నీ సిద్దిపేట ప్రజల్లో వున్నాయని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గౌరవంగా మెలగుతూ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని, ఇదే సందర్భంలో ఎలాంటి కామెంట్లు చేయవద్దని అన్నారు. ఈ నెల 26కు ముందే సత్యాగ్రహంతో సహాయ నిరాకరణ ప్రారంభించాలని, ఇది పట్టణాల కంటే గ్రామాల నుంచే ప్రారంభమయితే మరింత మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతకు మునుపు ఎమ్మెల్యే హరీష్‌రావుకు పూలమాల వేసి 365వ రోజు దీక్షలను ప్రారంభించారు.
పోరాడేటోళ్లకే కత్తి ఇవ్వాలి
తెలంగాణ కోసం పోరాడేటోళ్లకే కత్తి ఇవ్వాలి కాని, కత్తిని ఇతరులకిచ్చి హరీష్‌రావును కొట్లాడమంటే బావుండదని టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కె.స్వామిగౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని తిప్పితిప్పి మళ్లీ మొదటికే తెచ్చిందని, ఇక విజయం సాధించే వరకు పోరాడాల్సిందేనన్నారు. ఉద్యమంలో నిరాశకు లోనుకాకుండా లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. పదవుల కోసం పాకులాడే నేతలను గల్లీల్లోకి రానియ్యవద్దన్నారు.
తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష
తెలంగాణ ఉద్యోగులు అణచివేత, వివక్షలకు గురవుతున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగులు పెన్‌డౌన్‌కు సిద్ధమవుతారని స్పష్టం చేశారు.
గాంధీ మార్గంలో తెలంగాణ సాధన
మహాత్మా గాంధీ మార్గంలో ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని టీఆర్‌ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి అన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సింది పోయి విభజించి పాలించే విధానాన్ని అవలంబిస్తోందన్నారు. సిద్దిపేట జేఏసీ అధ్యక్షుడు పాపయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, టీఎన్‌జీవో నేతలు దేవిప్రసాద్, రాజేందర్, టీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, మోహన్‌లాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు 25 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతకు మునుపు రంగధాంపల్లిలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. సోమవారం దీక్షల్లో 365 మంది పాల్గొన్నారు. దీక్షా శిబిరంలో కవులు కవి సమ్మేళనం నిర్వహించి కవితా సుమసౌరభాలను వెదజ