Read Full News --
-హైదరాబాద్, చుట్టుపక్కల లక్షల ఎకరాలు పరాధీనం!
-అభివృద్ధి ముసుగులో వ్యాపారాలు
-మధ్యతరగతికి సొంతిల్లు కలే
-అపార్ట్‌మెంట్లూ అందని ద్రాక్షే
హైదరాబాద్, నవంబర్ 19 (): రాజధాని హైదరాబాద్ అంటే పరిపాలన కేంద్రం! సకల రాష్ట్రానికి సంబంధించిన అన్ని పాలనా విభాగాలు కొలువుతీరి ఉండే ప్రాంతం. కానీ.. ఇప్పుడు హైదరాబాద్ అంటే ప్లాట్లు.. ఫ్లాట్లు.. ఫాంహౌస్‌లు! అంతా రియల్ దందా! ఇసుంట రమ్మంటే.. ఇల్లంతా నాదే అన్నాడట వెనుకటికెవడో! సరిగ్గా సీమాంధ్ర బడాబాబులు చేసిందీ అదే! విలీనం పేరిట తెలంగాణను కలిపేసుకొని ఆంధ్రవూపదేశ్‌గా అవతరించాక.. హైదరాబాద్‌పై కన్నేశారు. హైదరాబాద్ భవిష్యత్తును ముందుగానే ఊహించి.. ఎకరం పదివేల నుంచి లక్షలోపు కొనుగోలు చేసి.. ఇప్పుడు వాటిని కోట్లలో అమ్ముతున్నారు! ఫలితం.. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి కుటుంబీకునికి సొంత ఇల్లు ఒక నెరవేరని కల! కనీసం అపార్ట్‌మెంట్ అయినా కొనుక్కుందామంటే.. ఎంతలేదన్నా 30 లక్షలు పోయాల్సిందే! ఇక దిగువ మధ్యతరగతి, పేద వర్గాల సంగతి చెప్పేదేముంది? అభివృద్ధి ముసుగులో సర్కారు ప్రోత్సహించిన రియల్ వ్యాపారంలో ఎదిగిపోయిన సీమాంధ్ర బడాబాబులు.. లక్షాధికారులకు, కోటీశ్వరులకు పనికొచ్చే ‘అభివృద్ధి’ చేసి అదే ఘనతగా గప్పాలు కొట్టుకుంటున్నారు! వారి బారిన పడి భూములను అగ్గువకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు అటు వ్యవసాయం చేసుకోవడానికి పొలంలేక, పొలాలు కొనే పరిస్థితి లేక అడ్డా కూలీలుగా మారుతున్నారు!
రాజధాని నగరాన్ని సీమాంధ్ర రాబందులు పీక్కుతింటున్నాయి. బతుకుదెరువు కోసమంటూ నగరంలో కాలుమోపిన సీమాంధ్ర బాబులు, అందిన కాడికి నగరంలోని విలువైన భూ ములను కబ్జా చేశారు. సొసైటీల పేర్లతో దందాలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నగర శివారు ప్రాంతాలైన రంగాడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన పంట భూములను కారుచౌకగా కాజేశారు. రియల్ ఎస్టేట్ దోపిడీ కారణంగా రంగాడ్డి జిల్లా తన అస్థిత్వాన్నే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు లక్షల ఎకరాల భూమి రైతుల చేతుల్లో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లింది. వందల సంఖ్యలో సీమాంధ్ర వలసవాదులు రియల్ ఎస్టేట్ సంస్థలను ఏర్పాటు చేశారు. ఒకొక్కరికి వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇదంతా స్థానిక రైతుల నుంచి ఎకరానికి రూ.10 వేల నుంచి లక్ష రూపాయలలోపు కొనుగోలు చేసినవే. ఈ భూములకు ప్రస్తుతం ఎకరాకు 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు విలువ పలుకుతున్నది. కాగా ఇవే భూముల వద్ద జరిగే నిర్మాణాల్లో స్థానిక పేద రైతులు కూలీలుగా మారిన పరిస్థితి ఏర్పడింది.
జయభేరి, నార్నే ఎస్టేట్స్, జీపీఆర్, శ్రీమిత్ర, శ్రీనిధి, ఇందూ, బ్రహ్మణి, గాయత్రి, గ్రీన్‌సిటీ, సూర్యవంశి, మాక్సిమా, శిల్ప, లహరి... ఇలా సీమాంవూధకు చెందిన అనేక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు ఈ కోవలో రాజధాని నగర భూములను కైవసం చేసుకున్నాయి. అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ అన్నట్లు పరిస్థితిని మార్చిన సీమాంధ్ర రాబందులు.. సగటు నగరజీవికి స్వంత ఇంటి కల ను దూరం చేశాయి. వీరి రియల్ దెబ్బకు నగరంలో స్థానికులే కాదు.. ఆఖరుకు సీమాంధ్ర నుంచి ఉద్యోగాలపేరుతోనో ఉపా ధి పేరుతోనో వచ్చిన మధ్యతరగతి ప్రజలు కూడా అపార్టుమెంట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితిని సృష్టించారు. అద్దె ఇళ్లలో కూడా ఉండలేని స్థితిని కల్పించారు. పైగా తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటూ గప్పాలు కొడుతున్నారు. వాస్తవానికి స్థానిక హైదరాబాదీలకు సొంత ఊరిలోనే నిలువ నీడలేకుండా పోయింది. అనేక మంది స్థానిక పేదలు 50 గజా ల భూమి కోసం అల్లాడుతున్నారు. కానీ.. సీమాంధ్ర నుంచి వచ్చిన రియాల్టర్లు స్థానిక రెవెన్యూ చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని విలువైన ప్రభుత్వ భూములను కాజేశారు.
భూముల పరాధీనం ఇలా
తెలంగాణ రైతు ఎలా కుదేలయ్యాడు? సీమాంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎలా కుబేరుడయ్యాడు? ఇందుకు గచ్చిబౌలికి చెందిన నర్సింగ్‌రావుప (గచ్చి) అనే స్థానిక రైతు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, జయభేరి సంస్థల అధినేత మురళీమోహన్ మంచి ఉదారణగా నిలుస్తారు. పటేల్‌కు అప్పట్లో గచ్చిబౌలిలో పదెకరాల భూమి, మూడు ఎకరాల పౌల్ట్రీ ఫామ్ ఉండేది. పటేల్ భూమితో పాటు ఈ ప్రాంత రైతుల భూములన్నీ మురళీమోహన్ కొనుగోలు చేశారని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని 1984-86 మధ్య కాలంలోనే అంచనా వేసిన మురళీమోహన్.. సినిమాల ద్వారా సంపాదించిన సొమ్ముతో ఎకరం రూ.10 వేల నుంచి రూ.25 వేలకు కొన్నారని సమాచారం. నాడు నీటి వసతి లేక కరువుతో అల్లాడిన రైతులు తిండి కోసమే ఆ భూములను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అన్నారు. ఇప్పుడు ఈ భూమికి కోట్ల రూపాయల విలువ వచ్చింది. ‘‘అప్పట్లో మా ఊర్లో ఎకరం 5 వేలు అంటే కూడా కొనే వాడు లేడు. కానీ ఎకరానికి రూ.10వేలు ఇస్తామంటే ఎగబడి అమ్ముకున్నాం. ఇలా అవుతుందని మాకేమి ఎరుక సారూ..’’ అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బికారిలా వచ్చి...
టీడీపీ అధినేత చంద్రబాబు సమీప బంధువు, తెనాలికి చెందిన నార్నే శ్రీనివాసరావు రియల్ వ్యాపారం చేస్తూ, జన్మభూమి హోమ్స్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇతని ఆధీనంలో దాదాపు 2 వేల ఎకరాలు ఉన్నాయని సమాచారం. ఇందులో ఎకరం రూ.50 లక్షలు మొదలు.. రూ.10 కోట్లు విలువ చేసే భూములూ ఉన్నాయి. నిజానికి నార్నే కుటుంబం మధ్యతరగతికి చెందినది. శ్రీనివాసరావు తండ్రి నార్నే అప్పారావు హైదరాబాద్‌కు వలస వచ్చి శివార్లలో పౌల్ట్రీఫాం పెట్టారు. నార్నే శ్రీనివాసరావు ఎదిగిన తర్వాత రియల్ వ్యాపారం మొదలు పెట్టి.. క్రమంగా హైదరాబాద్‌ను హస్తగతం చేసుకోవడం ప్రారంభించారని చెబుతారు. ఈ సొమ్ముతో మంగుళూరులో ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నారని సమాచారం.
ఏడు లక్షల ఎకరాలు రియల్టర్ల చేతిలో!
దాదాపు ఆరేడు లక్షల ఎకరాల భూమి కొద్ది మంది రియల్ ఎస్టేట్ సంస్థలు, సీమాంధ్ర బడా బాబుల సంస్థల చేతుల్లోకి వెళ్లిందని అంచనా. వందల మంది సీమాంవూధులు నగరంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ వ్యాపారం చేస్తున్నారు. వీరంతా నామమావూతపు ధరకు భూములను కొనుగోలు చేసి, కృత్రిమంగా రియల్ ఎస్టేట్ బూమ్ సృష్టించి లక్ష విలువ చేసే భూమిని కోట్ల రూపాయలకు అమ్మారు. ఇలా ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్ సంపద దాదాపు 60 నుంచి 70 వేల కోట్ల మేర తరలిపోయి ఉంటుందని, ఈ రంగంలో ప్రవేశం ఉన్న తెలంగాణకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్నారు. అయితే బూమ్ తగ్గిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పటికే స్థానిక రైతుల నుంచి కోసం కొనుగోలు చేసిన భూములను ల్యాండ్ బ్యాంకుగా మార్చుకున్నారు. కొంత మంది ఫాం హౌస్‌లుగా మార్చుకోగా, మరి కొంత మంది తోటలు వేశారు. కానీ ఈ భూములను మాత్రం వదులు కోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు వారి చేతుల్లో ఉన్న భూముల్లో తిరిగి వ్యాపారం జరిగితే లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల సంపద వస్తుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అభివృద్ధి అంతా వారి కోసమే...
నగరం, శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి నమూనాగా చెపుతున్న ఔటర్‌రింగ్‌రోడ్డు, గ్రోత్‌కారిడార్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, సైబరారాబాద్‌లన్నీ కూడా సీమాంవూధుల సౌకర్యం కోసమే అని అర్థమవుతున్నది. వీటి చుట్టూ సీమాంధ్ర బడా బాబుల భూములే ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వస్తుందనగానే అక్కడి భూములు సీమాంధ్ర రియల్ గద్దల చేతుల్లోకి మారాయి. అధికారం కూడా వారిదే కావడంతో ముందుగా ఎక్కడైనా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనుకుంటే తొలుత వారి చేత అక్కడ తక్కువ ధరకు భూములు కొనిపించి, ఆ తరువాత ప్రాజెక్టును ప్రకటిస్తారు. ఔటర్‌రింగ్‌రోడ్డు భూసేకరణలో ఇదే తంతు జరిగింది. ముందుగా భూసేకరణ నోటీస్‌లు ఇవ్వడం, రైతుల వద్దకు వెళ్లి మీరు మాకు ఇస్తే సర్కారు ఇచ్చే దానికనా ఎక్కువ ధర ఇస్తామంటూ వారి వద్దనుంచి ఆ భూములను కాజేసి.. ఆ తరువాత అసలు భూసేకరణ నోటీస్‌లు వేరే రైతులకు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా పెద్దల కోసం భారీ ఎత్తున మూడు సార్లు రింగురోడ్డు అలైన్మెంట్లు మార్చారన్న ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ధనవంతులు 500 కోట్లకు పైగా ఆస్తి ఉన్న వారు దాదాపు ఐదు వేల మంది ఉంటారని ఒక అంచనా.
వట్టినాగులపల్లి కథ
వట్టినాగుల పల్లి అనే నగర శివారు గ్రామంలో దాదాపు 5 వేల ఎకరాల భూమి ఉంది. ఒక నాడు నగరానికి కావల్సిన కూరగాయలు, అహారధాన్యాలు ఇక్కడ పండించేవారు. అప్పట్లో ఈ గ్రామంలో అందరికీ పనిదొరికేది. రియల్ రాబందులు వాలడంతో సాగుభూమి 200 ఎకరాలకు పడిపోయింది. రైతు కూలీలు ఇతర పనుల కోసం అడ్డా మీది కూలీలుగా మారారు. ఈ ఒక్క గ్రామంలో సత్యం సంస్థకు 600 ఎకరాలకు పైగా ఉందని స్థానికులు తెలిపారు. అయితే ఈ గ్రామంలో భూములు అమ్ముకున్న రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తుండగా, కూలీల పరిస్థితే దారుణంగా ఉంది. వెంచర్ల వద్ద కాపలా పనికి కూడా గ్రామంలోని వారికి అవకాశం ఇవ్వకుండా సీమాంధ్ర నుంచే తెచ్చుకోవడం విశేషం.
కొన్ని ప్రముఖ సీమాంధ్ర రియల్ ఎస్టేట్ సంస్థలు
జనచైతన్య, సాయి చైతన్య, వెంకట చైతన్య, గ్రీన్‌సిటీ టౌన్‌షిప్, మయూరి రియల్ ఎస్టేట్స్, అమరావతి రియల్ ఎస్టేట్స్, శ్రీనివాస కన్‌వూస్టక్షన్స్, సూర్యవంశి రియల్‌ఎస్టేట్స్, మాక్సిమా రియల్ ఎస్టేట్స్, 21 సెంచరీ బిల్డర్స్, శిల్ప రియల్ ఎస్టేట్స్, లహరి రిసార్ట్స్, అజయ్ రియల్ ఎస్టేట్స్‌లున్నాయి. వీటితో పాటు నగర శివారు ప్రాంతాల్లో రిసార్ట్స్, గెస్ట్ హౌస్‌లు, క్లబ్ పేరిట విలాస గృహాలు ఉన్నాయి.