-అస్తిత్వం, ఆర్థిక ప్రయోజనాల రక్షణకు ఏకమైన 33 లాటిన్ దేశాలు, రాజ్యాలు
-తొలి వేదిక వెనిజులా రాజధాని
-తదుపరి సదస్సు క్యూబాలో
-అమెరికా అధిపత్యం ఇక చాలు
-సమస్యలు మనమే పరిష్కరించుకుందాం
-ప్రపంచానికి మార్గదర్శకులమవుదాం
-సదస్సులో వెనిజులా అధ్యక్షుడు ఛావెజ్
కారకాస్, డిసెంబర్ 7:లాటిన్ దేశాలు కలిసికట్టుగా ఉండాలని లాటి్ అమెరికా విముక్త పోరాట యోధులు కాంక్షించిన 200 ఏళ్ల తర్వాత ఆ కల సాకారం అవుతోంది. ఇప్పటిదాకా అగ్రరాజ్యం అమెరికాకు పెరటిదొడ్డిగా ఉన్న పరిస్థితిని చాలించి.. అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు లాటిన్ సమాయత్తమవుతోంది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ 33 దేశాలు ఒక కూటమిగా ముందుకు వచ్చాయి. ఈ సంగతి.. భారతీయ మీడియాలో అంతగా ప్రాధాన్యం పొందకపోవడం విశేషం. కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ స్టేట్స్ (సెలాక్) ఏర్పాటుకు ఉద్దేశించిన ఈ సదస్సును మెక్సికో అధ్యక్షుడు ఫెలిప్ కాల్డెరాన్ డిసెంబర్ 2న ప్రారంభించారు. ‘‘మనం మన ప్రాంత ప్రయోజనాల కోసం ఐక్యత కోసం పని చేద్దాం.
బొలివార్ స్వాతంత్య్ర సమర సేనాని) సిద్ధాంతాలు లాటిన్ అమెరికా మొత్తానికీ ఉమ్మడి సిద్ధాంతాలే’’ అని ఆయన అన్నారు. ఈ సదస్సుకు వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ స్వాగతం పలికారు. సైమన్ బొలివార్‌ను తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ లాటిన్ అమెరికా పట్ల అమెరికా అనుసరిస్తూ వచ్చిన విధానాలను దుయ్యబట్టారు. ‘‘మొత్తంగా లాటిన్ అడుగుతున్నది గౌరవం. నిజమైన స్వాత్రంత్య్రం మాత్రమే’’ అన్నారు. ‘‘సంకోచించేవాడు ఓడిపోతాడు’’ అన్న బొలివార్ మాటలను ఛావెజ్ ప్రస్తావించారు. మనం ఇంకా ఎంతకాలం ఇలా పాడుబడిన పెరడులా మిగలాలి? అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఐక్యత, ఐక్యత, ఐక్యత, ఐక్యత మాత్రమే మనల్ని విముక్తి చేస్తుంది. మనల్ని స్వతంవూతంగా మనగలిగేలా చూస్తుంది’’ అని ఛావెజ్ స్పష్టం చేశారు. ‘‘ఇకపై మన మధ్య ఎలాంటి ఘర్షణలూ వద్దు. ఇప్పటిదాకా జరిగింది చాలు. మనం అందరం కలిసి ఒక మహా ‘మాతృభూమి’ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మనకు ఉన్న మాతృభూమి కూడా మిగలదు. 200 ఏళ్లపాటు అమెరికన్లు వాళ్ల చిత్తం వచ్చినట్లు మనల్ని పాలించారు. ఇక చాలు’’ అని అన్నారు. వెనిజులాలో ఛావెజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1045 కంపెనీలను జాతీయం చేశారు.
ఈ ఒక్క ఏడాదే 459 కంపెనీలను జాతీయం చేశారు. చమురు, విద్యుత్, సిమెంట్, ఉక్కు, టెలికమ్యూనికేషన్స్, ఆహార ఉత్పత్తి-పంపిణీ రంగాల్లో ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. బహుళజాతి సంస్థలైన కోల్గేట్-పామోలివ్, పెప్సీ కోలా, నెస్ట్‌లే, కోకాకోలా, యూనిలీవర్ వంటి సంస్థలపై నిరంతర పర్యవేక్షణను ఛావెజ్ ఏర్పాటు చేశారు. ‘‘వెనిజులా ప్రజల జేబులు కొట్టేసేందుకు పెద్ద వ్యాపారులకు, కార్పొరేట్ శక్తులకు మేం స్వాతంత్య్రం ఇవ్వం’’ అని ఛావెజ్ తేల్చి చెప్పారు. ఇదే అక్కడి విపక్షానికి కంటగింపుగా మారింది. ఇప్పటికే బొలీవియా వంటి దేశాల్లో జాతీయకరణలు జరుగుతున్నాయి. ఛావెజ్ నాయకత్వాన సెలాక్ రంగంలోకి దిగితే లాటిన్‌లో పెట్టుబడి రూపురేఖలు మారిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే అమెరికా, దాని తైనాతీలకు సెలాక్ ఆవిర్భావం గుబులు రేపుతోంది.
తదుపరి సదస్సు క్యూబాలో
ఖబడ్దార్.. మీ దేశం మాకు కూతవేటు దూరంలోనే ఉంది.. అని అమెరికా హెచ్చరిస్తే.. అమెరికా కూడా మాకు కూతవేటు దూరంలోనే ఉందని అగ్రరాజ్యాన్ని దీటుగా హెచ్చరించగలిగిన చిన్న దేశం.. క్యూబా సెలాక్‌లో కీలక పాత్ర పోషిస్తుండటమే కాక.. వచ్చే సంవత్సరం జరిగే సెలాక్ సదస్సుకు ఆతిథ్యం కూడా ఇవ్వబోతున్నది. ఆ తదుపరి సదస్సు చిలీలో జరగబోతున్నది.
బలహీనపడుతున్న సామ్రాజ్యవాదం
అమెరికా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు తిరోగమనంలో ఉన్న తరుణంలో, ఐరోపా యూనియన్ దాదాపు కుప్పకూలే దశలో ఉన్న సమయంలో సెలాక్ ఏర్పాటు జరిగింది. యావత్ ప్రపంచం సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో లాటిన్ అమెరికా ఖండం కదులుతోందని గార్షి యా చెప్పారు. ‘‘సిద్ధాంతాలు, పరిణామం, ప్రజలకు, మా నవ జాతికి సేవలు అందించే ప్రతిపాదనలతో మొత్తం ప్రపంచానికి లాటిన్ అమెరికా నాయకత్వం వహిస్తుంది’’ అని గార్షియా విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘సెలాక్ ఏర్పాటు అనేది మానవ చరివూతలోనే గొప్ప దశకు శ్రీకారం. ఇలాంటిది మునుపెన్నడూ లేదు’’ అని లాటిన్ అమెరికాలో ప్రజాదరణ కలిగిన అమెరికా-గీగీఐ అనే మ్యాగజైన్ సంపాదకుడు లూయిస్ బిల్‌బావో రాశారు. మిగిలిన ఖండాలన్నీ అపకేంద్ర శక్తుల హింసతో అతలాకుతలమవుతున్న సమయంలో లాటిన్ ఖండం దూసుకుపోయే స్వభావంతో ప్రాంతీయ ఐక్యతకు వేదిక ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ సామ్రాజవాద దేశాల్లో ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండగా.. లాటిన్ అమెరికాలో ఆ ఛాయలు లేవని గుర్తు చేశారు. పెట్టుబడిదారీ సమాజం కు ప్పకూలుతున్న తరుణంలో 21వ శతాబ్దపు సోషలిజం.. అ న్న జండా కింద సమీకృతమవుతున్నదని ఆయన రాశారు.
అడుగడుగునా అడ్డుకున్న అమెరికా
సెలాక్ ఏర్పాటును అడ్డుకునేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు. అమెరికా కీలు బొమ్మ, కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వరో యూరిబ్‌ను వాడుకుంది. వెనిజులా వెళ్లిన యూరిబ్.. అక్కడి ప్రభుత్వ వ్యతిరేక శక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రాపకంలోని మీడియా సైతం అనేక యత్నాలు చేసింది. వెనిజులా ఈ ప్రాంతంలో వేరుపడిపోయిందన్న దుష్ర్పచారానికీ తెగించింది. ఇటీవల క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొంది పూర్తి స్వస్థతతో ఛావెజ్ తిరిగి పాలనా కార్యక్షికమాల్లో పాల్గొడం కూడా అమెరికాకు కంటగింపుగా మారింది. అనారోగ్యం కారణంగా వచ్చే ఎన్నికలకు ఛావెజ్ దూరంగా ఉంటారన్న అమెరికా ఆశలనూ ఆయన అడియాస చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తాజా సర్వేల ప్రకారం ఛావెజ్‌కు 50శాతానికి పైగా ప్రజల మద్దతు ఉంది.
ఇదీ లాటిన్ ప్రాముఖ్యం
సెలాక్ దేశాల మొ త్తం స్థూల జాతీయోత్పత్తి కలిపితే ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానంలో ఉంటుంది. ఇదీ లాటిన్ ప్రాము ఖ్యం. అంతేకా దు.. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న ప్రాంతమిది. ఆహారోత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో, ఇంధనం ఉత్పత్తిలో మూడవ స్థానంలోనూ నిలిచింది.
సెలాక్.. ఓ మహా కూటమి
ఇప్పటికే దక్షిణ అమెరికా ఖండంలో యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్ (యూఎన్‌ఏఎస్‌యూఆర్), బ్యాంక్ ఆఫ్ సౌత్ (దీనికి మొక్క ఉరుగ్వే ఆమోదం మాత్రమే రావాల్సి ఉంది. ఆ ఆమోదం వస్తే రెండువేల కోట్ల అమెరికా డాలర్లను అభివృద్ధి పనుల కోసం ఈ బ్యాంక్ వెచ్చించనుంది.) సహా కొన్ని మండళ్లు పని చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన సెలాక్.. వీటిని సైతం కలుపుకొని తన కార్యక్షికమాలను రూపొందించుకోనుంది. అంతేకాకుండా ప్రస్తుతం లాటిన్ దేశాల మధ్య వాణిజ్య వ్యవహారాలకు మధ్యేమార్గంగా వినియోగిస్తున్న డాలర్‌ను కూడా పూడ్చిపెట్టాలని బ్యాంక్ ఆఫ్ సౌత్ భావిస్తోంది. ఇదే కూటమిలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బొలివారియన్ అలయెన్స్ ఆఫ్ ది పీపుల్స్ ఆఫ్ అవర్ అమెరికా(అల్బా) కూడా అంతర్భాగం కానుంది. ఈ కూటమిని క్యూబా, వెనిజులా సహా 9 లాటిన్ సోషలిస్టు దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.
సభ్య దేశాలు
అంటిగ్వా, బార్బుడా, బహమాస్, బార్బడోస్, బెలీజి, బొలీవియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, కోస్టారికా, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, గ్రెనడా, గుయానా, హైతీ, హోండురాస్, జమైకా, మెక్సికో, నికరాగువా, పరాగ్వే, పెరు, పనామా, డొమినికా, సెయింట్ కిట్స్-నెవిస్, సెయింట్ విన్సెంట్-క్షిగెనడినెస్, శాంటా లూసియా, సురినేమ్, ట్రినిడాడ్ - టొబాగో, ఉరుగ్వే, వెనిజులా.
ఓఏఎస్‌కు సమాధి!
ఉత్తర అమెరికాలోని శక్తిమంతమైన రాజ్యాలు సంప్రదాయకంగా ఆధిపత్యం వహిస్తున్న ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌ను సమాధి చేసే క్రమంలో సెలాక్ తుది ఇటుకను పేర్చుతుందని ఇప్పటికే వాదనలు మొదలయ్యాయి. ఓఏఎస్‌లో అమెరికా గురుత్వాకర్షణ శక్తి స్పష్టంగా కనిపిస్తున్నందున అమెరికన్ దేశాల మధ్య ప్రత్యేకించి లాటిన్ అమెరికన్ వ్యవస్థ ఒకటి ఏర్పడాలని ఇటీవలే ఈక్వెడార్ అధ్యక్షుడు రఫెల్ కొర్రియా చెప్పారు.
‘‘మనం మన సమస్యలను మన ప్రాంతంలోనే చర్చించుకునేలా మనకు మరొక వ్యవస్థ కావాలి. అంతేకానీ మన సమస్యలపై వాషింగ్టన్(ఓఏఎస్ కేంద్ర కార్యాలయం)లో చర్చించుకోవడం కాదు. మన సంప్రదాయాలు, విలువలు అవసరాలు తొలగింపునకు గురైన చోటకాదు.’’ అని ఆయన చెప్పారు. బొలీవియా వైస్ ప్రెసిడెంట్ గార్షియా లినెరా.. అమెరికా జోక్యంలేకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకునేందుకు, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునేందుకు, ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా మన భవితను తీర్చిదిద్దుకునేందుకు ఈ సదస్సు జరుగుతోంది’’ అన్నారు.
Read more...