పేరెంట్స్ పెంపకానికి ‘పరీక్షా’
‘సారీ అండీ... పెళ్ళికి రావడం కుదరదు. మా పిల్లలకి పరీక్షలు’, ‘నెల రోజులు లీవ్ కావాలండీ ... మా వాడికిప్పుడు బోర్డ్ ఎగ్జామ్..’ దగ్గరుండి చదివించాలి’
‘ఇదిగో అబ్బాయ్.. ఈ మూడు నెలలు కేబుల్ కనెక్షన్ వద్దు... పిల్లలకి పరీక్షలు’
సంక్రాంతి సెలవుల సరదా ఇంకా పూర్తిగా దిగకముందే ఆ సరదాలను పటాపంచలు చేస్తూ ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులకీ ఆందోళన కలిగించేలా అడుగులు వేస్తూ తను వైపే వస్తూ కనిపించే భూతం... పరీక్షలు.
ప్రస్తుత పోటీ ప్రపపంచంలో ఆర్థికంగా, సామాజికంగా ఒక భద్రతా పూర్వకమైన స్థాయిలో జీవితంలో స్థిరపడడానికి, మంచి విద్యార్హతలు ఉంటేనే సాధ్యపడుతుందనే భావన ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంది. తమ పిల్లలు బాగా చదువుకొని, మంచి ఉద్యోగం చేయాలని భావించే తల్లిదండ్రుల శాతం గత పదేళ్ళలో 35 శాతం పెరిగి, ప్రస్తుతం అలా భావించే అమ్మానాన్నల సంఖ్య మొత్తం కుటుంబాలలో 75 శాతం ఉంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు, ఉద్యోగాల మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు పిల్లలమీద తీవ్రస్థాయిలో ఒత్తిడిని పెంచేస్తున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఒత్తిడి పరీక్షల సమయంలో పరాకాష్టను చేరి అనేక అనర్థాలకు దారితీస్తోంది.
పరీక్షలు దగ్గరకొస్తున్నాయనగానే తల్లిదండ్రు లు తాము ఆందోళన పడిపోయి పిల్లలను కూడా ఎంతో ఆందోళనకు గురిచేస్తున్నారు. పరీక్షలలో తమ పిల్లలు మంచి మార్కులు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో పిల్లలని అనేక విధాల కట్టడి చేస్తుంటారు. ఎన్నో నియమాలు విధిస్తుంటారు. నిరంతరం హెచ్చరిస్తుంటారు. ఒకప్పుడు ఈ పరీక్షల హడావిడి కేవలం 7,10 వంటి పబ్లిక్ పరీక్షల సమయాల్లోనే ఉండేది. ఇప్పుడు ఒకటవ తరగతి పిల్లలకి కూడా పరీక్షల ఒత్తిడిని కలిగిస్తున్నారు తల్లిదండ్రులు.
పరీక్షల సమయంలో పిల్లల పెంపకం అనేది ఎంతో సున్నితమైన, కీలకమైన అంశం. అసలు ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నారా? అంటే అధిక శాతం లేదనే చెప్తున్నాయి సర్వేలు. ఈ అంశంపై ఎన్నో శాస్త్రీయమైన సూచనలను మానసిక నిపుణులు చేసి వాటిని పాటించడం వలన మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయని హామీ ఇస్తున్నారు.
పిల్లలే సమస్తం
పిల్లలకు తాము బాగా చదవాలని, పరీక్షలు బాగా రాయాలని మంచి మార్కులతో పాసవ్వాలని తెలుసనే విషయం తల్లిదండ్రులు నమ్మాలి. వారికి ప్రత్యేకంగా చదవమని ఒత్తిడి చేయనవసరం లేదు. అయితే పిల్లలు తమ లక్ష్యాలను సాధించే దిశగా తల్లిదండ్రులు సహకరించడం, తగిన వాతావరణాన్ని కల్పించడం, అండగా నిలబడడం చేయాలి.
పరీక్షల గురించి మాట్లాడాలి. ఏఏ సబ్జక్టులు కష్టమైనవి, ఏవి సులభమైనవో అడిగి తెలుసుకోవాలి. కష్టమైన వాటిని ఎందుకు కష్టమైనవో చర్చించాలి. వాటిని సులభంగా చేసే కొన్ని చిట్కాలు చెప్పాలి.
సమయంలో పిల్లలే ఇంట్లో విఐపిలుగా భావించాలి. వారికి తగ్గట్టుగానే ఇంట్లో అన్ని పనులు జరుగుతుండాలి. తనకి ఇంట్లో ఎంతో ప్రాముఖ్యత లభిస్తోందనే విషయం పిల్లలు ఫీలవ్వాలి.
సమయంలో పిల్లలో కలిగే అనేక భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలగడం చాలా ముఖ్యం.
దానికి తల్లిదండ్రులే చొరవ తీసుకొని మాట్లాడాలి.
ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ‘నువ్వు బాగా చదువుతావు. నీకు ఆసక్తి ఉంది. నీకు తేలికగా మంచి మార్కులు వస్తాయి’ అనే పాజిటివ్ సంకేతాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అందాలి.
పోషక విలువలుగల వారికి ఇష్టమైన ఆహారపదార్ధాలను చేసిపెట్టాలి. వాళ్ళు సరిగ్గా తినేలా, సరిగ్గా నిద్రపోయేలా చూడాలి.
భయం పొగొట్టడానికి పిల్లలు తేలిగ్గా జవాబులు రాయగల కొన్ని ప్రశ్నాప్రతాలను తయారుచేసి వారితో రాయించాలి. వాటితో సాధించే మంచి మార్కులు పిల్లల ఒత్తిడిని తగ్గిస్తాయి.
ప్రిపరేషన్ సమయంలో పిల్లలు ఉత్సాహ భరితంగా ఉండడం చాలా అవసరం. అందుకు తల్లిదండ్రులు చిన్న చిన్న బహుమానాలు, కొత్త వస్తువులు కొని ఇస్తుండాలి.
ప్రిపరేషన్‌కు అవసరమైన చిన్నచిన్న నోట్స్ రాసిపెట్టడం, రివిజన్‌లో సహాయపడడం, చదువుకోవడానికి టైమ్ తయారుచేయడం వంటివి చేయాలి.
సమయంలో పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళాలి. చదువనేది నిర్విరామంగా ఉండకూడదు.
సాధారణంగా ఎలా చదవాలో సరైన అవగాహన లేకుండా చదువుతుంటారు. దానివలన అదేపనిగా చదవడం, ఒకటే సబ్జెక్టు చదవడం వలన ఆసక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత ఉండకపోవడం, శారీరకంగా అలసిపోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కొన్ని ప్రిపరేషన్ టెక్నిక్స్ తెలుసుకొని పిల్లల్ని కూడా అలాగే చదివిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ రకమైన చర్యలతో తల్లిదండ్రులు పిల్లలలో పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, తాము కూడా ఎంతో రిలాక్స్‌డ్‌గా ఉండవచ్చు. దీని ప్రభావం పిల్లల పరీక్షా ఫలితాలపై కూడా పాజిటివ్‌గా ఉంటుంది. పిల్లలకు పరీక్షలలో మంచి మార్కులు రావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆ మార్కులు, పిల్లల జీవితాల కన్నా, వ్యక్తిత్వాల కన్నా గొప్పవి కావనే విషయం తల్లిదండ్రులు గ్రహిస్తే ఈ పరీక్షాకాలం అందరికీ ఆహ్లాదకాలంగా గడిపేయవచ్చు.
- డి. వేణుగోపాల్
ఇలా చేయండి..!
పరీక్షల టైమ్‌టేబుల్ వచ్చిన ఒక రెండు మూడు రోజుల తర్వాత పిల్లలతో ఒక చర్చా కార్యక్రమం పెట్టాలి.
వెళ్ళి టీచర్‌ని కలిసి పిల్లల పరిస్థితి ఏమిటో, సబ్జక్టులలో ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకోవాలి.
ప్రిపరేషన్‌కి ఒక 60 లేదా 30 రోజుల టైమ్ తయారుచేయాలి. ఏఏ సబ్జక్టులు ఎప్పుడు, ఎంత చదవాలనే దానిపై ఒక విశ్లేషణ చేసుకొని దానికి తగ్గట్టుగా టైమ్‌టేబుల్ తయారుచేసుకోవాలి.
అదే పనిగా గంట సమయం కన్నా ఎక్కువ సేపు చదవనీయకండి.
ప్రశ్నాపత్రాలు తయారుచేసి మాక్ టెస్ట్‌లు పెట్టండి. దానికి బహుమతులు ఇవ్వండి.
వారానికోసారి బయటకు తీసుకువెళ్లండి. అప్పుడప్పుడు ఆటకి, టీవీకి అనుమతి ఇవ్వండి.
చదివితే ఏమవుతుందో దృశ్యపరంగా వివరించి చెప్పండి. వారికి ఇష్టమైన సినిమా హీరోలు, క్రీడాకారుల చదువు గురించి చెప్పాలి.
ఇలా చేయవద్దు..!
టైమ్ రాగానే ‘ఇక ఆటలు టీవీలు బంద్‌చేసి చదువు’ అని భయపెట్టకండి
టార్గెట్ పెట్టకండి. ఇతర పిల్లల మార్కులతో పోల్చి ‘అన్ని మార్కులు రాకపోతే’ అని హెచ్చరికలు జారీ చేయకండి.
సందేహాలు వచ్చి అడిగితే విసుక్కోకండి.
మంచి మార్కులు రాకపోతే ‘చదువు మాన్పించేస్తానని, ఎవరింట్లోనైనా పనికి పెట్టేస్తానని’ బెదిరించకండి.
సిలబస్ పూర్తి కాకపోవడం, టీచర్ చెప్పడం బాలేకపోవడం వంటి సమస్యలు పిల్లలు చెప్పినప్పుడు ఏవో సాకులు చెప్తున్నారని, విసుక్కోకూడదు.
చదువుమీద బోలెడంత ఖర్చు చేశాం’ అని ఆ డబ్బు తేవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అప్పులు చేశారో పిల్లల ముందు ఏకరవు పెట్టకూడదు.
మీద నిఘా పెట్టకూడదు. మాటిమాటికీ చదువుతున్నారో లేదో వెళ్ళి చూడకూడదు. ఆ విషయం సులభంగా గ్రహించగలరు.