-హస్తినలో జోరుగా రాజకీయాలు..
-వేగంగా మారుతున్న పరిణామాలు
-ప్రధాని పిలుపుతో ఢిల్లీకి గవర్నర్
-సీఎం, డిప్యూటీ సీఎంలకూ ఆహ్వానం
-పీసీసీ చీఫ్ బొత్స,మాజీ చీఫ్ డీఎస్‌కు కూడా
-నేడు కోర్‌కమిటీ సభ్యులతో నేతల చర్చలు
-అనంతరం కాంగ్రెస్ అగ్రనేతల భేటీ
-కీలక నిర్ణయం వెలువడే అవకాశం!
-సోనియా, ప్రధానిని కలిసిన ప్రణబ్
-గంటపాటు సుదీర్ఘ మంతనాలు
-అనంతరం మినీ కోర్ కమిటీలో చర్చ
-మరిన్ని సమస్యలు వస్తాయనలేదు
-వివరణ ఇచ్చిన ఆర్థిక మంత్రి
-సమ్మె తీవ్రత వల్లే సమావేశమయ్యాం
-భేటీ అనంతరం ఆజాద్ వెల్లడి
-ప్రణబ్‌కు కేశవరావు ఘాటైన లేఖాస్త్రం
-వ్యాఖ్యలు గందరగోళం రేపాయని గుస్సా
-నేడు మళ్లీ సబ్ కోర్ కమిటీ సమావేశం
-తెలంగాణపైనే చర్చించనున్న నేతలు
-పరిష్కార యత్నంలో ఉన్నామన్న రాహుల్
హైదరాబాద్, న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేంద్రంగా హస్తిన రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌లో సమస్య పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. అనంతరం తన ఆధ్వర్యంలో మినీ కోర్‌కమిటీని సమావేశపర్చి తెలంగాణ అంశంపై చర్చించారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ప్రణబ్.. ఇటీవల తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ఇస్తే మరిన్ని సమస్యలు వస్తాయని తాను అనలేదని తేల్చి చెప్పారు. ప్రణబ్ ఇచ్చిన వివరణ, హస్తినలో తెలంగాణ అంశంపై వరుస భేటీ లు, రాజధానికి గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, పీసీసీ మాజీ చీఫ్‌లను పిలవడం తెలంగాణ సమస్య సత్వర పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నదనేందుకు సంకేతాలని విశ్లేషకులు చెబుతున్నారు. అందరి అభివూపాయాలను పరిగణనలోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర పెద్దలను ఢిల్లీకి పిలిచారని సమాచారం. ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీ వచ్చిన గవర్నర్ శనివారం మన్మోహన్, హోం మంత్రి చిదంబరంతో సమావేశం కానున్నారు.
సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను నివేదించనున్నారు. కేంద్ర నిఘా వర్గాల నివేదికలు తమ వద్ద పుష్కలంగా ఉండటంతో గవర్నర్ నివేదికలపై ఏ మాత్రం ఆధారపడకున్నా, నిర్ణయంలో ఆయనకూ భాగస్వామ్యం కల్పించాలని భావించే నరసింహన్‌ను పిలిచినట్లు తెలిసింది. దాంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్‌ను కూడా శనివారం ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ ఆదేశించింది. వీరంతా ప్రధానిసహా ఇతర కోర్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. వీరితో సమావేశమైన తర్వాత కోర్ కమిటీ మరోసారి భేటీ జరిపి, విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఏది ఏమైనా శనివారం జరగబోయే కోర్ కమిటీ సమావేశం చాలా కీలకం కావడంతో ఢిల్లీ స్థాయిలోని రాజకీయ వర్గాలు చాలా ఆసక్తితో ఉన్నాయి.
హస్తినకు సమ్మె సెగ
గత 25 రోజులుగా రాష్ట్రంలో పరిపాలన దాదాపు స్తంభించిపోయింది. తెలంగాణలో సకల జనుల సమ్మె తీవ్ర స్థాయికి చేరింది. దాని తీవ్రత ఢిల్లీపైనా ప్రభావాన్ని చూపెడుతున్నది. దీంతో కేంద్రం కదిలింది. కేవలం తెలంగాణ సమస్యపైనే చర్చించడానికి పలు దఫాలుగా హస్తినలో ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని నేతృత్వంలో ఇటీవల జరిగిన సమావేశానికి తోడు ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని కలిశారు. తరువాత ప్రణబ్ తన ఆధ్వర్యంలోనే ఇతర ముఖ్యనేతలు ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. సమ్మెను ఎలా విరమింపచేయాలన్న దానిపైనే ఢిల్లీ నాయకత్వం తర్జనభర్జన పడుతున్నది.
శుక్రవారం కోర్ కమిటీలోనూ అదే చర్చ జరిగినట్లు తెలిసింది. తెలంగాణ పరిష్కారంతోనే సమ్మె విరమణ ముడిపడి ఉండటంతో ఏం చేయాలో పాలుపోక మినీ కోర్‌కమిటీ తన చర్చను అసంపూర్తిగా ముగించింది. గత వారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేయడానికి కేంద్రం నుంచి ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపాలన్న దానిపై ఇప్పటికీ నిర్ణయం జరుగలేదు. కానీ తెలంగాణ సమస్య పరిష్కార బాధ్యతలు పార్టీ పరంగా ప్రణబ్ ముఖర్జీకి అప్పగించడంతో ఆయన హైదరాబాద్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతకు ముందు జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ తెలంగాణ ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని వార్తలు వెలువడినా సమావేశం కేవలం ఆర్థిక, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చకే పరిమితమైంది. మరీ ముఖ్యంగా తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయనందున తెలంగాణ అంశం ప్రభుత్వం దాకా వెళ్లలేదు. కాంగ్రెస్ తన వైఖరి తేల్చకుండా భాగస్వాముల అభివూపాయాలను కోరడం అవివేకమవుతుంది కనుక తెలంగాణ అంశాన్ని పార్టీకే పరిమితం చేశారని సమాచారం. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేస్తుండడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడి, త్వరలో పార్టీ పరంగా తన వైఖరిని వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
వివాదం రేపిన వ్యాఖ్యలు.. ప్రణబ్ వివరణ
ప్రణబ్ ఇటీవల ఒక టీవీ చానల్ ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు ఒక అడుగు ముందుకు వేసి ప్రణబ్‌కు ఘాటైన లేఖాస్త్రం సంధించారు. ప్రణబ్ వ్యాఖ్యలు అనేక అపార్థాలకు తావిచ్చాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఏ రకంగానూ ఔచిత్యంగా లేదని కేకే తన లేఖలో ప్రణబ్‌పై దాడి చేశారు. తెలంగాణ అంశం కొత్తదికాదని, రాష్ట్రాల విభజన కొత్తగా జరగడం లేదని కేకే స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి ప్రసంగంలోనూ, యూపీఏ ఎజెండాలోనూ, సీడబ్ల్యూసీలోనూ, పార్లమెంట్‌లోనూ తెలంగాణ విషయం ప్రస్తావనకు వచ్చిందని, చివరకు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు స్వయంగా కేంద్ర హోంమంత్రి ప్రకటించారని ప్రణబ్‌కు రాసిన లేఖలో కేకే గుర్తు చేశారు. పైగా తెలంగాణ ఏర్పాటుకు మరింత సమయం కావాలన్న ప్రణబ్ వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి గురి చేశాయని తెలిపారు.
ఇది అసంబద్ధమని కూడా కేకే తన లేఖలో ప్రస్తావించడంతో పాటు ప్రణబ్ స్వయంగా ఈ విషయంలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రణబ్ స్పందించారు. తెలంగాణ ఏర్పాటుతో మరిన్ని సమస్యలు వస్తాయని తాను ఎక్కడా చెప్పలేదని, అలాంటి వ్యాఖ్యలు తనకు ఆపాదించవద్దని ప్రణబ్ సబ్‌కోర్ కమిటీ మీటింగ్ తర్వాత వివరణ ఇచ్చి, తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని పరోక్షంగా స్పష్టం చేశారు. అసలు తాను ఆ మాటలు అనలేదని కొట్టి పారేశారు. మీరు ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఎవరు ఆ వ్యాఖ్యలు చేసింది?’’ అని ఎదురు ప్రశ్నించారు.
అసంపూర్తిగా మినీ కోర్‌కమిటీ సమావేశం
45 నిమిషాల పాటు సాగిన మినీ కోర్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సమస్యపై తీవ్ర చర్చ జరిగినప్పటికీ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు ఆయన తెలిపారు. దీనికి కొనసాగింపుగా శనివారం మరోసారి కోర్ కమిటీ భేటీ కానున్నట్లు వెల్లడించారు. సకల జనుల సమ్మె తీవ్రంగా ఉండటంతోనే తామంతా సమావేశమైనట్లు ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మినీ కోర్ కమిటీ సమావేశంలో ప్రణబ్, చిదంబరం, ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో పాటు ఆజాద్ పాల్గొన్నారు.
సోనియా, మన్మోహన్ సమావేశానికి హజరుకానప్పటికీ అంతకు ముందే ప్రణబ్ విడివిడిగా వారిద్దరితో గంటపాటు సమావేశమై తెలంగాణ, సమ్మె విషయాలతోపాటు సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ సమస్యతో పాటు దాని అనుబంధ అంశాలపై కోర్ కమిటీ చర్చించినట్లు ప్రణబ్ విలేకరులకు తెలిపారు. చర్చలు అసంపూర్తిగా ముగిశాయన్న ప్రణబ్.. తదుపరి చర్చలు కొనసాగుతాయన్నారు.
అదే ప్రయత్నంలో ఉన్నాం :రాహుల్
అధిష్ఠానం సహా కాంగ్రెస్‌లోని ప్రముఖులందరికీ సమ్మె వేడి తగిలింది. సమ్మె కొనసాగుతుండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తెలంగాణపై త్వరగా ఏదో ఒక నిర్ణయం జరగాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీని కలిసిన తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి కోరారు. ఇందుకు స్పందించిన రాహుల్ ‘‘మేమంతా సమస్య పరిష్కార ప్రయత్నంలో ఉన్నాం. దాని మీదే కూర్చున్నాం’’ అని వ్యాఖ్యానించడం చూస్తే హస్తినలోని పెద్దలందరికీ సమ్మె తీవ్రత అవగతమైందని అర్థమవుతున్నది. మరీ ముఖ్యంగా పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులకే సమ్మె పరిమితం కాలేదన్న సత్యాన్ని అధిష్ఠానం గ్రహించిందని నేతలు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా నాటుకుని పోవడంతోనే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారనే అంచనాకొచ్చారు. అందుకే కేసీఆర్, రాజకీయ, ఉద్యోగ సంఘ నాయకుల బృందం నాలుగురోజుల పాటు ఢిల్లీలో ఉన్నా సమ్మె ఇసుమంతైనా తగ్గకపోవడంతో ఇది కచ్చితంగా ప్రజా ఉద్యమమేననే నిర్ధారణకొచ్చారు. తెలంగాణపై పార్టీ పరంగా ఇప్పటికీ నిర్ణయం తీసుకోనందున ఎలాగైనా సమ్మెను విరమించే విధంగా విధానపరమైన ప్రకటన ఒకటి చేస్తే సరిపోతుందా? లేక సమ్మెకు మూలమైన తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపాలా? అన్న విషయాలపై శనివారం కోర్ కమిటీ సమావేశం కానుండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమస్య సత్వర పరిష్కారానికి కేంద్రం నడుం బిగించనట్లయితే మరిన్ని తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని టీ కాంగ్రెస్ నేతలు సహా తెలంగాణవాదులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 12,13,14 తేదీల్లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన రైల్‌రోకో ఆందోళన ఉధృత రూపం దాల్చే అవకాశం ఉంది.
ఢిల్లీకి చేరుకున్న గవర్నర్
ప్రధాని మన్మోహన్‌సింగ్ పిలుపు మేరకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని పిలుపుతో రేణిగుంట విమానాక్షిశయం నుంచి నేరుగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజులు తాను రాజధానిలోనే ఉంటానని, ప్రముఖులందరినీ కలుసుకుంటానని గవర్నర్ చెప్పారు. మీ పర్యటన ఉద్దేశమేమిటని విలేకరులు అడిగినపుడు, సూటిగా సమాధానం చెప్పకుండా, ‘‘నా పర్యటన ఎందుకో మీకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానితో అపాయింట్‌మెంట్ ఉందని తెలిపారు. అయితే ప్రధానితో సమావేశమైన తర్వాత కూడా తను మీడియాకు ఏమీ చెప్పనని గవర్నర్ అన్నారు.
Read more...