మారిన సిలబస్ పై పట్టు ఎలా?
రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (S.C.E.R.T.) ఇటీవల మూడవ, ఆరవ, ఏడవ తరగతుల పాఠ్యపుస్తకాలను అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు అందించింది. ఈ నూతన పాఠ్యపుస్తకాలను చక్కగా ఉపయోగించి పిల్లలు విద్యాభివృద్ధిని సాధించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు ఎలాంటి పాత్ర నిర్వహించాలి? విద్యార్థులు ఎలాంటి కృత్యాలు చేస్తూ అభ్యసించాలి? అసలు ఈ మారిన సిలబస్‌లో ఉన్న నూతన అంశాలేమిటి? అనే అంశాలను సోదాహర ణంగా పరిశీలిద్దాం.
కృత్యాలలో పాల్గొనాలి
ఆరవ తరగతిలో ‘మన ఆహారం’ అనే సైన్సు పాఠంలో మొత్తం నాలుగు కృత్యాలు ఉన్నాయి. ‘1.రకరకాల ఆహార పదార్థాలు, 2.ఆహారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, 3. మనం వంట చేద్దాం, 4. ఆహారం నిలువ చేద్దాం.’ విద్యార్థులు ఈ నాలుగు కృత్యాలలో పాల్గొని జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి. ఆహార పదార్థాలను పరిశీలించడం, వాటి గురించి చర్చించడం, కావలసి పదార్థాల గురించి సమాచారం సేకరించడం, ‘వంట’ చేయడాన్ని ఒక ప్రయోగంలా నిర్వహించడం, చివరగా ఆహారాన్ని నిల్వచేసే విధానాలు అవలంభించడం ద్వారా పిల్లలలో ప్రయోగాత్మక జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటిస్తూ క్రమపద్ధతిలో ఈ కృత్యాలు నిర్వహించడం జరుగుతుంది.
అదేవిధంగా ‘జంతువులు ఏమి తింటాయి’ పాఠ్యాంశం లో ‘ఆహారం తీసుకోవడం’-అనే కృత్యంలో ఏయే జంతువు ఎలాంటి ఆహారం తీసుకుంటుందో వివరాలు సేకరించాలి. ‘దారాల నుంచి వస్తువుల దాకా’ అనే పాఠ్యాంశంలో ‘నూలు వడకడం’, ‘చాపలు అల్లుదాం’ వంటి కృత్యాలు విద్యార్థుల్లో చేతివృత్తులపై అవగాహనను పెంచగలవు. పని చేసే తత్వాన్ని, పనిలో సహకారాన్ని, మెళకువలను అర్థం చేసుకోగలరు. అందుకే, ప్రతికృత్యంలో విద్యార్థిని భాగస్వామిని చేయాలి.
గణితంలో సాధన
ఆరవ తరగతి గణితంలో విద్యార్థులు ‘ప్రయత్నించండి’ అని ఇచ్చిన అంశం క్రింద ఉన్న కృత్యాలను తప్పనిసరిగా చేయాలి. ‘బీజగణిత పరిచయం’ పాఠ్యాంశంలో ఇవ్వబడిన అమరికలు 1, 2, 3,లను చూసిన పిదప ‘ప్రయత్నించండి’ టైటిల్ క్రింద ‘పక్క అగ్గిపుల్లల అమరికకు తగిన సూత్రం రాయండి?’ వంటి కృత్యాలు, ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కృత్యాల నిర్వహణ వల్ల విద్యార్థులు బీజగణిత భావనలను బాగా అర్థం చేసుకోగలుగుతారు.
‘చుట్టు కొలతలు- వైశాల్యాలు’ పాఠ్యాంశంలో ఒక తీగను ముక్కలుగా కత్తిరించి, ఆ ముక్కలతో రకరకాల జ్యామి తీయ ఆకృతులను నిర్మించడం, ఆ ఆకారాల వైశాల్యాలను, చుట్టుకొలతలను దారం, స్కేలు సహాయంతో కొలవడం వంటి కృత్యాలు చేస్తూ విద్యార్థి ప్రాథమిక గణిత ప్రక్రి యలు, భావనలు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. తద్వారా క్రమంగా గణి త జ్ఞానాన్ని సంతరించు కోగలుగుతాడు.
ఉపాధ్యాయులు చేయవలసినది....
విద్యార్థుల ప్రాథమిక అవగాహనలను, వారి స్థాయిలను మ్యాపింగ్ చేసుకోడం ద్వారా బోధన మొదలుపెట్టాలి. విద్యార్థుల్లో ఆలోచన, ప్రశ్నించే తత్వం పెంపొందించడానికి పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలను, కృత్యాలను, ఉదాహరణలను వినియోగించు కోవాలి. కృత్యాలకు కావలసిన పరికరాల తయారీ, సేకరణలలో పిల్లలు కూడా పాలుపంచుకునేలా చేస్తే వారిలో ఉత్సాహం చిగురిస్తుంది. విద్యార్థులు తమ వంతు పనిచేస్తుంటే ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తూ ప్రోత్సహిస్తూ, అభినం దిస్తూ, తగిన సూచన లను అందిస్తూ ఉండాలి.
నివేదికలు రచింపజేయాలి
విద్యార్థులు కృత్యాన్ని ముగించి న తరువాత ఆ కృత్యం యొక్క మొదటి ప్రక్రియ నుండి చివరి ప్రక్రియ వరకు గల అంశాలను వివరిస్తూ నివేదిక రచించమని విద్యార్థులను ప్రోత్సహించాలి. బొమ్మలు గీయించడం, భాగాలు గుర్తించడం వంటి కీలక అంశాలను విద్యార్థులు నివేదికలలో పొందుపరిచేలా చూడాలి.
స్థానిక వనరులు
వస్తువులను, పరికరాలను సేకరించే సమయంలో స్థానికంగా లభించే వనరులను వినియోగించడం నేర్పించాలి. ప్రతీదానికీ ‘షాప్’కు వెళ్లి ‘షాపింగ్’ చేయాలి అనే కృత్రిమ ధోరణిని పిల్లలు విస్మరించేలా గైడ్ చేయాలి. ‘నోకాస్ట్’, ‘లోకాస్ట్’ మెరియల్‌ను సేకరించే గుణం వారిని ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగించుకునే దిశలో మెరుగైన విధంగా సిద్ధం చేస్తుంది.
తాము నేర్చుకున్న అంశాలను, కృత్యాలను విద్యార్థులు అర్థం చేసుకొని స్వయంగా సమాధానాలు ఇచ్చే విధంగా వారిని సిద్ధం చేయాలి. అంతేగాని తరగతిలోని విద్యార్థు లంతా కలిసి కట్టుగా గా సమాధానాన్ని రాసేలా ప్రోత్సహించ కూడదు. ఇది వారిలోని విభిన్నతను, వారి ఆలోచన సృజనాత్మకతను అడ్డుకుంటుంది. అందుకే ఉపాధ్యా యులు విద్యార్థులను కృత్యోన్ముఖులను చేయాల్సి ఉంది. గోడపత్రిక, బులెటిన్ బోర్డు, ఎగ్జిబిషన్ లాంటి ఏదో ఒక ప్రక్రియ ద్వారా విద్యార్థి తన స్వీయ ఆలోచనలను వెలువరించేలా ప్రోత్సహించాలి.
Take By: T News Read more...