ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా!
ఒక్క ఏజెంట్‌కూ లైసెన్సు లేదు
రెండేళ్లుగా యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు
హైదరాబాద్,
జూన్ 18 ():డ్రైవింగ్ లైసెన్సు లేదని చలాన్ రాస్తారు. లైసెన్సు
ఉన్నా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ దగ్గర లేదంటూ జరిమానా విధిస్తారు. ఇవన్నీ
ఉంటే పొల్యూషన్ సర్టిఫికెట్ ఏదీ? హెల్మెట్ ఎక్కడ? అంటూ నిలదీస్తారు.
దబాయిస్తారు.రెండేళ్లుగా యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు
ఇవన్నీ.. అంత ప్రమాదకరం కాని ద్విచక్షికవాహనదారుల విషయంలో కనిపించే దృశ్యాలు. మరి.. ప్రాణాంతక నిర్లక్ష్యం ప్రదర్శించే ‘ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా’ గురించి అధికార గణం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే ఏయే చర్యలు చేపడుతోంది? నిజంతెలుసుకుంటే నివ్వెరపోవాల్సిందే. షిర్డీ వెళ్లే బస్సు రోడ్డుప్రమాదానికి గురై 32 మంది దుర్మరణం చెందడంతో, రవాణాశాఖ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో సుమారు 600 వరకు ట్రావెల్ ఏజెంట్లు ఉన్నారు. వీరికి సంబంధించి 1215 ప్రైవేటు బస్సులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరుగుతున్నాయి.
వాస్తవానికి ప్రైవేటు బస్సు రోడ్డుపై నడుపుకోవాలంటే ముందుగా టికెట్ బుకింగ్ చేసుకునేందుకు రవాణాశాఖ నుంచి లైసెన్సు తీసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర లేదా అంతర్‌రాష్ట్ర పర్మిట్ తీసుకోవడం, మూడు నెలలకు ఒకసారి పన్ను చెల్లించడం వంటివి ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సుల్లో ఒక్క ట్రావెల్ ఏజెంట్‌కూ లైసెన్సు లేదు. కొందరి లైసెన్సుల కాలపరిమితి 2007లో, మరికొందరివి 2009లో ముగిసిపోయింది. ఇప్పటివరకు ఒక్కరూ రెన్యువల్ చేయించుకోలేదు. సోమవారం జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూడటంతో రవాణాశాఖాధికారులు కంగుతిన్నారు. లైసెన్సు లేకపోయినా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయంటే అందుకు మొదట బాధ్యత వహించాల్సింది రవాణాశాఖే.
అయితే ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనధికార ఆదేశాలు ఉండటంతో, రవాణాశాఖ అధికారులు ఎవ్వరూ వాటి గురించి ఆరా తీసే ధైర్యం చేయలేకపోతున్నారని సమాచారం. లైసెన్సు లేని ఏజెంట్లు టికెట్లు విక్రయించకూడదు, బస్సులు తిప్పకూడదు. కానీ రెండేళ్లుగా ట్రావెల్స్.. మాఫియా స్థాయిలో నిబంధనలు గాలికి వదిలేసి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ విషయమై రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరిని ‘టీ మీడియా’ ప్రశ్నించగా 2009 దాకా ఏడాదికి 2500 కేసుల వరకు రాసేవారమని, అయితే ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం నుంచి అనధికార ఆదేశాలు రావడంతో రెండేళ్లుగా వాటి జోలికి వెళ్లడం లేదన్నారు.
సవాలక్ష నిబంధనలు.. ఖాతరు చేసేదెవరు?
వాస్తవానికి వాహనాలు, ప్రయాణానికి సంబంధించి నిబంధనలు బోలెడున్నాయి. పట్టించుకునేవారే లేరు. ప్రైవేటు బస్సులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నా పట్టించుకుని శిక్షించేవారు కరువయ్యారు. లైసెన్సు సమయంలో కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి తీసుకుంటారు. ఒకచోట నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అక్కడే ఆగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాంట్రాక్టు క్యారియర్‌గా కాకుండా స్టేజీ క్యారియర్‌గా తిరుగుతున్నాయి. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.
ఈ విషయం రవాణాఅధికారులకు తెలిసినా, పైస్థాయిలో ఒత్తిడి ఉండటంతో చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. కాంట్రాక్టు క్యారియర్ అనుమతి ఉన్న బస్సుల్లో తప్పనిసరిగా ప్రయాణికుల వివరాలు ఉండాలనే నిబంధన కూడా అమలుకావడం లేదు. ఈ నిబంధన అమలుకాకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారి వివరాలు తెలియక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదాహరణకు మొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో రవాణా అధికారులు ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్‌చేసి వివరాలు అడిగితే, తమ వద్ద వివరాలు ఏమీలేవని జవాబు వచ్చింది.
హైదరాబాద్ నగరంలో 40మంది బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్లు బుక్ అయ్యాయని తెలియడంతో, 44 మంది ప్రయాణికుల వివరాల కోసం నాలుగుగంటలపాటు శ్రమించి 40 మంది ఏజెంట్లను వాకబు చేసి అందుబాటులో ఉన్న వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించగలిగామని రవాణాశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ ‘టీ మీడియా’తో చెప్పారు.
ఆర్టీసీ బస్సులు స్టేజీ క్యారియర్ల కిందకు వస్తాయని, వాటిల్లో కూడా రిజర్వేషన్ చేయించుకునేవారి జాబితా ఉండే విధంగా ప్రయత్నిస్తామని రవాణా శాఖాధికారి ఒకరు చెప్పారు.
డ్రైవర్లకు పరీక్షలు, విశ్రాంతి మాటేమిటి?
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాంట్రాక్టు క్యారియర్లుగా నడపాలంటే వాల్వో బస్సుకు మూడు నెలలకు రూ.1.40 లక్షలు, హైటెక్ బస్సులకు మూడు నెలలకు ఒకసారి రూ.లక్ష చొప్పున చెల్లించాలి. అలా ప్రతి సంవత్సరానికి నాలుగుసార్లు పన్ను చెల్లించాలి. పర్మిట్ కోసం అంతపూరాష్ట్ర బస్సులకు సీటుకు రూ.3675, రాష్ట్ర సర్వీసులకు రూ.2625 చొప్పున చెల్లించాలి. రెండేళ్ల నుంచి లైసెన్సులు రెన్యువల్ చేసుకోకపోవడంతో, కేవలం పర్మిట్లు మాత్రమే కట్టి బస్సులు తిప్పుకుంటున్నారు. ఫలితంగా పన్ను రూపేణా ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లలో నష్టం వాటిల్లుతోంది. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం స్పందన లేదు.
ప్రభుత్వరంగ సంస్థ అయినప్పటికీ ఆర్టీసీ నుంచి సకాలంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు బస్సులపట్ల ఉదాసీనంగా ఉంటోంది. ఇందులో ఆంతర్యం అధికారులకు, ప్రభుత్వానికే తెలుసు! లైసెన్సుల జోలికి వెళ్లని రవాణాశాఖ కేవలం వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూన్సులు ఉన్నాయో లేదో చూసి ఊరుకుంటోంది. గత కొంతకాలం నుంచి అదీ లేదు. అయితే ప్రైవేటు బస్సుల్లో చాలావరకు కొత్త బస్సులే కావడంతో ఫిట్‌నెస్ సమస్య పెద్దగా ఎదురుకావడం లేదు.
కొన్ని బస్సుల యాజమాన్యాలు ఒకే పర్మిట్ రెండు, మూడు బస్సులు తిప్పడం, లేదా ఒకే నంబర్‌తో రెండు బస్సులు నడపడం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనదారులకు, కార్లలో ప్రయాణించేవారికి మద్యం తాగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు జరుపుతున్నారు. కానీ ఒక్క బస్సు డ్రైవర్‌ను కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. కనీసం ఆ ఆలోచన కూడా అటు పోలీసుశాఖకుగానీ ఇటు రవాణా అధికారులకు గానీ ఎందుకు తలెత్తడం లేదో! బస్సులో ప్రయాణికుల ప్రాణాలు బస్సు నడిపే డ్రైవర్‌పై ఆధారపడి ఉంటాయి.
బస్సు డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి. తగినంత విశ్రాంతినివ్వాలి. కానీ మెజార్టీ యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు షిర్డీ బస్సు ప్రమాద ఘటనతో కాస్త హడావిడి చేస్తున్న ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటుందో, కంటి తుడుపు చర్యలతో సరిపెడుతుందో చూడాలి.
Take By : T News
0 comments:
Post a Comment