Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, June 28, 2012

ఏజెన్సీ మద్యం దుకాణాలకు బినామీల అవతారం



- వెనకుండి కథ నడిపించిన మద్యం మాఫియా
- విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న వ్యాపారులు
- ‘టీమీడియా’ పరిశీలనలో వెల్లడైన నిజాలు
- ప్రశాంతంగా మద్యం దుకాణాలకు ముగిసిన లాటరీ


ఖమ్మం టౌన్, జూన్ 27():‘నేటి విద్యార్థులే రేపటి పౌరులు.. నవసమాజ నిర్మాతలు’ అని మన పెద్దలు సూక్తీకరించారు. కానీ ఆ విద్యార్థులు జిల్లాలో వేళ్లూనుకున్న మద్యం వ్యాపారంలో నేడు పావులుగా మారారు. అక్రమ మద్యం వ్యాపారంలో ఆరితేరి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న కొందరు రాబందులు వెనుక బడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తమ ఉన్నతికి మెట్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది కథ కాదు. పచ్చి నిజం..టీమీడియా పరిశీలనలో వెల్లడైన నిప్పులాంటి నిజం. జిల్లాలోని 153 మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిల్లో 71దుకాణాలను ఏజెన్సీ ప్రాంతానికి కేటాయించింది. అయితే ఏజెన్సీలో మద్యం దుకాణానికి దరఖాస్తు చేయాలంటే స్థానిక గిరిజనుడికే మొదటి ప్రాధాన్యత. అలాగే సంబంధిత తహసీల్దార్ ఇచ్చిన నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలనే కచ్చితమైన నిబంధన అమల్లో ఉంది. కాగా ఆ రెండు సర్టిఫికెట్‌లు పొందాలంటే ప్రస్తుత చట్టాల ప్రకారం సామాన్యులకు వెంటనే సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఎప్పటి నుంచో మద్యంతో మన్యం ప్రజలను దగా చేస్తున్న అక్రమార్కుల కన్ను విద్యార్థులపై పడింది.

ఉన్నత విద్య కోసం తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను ఆసరాగా చేసుకుని విద్యార్థులను ముగ్గులోకి లాగింది మద్యం మాఫియా. ఈనెల 19 నుంచి 25 వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసేందుకు వచ్చిన వారిని పరిశీలించడంతోపాటు రెండు రోజులు( మంగళ, బుధవారాల్లో) రామకృష్ణా ఫంక్షన్‌హాల్లో చేపట్టిన లాటరీ ప్రక్రియకు హాజరైన వారిని ‘టీమీడియా’ నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో వారిని పలకరిస్తే నిజాలు నిగ్గు తేలాయి. వారు ఏషాపునకు దరఖాస్తు చేశారో.. ఎంత డబ్బు చెల్లించారో ఎవ్వరికీ తెలియదు. లాటరీలో దుకాణం దక్కినా.. ఈఎండీ ఫీజు డబ్బు చెల్లించడానికి వెనకుండి ఉరికిచ్చిన వారు సకాలంలో ఎవరూరాక పోవటంతో నేరం చేసిన వాళ్ల లాగా బిక్కమొహాలేసుకుని గంటల తరబడి హాల్‌లోనే కూర్చున్నారు. ఇలా చదువుతో చక్కని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే విద్యార్థులను మద్యం మాఫియా బినామీ వ్యాపారులుగా మార్చారు.

ముగిసిన లాటరీ ప్రక్రియ...
మైదానంలో 2, ఏజెన్సీలో 71 కలిపి జిల్లాలో మొత్తం 153మద్యం దుకాణాలు ఉన్నాయి. కాగా ఆయా ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మైదానంలో1591, ఏజెన్సీలో 971 మొత్తం 2562 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా అదికారులు వాటికి పట్టణంలోని బైపాస్‌రోడ్‌లోని రామకృష్ణా ఫంక్షన్‌హాల్‌లో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎంఎం నాయక్ సమక్షంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న లాటరీ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఆ క్రమంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటేంతవరకు మైదాన ప్రాంత దుకాణాలకు(2)కు లాటరీ ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు. కాగా మిగిలిన ఏజెన్సీ ప్రాంత దుకాణాలు (71) కు సంబంధించి నిబందనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లాటరీ తీయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సూచించడంతో బుధవారం ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీంతో వ్యాపారులు కొంత అసహనానికి గురై ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే అక్కడకు వచ్చిన నాయక్ ఉన్నతాధికారులతో సంప్రదించి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. అలాగే మిగిలిన 71 ఏజెన్సీ దుకాణాల్లో 11 దుకాణాలకు ఒకే ఒక్కరు దరఖాస్తులు చేశారు. వాటిల్లో కొత్తగూడెం మండలం చుంచుపల్లి(92), భద్రాచలం మండల కేంద్రం(115), కూనవరం(122), చింతూరు(126), మణుగూరు(131, 133, 135, 136, 139, 141, 142) ఉన్నాయి. వీటి దరఖాస్తులకు లాటరీ ప్రక్రియ చేపట్టకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే చింతూరు మండల కేంద్రంలోని దుకాణానికి ఒక్కరు కూడా దరఖాస్తు చేయకపోవటంతో లాటరీ నిలిపేశారు. కాగా ఏజెన్సీ ప్రాంత దుకాణాలకు లాటరీ ప్రక్రియలో స్థానిక నివాస, కుల సర్టిఫికెట్లను సమర్పించిన వారినే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. కొందరు తమ పిల్లల సర్టిఫికెట్లను దరఖాస్తుతో జత చేసినా ఇన్‌చార్జ్ కలెక్టర్ నాయక్ వాటిని తిరస్కరించారు. మరికొన్ని దుకాణాలకు ఇద్దరు కలిసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్నీ అడ్డుకున్నారు.

శభాష్ నాయక్..!
కలెక్టర్ సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు ఆ మరుసటి రోజే గురుతరమైన బాధ్యత భుజాలపై పడింది. అదే మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ. గతంలో టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారి పలువురి మెడలకు ఉచ్చు బిగిసిన నేపథ్యంలో అసలు ఈ వ్యవహారమంటేనే వణుకు పుట్టే పరిస్థితి అధికారుల్లో నెలకొంది. ఈక్రమంలో రెండ్రోజుల పాటు సాగిన లాటరీ ప్రక్రియను నాయక్ తన భుజాలపై వేసుకున్నారు. దరఖాస్తుదారుల జాతకాలు చూసే ఈ ప్రక్రియను మొదటి రోజు ప్రారంభించిన ఆయన ఆధ్యంతం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. తొలి రోజున తెల్లవారుజామున మూడు గంటల వరకూ అక్కడే ఉండి లాటరీ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.

ఎక్సైజ్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ నియమ, నిబంధనలకు ఉల్లంఘన కలుగకుండా దిశానిర్దేశం చేశారు. రెండోరోజున మొదలైన ఏజెన్సీ షాపుల ఎంపికలోనూ పారదర్శకత పాటించారు. దరఖాస్తుదారులు స్థానిక గిరిజన, నివాస ధ్రువపత్రాలను సమర్పించే విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించారు. షాపుల వారీగా ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. ఒకానొక సందర్భంలో ఏజెన్సీ సర్టిఫికెట్లను సరైన రీతిలో పరిశీలించకుండా దరఖాస్తుదారులను లోపలికి అనుమతించిన ఓ పోలీసు అధికారిపై ఆయన మండిపడ్డారు. వెంటనే ఆయనకు మెమో జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇతరులెవరికీ లాటరీ తీసే అవకాశం కల్పించకుండా మీడియా, పత్రికల ప్రతినిధులతో టోకెన్లను తీయించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Take By: T News

Read more...

Good Cartoon - Namasthe Telangaana


Take By: T News

Read more...

సమన్వయం లేదు అందుకే ఓడాం - చిరంజీవి


Chieee talangana patrika telangana culture telangana politics telangana cinema
సోనియాకు నివేదించిన చిరంజీవి మీరూ కారణమేనన్న అధినేత్రి
‘ఉప’ ఓటమిపై పోస్ట్‌మార్టం
- పార్టీ బలోపేతంపై చర్చించాం
- పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలో మేడమ్ కార్యాచరణ
- నాయకత్వ మార్పు ఉండదు
- నావల్లే గెలిచామని నేననలేదు మీడియానే వక్రీకరించింది
- సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి
- రాష్ట్రంపై అధినేత్రి ప్రత్యేక దృష్టి
- అందుకే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు
- నాయకత్వ మార్పు అక్కర్లేదు: రఘువీరా
- అధిష్ఠానం ఆదేశిస్తే చిరును సమర్థిస్తాం

న్యూఢిల్లీ, జూన్ 27 ():కాంగ్రెస్‌లో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు సమన్వయం లోపించడంవల్లే ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినట్లు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధినేత్రి సోనియాగాంధీ కూడా అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె దృష్టి సారించినట్లు తెలిపారు. దానిపై ఆమె రూపొందించే కార్యాచరణ ప్రణాళికను తామంతా అనుసరించి పార్టీని బలోపేతం చేస్త్తామని చెప్పుకొచ్చారు. కిందిస్థాయి నాయకులకు పార్టీ, నామినే పదవులు ఇచ్చి పని కల్పించాలని మేడమ్‌ను లేదు సమన్వయం.. అందుకే ఓడాం
కోరినట్లు తెలిపారు. ఆయన బుధవారం రాష్ట్ర మంత్రులు సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాసరావులతో కలిసి సోనియాతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. పార్టీ ఓటమి చెందడానికి కారణాలపై తనదైన నివేదికను ఆమెకు అందజేశారు.

ఆంధ్రవూపదేశ్‌లో ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం పార్టీ అగ్ర నేతలు పలువురు అధిష్ఠానాన్ని కలిసి తమ వివరణలను, అభివూపాయాలను నివేదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం చిరంజీవి కాంగ్రెస్ అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. అగ్ర నాయకత్వం నుంచి, క్షేత్రస్థాయి వరకు అన్నిచోట్లా సమన్వయ లోపం కారణంగానే పార్టీకి దారుణ అనుభవం ఎదురైందని ఆయన విశ్లేషించినట్లు సమాచారం. తిరుపతిలాంటిచోట్ల కూడా నాయకుల మధ్య సఖ్యత కొరవడటం, అంతర్గత గ్రూపు తగాదాలవల్లే పార్టీ నష్టపోయిందని వివరించినట్లు తెలిసింది. రాజంపేట, రాయచోటి లాంటిచోట్ల సరైన అభ్యర్థులను నిలుపలేదని ఆయన అసంతృప్తి వ్యక్తపరిచినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గంతో పోలిస్తే తన సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పార్టీకి పడ్డాయని ఆయన నియోజకవర్గాలవారీగా సమాచారాన్ని సోనియాకు అందించినట్లు తెలిసింది.

దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడంవల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తన పార్టీ పీఆర్పీ విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని, తన వర్గానికి ప్రాధాన్యం లభించలేదని చిరంజీవి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సోనియా సైతం చిరంజీవి పనితీరుపై అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలిసింది. ప్రతిసారి కాంగ్రెస్ నాయకత్వం సహకరించటం లేదని ఫిర్యాదు చేస్తున్న మీరు సమన్వయం కోసం ఏం ప్రయత్నాలు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ విలీనమై ఏడాది గడుస్తున్నా సొంత వర్గీయులైన గంటా, రామచంవూదయ్యలను వెంట తిప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సీనియర్లతో, నాయకులతో సఖ్యత యత్నాలు ఆశాజనకంగా లేవని అన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నందున అహంభావాలకు పోకుండా పనిచేయాలని సూచించినట్లు సమాచారం.

అందుకే కేంద్ర పదవి అడుగుదామనుకున్న చిరంజీవి ఆ పనిచేయకుండానే వెనుదిరిగినట్లు తెలిసింది. సోనియాతో సమావేశమైన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంలోనూ తాను కేంద్ర పదవిని ఆశించలేదంటూ నిట్టూర్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సోనియాతో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. సానుభూతే జగన్ విజయానికి కారణమని, అదే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారిందన్న అంశం తమ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. రెండుస్థానాల్లో పార్టీ విజయానికి కారణాలపై సైతం చర్చించినట్లు చెప్పారు. అన్ని విషయాలపై మేడమ్‌కు అవగాహన ఉందని, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి? పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. రామచంవూదాపురం, నరసాపురంలో పార్టీ తనవల్లే గెలిచిందని తానెప్పుడూ అనలేదని వివరణ ఇచ్చారు. అదంతా మీడియా వక్రీకరణ అంటూ కొట్టిపారేశారు.

‘‘కలిసికట్టుగా పనిచేయడంవల్లే ఆయా స్థానాల్లో విజయం సాధించాం. ఇదే రకంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పా. నావల్లే అక్కడ గెలిచారని నేనన్నట్లు మీడియా పదే పదే ప్రచారం చేయడం భావ్యం కాదు’’ అని సూచించారు. అందరం కలిసి ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే తిరుపతి అభ్యర్థిని ఎంపిక చేశామని, వెంకటరమణ ఎంపిక సమిష్టి నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2014 ఎన్నికల తర్వాత చిరంజీవే సీఎం అన్న పెడన ఎమ్మెల్యే జోగు రమేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ- అది ఆయన అభిమానంగా చూస్తున్నాను తప్ప ఆయన పదాల్లోని అర్థాన్ని తాను చూడటం లేదని అన్నారు. పార్టీలో తననెవ్వరు టార్గెట్ చేయడం లేదన్న ఆయన, దాన్ని మీడియానే ఎక్కువచేసి చూపుతోందన్నారు. తెలంగాణ అంశంగానీ, తనకు కేంద్ర మంత్రి పదవి అంశంగానీ చర్చకు రాలేదన్నారు. ‘‘సామాన్య కార్యకర్తగా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.

నా బాధ్యత ఏమిటన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది తప్ప నేను ఫలానా పదవి కావాలని ఏనాడూ అడగలేదు. కేంద్ర పదవి ఇవ్వకపోయినా, సంతృప్తిగా పనిచేస్తా. ప్రజలకు ఏం చేయాలన్నదే నాకు ముఖ్యం తప్ప నాకేం కావాలన్నది ముఖ్యం కాదు. ఎంపీగా అవకాశం ఇచ్చారు. నన్ను నిరూపించుకోనీయండి’’ అని స్పందించారు. ప్రభుత్వ పెద్దల పనితీరుపై అధ్యక్షురాలి వద్ద అసంతృప్తి వ్యక్తంచేయలేదని చెప్పారు. కేవలం భవిష్యత్తు ఎలా ఉండాలన్న దానిపైనే సలహాలిచ్చినట్లు చెప్పుకొచ్చారు. నాయకత్వ మార్పుల అంశం తమ చర్చలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. నాయకత్వ మార్పుంటుందని తాననుకోవడంలేదని చెప్పారు. మనుషులను సోనియా మారుస్తారని అనుకోనన్నారు. సీఎం మార్పుపై చర్చే లేనప్పుడు మీడియా వారికి నాయకత్వ మార్పుపై అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందన్నది కేవలం అభియోగమే తప్ప అది నిర్ధారణ కాలేదని గుర్తు చేశారు.

అవినీతి నిర్ధారణ అయితే తాను ఖచ్చితంగా స్పందిస్తానని బదులిచ్చారు. కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లేశారా అన్న ప్రశ్నకు తానేం మాట్లాడనని సమాధానమిచ్చారు. ఓట్లు ఎవ్వరు వేసినా వేయకపోయినా కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందన్న ఆయన అది ఎప్పటికీ చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇతరుల ఓట్లు ఎంత మేర సాధించుకుంటామన్నదే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. పీఆర్పీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య సమన్వయలోపం కొనసాగుతోందని అంగీకరించారు. దాన్ని అధిగమించేలా పార్టీ కార్యాచరణ చేపట్టాలని కోరిన ఆయన అధిష్ఠానం చేపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆగస్టులోపు పార్టీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టడానికి పార్టీ పెద్దలు దృష్టిసారిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికలవల్లే పదవుల భర్తీ జరగలేదని తెలిపారు. నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

దాంట్లో అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీని కలిసి అభినందనలు తెలియచేశారు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇక్కడి పార్టీ పరిస్థితులపై అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని పార్టీ వర్గాలు అభివూపాయపడుతున్నాయి.
4200 talangana patrika telangana culture telangana politics telangana cinema
నాయకత్వ మార్పుపై అధిష్ఠానానిదే నిర్ణయం: మంత్రి రఘువీరాడ్డి
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితులను గాడిలో పెట్టడానికి నాయకత్వ మార్పు అవసరం లేదని రాష్ట్రమంత్రి రఘువీరాడ్డి అభివూపాయపడ్డారు. తనతో సహ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న ఆయన పార్టీని బలోపేతం చేయడమే తమ బాధ్యతని చెప్పారు. రాష్ట్రపతిగా ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఢిల్లీ వచ్చిన రఘువీరాతో ఎంపీ చిరంజీవి బుధవారం కొద్దిసేపు మంతనాలు జరిపారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడారు. పార్టీలో సమన్వయం లోపించిందన్న చిరు వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికార పార్టీలో ఇలాంటివి సహజమని అన్నారు. దానికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. ఉప ఓటమికి కారణాలు వెతకడానికే పరిమితం కాకుండా ఓటమిని అధిగమించే విధంగా కార్యాచరణ రూపొందించుకుని నాయకులు ఐక్యంగా పనిచేయాలని కోరారు.

ప్రత్యేక తెలంగాణ అంశంపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇకపై దానిపై మాట్లాడబోమని తెలిపారు. పదే పదే నాయకులు అభివూపాయాలను వ్యక్తంచేయడం భావ్యం కాదన్నారు. అధిష్ఠానం చిరంజీవి నాయకత్వంలో పనిచేయాలని ఆదేశిస్తే దాన్ని తాము ధిక్కరించబోమని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. అధిష్ఠానం చెబితే చిరుతో సహా ఎవరి నాయకత్వాన్నైనా అంగీకరిస్తామని తెలిపారు.

Take By: T News

Read more...

గోప్యజ్ఞానం కాల్‌యుగ! కాల్‌లిస్టుల సంచలనం క్యా హై?


వ్యక్తుల ప్రైవసీ మాటేమిటి?.. మీడియా పాత్రేమిటి? చట్టం చుట్టరికం ఎందాక?
- కాల్‌లిస్టుల వ్యవహారంలో సందర్భాన్ని బట్టి నేరం తీవ్రత పెరుగుతుందా?
- బోఫోర్స్ నుంచి తెహల్కా దాకా.. మారుతూ వచ్చిన మీడియా మాటేమిటి?
- రెండుగా చీలిన రాష్ట్ర మీడియాలో ఏది సత్యం.. ఏదసత్యం?

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన మొబైల్‌లో ఎవరితో మాట్లాడారు క్లాస్‌మేట్ చంద్రబాల ఎవరికి ఫోన్ చేశారు.. వారి మొబైల్ కాల్‌లిస్టులో ఎవవరి నంబర్లున్నాయి ఇది తెలుసుకోవాలంటే చట్టవూపకారం తెలుసుకోవచ్చా.. తెలుసుకోవచ్చుననుకుంటే అది వారి ప్రైవసీకి భంగం కలిగించినట్టు కాదా?.. వారే కాదు, ఎవరి నంబర్ల నుంచి కాల్స్ ఎటు వెళ్లాయో ఏ సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది? పోలీసు అధికారుల స్థాయిలో ఇది సాధ్యమే అయినా, ప్రైవేటు వ్యక్తులు దొడ్డిదారిన ఆ పని చేస్తే ఎలా? అసలు వ్యక్తుల ప్రైవసీకి అర్థమే లేదా?.. ఒకవేళ ఉన్నతస్థాయి వ్యక్తులకు సంబంధించి ఈ సమాచారాన్ని తెలుసుకుంటే అది అధికార రహస్యాల చట్టం కింద తీవ్రమైన నేరం అవుతుందా?

ఆధునిక సాంకేతిక పరిజ్ఖానంతో మీడియా బహుదా విస్తరించిన కాలంలో ఉన్నాం. కాలంతో పాటు కొత్త ప్రశ్నలూ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే కాల్‌లిస్టుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం ఒకవైపు, దానిని అందిపుచ్చుకొని ప్రైవసీ పరిధిని ఛేదించుకొని సమాచార సేకరణ దిశగా పరుగులు పెడుతున్న మీడియా మరోవైపు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పుడు పెను తుఫాన్‌గా మారిన కాల్‌లిస్టుల వ్యవహారంపై.. ఇప్పటికే రాష్ట్రంలో రెండుగా విడిపోయిన మీడియాను గమనిస్తున్నవారికి, ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కాల్‌లిస్టులను సేకరించి నేర పరిశోధన చేసిన ఉదంతాలు ఒక ఎత్తయితే, ఇదే కాల్‌లిస్టుల వ్యవహారంలో ఏకంగా ఓ జర్నలిస్టుపై కేసులు నమోదు కావడం ఇప్పుడు తాజా పరిణామం. జాతీయ స్థాయిలో బోఫోర్స్ కుంభకోణం మొదలుకొని గత దశాబ్దంలోని తెహల్కా స్టింగ్ ఆపరేషన్ వరకు నిజాన్ని నిగ్గు తేల్చేందుకు మీడియా కొత్త పుంతలు తొక్కింది.

మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు ఆనాడు చట్టబద్ధత లేకపోయినా, మారిన పరిస్థితుల్లో ఆ ఆపరేషన్‌ను కోర్టులు కూడా ఆమోదించాయి. అదే క్రమంలో ఇప్పుడున్న మార్గాలను దాటి జర్నలిస్టులు సమాచార సేకరణకు పూనుకుంటే చట్టపరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఇప్పుడు రాష్ట్రంలో కాల్‌లిస్టుల వివాదం ముందుకు తెచ్చింది. గతంలో మద్దెలచెరువు సూరి హంతకుడు భాను అజ్ఞాతంలో ఉన్నపుడు అతని సెల్‌ఫోన్ కాల్‌లిస్టును మీడియా ప్రతినిధులే బయటపెట్టారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన కాల్‌లిస్టును బయటపెట్టడమూ సంచలనమే అయింది. గుంటూరు రూరల్ ఎస్పీగా పనిచేసిన శ్యాంసుందర్ తన భార్యతో వందలసార్లు మాట్లాడారంటూ ఓ వ్యక్తి కాల్‌లిస్టుతో కోర్టుకెక్కడమూ జరిగింది. అయితే, ఆ కేసులు వేరు. ఇపుడు జగన్ అక్రమాస్తుల కేసు తీవ్రత వేరు కేసు తీవ్రతను బట్టి కాల్‌లిస్టుల సేకరణలో నేరం తీవ్రత కూడా మారుతుందా అనేది ఇక్కడ ప్రశ్నగా నిలిచింది. జర్నలిస్టు యాదగిరిరెడ్డి అక్రమ మార్గంలో జేడీ కాల్‌లిస్టును సేకరించారు. అది నేరమే కావచ్చు. అంతమాత్రాన అధికార రహస్యాల చట్టం కింద పరిగణించేంత నేరమా అనేది మరో ప్రశ్న.

హైదరాబాద్, జూన్ 27 () సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...ఆయన క్లాస్‌మేట్ వాసిడ్డి చంద్రబాల మొబైల్‌ఫోన్ల కాల్‌లిస్టుల వ్యవహారంలో ఇటు మీడియా, అటు దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ అక్రమాస్తులు, కంపెనీల కేసుల నేపథ్యంలో ఇప్పటికే రెండుగా విడిపోయిన మీడియా రంగం తమకు ఆసక్తి ఉన్న కోణాల్లో మాత్రమే వార్త కథనాలను వండివారుస్తూ మొదలుపెట్టిన ‘మీడియా యుద్ధం’ చివరకు జర్నలిస్టుల విధులనే ప్రశ్నార్థకం చేసే దశకు చేరుకుంది. వేర్వేరు కుంభకోణాలు...కేసులకు సంబంధించి వివరాలు కావాల్సి వచ్చినపుడు మీడియా ప్రతినిధులు వేర్వేరు మార్గాల్లో సమాచారాన్ని సేకరించటం పరిపాటి. ఆనాటి బోఫోర్స్ కుంభకోణం మొదలుకుని రాష్ట్రాన్ని కుదిపేసిన మాజీ గవర్నర్ తివారీ రాసలీలల వ్యవహారం...మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న భాను సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ వరకు జర్నలిస్టులు తమకు వీలైన మార్గాల్లోనే సమాచారాన్ని సంపాదించారు.

ప్రయివేట్ వ్యక్తులు ఐపీఎస్ అధికారుల మొబైల్‌ఫోన్ల కాల్‌లిస్టులను సేకరించి బయటపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఉదంతంలోనూ జర్నలిస్టులపైగానీ.పయివేట్ వ్యక్తులపైగానీ కేసులు నమోదు కాలేదు. కానీ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంగా మారిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...వాసిడ్డి చంద్రబాల సెల్‌ఫోన్ల కాల్‌లిస్టుల ఉదంతంలో మాత్రం మీడియా ప్రతినిధి యాదగిరిడ్డిపై కేసులు నమోదయ్యాయి.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అధికార రహస్యాల చట్టం ప్రకారం కూడా సదరు జర్నలిస్టుపై కేసులు పెట్టటం. యాదగిరిడ్డి చేసింది తప్పే...అయితే ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం సరైంది కాదని న్యాయ నిపుణులు చెబుతుండగా, ఓ మీడియా ప్రతినిధిగా రాష్ట్రం మొత్తం మీద చర్చనీయంగా ఉన్న కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వృత్తి ధర్మంలో భాగంగానే అతను చంద్రబాల మొబైల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సేకరించాడని జర్నలిస్టు సంఘాల నేతలు అంటున్నారు. కాగా, చంద్రబాల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించేందుకు సదరు జర్నలిస్టు అనుసరించిన విధానం ఖచ్చితంగా తప్పేనని సీనియర్ ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తమిళనాడు తరహాలో పార్టీలవారీగానో...సొంత ప్రయోజనాల కోసమో మీడియా రెండుగా విడిపోవటం వల్ల ఏ అంశంలోనూ ప్రజలకు పూర్తి నిజాలు తెలియకుండా పోతుండటంతోపాటు ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

అందరి దృష్టి...
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జగన్ కంపెనీలపై కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మేళ్లు పొందిన సంస్థలు, వ్యక్తులే జగన్‌కు చెందిన కంపెనీల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టారని సీబీఐ అధికారులు దర్యాప్తులో తేల్చారు. అంతా క్విడ్-వూపో-కో పద్ధతిలోనే జరిగిందంటూ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లలో అభియోగాలు కూడా మోపారు. జగన్‌తోపాటు ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్‌ఛైర్మన్ విజయసాయిడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌లను అరెస్టు కూడా చేశారు. ఆరేళ్లపాటు ముఖ్యమంవూతిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్‌కు సంబంధించిన కేసు కావటంతో దీనిపై మొదటి నుంచి అటు మీడియా ఇటు ప్రజల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రెండుగా విడిపోయిన మీడియాలో ఒకరు అంతా చట్టవూపకారమే జరిగిందంటూ వాదనలు వినిపిస్తుండగా మరొకరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల ప్రజాధనం లూటీ చేశారంటూ వరుస కథనాలను ఇ స్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై కూడా కొన్ని కథనాలు వచ్చాయి.

ఆరోపణలతో దుమారం...
సరిగ్గా దీనిపైనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఉద్దేశపూర్వకంగా మీడియాలో కొందరికి లీకులు ఇస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ...జగన్ ప్రతిష్టను దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. ఉప ఎన్నికల సమయంలో కావాలని జగన్‌ను దెబ్బతీసేలా లీకులు ఇస్తూ, జగన్ వర్గం మరింతగా బలపడకుండా సీబీఐ అధికారులు కుట్ర పన్నారనేది వారి ప్రధాన ఆరోపణ. జగన్ అరెస్టు, ఇతరత్రా కథనాలు ఎంతో ముందుగా లీక్ కావడంతో కూడా ఎన్నికల సమయంలో తమ పార్టీకి ఎంతో నష్టంగా వారు భావిస్తున్నారు.

ఇలాంటి లీక్‌లు రానట్లయితే ఇంకా కొందరు నేతలు తమ పార్టీలోకి వచ్చే వారని రెండు కీలక పార్టీల నుంచి వలసలు ఇంకా పెరిగేవని, కానీ సీబీఐ లీక్‌ల వల్లనే ఇవి కొంతవరకు తగ్గినట్లుగా కూడా జగన్ వర్గం వారు వాదిస్తూ, ఇది కుట్రలో భాగమనే విధంగా విమర్శలు చేస్తూ, లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ప్రభుత్వంలో సలహాదారునిగా పనిచేసిన ఓ నాయకుని బంధువు లక్ష్మీనారాయణ మొబైల్‌ఫోన్ కాల్ లిస్టును సంపాదించే ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం నాందేడ్‌లోని ఓ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీని ఆశ్రయించారు. సదరు ఏజన్సీ నిర్వాహకులు నాందేడ్ ఎస్‌పీ సహాయంతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించి దానిని అతనికి అందచేసినట్టుగా పోలీసులు అంతర్గతంగా జరిపిన విచారణలో వెల్లడైంది. ఆ తరువాత ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన నేత బంధువు జగన్ కంపెనీల కేసులో లక్ష్మీనారాయణ ఓ వర్గం మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు.

కారణాలు తెలియవుగాని ఆ తరువాత కొన్నిరోజులకు ఆయన తన పిటీషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇలా బయటకు వచ్చిన లక్ష్మీనారాయణ మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరింది. ఆ తరువాత మీడియా ప్రతినిధి యాదగిరిడ్డి చేతికి చిక్కింది. కాగా, తన మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్ బయటకు వచ్చిందని తెలిసి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన సెల్‌ఫోన్ నెంబర్‌ను అప్పుడే మార్చుకున్నారు. తప్పితే తన సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ ఎలా బయటకు వచ్చిందన్న దానిపై మాత్రం ఆరా తీయలేదు. అయితే పోలీసు కేసు లేకుండా ఫోన్ కాల్స్ లిస్టును కోరడంలో ఔచిత్యం లేదని.. అయినప్పటికీ జేడీ, చంద్రబాల లిస్టును పోలీసులు సేకరించడం తప్పని, అయితే జర్నలిస్టుగా తనకు లభించిన వివరాలను ప్రచురిస్తే మాత్రమే తప్పనే విధంగా పోలీసుల కేసు నమోదు చేయడం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నారు.

ఇవిగో ఆధారాలు..
ఆ తరువాత కొన్నిరోజులకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఓ వర్గం మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ తాము చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు దొరికాయని ప్రకటించారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు తరచుగా వాసిడ్డి చంద్రబాల అనే మహిళ ఫోన్లు చేస్తున్నారని...ఆమె తన మొబైల్ నుంచి ఓ పత్రిక అధినేతకు కూడా ఫోన్లు చేసినట్టుగా ఆధారాలున్నాయని వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే లీకులు నిజమే అనిపిస్తోందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత ఈ ఉదంతం పలు మలుపులు తిరిగింది. ఓ మీడియాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ వరుస కథనాలు రాగా మరో మీడియాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను సమర్థిస్తూ కథనాలు వచ్చాయి. దాంతో అసలు జరిగిందేమిటి? వాస్తవాలు ఏమిటి? అన్నది జనానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

చంద్రబాల ఫిర్యాదుతో...
ఇటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాల తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్‌ను సంపాదించి దానిని బహిరంగ పరచటం ద్వారా ప్రతిష్టను దెబ్బ తీశారంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి జరిపిన దర్యాప్తులో జర్నలిస్టు యాదగిరి నాచారం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సహాయంతో ఆమె మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్‌ను సంపాదించినట్టుగా తేలింది. యాదగిరిడ్డి అడిగిన వెంటనే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కూడా వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా...పైగా మల్కాజిగిరి డీసీపీ ఈ-మెయిల్ ఐడీని తస్కరించి కాల్‌లిస్ట్‌ను తెప్పించి యాదగిరిడ్డికి ఇచ్చారు. దీని ఆధారంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాలపై ఆరోపణలను తీవ్రతరం చేశారు. ఈ విషయంపై సీనియర్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడినపుడు.. ఈ విషయంలో యాదగిరిడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లు చేసింది చట్టవూపకారం తప్పేనని వ్యాఖ్యానించారు. ఇతరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని దొడ్డిదారుల్లో సంపాదించే హక్కు ఎవ్వరికీ ఉండదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు.

ఇదే మొదటిసారి కాదు...
యాదగిరిడ్డిపై తీవ్రమైన అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటాన్ని సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. మీడియా ప్రతినిధులు...చివరకు ప్రయివేట్ వ్యక్తులు సైతం ఇతరుల మొబైల్‌ఫోన్ కాల్‌లిస్టులను సంపాదించటం ఇదే మొదటిసారి కాదన్నారు. మద్దెలచెరువు సూరిని హత్య చేసిన భాను అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం మీడియా ప్రతినిధులే అతని సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైనాన్ని గుర్తు చేశారు. భాను మొబైల్‌ఫోన్ కాల్‌లిస్టులో సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉండటాన్ని కూడా మీడియానే వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు. గుంటూరు రూరల్ ఎస్‌పీగా పనిచేసిన శ్యాంసుందర్ తన భార్యతో వందలసార్లు మొబైల్‌ఫోన్‌లో మాట్లాడారంటూ కే.కార్తిక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేయటమే కాకుండా కాల్‌లిస్ట్‌ను సమర్పించిన ఉదంతాన్ని కూడా గుర్తు చేశారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేసినపుడు సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తనను ఫోన్‌లో వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైనాన్ని కూడా ఉదహరించారు. ఏ డిటెక్టీవ్ ఏజన్సీకి వెళ్లి...ఫలానా నెంబర్ వివరాలు కావాలంటే ఒకటి రెండు రోజుల్లో తెచ్చి ఇవ్వటం లేదా? అని ప్రశ్నించారు. ఈ అన్ని సందర్భాల్లో ప్రస్తావనకు రాని అధికార రహస్యాల చట్టం ఇప్పుడెలా ముందుకు వచ్చిందని అడిగారు. ఈ పరిణామాలు దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై ఖచ్చితంగా అనుమానాలు కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.

అంత తీవ్ర చట్టమా?
సైబరాబాద్ పోలీసులు జర్నలిస్టు యాదగిరి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లపై అధికార రహస్యాల చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కేసులో అధికార రహస్యాల చట్టం ఎందుకు వచ్చిందో? ఎలా వచ్చిందో? తమకు అర్థం కావటం లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. చంద్రబాల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించటానికి యాదగిరిడ్డి అనుసరించిన మార్గం తప్పుడుదే అయినా...ఓ ప్రయివేట్ మహిళ కాల్‌లిస్ట్ సంపాదిస్తే అది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొనసాగుతున్న వార్‌లో భాగంగా ఓ వర్గం మీడియా జరిగినదాన్ని భూతద్దంలో చూపించటం...దర్యాప్తు సంస్థలు సైతం యాదగిరిడ్డిని మీడియా ప్రతినిధిగా కాకుండా జగన్‌కు చెందిన పత్రికలో పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన మనిషిలా చూడటం వల్లనే ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారేమో అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా.. అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటాన్ని సమర్థించక పోవటం గమనార్హం. అయితే అటు లక్ష్మీనారాయణ, ఇటు చంద్రబాల కాల్‌లిస్ట్‌లను అక్రమ పద్ధతిలో సంపాదించడం కూడా సరైనది కాదని మరికొందరు అభివూపాయపడుతున్నారు. వీరితో మాట్లాడినపుడు రాష్ట్రంలోని మీడియాలో క్రమంగా తమిళనాడులోని మీడియా తరహాలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అక్కడ పార్టీలవారీగా విడిపోయిన మీడియా పరస్పరం బురద చల్లుకోవటం సర్వసాధారణమైపోయిందని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలో...పార్టీల వారీగా పక్షం తీసుకోవటం వల్లనే తెలియదుగాని మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషించారు.

ప్రైవసీ ఇంకా ప్రాథమిక హక్కు కాదు
- జీవించే హక్కులో అంతర్భాగమన్న సుప్రీంకోర్టు

హైదరాబాద్, జూన్ 27 (టీ మీడియా): రాజ్యాంగ నిర్మాణం జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ప్రైవసీ ప్రాథమిక హక్కుగా గుర్తింపునకు నోచుకోలేదు. 1964లో ఉత్తరవూపదేశ్- ఖరక్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవసీ అన్నది జీవించే హక్కులో అంతర్భాగమని మాత్రమే వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి జీవితంలోకి మరో వ్యక్తి తొంగిచూడటం ప్రైవసీని భంగపరిచినట్టు కాదంటూ మేనకాగాంధీ-రచయిత కుష్వంత్‌సింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. కుష్వంత్‌సింగ్ రచించిన ట్రూత్ లవ్ అండ్ లిటిల్ మలైస్ పుస్తకంలో తన ప్రైవసీకి భంగం కలిగించేవిధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ మేనకాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నడిచిన మరో కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది.

ప్రైవసీ హక్కు అన్నది రాజ్యాంగం కల్పించలేదని, అయితే కేసు అంశాల ఆధారంగా మాత్రమే దానిని గుర్తించాలని వ్యాఖ్యానించింది. అయితే, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత సైబర్ స్టాకింగ్, సైబర్ స్నూపింగ్, స్పాం మెయిల్, మొబైల్‌ఫోన్లు, హ్యాకింగ్ ద్వారా ఒక వ్యక్తి జీవితంలోకి ఇతరులు జోక్యం చేసుకోవటానికి అనేక అవకాశాలు లభించాయి. దీనిని అరిక ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 72 ప్రకారం ఎవరైనా ప్రభుత్వ అధికారి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఇతరులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి మరెవరికో అందజేస్తే, చట్టం ప్రకారం సదరు అధికారి శిక్షార్హుడవుతాడు.

వాస్తవాలను వెలికితీయడంలో జర్నలిస్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అధికార రహస్యాల చట్టం అందులో ఒకటి. అందులోని సెక్షన్ ఐదులోని క్లాజు ప్రజలకు సమాచారాన్ని దూరం చేస్తుంది. ప్రజా ఒత్తిడి ఫలితంగా ఈ చట్టంలో కొన్ని మినహాయింపులతో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. అయినా ఇప్పటికీ అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్లు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేకుండా చేసేందుకు, ప్రభుత్వ దుర్నీతి, లంచగొండి వ్యవహారాలను కప్పిపుచ్చేందుకు తోడ్పడుతున్నాయి.
- కే శ్రీనివాసడ్డి, విశాలాంధ్ర సంపాదకుడు, ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్


మీడియా సంస్థల్లోకి రాజకీయాలు వచ్చి అవి విడిపోయాయి. మీ రాజకీయ గొడవల్లోకి జర్నలిస్టులను లాగకూడదు. అలాగే యాదగిరిడ్డి విషయంలో కూడా అంతే. యాదగిరిడ్డి సమాచారాన్ని దేని కోసమో వాడడు. చంద్రబాల కాల్ లిస్ట్ సేకరించి, చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను బ్లాక్‌మెయిల్ చేయలేదు. అసలు ఆ సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. ఏదో మతలబు ఉందన్న సందేహంతోనే యాదగిరిడ్డి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు.
- దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్


జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవు
సమాచార సేకరణలో జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవుగానీ ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో వాస్తవాలను వెల్లడించడానికి అనువుగా కొన్ని సదుపాయాలున్నాయి. వార్తను ఇచ్చే, చెప్పే వ్యక్తుల దగ్గర ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు. సమాచార సేకరణ వృత్తి ధర్మంలో భాగంగా ప్రభుత్వ వర్గాలతోపాటు, సమాజంలోని పలు వర్గాల ప్రజలతో జర్నలిస్టులు సన్నిహితంగా మెలుగుతారు. కొన్ని సందర్భాలలో వాస్తవాల వెలికితీయడంలో జర్నలిస్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అధికార రహస్యాల చట్టం అందులో ఒకటి. అందులోని సెక్షన్ ఐదులోని క్లాజు ప్రజలకు సమాచారాన్ని దూరం చేస్తుంది. ప్రజా ఒత్తిడి ఫలితంగా ఈ చట్టంలో కొన్ని మినహాయింపులతో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. అయినా అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్లు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేకుండా చేసేందుకు, ప్రభుత్వ దుర్నీతి, లంచగొండి వ్యవహారాలను కప్పిపుచ్చేందుకు తోడ్పడుతున్నాయి. వీటిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో ఈ అంశాలను కొన్నింటిని ప్రచురిస్తే, ప్రసారం చేస్తే అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన కింద నేరారోపణ చేసి విచారించడానికి ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి. ఒక వర్కింగ్ జర్నలిస్టుగా, ప్రజావూపయోజనమే పరమావధిగా భావించేవారు అవసరమైతే కష్టనష్టాలను కూడా ఎదుర్కోవాలి.
- కే శ్రీనివాసడ్డి, విశాలాంధ్ర సంపాదకుడు,
ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్


సమాచారాన్ని సేకరించడం జర్నలిస్టుల హక్కు
సమాచారాన్ని సేకరించడం జర్నలిస్టుల హక్కు. రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమే పత్రికా స్వేచ్ఛ. జర్నలిస్టులు వార్తలు రాయడానికి అనేక పద్ధతులు అవలంబిస్తారు. వారిని ఆపే హక్కు ఎవరికీ లేదు. అయితే వికిలీక్స్ అధినేత అసాంజే, తెహల్కా విలేకరులు కుంభకోణాలు బయట పెట్టడంతో ప్రభుత్వాలు చట్టం దృష్టితో వారిని శిక్షించాయి. కానీ వారి చర్యలను ప్రజలు హర్షించారు. మన రాష్ట్రంలోని విషయాలకు వస్తే ఈ మధ్యన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కొన్ని పత్రికలు, చానెళ్లతో మాట్లాడిన వ్యవహారాన్ని బయటపెట్టినప్పుడు వ్యక్తులుగా జర్నలిస్టులను ఇందులోకి లాగవద్దని చెప్పాం. మీడియా సంస్థల్లో రాజకీయాలు వచ్చి విడిపోయాయి.

మీ రాజకీయ గొడవల్లోకి జర్నలిస్టులను లాగకూడదు. అలాగే యాదగిరిడ్డి విషయంలో కూడా అంతే. యాదగిరిడ్డి సమాచారాన్ని దేనికోసం వాడడు. చంద్రబాల కాల్‌లిస్ట్ సేకరించి, చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను బ్లాక్‌మెయిల్ చేయలేదు. అసలు ఆ సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. ఏదో మతలబు ఉందన్న సందేహంతోనే యాదగిరిడ్డి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత అధికార రహస్యాల చట్టానికి కాలం చెల్లింది. ఆ చట్టం కింద నేరారోపణ చేయడం ఆక్షేపణీయం.
- దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్


అధికార రహస్యాల చట్టానికి విలువ లేదు
అధికార రహస్యాల చట్టం బ్రిటీష్ కాలం నాటి పురాతన చట్టం. సమాచార హక్కు చట్టం రావటానికి ముందే దీనికి విలువ లేకుండా పోయింది. విదేశీ వ్యవహారాలు, దేశ భద్రత, రక్షణశాఖకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాదాపు 12 కేసుల్లో తీర్పులు వెలువరిస్తూ స్పష్టం చేసింది. జర్నలిస్టులపై అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం సరైంది కాదు. స్టోలెన్ ఎవిడెన్స్ ఈజ్ వ్యాలిడ్ ఎవిడెన్స్ (దొంగిలించబడిన సాక్ష్యం పరిగణనలోకి తీసుకోవాలి) అంటూ బ్రిటీష్ కాలంనాటి ప్రీవీ కౌన్సిల్ (అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం) సైతం చెప్పింది. ఇప్పటికీ దేశంలోని అన్ని న్యాయస్థానాలు దీనిని అనుసరిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టులు సమాచారాన్ని సేకరించవచ్చు. దానిని బహిరంగపరచవచ్చు.
- కే రామకృష్ణాడ్డి, సీనియర్ న్యాయవాది


జర్నలిస్టులపై కేసులు తప్పు
ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వాతంత్య్రం, ప్రైవసీ అన్నది కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు. తాజా వివాదాన్ని అలా పక్కనబెడితే ప్రైవసీ చాటున తప్పుడు వ్యవహారాలకు పాల్పడినపుడు రాజ్యాంగం ప్రకారం రక్షణ ఉండదు. తప్పులు చేసినవారి గురించి బయటపెట్టటంలో తప్పు లేదు. వాస్తవాలను వెలికితీసే జర్నలిస్టులపై కేసులు పెట్టటం తప్పు. దీనిపై మీడియా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉంది.
-ఎస్ రాంచందర్‌రావు, సీనియర్ న్యాయవాది


సమాచార సేకరణ విలేకరుల వృత్తి ధర్మం
కుంభకోణాల కేసుల్లో వాస్తవ వివరాలను తెలుసుకుని బహిర్గతం చేయడం అన్నది జర్నలిస్టుల వృత్తి. దీనివల్లనే బోఫోర్స్ లాంటి కుంభకోణాలు సైతం వెలుగు చూశాయి. మావోయిస్టులతో, గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌తో సైతం మీడియా ప్రతినిధులు మాట్లాడారు. సమాచారాన్ని ప్రజలకు అందజేశారు. అటువంటి సందర్భాల్లో సైతం కేసులు నమోదు కాలేదు. ఓ మహిళ మొబైల్ ఫోన్ కాల్‌లిస్ట్‌ను తీసుకున్నంత మాత్రాన తీవ్రమైన అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసు నమోదు చేయటం సరైంది కాదు.
- శ్రీరంగారావు, న్యాయవాది

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP