ఏజెన్సీ మద్యం దుకాణాలకు బినామీల అవతారం
- వెనకుండి కథ నడిపించిన మద్యం మాఫియా
- విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న వ్యాపారులు
- ‘టీమీడియా’ పరిశీలనలో వెల్లడైన నిజాలు
- ప్రశాంతంగా మద్యం దుకాణాలకు ముగిసిన లాటరీ
ఖమ్మం
టౌన్, జూన్ 27():‘నేటి విద్యార్థులే రేపటి పౌరులు.. నవసమాజ
నిర్మాతలు’ అని మన పెద్దలు సూక్తీకరించారు. కానీ ఆ విద్యార్థులు జిల్లాలో
వేళ్లూనుకున్న మద్యం వ్యాపారంలో నేడు పావులుగా మారారు. అక్రమ మద్యం
వ్యాపారంలో ఆరితేరి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న కొందరు
రాబందులు వెనుక బడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తమ ఉన్నతికి మెట్లుగా
ఉపయోగించుకుంటున్నారు. ఇది కథ కాదు. పచ్చి నిజం..టీమీడియా పరిశీలనలో
వెల్లడైన నిప్పులాంటి నిజం. జిల్లాలోని 153 మద్యం దుకాణాల నిర్వహణకు
ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిల్లో 71దుకాణాలను ఏజెన్సీ
ప్రాంతానికి కేటాయించింది. అయితే ఏజెన్సీలో మద్యం దుకాణానికి దరఖాస్తు
చేయాలంటే స్థానిక గిరిజనుడికే మొదటి ప్రాధాన్యత. అలాగే సంబంధిత తహసీల్దార్
ఇచ్చిన నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలనే కచ్చితమైన నిబంధన
అమల్లో ఉంది. కాగా ఆ రెండు సర్టిఫికెట్‌లు పొందాలంటే ప్రస్తుత చట్టాల
ప్రకారం సామాన్యులకు వెంటనే సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఎప్పటి నుంచో
మద్యంతో మన్యం ప్రజలను దగా చేస్తున్న అక్రమార్కుల కన్ను విద్యార్థులపై
పడింది.
ఉన్నత విద్య కోసం తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను ఆసరాగా చేసుకుని
విద్యార్థులను ముగ్గులోకి లాగింది మద్యం మాఫియా. ఈనెల 19 నుంచి 25 వరకు
మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసేందుకు వచ్చిన వారిని పరిశీలించడంతోపాటు
రెండు రోజులు( మంగళ, బుధవారాల్లో) రామకృష్ణా ఫంక్షన్‌హాల్లో చేపట్టిన లాటరీ
ప్రక్రియకు హాజరైన వారిని ‘టీమీడియా’ నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో
వారిని పలకరిస్తే నిజాలు నిగ్గు తేలాయి. వారు ఏషాపునకు దరఖాస్తు చేశారో..
ఎంత డబ్బు చెల్లించారో ఎవ్వరికీ తెలియదు. లాటరీలో దుకాణం దక్కినా.. ఈఎండీ
ఫీజు డబ్బు చెల్లించడానికి వెనకుండి ఉరికిచ్చిన వారు సకాలంలో ఎవరూరాక
పోవటంతో నేరం చేసిన వాళ్ల లాగా బిక్కమొహాలేసుకుని గంటల తరబడి హాల్‌లోనే
కూర్చున్నారు. ఇలా చదువుతో చక్కని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే
విద్యార్థులను మద్యం మాఫియా బినామీ వ్యాపారులుగా మార్చారు.
ముగిసిన లాటరీ ప్రక్రియ...
మైదానంలో
2, ఏజెన్సీలో 71 కలిపి జిల్లాలో మొత్తం 153మద్యం దుకాణాలు ఉన్నాయి. కాగా
ఆయా ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మైదానంలో1591, ఏజెన్సీలో 971 మొత్తం 2562
మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా అదికారులు వాటికి పట్టణంలోని
బైపాస్‌రోడ్‌లోని రామకృష్ణా ఫంక్షన్‌హాల్‌లో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్
ఎంఎం నాయక్ సమక్షంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న లాటరీ ప్రక్రియ
బుధవారంతో ముగిసింది. ఆ క్రమంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటేంతవరకు
మైదాన ప్రాంత దుకాణాలకు(2)కు లాటరీ ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు. కాగా
మిగిలిన ఏజెన్సీ ప్రాంత దుకాణాలు (71) కు సంబంధించి నిబందనలను క్షుణ్ణంగా
పరిశీలించిన అనంతరమే లాటరీ తీయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్
సూచించడంతో బుధవారం ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీంతో వ్యాపారులు కొంత
అసహనానికి గురై ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే అక్కడకు వచ్చిన నాయక్
ఉన్నతాధికారులతో సంప్రదించి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. అలాగే మిగిలిన
71 ఏజెన్సీ దుకాణాల్లో 11 దుకాణాలకు ఒకే ఒక్కరు దరఖాస్తులు చేశారు.
వాటిల్లో కొత్తగూడెం మండలం చుంచుపల్లి(92), భద్రాచలం మండల కేంద్రం(115),
కూనవరం(122), చింతూరు(126), మణుగూరు(131, 133, 135, 136, 139, 141, 142)
ఉన్నాయి. వీటి దరఖాస్తులకు లాటరీ ప్రక్రియ చేపట్టకుండా ఏకగ్రీవంగా ఎంపిక
చేశారు. అలాగే చింతూరు మండల కేంద్రంలోని దుకాణానికి ఒక్కరు కూడా దరఖాస్తు
చేయకపోవటంతో లాటరీ నిలిపేశారు. కాగా ఏజెన్సీ ప్రాంత దుకాణాలకు లాటరీ
ప్రక్రియలో స్థానిక నివాస, కుల సర్టిఫికెట్లను సమర్పించిన వారినే లాటరీ
ప్రక్రియకు అనుమతించారు. కొందరు తమ పిల్లల సర్టిఫికెట్లను దరఖాస్తుతో జత
చేసినా ఇన్‌చార్జ్ కలెక్టర్ నాయక్ వాటిని తిరస్కరించారు. మరికొన్ని
దుకాణాలకు ఇద్దరు కలిసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయగా ఆ
ప్రయత్నాన్నీ అడ్డుకున్నారు.
శభాష్ నాయక్..!
కలెక్టర్
సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జాయింట్
కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు ఆ మరుసటి రోజే గురుతరమైన బాధ్యత భుజాలపై పడింది.
అదే మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ. గతంలో టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారి
పలువురి మెడలకు ఉచ్చు బిగిసిన నేపథ్యంలో అసలు ఈ వ్యవహారమంటేనే వణుకు పుట్టే
పరిస్థితి అధికారుల్లో నెలకొంది. ఈక్రమంలో రెండ్రోజుల పాటు సాగిన లాటరీ
ప్రక్రియను నాయక్ తన భుజాలపై వేసుకున్నారు. దరఖాస్తుదారుల జాతకాలు చూసే ఈ
ప్రక్రియను మొదటి రోజు ప్రారంభించిన ఆయన ఆధ్యంతం ఈ వ్యవహారాన్ని
పర్యవేక్షించారు. తొలి రోజున తెల్లవారుజామున మూడు గంటల వరకూ అక్కడే ఉండి
లాటరీ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.
ఎక్సైజ్ అధికారులతో
ఎప్పటికప్పుడు చర్చిస్తూ నియమ, నిబంధనలకు ఉల్లంఘన కలుగకుండా దిశానిర్దేశం
చేశారు. రెండోరోజున మొదలైన ఏజెన్సీ షాపుల ఎంపికలోనూ పారదర్శకత పాటించారు.
దరఖాస్తుదారులు స్థానిక గిరిజన, నివాస ధ్రువపత్రాలను సమర్పించే విషయంలో
నిర్మొహమాటంగా వ్యవహరించారు. షాపుల వారీగా ధ్రువపత్రాలను క్షుణ్ణంగా
పరిశీలించిన తర్వాతే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. ఒకానొక సందర్భంలో
ఏజెన్సీ సర్టిఫికెట్లను సరైన రీతిలో పరిశీలించకుండా దరఖాస్తుదారులను
లోపలికి అనుమతించిన ఓ పోలీసు అధికారిపై ఆయన మండిపడ్డారు. వెంటనే ఆయనకు మెమో
జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇతరులెవరికీ లాటరీ తీసే
అవకాశం కల్పించకుండా మీడియా, పత్రికల ప్రతినిధులతో టోకెన్లను తీయించడం
అందరి దృష్టిని ఆకర్షించింది.
Take By: T News
0 comments:
Post a Comment