విద్యార్థి ఆత్మహత్య
హసన్‌పర్తి మేజర్ న్యూస్‌ః తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని, రచ్చబండ వద్దని సోమవారం జరిగిన రచ్చబండలో పాల్గొన్న విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం తన నివాసంలో క్రిమిసంహారక మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న పాలపిందల వీరేశం తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ లేఖ వ్రాశారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్ గ్రామానికి చెందిన వీరేశం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమాన్ని సోమవారం అడ్డుకున్నారు. ఆయన ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో గాయాలపాలయ్యాడు.
ఈ విషయాన్ని స్థానిక ప్రజలు, టిఆర్‌ఎస్ నాయకులు గుర్తించి ప్రాధమిక వైద్య చికిత్సం ఆసుపత్రికి తరలించిన విషయాన్ని కూడా వీరేశం మృతి సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన బలిదానం తెలంగాణాకు తీరని లోటని పేర్కొన్నారు. వీరేశం మృతిచెందిన విషయాన్ని తెలుసుకుని జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజకీయ జెఎసి జిల్లా కన్వీనర్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఐక్యవేదిక నాయకులు ప్రొఫెసర్ వెంకటనారాయణ, విద్యార్థి జెఎసి నాయకులు, బిజెపి స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.వంగపహాడ్ గ్రామానికి చెందిన పాలపిందల రాంచందర్, రాజమ్మ దంపతులది సామాన్య కుటుంబం. చిన్నవాడైన వీరేశం (16) స్థానిక పాఠశాలలో 10వ తరగతికి చదువుతున్నాడు.
ఈ క్రమంలోనే గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా, ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంభిస్తూ పాలకులు నిరంకుశంగా, నిర్బంధంగా ఇటు పోలీసులు వ్యవహరించిన తీరు, అటు పాలకుల విధానంతో కలత చెందాడు. రచ్చబండలో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తెలంగాణావాదులతో కలిసి సచివాలయానికి చేరుకున్న వీరేశం ఈ తోపులాటలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇలా పాలకుల, పోలీసుల నిర్భందంతో తెలంగాణ ఇక రాదేమోననే ఆందోళనతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుములుకున్నాయి.
కూలీ నాలి చేసి విద్యాభ్యాసం చేస్తున్న చెట్టంత కొడుకు ఉన్నట్టుండి నెల రాలడంతో ఆ తల్లిదండ్రుల రోదన అరణ్య వేదనగా మారింది. పలువురు గ్రామస్తులు వారిని ఓదార్చిన దృశ్యాలు కన్నీరు పెట్టించాయి.వీరేశం మృతికి అధికార పార్టీ నేతలే బాధ్యులు ఃసిఎం పర్యటన రద్దు చేసుకోవాలి - టిఆర్‌ఎస్ అధ్యక్షుడు పెద్దితెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఆత్మహత్య చేసుకున్న వీరేశం మృతికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత వహించాలని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
నిర్బంధంగా రచ్చబండ నిర్వహిస్తే వీరేశం లాంటి సున్నితమనస్కులు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. బుధవారం నుండి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించే అధికారులకు, ప్రజాప్రతినిధులకు గోబ్యాక్ నినాదాలతో పాటు సిఎం పర్యటనను రద్దు చేసుకోవాలనే నినాదాలు కూడా వినిపించాలని వారు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రచ్చబండను నిర్వహిస్తే తెలంగాణ ప్రాంత ప్రజల ఆగ్రహ ఆవేశాలకు గురికాక తప్పదని వారు హెచ్చరించారు.
నేడు వీరేశం అంతిమ యాత్రవరంగల్ ఎంజిఎం ఆసుపత్రి నుండి అమరవీరుల స్థూపం వరకు వీరేశం అంతిమయాత్ర జరుపుతామని వారు తెలిపారు. వీరేశం మృతదేహానికి శవ పంచనామ జరిపిన తర్వాత రాజకీయ జెఎసి పక్షాన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ నినాదాలతో అమరవీరుల స్థూపం వరకు అంతిమయాత్ర జరుగుతుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో ఉద్యమిస్తున్న అన్ని జెఎసిలు వీరేశంకు కన్నీటి వీడ్కోలు చెప్పాలని వారు సూచించారు.
9న నగర బంద్‌విద్యార్థి వీరేశం మృతికి నిరసనగా ఈ నెల 9న వరంగల్ నగర బంద్‌కు పిలుపునిచ్చినట్లు టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. విద్యార్థి మృతిపట్ల పార్టీ అధినేత కెసిఆర్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. 9న జరిగే ముఖ్యమంత్రి పర్యటనను కూడా ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.9న జరిగే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
take By: Suryaa