బతుకమ్మ - అమ్మమ్మ

అమ్మమ్మ ఉదయాన్నే లేచి పూలు తెంపుతుండె. పూలు తెచ్చి నీళ్లలో వేసి ఇంట్లో పని చేస్తుండె. పని అయినంక గునుగు పని మొదలుపెడుతుండె. పెద్దమ్మ అమ్మవాళ్లు గునుగును సరిచేసి కట్టలు కడుతుండె. అక్క సమానంగా పూవులను కత్తిరిస్తుండె. పిల్లలం మడత పెడుతుంటివి. నేనంటే నేనని పూల తొడిమలు తీసేందుకు పోటీ పడేవాళ్లం. మీరు చేసేదానికన్నా ఎక్కువ పాడు చేస్తుంవూడని తాతమ్మ కోప్పడేది. ఇట్ల రోజుకోరకంగా, రకరకాల పూలతో బతుకమ్మ పేరుస్తుండె. దేవుడి గూటి కాడ పీట మీద బతుకమ్మ పెట్టి తడిబట్ట వేస్తుండె.
మమ్మల్ని అమ్మమ్మ వాళ్లింటికి పోనియకపోతుండె. కనీసం 2 రోజులయ్యాక బండి ఎడ్లు ఇచ్చి పంపిస్తుండె. అమ్మమ్మ వాళ్ల ఊరు వెంకటరావుపల్లె 8 కిలోమీటర్లు. పొద్దున వెళ్తే అమ్మమ్మ వాళ్ల ఇంటికి చేరేటప్పటికి మధ్యాహ్నం మూడు నాలుగు అయితుండె. పండగనాడు అమ్మమ్మ ఎర్రటి పట్టుచీర కట్టుకుంటుండె. ఆ చీరలో చాలా అందంగా ఉండేది. డప్పు సప్పుడు కాగానే బతుకమ్మ తీసుకుని పోతుంటిమి. మూడు బజార్ల కాడ ఆకులోల్ల జాగలో బతుకమ్మ ఆడుతుంటిమి. మగవాళ్లు గోడల మీద, రాళ్ల మీద ఎడ్ల బండ్ల మీద కూర్చునేవారు. ఆట అయిపోయినాక పక్కనే ఉన్న ఒర్రెలోకి పోయి బతుకమ్మను నీళ్లలో వదులుతుంటిమి.
మాతోపాటు పెద్దవాళ్లు కూడా వస్తుండే సిబ్బిలో పలహారం పెట్టి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అని అందరితో పంచుకుంటుంటిమి. మోడ్రనైజేషన్ పుణ్యమా అని ఇప్పుడు ఇవన్నీ అంతరించిపోతున్నాయి. గ్లోబల్ విలేజ్ ఏమోగానీ.. గ్రామాల్లో ఈ సంస్కృతిని మరిచిపోతున్నాము. ఈ స్పీడ్‌లైఫ్‌లో ఇట్లాంటివి చాలా రిలాక్స్‌ని ఇస్తాయని గుర్తించాలి. బతుకమ్మ పండగ ద్వారా అందరినీ కలవడం, కష్టసుఖాలు చెప్పుకోవడం. సలహాలు ఇచ్చుకోవడం.. చేతనైన సహాయం చేయడం.. ఇలా ఒక సపోర్ట్ సిస్టమ్ పెరగడానికి దోహదపడుతుంది.
Take By: NT (namastetelangana)
0 comments:
Post a Comment