జావీద్ ఆలం కుంద్‌మీరి
సంపదనిస్తే....సోమరులవుతారు
విద్యనిస్తే..వివేకులవుతారు
వివేకం బతకడం నేర్పుతుంది. మనిషి పోరాడేది దాని కోసమే కదా!
ఈ తత్వం ఆలం కుంద్‌మీరికి బాగా తెలుసు
అందుకే తన పిల్లలకు చదువునిచ్చాడు. అందుకున్న వాళ్లు విద్యాధనికులయ్యారు
తరతరాలు పంచుకున్నా తరగని ఆస్తిపరులయ్యారు
వాళ్లలో ఒకరే జావీద్ ఆలం.
కుంద్‌మీరి పెద్ద కొడుకు
ఆ రిచెస్ట్ పర్సన్ కొనసాగిస్తున్న పరంపర.....
ఆ ఇంటి తలుపు తట్టేముందు...
‘చమురు కోసం రక్తపాతం వద్దు, నీటి కోసం యుద్ధాలు వద్దు’, ‘చమురు, నీటిని ఆదాచేయండి మీ పిల్లల కోసం’ అన్న రైటప్స్ కనపడతాయి ఆ తలుపు మీద. ఇవి అక్షరాలు కావు ఓ పదేళ్ల పాప అవగాహన, ఆందోళన, అభ్యర్థన. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రశాంత తెమ్మెరలు చల్లగా చెంపల్ని తాకి మనసు చుట్టూ అల్లుకుంటాయి. ఇంటపూక్చువల్స్ ఇళ్లకి ఫర్నీచర్ కన్నా పుస్తకాల అల్మారాలే అందాన్నిస్తాయట. నిజమే ఈ ఇంటికి కూడా అవే ప్రత్యేకమైన అలంకారాన్ని, నిండుదనాన్నిచ్చాయి. ఆ ఇల్లు.. ఆలం కుంద్‌మీరి కొడుకు జావీద్ ఆలంది. మత ఛాయల్లేకుండా మానవత్వ పరిమళాలతో గుబాళిస్తోంది. ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ మేధావుల మధ్య మేధావిగా, సామాన్యుల మధ్య సామాన్యుడిలా కలిసిపోయే ప్రత్యేకమైన మనిషి. ఈ గుణం తండ్రి ఆలం కుంద్‌మీరి ఇచ్చిన వరం అంటాడు. జీవితంలో అడుగడుగునా సింప్లిసిటీ.. ఇదీ తండ్రి వల్ల అబ్బిన భాగ్యమే అని గర్వపడతాడు.
ఆస్తులు, అంతస్తులు సంపాదించిపెట్టకపోతేయే...అద్భుతమైన నైజాన్ని తరతరాలు పంచుకునేలా జీన్స్‌తో రంగరించి రక్తంలో కలిపిస్తే! అందుకే కుంద్‌మీరి గురించి బాగా తెలిసిన వాళ్లకు జావీద్ కొత్తగా అనిపించడు. ఆ తండ్రి పరిఛాయలాగే కనపడతాడు. అవును మరి అతను పుట్టి, పెరిగింది ఆ విలువల మధ్యే కదా!
జావీద్ కూడా ఈ మాటే అంటాడు.. ‘మానవత్వ విలువల మధ్య పెరిగాం. మేము ఆరుగురం పిల్లలం. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు. అందరిలోకి నేనే పెద్ద. చెల్లెళ్లు, నేను... మిగిలాం. ఒక చెల్లెలు కెనడాలో, ఇంకో చెల్లెలు ఢిల్లీలో ఉంటున్నారు. మా కుటుంబంలో మా ఇంట్లో ఆడవాళ్లకు పరదా ఎప్పుడూ లేదు. మా తరందాకా ఎందుకు? మా అమ్మే ఎప్పుడు బురఖాలో లేదు. ఆ మాట కొస్తే... తను 1950ల్లోనే బహిరంగంగా స్మోక్ చేసేది, డ్రింక్ తీసుకునేది. మా తాతయ్య అమ్మను చాలా స్వేచ్ఛగా పెంచాడు. పెళ్లయ్యాకా నాన్న ఆంక్షలు పెట్టలేదు. అమ్మ ఆ రోజుల్లోనే బాడ్మింటన్ ఛాంపియన్. హార్స్ రైడింగ్ చేసేది. షూటర్, స్విమ్మర్ కూడా’ అని చెప్తున్న జావీద్ మాటలు వింటుంటే తండ్రి వారసత్వాన్నే కాదుతల్లి పరంపరనూ కొనసాగించాడేమో అనిపించింది.
యే లౌండా కౌన్ హై
జావీద్ కూడా తన తల్లి ఖదీజా ఆలంలాగే ఆటల్లో ఫస్ట్. క్రికెట్ అంటే ప్రాణం. హాకీలో కూడా ప్రవేశం ఉంది. పదిహేడేళ్ల వయసు దాకా క్రికెట్‌ను బాగా ఎంజాయ్ చేశాడు. లీగ్ మ్యాచ్‌లు ఆడాడు. తన బౌలింగ్‌తో జయసూర్యలాంటి వాళ్లను వణికించాడు. జింఖానా గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుంటే... తన ఆఫ్ స్పిన్‌తో జయసూర్యకు చెమటలు పట్టించాడు. ఆట అయిపోయాక.. ‘యే లౌండా(ఈ పిల్లగాడు) కౌన్ హైరే...’ అంటూ జావీద్ గురించి ఆరా తీశాడట జయసూర్య. అయితే ఈ విషయంలో ఆలం కుంద్‌మీరికి కొడుకు పూర్తి అపోజిట్. కుంద్‌మీరి ఆటలకు చాలాదూరం. పైగా టైమ్‌వేస్ట్ వ్యవహారంగా భావించేవాడట. వాళ్ల నాన్న నస భరించలేకే ఇష్టమైన క్రికెట్‌ను వదిలేశానని చెప్తాడు జావీద్. ‘క్రికెట్ ఆడినప్పుడల్లా చదువుకోకుండా టైమ్ వేస్ట్ చేస్తున్నావంటూ సణిగేవారు. ఆ ఒక్క విషయంలో తప్ప దేంట్లో ఆయన పోరులేదు. అసలాయన ఓ ఫాదర్ కంటే కూడా ఫ్రెండ్‌గానే ఎక్కువ తెలుసు నాకు. చాలా క్యాజువల్‌గా ఉండేవాడు. ఏ విషయం గురించైనా మాతో చర్చించేవాడు. చాలా ఎఫెక్షనేట్‌గా ఉండేవాడు. మాతోనే కాదు తన స్టూడెంట్స్‌తో కూడా. ఆయన్ని స్టూడెంట్స్ ఎంత ఇష్టపడేవారు, గౌరవించే వారంటే.. కిడ్నీ ఫెయిలయ్యి ఆయనకు డయాలసిస్ చేయాల్సి వచ్చేది. దాని కోసం నాన్నని హాస్పటల్‌కు వాళ్లే తీసుకెళ్లేవాళ్లు, ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసిన సందర్భాలూ ఉన్నాయి’ అంటూ తండ్రి చివరిరోజులను గుర్తుచేసుకున్నాడు.
రాజకీయ నేతా?
కుంద్‌మీరి ప్రభావమో లేక సహజంగానే వచ్చిన లక్షణమో తెలియదు కాని స్టూడెంట్స్‌తో జావీదూ చాలా క్లోజ్‌గా ఉండేవాడట. ఒకసారి... జావీద్ సిమ్లా నుంచి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతుంటే ఆయన్ని సెండాఫ్ చేయడానికి దాదాపు ఐదువందల మంది స్టూడెంట్స్ రైల్వే స్టేషన్‌కు వచ్చారట. వాళ్లంతా కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతుంటే జావీద్ పక్కనున్న వ్యక్తి...‘సర్ మీరు రాజకీయనేతా? ఇంతమంది వచ్చారు మీకు వీడ్కోలు చెప్పడానికి’ అని అడిగాడట. ‘లేదండీ బాబూ.. నేను ఏ నేతను కాను. యూనివర్శిటీలో పాఠాలు చెప్పుకునే మామూలు టీచర్‌ను, వీళ్లంతా నా పిల్లలు’ అని సమాధానమిచ్చాడట కూల్‌గా.
పెళ్లి రోజూ దెబ్బలు
‘నాన్న సవతి తల్లి దగ్గర పెరిగాడు. ఆయనకు ఎనిమిదేళ్లున్నప్పుడే వాళ్ల అమ్మ చనిపోయింది. నాన్న వాళ్ల తాత నాన్నను ముల్లా చేయడానికి ట్రైనింగ్ ఇప్పించాడు. ఆయన పదిహేడేళ్ల వయసులో కూడా నున్నటి గుండుతో ఉండేవాడట. అప్పటిదాకా మతాచారాలు పాటించినా పద్దెనిమిదో యేట నుంచి ఆయన ఆలోచనా ధోరణి ఛేంజ్ అయింది. మార్క్సిస్ట్‌గా మారారు. కామ్రెడ్స్ అసోసియేషన్‌తో అనుబంధం పెంచుకున్నాడు. స్త్రీ సాధికారత కోసం పోరాడాడు. అందులో భాగంగానే మా అమ్మను మంచి పొలిటీషియన్‌ను చేశాడు. నాన్న అటు నైజాం సర్కారుకు, ఇటు ఇండియన్ గవర్నమెంట్‌కి రెండింటికి వ్యతిరేకంగా పనిచేసి జైలుకు వెళ్లాడు. రెండు మూడు రోజుల్లో ఆయన పెళ్లి ఉందనగా నాన్నను రజాకార్లు కిడ్నాప్ చేశారట. పెళ్లి రోజు దెబ్బలతో బయటకు వచ్చాడు. అలాగే పెళ్లి అయిందట. నాన్న పర్షియన్ భాషలో పండితుడు, అరబిక్ స్కాలర్. అమ్మకూ పర్షియన్ బాగా వచ్చు. పర్షియన్, ఉర్దూ సాహిత్యాన్ని ఇద్దరూ ఇష్టపడేవారు. అమ్మకు కవిత్వం అంటే ప్రాణం.
చాంద్ తారోంకా బన్
కవిత్వం అంటే గుర్తొచ్చింది. మగ్దుం మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మా అమ్మ అంటే ఆయనకు చాలా అభిమానం. ఒక రోజు... రాత్రి ఒంటిగంట.. ఆ సమయంలో.. మగ్దుం మా ఇంటికి వచ్చి ‘ఖదీజా... ఖదీజా..’ అంటూ పిలుస్తున్నాడు.నాన్న లేచి తలుపు తీసి ‘లోపలికి రా’ అన్నాడు.
‘నేనొచ్చింది నీ కోసం కాదు, ఖదీజాను పిలువు’ అన్నాడు ఆయన.నాన్న లోపలికి వెళ్లి ‘ఖదీజా మగ్దుం వచ్చాడు, నీతో ఏదో మాట్లాడాలి కావొచ్చు రా’ అని అమ్మను పిలుచుకొచ్చాడు. అమ్మ రాగానే మగ్దుం చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా లోపలికి వచ్చి కూర్చుంటూ..‘ఖదీజా... నేనో కవిత రాశాను చాంద్ తారోంకా బన్.. అని, దాన్ని ముందు నీకే వినిపిద్దామని వచ్చాను’ అంటూ ఆ కవితను చదివి వినిపించాడు. తర్వాత అది సియాసత్‌లో అచ్చయింది, ఆ కవిత మీద నాన్న రివ్యూ రాశాడు. మగ్దుం రెండే రెండు చోట్ల తాగేవాడు. ఒకటి మా ఇంట్లో, ఇంకోటి ఇందిరా ధన్‌రాజ్ వాళ్లింట్లో. ఇందిరా ధన్‌రాజ్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమె మీద కవిత్వం కూడా రాశాడు.
తెలంగాణ కావాలి
నాన్న ఎంత సింపుల్‌గా ఉండేవాడంటే... తను వేసుకునే బట్టల పట్ల కూడా పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. నాన్న.. నాకు ఓ ఫ్రెండ్, గైడ్, ఫిలాఫర్. సమ్‌టైమ్స్ ఇప్పటికీ... ఆయన్ని మిస్ అవుతుంటాను’ అని వాళ్ల నాన్న జ్ఞాపకాలను తలచుకున్నాడు. ప్రస్తుతంలోకి వస్తూ.. ‘నాన్న విశాలాంవూధనే సపోర్ట్ చేశాడు. ఈవెన్ 1969 ఉద్యమం అప్పుడు కూడా. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆంధ్ర, తెలంగాణ కలిసుండే వాతావరణం లేదు. తెలంగాణ ఏర్పాటు అనివార్యం అనేది ఇప్పుడు నాఅభివూపాయం’ అన్ని చెప్పాడు జావీద్ ఆలం.
సీరియస్ ఇంటపూక్చువల్ లైఫ్, ప్రాక్టికల్ యాక్టివ్ లైఫ్ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ బతకడమెలాగో నాన్న నుంచే నేర్చుకున్నానని చెప్తాడు జావీద్. ఆ తత్వాన్ని అక్షరాలా పాటిస్తూ అసలైన వారసుడు అనిపించుకుంటున్నాడు. ఎథీస్ట్ అయిన జావీద్ హిందువును పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య పేరు జయంతి. ఆమెది కోల్‌కత్తా. కొడుకు అనిఖేత్ కాశ్మీరి పండిట్‌ను పెళ్లి చేసుకున్నాడు. అనిఖేత్ ఈపిడబ్ల్యూ మ్యాగజైన్‌లో పనిచేస్తున్నాడు. ఆయన కూతురే సారా. రైటప్స్ రాసి తలుపు మీద అతికించిన పదేళ్ల పాప.
ఆలం కుంద్‌మీరి ఫౌండేషన్
ఆలం కుంద్‌మీరి ఉస్మానియా యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తండ్రిలాగే అకడమీషియన్ అయిన జావీద్ హిమాచల్‌వూపదేశ్, కోల్‌కత్తా, ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నాడు. మొన్న మార్చిలో తన టర్మ్ అయిపోవడంతో పుస్తకాలు రాసే పనితో బిజీ అయ్యాడు. జావీద్ ఆలం ఇప్పటి వరకు ఇండిస్పెన్సబులిటీ ఆఫ్ సెక్యులరిజమ్, లివింగ్ విత్ మోడర్నిటీ, హూ వాంట్స్ డెమోక్షికసీ అన్న పుస్తకాలను రాశాడు. హూ వాంట్స్ డెమోక్షికసీని తెలుగులోకీ అనువదించారు. సీపిఐ మెంబర్ అయిన జావీద్ 2004లో ఆలం కుంద్‌మీరి ఫౌండేషన్ స్థాపించాడు. స్త్రీ అసమానత్వం, రాజకీయ, సాంఘిక, విద్య, తాత్విక విషయాలకు సంబంధించిన సమస్యలు, స్త్రీ అసమానత్వం లాంటి అంశాల మీద పనిచేస్తుందీ సంస్థ.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, Zindagi,
0 comments:
Post a Comment