4, 5న భారత్ బంద్
- కుట్రపూరిత హత్యే
- కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ మండిపాటు
- రేపటినుంచి 5 దాకా నిరసన
- కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటనను వెల్లడించిన వరవరరావు
( కరీంనగర్/పెద్దపల్లి):సీపీఐ (మావోయిస్టు) అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌పై ఆ పార్టీ తీవ్రంగా ప్రతిస్పందించింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చడాన్ని ఖండిస్తూ రెండు రోజుల భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్రంలోని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, ప్రధానమంత్రి మన్మోహన్‌లతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత కుమ్మకై్క మల్లోజులను కుట్రపూరితంగా హతమార్చారని ఆరోపించింది. పశ్చిమబెంగాల్, ఆంధ్రవూపదేశ్ సర్కార్ సంయుక్త ఆపరేషనే ఈ ఎన్‌కౌంటరని మండిపడింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనను విరసం నేత వరవరరావు ఆదివారం మల్లోజుల మృతదేహం వద్ద చదివి వినిపించారు. మల్లోజుల మృతిచెందిన నవంబర్ 24ను బ్లాక్‌డేగా పరిగణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ఈనెల 29 నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన దినాలు పాటించాలని పిలుపునిచ్చింది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌బంద్ పాటించాలని కోరింది. 48 గంటల బంద్ నుంచి వైద్య సేవలను మినహాయిస్తున్నామని, ఇతర అన్ని రకాల సేవలు నిలిపివేయాలని, ముఖ్యంగా రైళ్లు, బస్సులు నిలిపివేయాలని, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కేంద్ర కమిటీ తరపున అభయ్ పిలుపునిచ్చారు.
కిషన్‌జీ ఆదివాసీ హక్కుల కోసం 37 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేశాడని, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని విప్లవోద్యమంలో తొలి అడుగులు వేశాడని, పేద ప్రజలంటే వల్లమాలిన అభిమానమని, వారి సంక్షేమం కోసమే పోరాటాలు చేశాడని మావోయిస్టు కేంద్రకమిటీ కొనియాడింది. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన తండ్రి వెంకటయ్య, అభ్యుదయవాది తల్లి మధురమ్మల స్ఫూర్తితో జగిత్యాల జైత్యయాత్ర నుంచి లాల్‌గఢ్ ఉద్యమం వరకు వీరోచిత పోరాటం చేశాడని పార్టీ పేర్కొంది. 1984లో ఉత్తర తెలంగాణ గెరిల్లా జోన్‌లో కిషన్‌జీ కీలక పాత్ర పోషించాడని, 1986లో దండకారణ్యానికి బదిలీ అయి పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీని ముందుకు నడిపించాడని తెలిపింది. 1994లో బెంగాల్, ఉత్తర భారతంలో ఉద్యమాన్ని ముందుకు నడిపించాడని, 1995లో పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికై 2001లో ఉత్తర భారత రీజనల్ బాధ్యలు స్వీకరించాడని, 2004లో ఎంసీసీతో విలీనమై మావోయిస్టుగా పార్టీ మార్చి దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశాడని పేర్కొంది. 2007 నందిక్షిగామ్ ఉద్యమం, లాల్‌గఢ్ ఉద్యమాలతో ప్రజలను చైతన్యపరిచాడని, 2009లో కేంద్రం ప్రతిపాదించిన బూటకపు చర్చలను తిప్పికొట్టాడని పేర్కొంది. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో భాగంగానే దేశభక్తుడైన కిషన్‌జీని ప్రభుత్వం హతమార్చిందని ఆరోపించింది.
మావోయిస్టుల ప్రతీకార దాడులు -ఆంధ్రవూపదేశ్‌లో రైలు పట్టాల తొలగింపు
విశాఖపట్నం, నవంబర్ 27: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆదివారం ప్రతీకార చర్యలకు పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో కిరండూల్ రైలు మార్గంలో రెండు చోట్ల మావోయిస్టులు పట్టాలు తొలగించినట్లు రైల్వేవర్గాలు వెల్లడించాయి. దీంతో కొత్తవలస-కిరండూల్ రైలు మార్గం మధ్య ఓ గూడ్సు రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Tags: Telangana News, AP News, Political News, Kishenji death, Maoist leader, Suchitra Mahato, Jungalmahal encounter
0 comments:
Post a Comment