ఆరామ్ కుర్చీ - The Short Story
‘తాతా..నాన్న నీకు కుర్చీ తెచ్చాడు’ అంటూ ప్రభాకర్ మనమడు, మనవరాలు అందమైన సీల్డ్ ప్యాక్‌లో ఉన్న కుర్చీని చూస్తూ చప్పట్లతో కేరింతలు కొడుతున్నారు.
‘ మెల్లగరా...తాతతోనే ప్యాక్ విప్పిద్దాం ఆగండి’ అంటూ కుర్చీ మీద పడబోతున్న పిల్లలను చిన్నగా వారించాడు ప్రభాకర్ కొడుకు అమర్.
అప్పటిదాకా ఆ కుర్చీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రభాకర్ పిల్లల అరుపులు విని తన గదిలోంచి హాల్లోకి వచ్చాడు.
కళ్లద్దాలు సవరించుకుంటూ కుతూహలంగా ముందుకు కదిలాడు కుర్చీ వైపు.
తండ్రిని గమనించి‘ పక్కకు జరగండ్రా..తాతను చూడనీయండి’ అంటూ దాని చుట్టూ చేరి గొడవ చేస్తున్న పిల్లలను సున్నితంగా పక్కకు నెట్టుతూ తండ్రికి దారిచ్చాడు అమర్.
ఆరాటంగా వచ్చిన ప్రభాకర్ మొహంలో కుర్చీని చూడగానే భావాలు మారాయి. తండ్రి మొహం ముడుచుకు పోవడం గమనించిన అమర్ అయోమయంలోపడ్డాడు. తన గిఫ్ట్ చూసి సంతోషిస్తాడనుకుంటే..నాన్న నారాజ్ అయ్యాడెందుకు? అర్థం కాలేదు కొడుక్కి.
ప్యాక్ విప్పి చూపిస్తే తనే హ్యాపీగా ఫీలవుతాడని..‘నాన్న ...మీరే ప్యాక్ విప్పండి నాన్నా..’ అంటూ తండ్రి చేయి పట్టుకుని ముందుకు నడిపించబోయాడు అమర్.
కొడుకు చేతిలోంచి తన చేతిని మెల్లగా విడిపించుకుని నిలబడ్డ చోటే ఆగిపోయాడు.
‘సరే, అమ్మతో తీయిస్తాను’ అంటూ ‘అమ్మా...’ పిలిచాడు వాళ్లమ్మను.
అక్కడే హాల్లో డైనింగ్ మీద వంటలు సర్దుతున్న రాజేశ్వరి ‘ఏంట్రా..’ అంటూ వచ్చింది.
‘అమ్మా...నీ చేతులతో ఈ ప్యాక్ విప్పి నాన్నకు నా గిఫ్ట్ చూపించమ్మా’ అంటూ రాజేశ్వరి భుజాల మీద చేతులు వేసి ముందుకు నడిపించాడు.
‘బాగుంది...నువ్వు కొని నన్ను ఇవ్వమంటా అంటూనే గిఫ్ట్ ప్యాక్ విప్పే పనిలో పడింది రాజేశ్వరి.
పిల్లలు కూడా ఉత్సాహంతో నానమ్మకు సాయంగా ప్లాస్టిక్ తాళ్లు కట్ చేసి చుట్టూ ఉన్న అందమైన కవర్ పరపరలాగేశారు. టీక్ వుడ్‌తో చేసిన రాకింగ్ ఛైర్ టచ్‌వుడ్‌పాలిష్‌లో మిలమిల మెరుస్తూ ఠీవీగా ఊగుతోంది
‘హే...రాకింగ్ ఛైర్...రాకింగ్ ఛైర్..తాతా..నేను కూచుంటాను తాతా...నేను కూచుంటాను’ అని పిల్లలిద్దరూ గొడవ పడ్డం మొదలుపెట్టారు.
‘చాలా బాగుందిరా..ఎంతయింది?’ మురిపెంగా చూస్తూ అడిగింది రాజేశ్వరి.
‘ఎంతో కొంతయిందిలే కాని...’ అంటూ తండ్రి వైపు చూశాడు అమర్.
అదేమీ పట్టనట్టు అనాసక్తంగా వెనుదిరిగాడు ప్రభాకర్.
‘నాన్నా.. ఆ కుర్చీ నచ్చలేదా...ఏమైంది నాన్నా....’ వెనకనుంచే గాభరాగా అడిగాడు అమర్.
‘బానే ఉందిలే’ అని గునుగుతూ గదిలోకి వెళ్లిపోయాడు.
‘ఏంటమ్మా...నాన్నకు నచ్చలేదా? ఇది కాదా...నాన్న కావాలనుకున్న కుర్చీ? తండ్రి చిన్నబోవడం భరించలేని కొడుకు తల్లిని అడిగాడు.
‘ఏమోరా..మరి! పుస్తకాలు చదువుకున్నా, ఓ కునుకు తీసినా..ఆరామ్‌గా కూర్చునే వీలుండే కుర్చీ కావాలి అన్నాడు. అంతకుమించి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నాకూ చెప్పలేదు. అయినా ఇప్పుడు ఈ కుర్చీకేమైందని? బంగారంలా ఉంటే! ఆయనే సర్దుకుంటారులే. నువ్వేమీ కంగారు పడకు’ అంటూ సగంలో వదిలేసి వచ్చిన తన పనిలోకి వెళ్లింది రాజేశ్వరి.
అమర్ మొహం చిన్న బోయింది. ఈ సీన్‌ను ఇలా ఊహించుకోలేదు తను. నాన్న పుట్టిన రోజున..తనెప్పటి నుంచో ఆశ పడుతున్న కుర్చీని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాడు. కాని తన భార్య శైలజ దాపరికంలేని నైజంతో రెండురోజుల కిందటే నాన్న ముందు ఈ విషయాన్ని లీక్ చేసింది. విషయం తెలియగానే ఎంత సంతోషపడ్డాడు! పుట్టిన రోజు కోసం చిన్న పిల్లలు ఎదురు చూసినట్టుగా ఎదురుచూశాడు. ఆ ఆరాటం చూసి నిజంగానే పెద్దాళ్లు పిల్లల్లాంటి వాళ్లు అనుకున్నాడు. తనిచ్చిన గిఫ్ట్ చూసి నాన్న ఉబ్బితబ్బిబ్బయిపోతుంటే చూడాలనుకున్నాడు. కాని అంతా రివర్స్ అయింది. ఈ ఆలోచనల్లో ఉండగానే...
అమర్ సెల్ రింగయింది. జేబులోంచి సెల్ తీసి చూశాడు. శైలజ.
‘శైలూ...చెప్పు’ లిఫ్ట్ చేస్తూ అమర్.
‘కుర్చీ వచ్చిందా...మామయ్య చూశారా? నచ్చిందా?’ ప్రశ్నల వర్షం అవతలి నుంచి.
‘ ఆ..వచ్చింది. చూశారు. నేను మళ్లీ చేస్తాలే’ విసుగు వినిపించనీయకుండా పొడిపొడిగా అమర్.
‘ఓ..మామయ్య పక్కనే ఉన్నారా?ఓకె, ఓకె’ అంటూ కట్ చేసింది.
తను ఎప్పుడూ ఇంతే. భలే ఇమాజిన్ చేస్తుంది క్వైట్ అపోజిట్‌గా. అంత విసుగులోనూ నవ్వుకుంటూ సెల్ జేబులో పడేశాడు. కాని తండ్రి అసంతృప్తి అమర్‌కు మనసులో మనసు లేకుండా చేసింది.
తన గదిలో విచారంగా కూర్చున్నాడు ప్రభాకర్. తను కావాలనుకుంటున్న కుర్చీ తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఊరిస్తోంది. అదేమీ లక్షల ఖరీదు కాదు..వందల్లో విలువే. అయితే ఇప్పుడనిపిస్తోంది అది అమూల్యమైందని. ఆలోచిస్తూ తన చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు ప్రభాకర్..
తనకప్పుడు ఎనిమిదేళ్లు...
తాత ఆరామ్ కుర్చీ అంటే తనకు చాలా ఇష్టం. భోజనం చేసే టైమ్, రాత్రి నిద్ర వేళలు తప్ప మిగిలిన సమయమంతా తాతా ఆ కుర్చీలో కూర్చునే గడిపేవాడు. ఉమ్మడి కుటుంబం. డజను మంది పిల్లలు ఆ ఇంట్లో. తనలాగే పిల్లలందరి కన్నూ ఆ కుర్చీ మీదే.
ఇంట్లో ఉన్నంత సేపు అంతా ఆ కుర్చీ చుట్టే తిరిగేవాళ్లు. ఏ అవసరం కోసమైనా తాతా లేస్తే చటుక్కున ఆ కుర్చీ ఆక్రమించుకుందామని. చెప్పొద్దూ...ఆ కుర్చీ కోసం పెద్దవాళ్లకూ పోటీ ఉండేది. ఒక్క కుర్చీ చుట్టూ చిన్నా, పెద్ద కలిపి ఇరవై మంది మ్యూజికల్ ఛైర్ ఆడినట్టుండేది. పిల్లలందరిలోకి ఆఖరివాడు ప్రభాకర్. పన్నేండేళ్లు వచ్చేదాకా కనీసం ఆ కుర్చీని తాకే ఆదృష్టం కూడా కలగలేదు తనకు.
వయసు పెరుగుతున్న కొద్దీ కుర్చీ మీద మోహమూ పెరగసాగింది ప్రభాకర్‌కు. ఎంతంటే ఆ కుర్చీలో కూర్చునే వాళ్ల మీద కసి తీర్చుకోవాలనుకునేంత.
తాత పోయాక, ఆ కుర్చీ పెద్దనాన్నకు అంకితమైంది. పెద్దనాన్న హయాంలోనే అన్నయ్యలు, బావలు, మామయ్యలూ పంచుకునే వాళ్లు దాన్ని. తనకు ఇరవై రెండేళ్లు వచ్చినా ఆ కుర్చీలో కూర్చునే అవకాశం రాలేదు.
అన్నేళ్లయినా కుర్చీ చెక్కు చెదరలేదు. అప్పుడప్పుడు కుర్చీ పొడవాటి చేతులు వదులైనప్పుడు పెద్దమ్మ వడ్లాయన్ని పిలిపించి చిన్న చిన్న పేళ్లు కొట్టించేది. చిన్నప్పటి నుంచి ఎన్ని కలలు, ఎన్ని ఊహలు అల్లుకున్నాడు ఆ కుర్చీ చుట్టూ.
దాని పొడవైన రెండు చేతుల మీద రైటింగ్ పాడ్ పెట్టుకుని హోం వర్క్ చేసుకోవాలని, ఆదివారం మధ్యాహ్నం ఆ కుర్చీలో ఆరామ్‌గా కూర్చుని గ్రామ్‌ఫోన్‌లో పాటలు వినాలని, ఎండాకాలం వాకిట్లో ఆ కుర్చీ వేసుకుని చుక్కలను లెక్కబెడుతూ చల్లగా నిద్రలోకి జారుకోవాలని... ఆ కుర్చీలో కూర్చునే కథల పుస్తకాలు చదువుకోవాలని..!వారానికి ఒక్కసారైనా కుర్చీలో కూర్చున్నట్టు కలొచ్చేది. ఆ కలొచ్చిన ఆనందం కన్నా తెల్లారి నిద్రలేచేసరికి ఆ కుర్చీలో కూర్చుని పేపర్‌చదువుకుంటున్న పెద్ద వాళ్లను చూస్తే విపరీతంగా కోపమొచ్చేది. నిస్సహాయంగా అక్కడి నుంచి కదిలేవాడు.
చాలా సార్లు కుర్చీ బట్టకున్న కర్రలు తీసి అందులో కూర్చునే పెద్దవాళ్ల నడుం విరగొట్టాలన్నంత కసికలిగేది. ఒకసారి దానికి ప్రాక్టికల్‌రూపమిచ్చాడు కూడా. అది నెగటీవ్ ఫలితాలనిచ్చింది.
ఒకరోజు ప్రభాకర్ వాళ్ల పెద్దనాన్న ఏదో పంచాయతీ ఉందని బయటకు వెళ్లాడు. అప్పుడే ఆడుకుని లోపలికి వచ్చిన ప్రభాకర్‌కు కుర్చీ ఖాళీగా కనిపించింది. ఆనందంతో అందులో కూర్చోబోతుంటే...
‘రేయ్‌పెద్దవాళ్లు కూర్చునే కుర్చీ అది. పో లోపలికెళ్లి పుస్తకాలు తియ్’ అంటూ తిడుతూ వచ్చి అందులో కూర్చున్నాడు పెద్దన్నయ్య.
విలవిల్లాడిపోయాడు ప్రభాకర్. బంగారం లాంటి ఛాన్స్. ఛ...వచ్చినట్టే వచ్చి మిస్8 అయింది. ఎవస్ట్ శిఖరం కొన వరకూ వెళ్లి శిఖరం మీంచి జారిపడినంత బాధపడిపోయాడు. మనసులోనే అన్నను తిట్టుకున్నాడు, శాపనార్థాలు పెట్టాడు.
ఇంతలోనే పెద్దమ్మ అన్నయ్యను పిలవడంతో ‘రేయ్...పెద్దమ్మ పిలుస్తోంది, ఇప్పుడే వస్తాను, ఈలోపు కుర్చీలో కూర్చున్నావో..కోలుదండం ఖాయం, జాగ్రత్త’ బెదిరిస్తూ వెళ్లాడు.
ఖాళీ కుర్చీ వెక్కిరిస్తోంది. అవమానం తట్టుకోలేకపోయాడు. ఎన్నాళ్లనుంచో మెదడును తొలుస్తున్న ఆలోచన బయటకు వచ్చింది. వెళ్లి కుర్చీ బట్టకున్న కర్రలు తీసి గప్‌చుప్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయి పుస్తకాలు ముందేసుకున్నాడు బుద్ధిగా చదువు నటిస్తూ.
ఈ లోపు అటుగా వచ్చిన ప్రభాకర్ మేనత్త భర్త ఆ కుర్చీలో కూర్చోబోయి దభేల్న కింద కూలబడ్డాడు. ‘అమ్మా....నడుం పాయే’ అన్న కేక వినిపించే సరికి ఎక్కడి వాళ్లక్కడ పని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు సౌండు వినిపించిన చోటికి.
అన్నయ్య కేక వినిపిస్తదనుకుంటే పెద్ద మామయ్య కేక వినిపించేసరికి బిత్తరపోయి హాల్లోకి వచ్చాడు ప్రభాకర్.
జీతగాడు సాయిలు ఆ ఇంటి పెద్దల్లుడ్ని తన రెండు చేతులతో ఎత్తి పక్కనే ఉన్న దీవాన్ మీద పడుకో బెడుతున్నాడు. బాధతో మెలికలు తిరుగుతున్నాడు ఆ ఇంటి పెద్దల్లుడు. ‘అయ్యో...ఎట్లా పడ్డారు’ పెద్దత్త కంగారు పడుతోంది.
అందరికీ దూరంగా నిలబడ్డాడు ప్రభాకర్. ఆ గుంపులోంచి రెండు చేతుల్లో రెండు కర్రలు పట్టుకుని తన వైపే వస్తూ కనిపించాడు పెద్దన్నయ్య. కర్రలు చూపిస్తూ తనముందు నిలబడ్డాడు నీ పనే కదా అన్నట్టుగా.తల వంచుకున్నాడు ప్రభాకర్.
మామయ్యకు నడుం విరిగింది. బాగవడానికి యేడాది పట్టింది. అయినా పూర్తిగా కోలుకోలేదు ఆయన. ఆ రోజు ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లే హడావుడిలో పడి కర్రలు ఎవరు తీసేశారు అన్న అనుమానంలోకి వెళ్లలేదెవరు. తర్వాత ఆ సంగతే మర్చిపోయారు.
ప్రభాకర్ పెద్దన్నయ్య ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కాని చాలా ఏళ్లు దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభాకర్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇంచుమించు తనను సేవకుడిగా మార్చుకున్నాడు.
అత్యంత విషాదమేంటంటే...తన తప్పేమీ లేకపోయినా ఆ ఇంటి పెద్దల్లుడి నడుం విరగడానికి కారణమైన ఆ కుర్చీని ఆ ఇంటి నుంచి తరిమేశారు. ఆ ఊళ్లోనే ఉంటున్న వాళ్ల బంధువులకు ఇచ్చేసింది ప్రభాకర్ పెద్దమ్మ. ఉసూరుమన్నాడు ప్రభాకర్. తాను ఒకటి తలిస్తే...విధి ఒకటి తలిచింది.
రెండు రోజుల కొకసారి పనిగట్టుకుని మరీ బంధువుల ఇంటికి వెళ్లి తృప్తిగా కుర్చీని చూసొచ్చేవాడు. ఎప్పటికైనా మళ్లీ ఆ కుర్చీని తమింటికి తెచ్చుకోవాలని ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాడు తనకుతానే. పై చదువుల కోసం పట్నానికి మకాం మారాడు ప్రభాకర్. చదువు ఒత్తిడితో కుర్చీ విషయాన్ని తాత్కాలికంగా మర్చిపోయాడు. జీవన పోరాటంలో రోజులు గడుస్తున్నాయి. కాని ఓ ఫైన్ మార్నింగ్..కుర్చీ జ్ఞాపకం వచ్చింది. అంతే సెలవు రోజున బయలుదేరాడు ఊరికి ఎలాగైనా సరే కుర్చీని వెంట తెచ్చుకోవాలని.
వెళ్లాక తెలిసింది చావు కబురు చల్లగా. బంధువులాయన చనిపోతే ఆయనతోపాటే ఆయన కూర్చునే ఈ కుర్చీనీ ఆయన వెంట సాగనంపారని. కుళ్లి కుళ్లి ఏడ్చాడు మనసులోనే ప్రభాకర్. కుర్చీ సహగమనం అయినందుకు. చెప్పలేని నిరాశతో వెనుదిరిగాడు.
తర్వాత పెళ్లి, పిల్లలు, పెరిగిన బాధ్యతలు కుర్చీ మోహాన్ని చంపినా జ్ఞాపకాన్ని మాత్రం చెరపలేకపోయాయి. అలాంటి కుర్చీ కోసం చాలా ట్రై చేశాడు.ఎక్కడా దొరకలేదు. కొడుకు ఇస్తానంటే అచ్చంగా అలాంటిదే అనుకున్నాడు. కాని కాదు...అన్నిట్లో లేటెస్ట్ వెర్షన్స్ వచ్చినట్టే ఆరామ్ కుర్చీ కూడా మోడ్రన్ రూపాన్ని తెచ్చుకున్నట్టుంది. ఆ న్యూ మోడల్ ప్రభాకర్‌ను ఆకర్షించలేదు. పైగా బోలెడంత నిరాశను మిగిల్చింది.
‘తాతా..నానమ్మ భోజనానికి రమ్మంటుంది’ అన్న పిల్లల పిలుపుతో వర్తమానంలోకి వచ్చాడు.
‘వస్తున్నా’ అంటూ నెమ్మదిగా లేచి డైనింగ్ హాల్లోకి వచ్చాడు.
పిల్లలు రాకింగ్‌ఛైర్ చుట్టూ చేరి అల్లరి చేస్తున్నారు. నేను కూర్చుంటాను అంటే నేను కూర్చుంటాను అంటూ. వాళ్ల నానమ్మ వారిస్తోంది‘ ఇది తాతది నాన్న...మీరు ఎక్క కూడదు’ అని.
పిల్లల దగ్గరికి వచ్చి‘ ఈ ఛైర్ మీకు బాగా నచ్చిందారా...’ అడిగాడు.
‘అవును తాతా.... ఈ ఛైర్ అంటే నాకు బాగా ఇష్టం. నేను కూచుంటానంటే నానమ్మ వద్దంటుంది, ఇది నీదంట...మెము కూచోవద్దట’ మనవడు చెప్పాడు బాధగా.
‘ నాది కాదు...మీదే’ అంటూ మనవడిని ఎత్తుకుని అందులో కూర్చోబెట్టాడు ప్రభాకర్.
వాడు అందులో కూర్చుని ఆనందంగా ఊగుతుంటే తృప్తిగా ఫీలయ్యాడు.
‘వీడు ఆశపడ్డ ఈ కుర్చీ వీడి మోజు తీరకుండానే రేపు ఇంకో రూపానికి మారిపోతే?.పాపం వాడూ నాలాగే లక్షలు సంపాదించినా ఓ చిన్న కోరిక తీరని వాడిగా మిగిలిపోతాడని.’ తనవైపే ప్రశ్నార్థకంగా చూస్తున్న భార్యతో అంటూ డైనింగ్ వైపు నడిచాడు ప్రభాకర్.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,
0 comments:
Post a Comment