తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
- ‘తెలంగాణ’పై అధిష్ఠానం నాన్చుడు ధోరణి
- విసుగెత్తిపోతున్న టీ కాంగ్రెస్ నేతలు
- పార్టీపై సన్నగిల్లుతున్న విశ్వాసం
- బాహాటంగానే కొందరి అసంతృప్తి
- ముగ్గురు ఎమ్మెల్యేల తిరుగుబావుటా
- టీఆర్‌ఎస్‌లో చేరనున్న నేతలు
- జాబితాలో జూపల్లి, రాజయ్య, సోమారపు
- నేడో రేపో కాంగ్రెస్‌కు రాజీనామాలు
- కార్యకర్తలతో సమావేశాల్లో నేతలు బిజీ
- అదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు!
- టీఆర్‌ఎస్‌వైపు ఇద్దరు ఎంపీల చూపు?
- ఆమరణదీక్షకు కోమటిడ్డి సిద్ధం
- ఆపేందుకు బొత్స విఫలయత్నాలు
: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయటంలో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో టీ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. సొంత పార్టీలోని తెలంగాణవాదుల ఓపికను పరీక్షిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న తాత్సారం టీ కాంగ్రెస్ నేతల్లో అసహనాన్ని పెంచుతోంది. ఉద్యమంలో చురుగ్గా ఉంటున్న టీ కాంగ్రెస్ నేతలు.. పార్టీ వ్యవహార శైలితో విసిగిపోయారు. కొందరు లోలోన రగిలిపోతున్నారు. మరికొందరు బహిరంగంగా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. క్రమంగా వీరి సంఖ్య పెరుగుతున్నది. అధిష్టానాన్ని ధిక్కరించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నవంబర్ 1వ తేదీ రాష్ట్రావతరణదినాన్ని విద్రోహదినంగా పాటించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా నిర్ణయించుకోగా ఎమ్మెల్యేల్లోనూ ధిక్కారం మొదలైంది. ఈ మేరకు ముగ్గురు శాసనసభ్యులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడుతున్న టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
గత రెండువారాలుగా ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నదని సమాచారం. తమ తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణవాదులతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని నిర్ణయించుకుంటున్నారు. పైగా తెలంగాణ ప్రజల అభీష్టంపై కాంగ్రెస్ అధిష్ఠానం అలసత్వాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరాలని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి కృష్ణారావుతోపాటు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే ీ రాజయ్య, కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (కాంక్షిగెస్ అసోసియేట్)లు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే పూర్తి భాగస్వాములైన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇకపై నేరుగా టీఆర్‌ఎస్‌తో మమేకమయ్యేందుకు నిశ్చయించుకున్నారు. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించిన కోమటిడ్డి వెంకట్‌డ్డి కూడా పదవిని తృణవూపాయంగా భావించి అధిష్ఠానం వైఖరికి నిరసనగా నవంబర్ 1వ తేదీ నుంచి నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణవాదుల నుంచి కోమటిడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తోంది.
కేంద్రం డిసెంబర్ 9 ప్రకటన నుంచి వెనుకడుగు వేశాక తెలంగాణలో ఉద్యమ తీవ్రత మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఆకాంక్షలను అటు కేంద్రంగానీ ఇటు రాష్ట్రంగానీ పట్టించుకోకపోవడం, కలిసి ఉందామంటూ సీమాంవూధులు చేస్తున్న అడ్డగోలు వాదనలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. తెలంగాణవ్యాప్తంగా ప్రజల మద్దతు ఉందని నిరూపించేందుకు నిర్వహించిన సకల జనుల సమ్మె తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటింది. కేంద్రం కూడా విషయాన్ని గుర్తించినట్టు చెప్పుకోడానికిన్నట్లు పలుసార్లు కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చలు జరిపింది. తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ జాతీయ నాయకులు పేరుకు అనేక ప్రకటనలు చేస్తున్నా సానుకూల సంకేతాలు రావడం లేదు. ఇది తెలంగాణవాదుల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది. టీ కాంగ్రెస్ నేతల్లోనూ అసంతృప్తి పెల్లుబుకుతున్నది.
తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు అందరూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా తమ తమ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు. వ్యక్తి స్వేచ్ఛను హరించేలా వారి రాజీనామాలను తిరస్కరించటాన్ని రాజకీయ నిపుణులు తప్పు పట్టినా ఫలితం కనిపించలేదు. రెండోసారి రాజీనామాలు చేసినా వాటినీ ఆమోదించకుండా జాప్యం చేస్తూ, తెలంగాణ ఆకాంక్షను తొక్కిపెడుతున్న అధిష్ఠానం వైఖరిపై టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నిరాశ, నిస్పృహలు ఆవరించిన టీ కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణకు ద్రోహం చేయలేమంటు న్నారు. వారిలో కొందరు పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో పడ్డారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
కాంగ్రెస్‌కు షాక్
సకల జనుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడి ప్రభుత్వ కార్యక్షికమాలు సజావుగా సాగుతున్నాయని, రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చి సీఎం, గవర్నర్‌లు సంతృప్తిని వ్యక్తం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్‌లో ధిక్కారస్వరం వినిపించటంతో అధిష్ఠానం, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. కోమటిడ్డి ఆమరణ దీక్షను అడ్డుకోవాలని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. లక్ష్య సాధనలో దీక్షకు దిగుతున్నానని, పైగా సీఎం, బొత్సలు తెలంగాణపై సవివరమైన నివేదికలు అందించటం లేదన్న అనుమానాలూ ఉన్నాయని కోమటిడ్డి అంటున్నారు. వారిని విశ్వసించి ఉద్యమాన్ని ఆపలేమని, అధిష్ఠానంపై కూడా ఒత్తిడి పెంచేందుకే దీక్షను చేపడుతున్నట్టు ప్రకటించారు. టీ కాంగ్రెస్ నేతలు పార్టీలో ఉండి చేస్తున్న ఉద్యమం ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోతోంది. పదవులు అడ్డు పెట్టుకుని ఉన్న మంత్రులను తెలంగాణద్రోహులుగానే ప్రజలు భావిస్తున్నారు.
ముమ్మర యత్నాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు
రాష్ర్ట మాజీ మంత్రి, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆదివారం హైదరాబాద్‌కు తమ పార్టీ శ్రేణులతో ప్రత్యేక వాహనాలలో భారీగా తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఆయన ఆదివారం రాజీనామా చేయనున్నారని ఆయన ముఖ్య అనుచరులు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులతో జూపల్లి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అవసరమైతే ఆదివారమే పార్టీ శ్రేణులతో కలిసి వెళ్ళి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి, ఆ పార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు తెలిపాయి. పెద్దకొత్తపల్లి, పాన్‌గల్, వీపనగండ్ల, కొల్లాపూర్, కోడేరు మండలాల నుంచి ప్రతి మండలానికి 15-20 వాహనాలలో ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్‌కు భారీగా తరలిరావడం కోసం జూపల్లి రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో రహస్యంగా కసరత్తు చేశారు. మరోవైపు వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు శనివారం వార్తలు వెలువడడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చర్చలు చేస్తున్నారు.
జీవిత కాలంగా కాంగ్రెస్‌ను నమ్ముకున్న రాజయ్య ఒక్కసారిగా టీఆర్‌ఎస్‌లో కలిసేందుకు సన్నద్ధం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. ఆదివారం రాష్ట్ర రాజధానిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీక్షకు కూర్చోనున్నట్లు తెలిసింది. దీక్షా కార్యక్షికమం పూర్తికాగానే నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రామగుండం కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కొద్ది రోజుల కిందటే ఎమ్మెల్యే పదవికి ప్రజల సమక్షంలో రాజీనామా చేశాక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు నచ్చకనే అ పార్టీకి గుడ్‌బై చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆదివారం వంద వాహనాలతో రాజధానికి వెళ్లి కేసీఆర్ సమక్షంలో కేడర్‌తో సహా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తాను టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయని సత్యనారాయణ టీ న్యూస్‌కు చెప్పారు. ఎప్పుడు చేరేది ఖరారు కాలేదన్నారు.
0 comments:
Post a Comment