ఆంధ్ర x తెలంగాణ నేతల అభిప్రాయాలు
ఆంధ్ర x తెలంగాణ నేతల అభిప్రాయాలు
ఆంధ్రా వాళ్లు గాజులు తొడుక్కుని లేరు: రాయపాటి (ఎంపీ-గుంటూరు) పరీక్షలు రాసేందుకు వెళ్లిన అభ్యర్థులపైనా, పరీక్ష కేంద్రాలపైనా దౌర్జాన్యాలకు దిగడం చాలా అన్యాయం, దుర్మార్గం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రత్యేక ఏపీపీఎస్సీ పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అంతేగానీ ఇలా పదేపదే దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు. ఆంధ్రావాళ్లేమీ గాజులు తొడుక్కొని లేరు. ప్రస్తుతానికి మేం సంయమనం వహిస్తున్నాం. ఏం చేయాలో అదే చేస్తాం.
తెలంగాణలోనూ పరీక్షలు రాశారు: వెంకట్రామిరెడ్డి (ఎంపీ-అనంతపురం)
నాయకులు వద్దంటున్నా విద్యార్థులు మాత్రం తెలంగాణ ప్రాంతంలో మొక్కవోని ధైర్యంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలను రాయడం అభినందనీయం.విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం నేతలపై తిరుగుబాటు చేయడమే.
తెలంగాణ నేతలకు జ్ఞానోదయం కలగాలి: లగడపాటి(ఎంపీ విజయవాడ)
ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరైన తెలంగాణ విద్యార్థులను చూసి ఇప్పటికైనా ఆ ప్రాంత నాయకులకు జ్ఞానోదయం కలగాలి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలోని అన్ని జిల్లాల్లో సగటున 45% మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని 10% మంది ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గ్రూప్-1 మీద ఎవరితోనైనా నేను చర్చలకు సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి రోశయ్య ఎంతో సమర్థంగా వ్యవహరించారు.
అభ్యర్థుల ఉసురు తగిలిపోతారు: జోగిరమేశ్, మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు
ఓయూలో పరీక్షలు రాస్తున్న అభ్యర్థులను బయటకు తీసుకురావడానికి ఒక ఎంపీ ప్రయత్నించడం సిగ్గుచేటు. తెలంగాణ ఎంపీలు కేసీఆర్ చెప్పినట్లుగా ఆడుతున్నారు. ఆయనతో కలిసి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మూర్ఖత్వపు చేష్టలు మానుకోకపోతే అభ్యర్థుల ఉసురు తగిలిపోతారు.
రగడకు కారణం ఆ నలుగురే: గాదె వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
గ్రూప్-1 పరీక్షల రగడకు తెలంగాణ ఎంపీలు మధు యాష్కీ, వివేక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథంలే కారకులు. గ్రూపు-1 పోస్టుల్లో ప్రాంతాల వారీగా రిజర్వేషన్లు లేవు. ప్రశాంతంగా జరుగుతున్న పరీక్షలపై రగడ సృష్టించి, విద్యార్థులను బలిపశువులను చేస్తున్నారు.
పరీక్ష జరిగిన తీరు బాధాకరం: కేకే(ఎంపీ-రాజ్యసభ)
ఏపీపీఎస్సీ పరీక్ష జరిగిన తీరు చాలా బాధాకరం. సీఎం రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. విద్యార్థులతో చర్చలు జరిపి, వారి అనుమానాలను నివృత్తి చేసి పరీక్షలు జరిపి ఉంటే ఇంకా బాగుండేది.
మాడి మసైపోతారు: పొన్నం ప్రభాకర్(ఎంపీ-కరీంనగర్)
తెలంగాణ ప్రజలు కన్నెర్ర చేస్తే సీమాంధ్ర నేతలు మాడిమసైపోతారు. విపరీత ధోరణి మానుకోవాలి. మరో 4 నెలల పాటు గ్రూప్-1 పరీక్షను వాయిదా వేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పరీక్షను జరుపుకొంటాం.
అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరు: మధుయాష్కీ(ఎంపీ-నిజామాబాద్)
అరెస్టులతో తెలంగాణ ఉద్యమాన్ని అణచలేరని మరోసారి రుజువైంది. తెలంగాణ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా యూనివర్సిటీకి వెళ్లిన తెలంగాణ ప్రాంత ఎంపీలను ప్రభుత్వం అరెస్టు చేసింది. రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా ఉధృతంగా నిర్వహిస్తాం.
సమస్యలు పరిష్కరించాక పరీక్షలు జరపాల్సింది: దేవేందర్‌గౌడ్, టీడీపీ
సమస్యను శాంతియుతంగా పరిష్కరిద్దామన్న ఉద్దేశమే ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి వ్యవహార శైలి కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. సమస్యలను పరిష్కరించాక పరీక్ష నిర్వహించి ఉంటే బాగుండేది.
తెలంగాణ సర్వీస్ కమిషన్ కావాలి: ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ
పంతాలు, పట్టింపులతో ఏపీపీఎస్సీ ప్రాంతీయ వివక్ష పెంచుతోందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం దానికి తగదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ శనివారం అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని, తెలంగాణకు ప్రత్యేకంగా సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహించి ఫలితాలు వెల్లడి అయినా నియామకాలు లేవని, కానిస్టేబుల్ ఫలితాలు కూడా ఇంతవరకు వెల్లడి కాలేదన్నారు.
This News Take By: Andrajyothi
0 comments:
Post a Comment