అందరి చూపు డిసెంబర్ వైపే
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. అన్ని ప్రాంతాల్లోని అన్ని వర్గాలూ డిసెంబర్‌లో, ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడ బోయే పరిణామాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. ప్రధానంగా.. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు ఉత్కంఠ తో ఊపిరిబిగపట్టి ఫలితం కోసం ఎదురుచూస్తు న్నారు. డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో ఏం జరగబో తోందన్న అంశం రాజకీయ పార్టీల భవితవ్యాన్నీ తేల్చనుంది. అన్నింటికన్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు, విస్తరణ వ్యవహారం కూడా డిసెంబర్‌తోనే ముడిపడి ఉండటం మరో ఆసక్తికర అంశం.
రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలయిన కాంగ్రెస్ -తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది? టీఆర్‌ఎస్ వ్యూహం ఎలా మారబోతోంది? సర్వ త్రా ఇవే ప్రశ్నలు. ఈ గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక రంగంలో గందరగోళం. పెట్టుబడులపై తర్జనభర్జన. అమ్మకాలు, కొనుగోళ్లు స్తంభించిన వైనం. ప్రతిదానికీ ఆచితూచి నిర్ణయం. ఇదీ.. రాష్ట్రంలో పై నుంచి కిందవరకూ ఉన్న పరిస్థితి.ప్రత్యేక-సమైక్యవాద ఉద్యమాల నేపథ్యంలో హైకోర్టు నుంచి పంచాయతీ వరకూ నిలువునా చీలిన మానసిక భావన రాష్ట్రంలోని అన్ని రంగా లపై పెను ప్రభావం చూపుతోంది.
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టులో స్వేచ్ఛగా అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనూ ఉద్యో గులు రెండుగా చీలిపోయారు. రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించవలసిన మంత్రులు ప్రాం తాల వారీగా విడిపోయి, ఒకరి ప్రాంతాల నేతలపై మరొకరు ధ్వజమెత్తుతున్నారు. దాదాపు అన్ని ఉద్యోగ సంఘాల్లోనూ ప్రాంతాల వారీగా చీలిక ఏర్పడింది. జర్నలిస్టు సంఘాలూ చీలిపోయాయి.
ప్రధానంగా.. రాజకీయపార్టీల్లోనూ స్పష్టమైన విభజన వచ్చింది. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు తెలంగాణ-సీమాంధ్రగా విడిపోయి పోరా టాలు చేస్తుంటే, స్థానిక ప్రజల మనో భావాలు దెబ్బతింటాయన్న భయంతో ఆయా నాయ కత్వాలు రెండు ప్రాంతాల ఉద్యమాలను ప్రోత్సహించవలసిన అనివార్యపరిస్థితి ఏర్ప డింది. పిసిసి అధ్యక్ష పదవీకాలం పూర్తవుతు న్నప్పటికీ, డిసెంబర్ వరకూ ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అయోమయ పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడును పూర్తి చేసుకుని నాలుగు నెలలవుతున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర కమిటీని ప్రకటించలేని గందరగోళంలో ఉంది. చివ రకు మునిసిపల్ ఎన్నికలు కూడా నిర్వహించ లేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ డిసెంబర్‌లో శ్రీకృష్ణ మిటీ ఇచ్చే నివేదిక ప్రభావమేనని స్పష్టమవుతోంది.
రాష్ట్ర రాజకీయాలు ఇంత అనిశ్చితికి గురయ్యేందుకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ చివరకు తాను తవ్వుకున్న గోతిలో తానే పడనుంది. రెండు ప్రాంతాల్లోని పార్టీ నేత లకు స్వేచ్ఛ ఇచ్చి, వ్యూహాత్మకంగా వాదాలను రగిలించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంపై నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేకపోతోంది. ముఖ్యంగా.. తనను ధిక్కరించి వ్యవహరి స్తోన్న జగన్ సంగతి తేలేవరకూ రాష్ట్ర విభ జనపై ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. జగన్ పార్టీ నుంచి తనంతట తాను వెళ్లిపోతాడా? లేక పార్టీ నుంచి తానే పంపించాలా? జగన్ వెళితే పార్టీ చీలుతుందా? ప్రభుత్వం కూలుతుందా? ఒకవేళ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సాయం తీసుకుంటే ఆ పార్టీ నుంచి జగన్ వైపు వెళ్లేది ఎంతమంది? తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో పార్టీ భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ సతమత మవుతోంది. గతంలో ఇలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాక పోవడం వల్లే ఆ పార్టీ రాష్ట్ర భవిష్యత్తుపై తర్జన భర్జన పడుతోంది.
డిసెంబర్‌తో శ్రీకృష్ణ కమిటీ గడువు పూర్తి కానుంది. గడువు కంటే ముందే నివేదిక ఇస్తామని శ్రీకృష్ణ విస్పష్టంగా చెబుతున్నారు. ఆ కమిటీ రాష్ట్ర విభజనకు సంబంధించినది కాకపోయినా, మూడు ప్రాంతాల్లోని ప్రజల మనోభావాలకు అద్దం పట్టే కమిటీగానే భావించవలసి ఉంది. దానికితోడు అది తన పర్యటనల్లో వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న వ్యాఖ్యలు కూడా గందరగోళంగా, అనుమా నాస్పదంగా కనిపిస్తున్నాయి. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, రాష్ట్రానికి సంబం ధించి ఒక నిర్ణయం తీసుకునేందుకు కమిటీ నివేదిక అక్కరకొస్తుందన్నది నిర్వివాదం.
ఇప్పుడు అన్ని పార్టీలు, వర్గాలు, ప్రాంతాల్లో ఆ అంశమే ప్రధాన చర్చగా మారింది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే వరకూ ముఖ్యమంత్రి మార్పు, విస్తరణ ఉండకపోవచ్చంటున్నారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. ఆ నివేదికలో అంశాలు తెలంగాణకు సానుకూలంగా ఉంటే.. సమైక్యాంధ్రను కొనసాగిస్తూనే, తెలంగాణకు చెందిన సీనియర్ నే తకు సీఎం పదవి అప్పగించవచ్చని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దానికి సైతం అంగీకారం కుదర పోతే హైదరాబాద్‌ను కేంద్రపాలిక ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తెలంగాణలో లబ్థి పొందే వ్యూహం కూడా లేకపోలేదంటున్నారు. ఇవన్నీ.. కాంగ్రెస్ తనకు రాజకీయంగా లాభం చేకూరుతుందనుకున్న నిర్ణయానికి వస్తేనే అని కాంగ్రెస్ సీనియర్లు విశ్లే షిస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే డిసెంబర్ వరకూ ముఖ్యమంత్రి రోశయ్యకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చంటున్నారు.
ఈ అంశంలో శ్రీకృష్ణ కమిటీతో పాటు.. గవర్నర్ నరసింహన్ నివేదిక కూడా కీలకంగా మారింది. గత కొద్ది నెలల నుంచి రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీ లిస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని సమాంతర పాలన నడుపుతున్న గవర్నర్, రాష్ట్ర విభజనపై కేంద్రానికి ఎలాంటి సూచనలు చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ అంశమే ప్రధానంగా మారింది కాబట్టి, దానిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సిఫార్సు చేస్తారా అన్న ప్రశ్నలూ వినిపించకపోలేదు. స్వతహాగా ఐపిఎస్ అయిన గవర్నర్ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న ధోరణినే ప్రదర్శిస్తున్నారు. శనివారం తనను కలిసేం దుకు వచ్చిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేతలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా... జగన్ వ్యవహారమే కాంగ్రెస్‌కు నిర్ణయం తీసుకునేందుకు ఒక అవరోధంగా పరిణమించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లోగా నాయకత్వం జగన్ వ్యవహారాన్ని తేల్చే ఉద్దేశంతో ఉందని, దానిని దశల వారీగా పూర్తి చేస్తుందంటున్నారు. తొందరపడి జగన్‌పై వేటు వేయడం వల్ల ఆయన సీమాంధ్రలో బలమైన నేతగా ఆవిర్భవిస్తారన్న ఆందోళన కూడా లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. జగన్‌ను వదిలించుకోవాలనుకుంటే.. ముందు ఆయన మద్దతుదారులందరినీ బయటకు పంపించి, ఆ తర్వాత జగన్‌పై వేటు వేయాలన్నది ఒక ఆలోచన అంటున్నారు. సీమాంధ్రలో అటు తెలుగుదేశం, ఇటు జగన్ లబ్ధి పొందకుండా చూసే వ్యూహంలో భాగంగానే తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తోందని సీనియర్లు చెబుతున్నారు.
అటు తెలుగుదేశం పార్టీకీ డిసెంబర్ ఫీవర్ పట్టుకుంది. ఇప్పటికే రెండుగా చీలిన ఆ పార్టీ కూడా కొత్త సంవత్సరంలో కేంద్రం ఏం నిర్ణయం తీసు కుంటుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. తెలంగాణ- సమైక్యాంధ్ర నే తలు ఇప్పటికే ఎవరి ఉద్యమాల్లో వారు మునిగిపోయారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని అటకెక్కించి చాలా కాలమయింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరినీ నియంత్రించే పరిస్థితిలో లేరు.
ఒకవేళ రాష్ట్రం విడి పోయినా.. రెండు ప్రాంతాల్లోనూ అధికారం లోకి రావాలన్న వ్యూహంతో ఉన్న చంద్రబాబునాయుడు వంటి పరిణతి చెందిన వ్యూహరచయిత సైతం,ఈ రాష్ట్రాన్ని కేంద్రం ఏం చేయబో తోంది? డిసెంబర్ తర్వాత ఏం జరగబో తోందన్న ఒత్తిడిలో ఉన్నారు. అందుకే ఆయన రాష్ట్ర కమిటీని ప్రకటించలేకపో తున్నారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవ హరించాలని తీర్మానించుకున్నారు. అసలు రాష్ట్రంలో తన పార్టీని సమాధి చేసేందుకే కాంగ్రెస్ విభజన చిచ్చు తెరపైకి తీసుకు వచ్చిందని భావిస్తోన్న బాబు, ఆ మేరకు ఇరు ప్రాంత నేతలకూ వాస్తవాలు చెప్పి, పార్టీని అదుపులో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో బాబు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు.
ఇక టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన పార్టీ భవితవ్యాన్ని నిర్దేశించుకు నేందుకు జనవరి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ జేఏసీల దన్నుతో ఉద్యమాన్ని, ఉద్యమ సహకారం తో పార్టీని బతి కించుకుంటూ వస్తోన్న కేసీఆర్, జనవరి తర్వాత ఏం చేయబోతా రన్న ఉత్కంఠ మిగిలిన వర్గాల్లో ఉంది. అదే సమయంలో కేసీఆర్‌కు సైతం పార్టీని ఏ దారి పట్టించాలన్న అయోమయం లేకపోలేదు. కాంగ్రెస్‌తో కలసి నడవాలా? బిజెపితో కలసి ఉద్యమాలు సాగించాలా? సొంతగా పార్టీని పటిష్టం చేసుకోవాలా? విద్యార్థులు, జేఏసీల ప్రభావం ఇదేవిధంగా కొనసాగితే పార్టీ మనుగడ ఏమిటి? అన్న ప్రశ్నలు కేసీఆర్ ముందున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్థిక రంగం కూడా స్తంభించిపోయింది. ప్రధా నంగా.. రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది. ఇల్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. అపార్టుమెంట్ల నిర్మాణాలు సగంలోనే నిలిచి పోయాయి. రాష్ట్రానికి రావలసిన పెట్టుబడుల వ్యవహారం కూడా అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చక్కబడి, కేంద్రం ఒక నిర్ణయా నికి వచ్చిన తర్వాతే విస్తరణ, కొత్త కంపెనీలపై దృష్టి పెట్టాలని నిర్ణయించాయి.
This news take by:http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=61443
0 comments:
Post a Comment