పరీక్షగా ముగిసింది తెలంగాణలో ఉద్రిక్తత
పరీక్షగా ముగిసింది
తెలంగాణలో ఉద్రిక్తత
రాష్ట్రవ్యాప్తంగా 50శాతం అభ్యర్ధులు హాజరుతెలంగాణలో 35శాత మే
ఓయూ బీఈడీ కాలేజీ మినహా అన్ని చోట్లా నిర్వహణ ఉస్మానియాలో టెన్షన్ టెన్షన్
ఆందోళనకారుల రాళ్ల వర్షం
పోలీసుల బాష్పవాయు ప్రయోగం
పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల అరెస్టు
పరీక్ష కేంద్రం వైపు హరీశ్ పరుగులు..
అడ్డుకున్న పోలీసులు
రద్దు చేయాలన్న టీఆర్ఎస్ జేఏసీ
తగిన బద్ధి చెప్పారన్న సీమాంధ్ర నేతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 : పరీక్ష... అభ్యర్థులకు, పోలీసులకు, ప్రభుత్వానికి, తెలంగాణ ఉద్యమకారులకూ ఇది పరీక్ష! నినాదాలు, వివాదాలు, అరెస్టులు, రాళ్లు, బాష్పవాయు గోళాలు, అనేక గందరగోళాల మధ్య ఈ పరీక్ష ముగిసింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ మూడోసారి మాత్రం యథాతథంగా జరిగింది. అదే సమయంలో పరీక్ష రద్దు చేయాలంటూ తెలంగాణ నేతల నుంచి కొత్త డిమాండ్ మొదలైంది. ఈ పరీక్ష తెలంగాణలో ఎంత రణగొణధ్వనుల మధ్య జరిగిందో... సీమాంధ్రలో అంత ప్రశాంతంగా జరిగింది.
తెలంగాణలోనూ చెదురుమదురు సంఘటనలు మినహా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ అరవిందరావు తెలుపగా... 'పరీక్ష మొదలైన పది నిమిషాలకే ప్రశ్నపత్రం బయటికి వచ్చింది. ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో తుస్సుమంది. దీనిని వాయిదా వేయాలి' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎద్దేవా చేశారు. బంద్ మధ్య, తుపాకులు పెట్టి మరీ పరీక్ష నిర్వహించినందున ఇది చరిత్రలో 'బ్లాక్ డే'గా నిలిచిపోతుందన్నారు. ఆందోళనకారులు 51 బస్సులను ధ్వంసం చేశారు.
పోలీసులు 1720 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో రెండు మాల్స్‌పైనా ఉద్యమకారులు రాళ్లు రువ్వారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణలో ఆందోళనల ఫలితంగా 35 శాతం మాత్రమే పరీక్ష హాలుకు వచ్చారు. సీమాంధ్రలో హాజరు శాతం 65గా నమోదైంది.
అత్యధికంగా విశాఖలో 68 శాతం అభ్యర్థులు పరీక్షలు రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థుల కోసం రాజధానిలో జరిగిన పరీక్షకు 45 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. వరంగల్‌లోని తేజస్వి హైస్కూల్ కేంద్రంలో 500 మంది అభ్యర్థులకు 11 మంది మాత్రమే వచ్చారు. మొత్తంమీద... ఉస్మానియా వర్సిటీలోని బీఈడీ కాలేజీ (ఐఏఎస్ఈ) పరీక్షా కేంద్రంలో మినహా, మిగిలిన అన్నిచోట్లా ఎగ్జామ్ యథాతథంగా జరిగింది. ఈ కేం ద్రంలోని అభ్యర్థులు ప్రశ్నపత్రాలను చించి వేయడం, ఆందోళనకారులు లోపలికి ప్రవేశించి గందరగోళం సృష్టించడంతో పరీక్ష జరపలేకపోయారు.
తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల్లో గట్టి పోలీసు భద్రత మధ్య పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మధు యాష్కీగౌడ్, జి.వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు విద్యార్థులతో కలిసి ముందుకు కదిలారు. పోలీసులు వీరిని అరెస్టు చేశారు.
ఇతర జిల్లాల్లోనూ ఆందోళనకు దిగిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హల్‌చల్ సృష్టించారు. ఆటోలో వచ్చిన ఆయన ఉన్నట్టుండి కిందికి దిగి పరీక్ష కేంద్రం వైపు పరుగులు తీశారు. అతి కష్టం మీద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ, విద్యార్థి నేతలను పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు.
పరీక్ష ముగిసిన తర్వాత విడుదల చేశారు. కనీసం పది శాతం మంది కూడా సజావుగా పరీక్ష రాయలేకపోయారని, ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. మెజారిటీ అభ్యర్థులు పరీక్షకు దూరంగా ఉన్నందున దీనిని రద్దు చేయాలని, సమస్యను పరిష్కరించాకే నిర్వహించాలని, నాలుగు నెలలు వాయిదావేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పరీక్ష జరుపుకొంటామని తెలిపారు. అటు సీమాంధ్ర నేతలు మాత్రం సరిగ్గా భిన్నంగా స్పందించారు. అక్కడి నేతలు వద్దంటున్నా అభ్యర్థులు ధైర్యంగా పరీక్షలు రాశారని, ఇకనైనా తెలంగాణ నేతలకు జ్ఞానోదయం కలగాలని, మూర్ఖపు చేష్టలు మానుకోకపోతే అభ్యర్థుల ఉసురు తగులుగుతుందని హెచ్చరించారు.
- Andrajyothi
0 comments:
Post a Comment