బీడీ మతుకుల్ని చుట్టేన్తున్నారు!
- కనీస వేతనాలకు కత్తెరేసే కుతంత్రం
- యాజమాన్యాల అమానుషం
- ‘స్టార్’ సమావేశాల్లో ‘మెజారిటీ’ నాటకం
- అదే జరిగితే సేట్ల జేబుల్లోకి వేల కోట్లు
- భారీ మొత్తాలు కోల్పోనున్న కార్మికులు
- జీవో మార్పుకోసం నెల్లూరు మాజీ ఎమ్మెల్సీ తంటాలు
- దానం, షబ్బీర్, రాజేశ్వర్ పాత్రపై కార్మికుల మండిపాటు
- సమరానికి సిద్ధం.. కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం
-జీవో 41 సవరణకు సీమాంధ్ర సర్కారు సిద్ధం
( - నిజామాబాద్):ప్రభుత్వ జీవో ప్రకారం కనీసం వేతనం రూ. 150 చెల్లించలేమని అలా చేస్తే నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదముందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలుకుతున్నారు. సీమాంధ్ర సర్కారులోని పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే బీడీ కార్మికులు వెయ్యి బీడీల ఉత్పత్తిపై రూ.60 నష్టపోయే ప్రమాదముంది. బీడీ కార్మికుల జీవితాలు మసిబారిపోతూనే ఉంటాయి. జీవనాధారంగా ఎంచుకున్న పని వారి జీవితాలను గొప్పగా నిలబెట్టకపోగా, ఆరోగ్యాన్ని పలు విధాలుగా హరించి వేస్తూనే ఉంటుంది.
సంతృప్తికరమైన, సుఖవంతమైన జీవనమో, ఆరోగ్య భద్రతకు హామీయో ఉండదు. అయినా ఏదో రకంగా జీవితాన్ని వెళ్ళదీయాలికదా అనే భావనతోనే కూటికోసం తెలంగాణలో కోట్ల కుటుంబాలు బీడీ పరిక్షిశమనే ఆధారం చేసుకున్నాయి. వాళ్ల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిజేసే ఈ పని సేట్లకు, యాజమాన్యాలకు మాత్రం కోట్ల సంపదను సమకూర్చుతోంది. కార్మికులకేమో సరైన కనీస వేతనాలు లభించవు. సుదీర్ఘ పోరాటం తర్వాత.. ఈ ఏడాది జూన్‌లో వెయ్యి బీడీల తయారీకి కనీస వేతనాన్ని రూ.150గా ఖరారుచేస్తూ జీవో నంబర్ 41 విడుదలయింది. కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, కార్మిక శాఖ, ప్రభుత్వం.. అన్నీ ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే విడుదలైన ఆ ఉత్తర్వు పని అంతటితోనే ముగిసిపోయింది.
ఆచరణకు రాలేదు. కారణం?.. స్వార్థపర యాజమాన్యాల దురాశ! తమ లాభాలు కొల్లగొట్టుకపోతాయనే అపోహ. అంతే.. ఆ జీవోకు అడ్డుచక్రం వేయాలనుకున్నారు. అధికారంలో ఉన్న నేతలను అందుకు ఉపయోగించుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. కావాలనుకున్న వర్గాలన్నింటినీ సంప్రదించారు. విలాసవంతమైన నక్షత్ర హోటళ్లలో సంప్రతింపుల ప్రహసనం నడిపారు. అన్యాయం కదా అనేవారికి అవకాశమీయలేదు. అన్ని రకాల మాయోపాయాలూ ప్రయోగించారు. చివరికి.. ‘మెజారిటీ’ పేరిట కార్మికుల కడుపు కొట్టేందుకు ఏకమయ్యారు. పదకొండు సంవత్సరాల పోరాటం ఫలితంగా కనీస వేతనాన్ని రూ.102 నుంచి రూ.150కు పెంచాలని ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినా.. ఇప్పుడు కుట్రపూరితంగా ఆ మొత్తం రూ.115కు పడిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. స్వార్థపర యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారుకు తోడు ఇక్కడి తెలంగాణ ద్రోహులు కూడా ఈ దారుణానికి అండగా నిలవడం కార్మిక వర్గాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. స్వయానా కార్మికమంత్రి దానం నాగేందర్, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, నెల్లూరు జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ అండదండలతో బీడీ యాజమాన్యాలు జీవో 41ని సవరింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ దారుణ చర్య గురించి తెలుసుకున్న బీడీ కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం కుయుక్తులకు తలొగ్గితే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. యాజమాన్యాల ప్రయత్నాలను తిప్పికొ సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం కావాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో వ్యవసాయం తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు తమ జీవనోపాధిగా ఎంచుకున్న బీడీ పరిక్షిశమ తనను నమ్ముకున్న కార్మికులను కాపాడుకోలేకపోతోంది. ఆ కార్మికులకు అండగా నిలబడి పోరాడుతున్న సంఘాలను దెబ్బతీసేందుకు ఎన్నో మాయోపాయాలు..
కపట నాటకాలు. ఇప్పుడు ఆ కార్మికవర్గం వెన్ను విరిచేందుకు స్వార్థ యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారు పథకం ప్రకారం పావులు కదుపుతున్న తీరు రోత కలిగిస్తోంది. గుండెలను రగిలిస్తోంది. లక్షల మంది కార్మికులు లడాయిచేసి సాధించుకున్న కనీసవేతనాల జీవోను సవరించే నయవంచన ఎత్తుగడలు ఇప్పుడు తీవ్ర ప్రతిఘటనను చవిచూసే పరిణామాలను కొని తెచ్చుకోనున్నాయి. కుట్రలు ఫలిస్తే ఈ ఒక్క ఆరు నెలల్లోనే తెలంగాణ జిల్లాల్లోని ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికులు రమారమి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. హైదరాబాద్ కేంద్రంగా సీమాంధ్ర సర్కారు పెద్దలు, బీడీ యాజమాన్యాలు కూడబలుక్కుని నడుపుతున్న గూడుపుఠాణీ వల్ల నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, రంగాడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని లక్షలాది మంది బీడీ కార్మికుల బతుకులు బుగ్గికానున్నాయి.
నయవంచన.. కుట్రల పరంపర..
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన ప్రమాణ సూచికల ప్రాతిపదికన కనీస వేతనాలు అందజేయాలని 11ఏళ్లుగా తెలంగాణ జిల్లాల్లోని బీడీ కార్మిక రంగంలో అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సీమాంధ్ర పాలకులు పట్టించుకోని కారణంగా జాతీయ కార్మిక సంఘాల నేతృత్వంలో 2010 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 2 వరకు చరివూతాత్మకమైన సమ్మె జరిగింది. 32 రోజులపాటు కొనసాగిన సమ్మెవల్ల తెలంగాణ జిల్లాల్లోని బీడీ యాజమాన్యాలు కోట్లాది రూపాయల ఉత్పత్తిని కోల్పోయాయి. దీంతో రాష్ర్ట ప్రభుత్వం జోక్యం చేసుకుంది. 56 సంఘాలతో సమ్మె కాలంలోనే నవంబర్ 24, 25, 26 తేదీల్లో చర్చలు జరిపింది. దీని ఫలితంగానే డిసెంబర్ 30న కనీస వేతనాలను ఖరారు చేస్తూ కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ 1381 నంబరుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
వెయ్యి బీడీల తయారీకి 130 రూపాయలు కనీస వేతనంగా పేర్కొంటు జారీచేసిన నోటిఫికేషన్‌పై మంత్రి దానం నాగేందర్ సమక్షంలో బీడీ యాజమాన్యాలు, కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. జీవన ప్రమాణ సూచికలు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రాతిపదికన ప్రతి వెయ్యి బీడీల తయారీకి 150 రూపాయల కనీస వేతనం అమలు పూర్తిగా శాస్త్రీయబద్ధమేనని కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆ సమావేశంలో స్పష్టంచేశారు. ఆ సమావేశం కొనసాగింపుగానే జూన్ 31వ తేదీన ప్రభుత్వం 130 రూపాయలు కనీస వేతనంగా, 7 రూపాయల 50 పైసలు కరువు భత్యంతోపాటు ఇతర అంశాలపై చెల్లింపుల ద్వారా 150 రూపాయలను ఖరారు చేస్తూ జీవో నంబర్ 41ను జారీ చేసింది.
ఆ జీవోను అమలుచేయాలని కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే బీడీ యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జూలై 6 నుంచి పదిరోజులపాటు అక్రమంగా లాకౌట్ ప్రకటించాయి. సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జూలై 27న త్రైపాక్షిక కమిటీని వేసింది. బీడీ సేట్లకు అనుకూలమైన సంఘాలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల బాధ్యులకు ఎక్కువ సంఖ్యలో కమిటీలో ప్రాతినిధ్యం కల్పించారు. బీడీ పరిక్షిశమతో ఏమాత్రం సంబంధంలేని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ రాధాకృష్ణను (నెల కిందట పదవీ కాలం ముగిసింది) సైతం త్రైపాక్షిక కమిటీ సభ్యుడిగా నియమించారు. ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, డీఎంఎస్, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాలతోపాటు ముఖ్యమైన బీడీ సంఘాల యాజమాన్యం ప్రతినిధులను కమిటీలో చేర్చారు. ఏనాడూ ఆ పని చేయని త్రైపాక్షిక కమిటీ మొక్కుబడిగా సెప్టెంబర్ 12న, నవంబర్ 9న మాత్రమే సమావేశాలు జరిపింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుండానే కార్మిక సంఘాల అభివూపాయాలను మాత్రమే స్వీకరించింది.
రెండ్రోజుల్లోనే తారుమారు.. ఆరునెలల్లోనే వెయ్యి కోట్ల నష్టం
కనీస వేతనాల జీవో అమలుకోసం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా చర్చలపేరిట సమావేశాలను నిర్వహించాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 150 రూపాయలు చెల్లించలేమని, నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదం ఉందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలికారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలో కనీస వేతనాలు ఇస్తుండగా లేని నష్టాలు ఇక్కడెందుకు వస్తాయని సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అయినా మెజార్టీ మంత్రాంగాన్ని తెరపైకి తెచ్చిన యాజమాన్యాలు 70 సంఘాల అంగీకారం ఉందంటూ కనీస వేతనాల జీవోను సవరించాలంటూ సర్కారును ఆశ్రయించాయి. వెయ్యి బీడీల తయారీపై ఇప్పుడు ఇస్తున్న 102 రూపాయలను 115 రూపాయలకు మాత్రమే పెంచగలుగుతామని యాజమాన్యాలు చేసిన ప్రతిపాదనకు బీడీ కార్మికసంఘాలు పచ్చజెండా ఊపాయి. సీమాంధ్ర సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే ప్రతి బీడీ కార్మికుడు వెయ్యి బీడీల ఉత్పత్తిపై భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. జీవో విడుదలైనప్పటినుంచి ఈ ఆరు నెలల కాలంలోనే ఆ మొత్తం రూ. వెయ్యి కోట్ల పైగా ఉంటుంది.
రోజుకు వందకోట్ల బీడీ ఉత్పత్తి
సంక్షోభంలో ఉన్నామంటూ నమ్మబలుకుతున్న సేట్లు కనీస వేతనాలు పెంచితే పరిక్షిశమనే తరలిపోతుందని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. బీడీ కంపెనీలు వెయ్యి బీడీలను 40 కట్టలుగా బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవడం ద్వారా 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు లాభాలను గడిస్తుంటాయి. ఉత్పత్తిచేస్తున్న కార్మికులకు మాత్రం 102 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. ఈ లెక్కన యాజమాన్యాలకు రోజువారీగా అంతులేని లాభాలు వస్తూనే ఉన్నాయి.
ప్రతిరోజు తెలంగాణ జిల్లాల్లో వందకోట్ల సంఖ్యలో బీడీ ఉత్పత్తి అవుతుంది. దీంట్లో ఒక్క దేశాయి కంపెనీలోనే లక్షమంది కార్మికులు 10 కోట్ల బీడీలను ఉత్పత్తి చేస్తున్నారు. శివాజీ, టెలిఫోన్, చారుబాయి, ఠాకూర్, హిమ్మత్‌లాల్ తదితర కంపెనీలు ప్రతిరోజు 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బీడీలను తయారుచేయిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది, కరీంనగర్‌లో లక్షన్నర మంది, మెదక్ జిల్లాలో లక్ష 20 వేల మంది, ఆదిలాబాద్ జిల్లాలో లక్ష మంది, వరంగల్‌లో 30వేల మంది బీడీలు చుడుతూ జీవనం గడుపుతున్నారు.
గూడుపుఠాణిపై సమరం: ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్
కనీస వేతనాల జీవోను సవరించేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకుంటామని ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ చెప్పారు. జీవో 41ని యథాతథంగా అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. దీంట్లో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నామన్నారు.
కాంగ్రెస్‌కు కష్టకాలమే: ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్
జీవోను సవరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కష్టకాలం తప్పదని ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సిద్ధిరాములు హెచ్చరించారు. సీమాంధ్ర పాలకులు, కాంగ్రెస్ పెద్దలు బీడీ యాజమాన్యాలతో కుమ్మకై్క లక్షలాది మంది తెలంగాణ బీడీ కార్మిక కుటుంబాలను నిలువు దోపిడీ చేయబోతున్నారని ఆయన ఆరోపించారు.
మెజార్టీ సంఘాలపేరిట జీవోను సవరించే కుట్రను అడ్డుకునేందుకు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడాలని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. జీవోను మార్చితే తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీడీ కార్మికుల ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి, కార్మిక మంత్రిని కలిసి మాట్లాడుతామని తెలిపారు.
Take By: T News
0 comments:
Post a Comment