మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం .... ( కోటా రాజకీయం)
మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంక్షేమం కన్నా రాజకీయ లబ్ధికే ప్రాధాన్యం ఇచ్చిందనే అభివూపాయం కూడా వ్యక్తమవుతున్నది. ఏదైనా సామాజిక వర్గాన్ని బాగుపరచాలనే చర్చ వచ్చినప్పుడల్లా ప్రభుత్వం కోటాతో సరిపెట్టి వివాదాల తుట్టె కదుపుతున్నది. కానీ ఆయా సామాజిక వర్గాల సమక్షిగాభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతులకున్న 27 శాతం రిజర్వేషన్‌లలో మైనారిటీలకు నాలుగున్నర శాతం ఉప కోటా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్, మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఆ తరువాత సార్వవూతిక ఎన్నికలు కూడా సమీపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదనడంలో సందేహం లేదు. ఉత్తర ప్రదేశ్ జనాభాలో ముస్లింలు 18 శాతం ఉన్నారు. దాదాపు 115 నియోజకవర్గాలలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారు.
ఈ కోటా ముస్లింలకు తమ ప్రభుత్వ కానుక అనీ, యూపీ ఎన్నికల్లో ములాయం పార్టీకి పడే ముస్లిం ఓట్లన్నీ తమకే వస్తాయని, ఇక యూపీలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించడం కోటా రాజకీయానికి నిదర్శనం. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల దేశంలో అంతర్యుద్ధం వస్తుందనే రీతిలో ఒక ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. మత రాజకీయాల ద్వారా లబ్ధి పొందడానికి అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి.
మరోవైపు జమాతే ఇస్లామీ హింద్ వంటి సంస్థలు మాత్రం ఈ కోటా కల్పించడాన్ని ముస్లింలను మోసం చేయడంగా అభివర్ణించాయి. ఇప్పటికే ముస్లింలలోని కొన్ని కులాలు బీసీలకు కేటాయించిన 27 శాతం కోటాలో రెండు నుంచి మూడు శాతం పొందే అవకా శం ఉందని, ఇప్పుడు మైనారిటీలు అందరికీ కలిపి కేటాయించే 4.5 శాతం కోటాలో వారికి అదనంగా ఒరిగేదేమీ ఉండదని ముస్లిం మత పెద్దలు కొందరు అంటున్నారు. ఉదాహరణకు జైనులు ఎంతో అభివృద్ధి చెందారని 4.5 శాతంలో వారితో ముస్లింలను కలపడం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు. అయితే 27 శాతం కోటాలో వెనకబడిన తరగతుల వారితో పోటీ పడే బదులు, నాలుగున్నర శాతంలో మిగతా మైనారిటీలతో పోటీ పడడం సులభమనే వారూ ఉన్నారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచి వినబడుతున్నది.
ముస్లింలతో పాటు మైనారిటీలందరికీ కలిపి నాలుగున్నర శాతం రిజర్వేషన్ కల్పించడం కంటి తుడుపు చర్య అనే అభివూపాయం ముస్లిం మేధావులలో వ్యక్తమవుతున్న ది. రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచించిన విధంగా ముస్లింలకు పది శాతం రిజర్వేష న్ కల్పించాలని వారు కోరుతున్నారు. పైగా ఈ మేధావి వర్గం అభివూపాయపడుతున్నట్టు ముస్లింల సమక్షిగాభివృద్ధికి చర్యలు తీసుకోకుండా కేవలం కోటా కల్పించడం వల్ల కూడా ఫలితం ఉండదు. యూపీఏ ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కానీ, ఆ తరువాతి రంగనాథ్‌మిశ్రా కమిషన్ కానీ ముస్లింల దయనీయ పరిస్థితిని వివరించాయి.
ప్రణాళికా సంఘం విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక (2011) కూడా ముస్లింల వెనుకబాటుతనాన్ని కళ్ళకు కట్టింది. ముస్లింల పరిస్థితి దళితుల కన్నా అధ్వాన్నంగా ఉన్నది. పేదరికం, విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని చూస్తే ముస్లింల అభివృద్ధి రేటు తక్కువగా ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలను ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసిందని కాదు.
ఈ సామాజిక వర్గాలు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కానీ ముస్లింల పరిస్థితి చెప్పడానికే భిన్న వెనుకబడిన వర్గాలతో పోల్చడం. 2004-05 నుంచి 2007-08 నాటికి పోల్చి చూస్తే నగర ప్రాంతాలలో ముస్లింలలో విద్యాభివృద్ధి 5.3 శాతం కాగా, ఎస్సీలలో 8.7, ఎస్టీలలో 8 శాతం ఉంది. శిశు మరణాల సంఖ్య కూడా మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే ముస్లింలలో ఎక్కువగా ఉన్నది. దేశ జనాభాలో ముస్లింలు 14 శాతం ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలలో 2.5 శాతం మాత్రమే ఉన్నారు.
ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనాన్ని మించిన సమస్యలను ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నది. ముస్లింలను ప్రధాన స్రవంతిలో భాగం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రధాన స్రవంతి చేయడానికి ఇష్టపడని, గిట్టుబాటు కాని పనులను వారు చేపట్టవలసి వస్తున్నది. భద్రతా రాహిత్యం, అస్తిత్వ సంక్షోభం, వివక్ష, దేశ భక్తిని శంకించడం వంటి సమస్యలను ముస్లింలు ఎదుర్కొంటున్నారని సచార్ కమిటీ పేర్కొంది.
వీరికి అసమ్మతిని వ్యక్తం చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముస్లింలకు విద్య, ఉద్యోగరంగాలలో కోటా కల్పించడం వల్ల కొన్ని తక్షణ ప్రయోజనాలు ఉంటాయి. అయితే కోటాతోనే సమస్యలన్నీ తీరుతాయనే భ్రమలను ప్రభుత్వం కల్పించకూడదు. దీర్ఘకాలిక సామాజిక - ఆర్థికాభివృద్ధి వ్యూహంలో కోటా కల్పించడం కూడా ఒక భాగం కావాలె. ప్రత్యేకించి ఆత్మాభిమానంతో బతికే గౌరవనీయ పరిస్థితులు కల్పించాలె.
అంతే తప్ప ముస్లింలకు ఏదో ఒరగ బెడుతున్న అభివూపాయాన్ని ఇతర మతాల వారికి కల్పించడం, బీసీ ల కోటా నుంచి కేటాయించి తగవులు పెట్టడం వంటి చర్యలు తక్షణ రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తాయేమో కానీ, సామాజిక సామరస్యానికి, సంక్షేమానికి దోహదపడవు. కాంగ్రెస్ వంటి బాధ్యతాయుత రాజకీయ పక్షం, కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో అడుగులు వేయాలే తప్ప రాజకీయ ఎత్తుగడలకు దిగడం భావ్యం కాదు.
Take By: T News
0 comments:
Post a Comment