పొంచి ఉన్న కరెంట్ షాక్
- పేద, మధ్యతరగతిపై రూ.1,500 కోట్ల భారం?
- 300 లోపు యూనిట్లకు 50 పైసలు పెంపుదల?
- ఉధృత ఉద్యమాల దృష్టి మళ్లించే కుట్ర!
- విద్యుత్ చార్జీల పెంపుదలకు సర్కారు కసరత్తు
- గృహ వినియోగదారులపైనే అధిక భారం
- రైతులకు ఉచిత కరెంటుకు మంగళం
- వ్యవసాయ పంపుసెట్లపై నియంవూతణ
- కుటీర పరిక్షిశమలు, దోభీఘాట్‌లకు యూనిట్‌కు కనీసం రూ.3లు
- మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో టీఓడీ చార్జీలు
- వీధి దీపాల వెలుగులకు కత్తెర
- మైనర్ పంచాయతీలు, పీడబ్ల్యూఎస్‌లకు పెరగనున్న టారిఫ్
- ప్రీ పెయిడ్ మీటర్లపై వెనుకడుగు
- ఇకపై మీటర్‌లకూ అద్దె కట్టాలి!
హైదరాబాద్, అక్టోబర్ 13 :రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఉచిత విద్యుత్ సేవలు పొందుతున్న సుమారు 29.3 లక్షల వ్యవసాయ కనెక్షన్లను ఇకపై నియంవూతించే చర్యలు చేపడుతున్నది. అత్యధికంగా విద్యుత్ వాడకాన్ని సాగించే మల్టీప్లెక్స్‌లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలను టైమ్ ఆఫ్ ది డే (టీఓడీ) సేవల పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నది. విద్యుత్ వాడకంలో ఎక్కువ దుర్వినియోగం అవుతున్నదన్న సాకుతో వీధి దీపాలు, మైనర్ పంచాయతీల్లో విద్యుత్ దీపాలు, తాగునీటి పథకాలు (పీడబ్ల్యూఎస్) వంటి వాటిల్లో కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రస్తుతం ఉన్న టారిఫ్‌ను మూడు రెట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. కుటీర పరిక్షిశమలు, రజకుల దోభీఘాట్‌లకు యూనిట్‌కు కనీసం మూడు రూపాయల చొప్పున చార్జీలు, సింగిల్ పాయింట్ సర్వీసులకు ఒకే టారిఫ్ అమలు చేయాలని యోచిస్తున్నది.
ఆంధ్రవూపదేశ్ విద్యుత్ నియంవూతణ సంస్థ (ఏపీఈఆర్సీ)కు నవంబర్‌లోగా విద్యుత్ సంస్థలు టాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లు), రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సిన వార్షిక ఆదాయ వ్యయ నివేదికలు(ఏఆర్‌ఆర్) రూపకల్పన యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది. ఇప్పటికే పంపిణీ సంస్థలు తమ ప్రతిపాదనలను ఏపీ ట్రాన్స్‌కోకు అందజేశాయి. డిస్కమ్‌ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ట్రాన్స్‌కో కొన్ని ప్రయివేటు ఏజెన్సీలతో క్రోడీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా ఏఆర్‌ఆర్‌లలో పొందుపర్చుకునే విధంగా మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈసారి కరెంటు చార్జీలను పెంచడం ఖాయమని అధికారవర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి.
గృహ వినియోగంపై యూనిట్‌కు 50 పైసల భారం?
ప్రధానంగా గృహ వినియోగదారులపైనే కరెంటు భారం వేయాలనే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందులోనూ 300 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వర్గాలనే ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. కనీసం యూనిట్‌కు 50 పైసల చొప్పున చార్జీలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. చార్జీల పెంపుదల ద్వారా రూ,1,500కోట్ల అదనపు భారాన్ని ప్రజానీకంపై మోపేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో దాదాపు 2.3 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వాటిలో డొమెస్టిక్ కేటగిరీలో సుమారు 1.8కోట్ల కనెక్షన్లున్నాయి. వీటిల్లో 300 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారుల సంఖ్య దాదాపు 1.6కోట్లు ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న చార్జీల పెంపుదల ప్రతిపాదనలు వీరినే లక్ష్యం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం 0-50 యూనిట్ల స్లాబ్‌కు ఉన్న రూ.1.45ల టారిఫ్‌ను రూ.1.95లకు పెంచనున్నది.
ఉద్యమాల దృష్టి మరలించేందుకే
రాష్ట్ర ప్రజానీకం దృష్టి అంతా తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె ఉద్యమం వైపు ఉండడం, సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే కరెంటు చార్జీలను పెంచడం ద్వారా ఉద్యమాల తీవ్రతను మళ్లించేందుకు రాష్ట్ర సర్కార్ కుట్ర పన్నుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పేద, మధ్యతరగతి వినియోగదారులపై గత తొమ్మిదేళ్ళుగా విద్యుత్ భారం మోపేందుకు ఎవ్వరూ సాహసించలేదు. రెండేళ్ళ క్రితం (రోశయ్య హయాంలో) 500 యూనిట్ల వినియోగానికి పైబడిన వర్గాలకు మాత్రం చార్జీలను పెంచారు.
ఉచిత కరెంటుకు ఉరి
వ్యవసాయరంగానికి ఉచిత కరెంటు పథకం ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం అధికారికంగా రాష్ట్రంలో 29.3లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ వర్తిస్తున్నది. అనధికారికంగా క్రమబద్ధీకరణ కోసం మరో 5లక్షల వరకు వ్యవసాయ కనెక్షన్లు ఎదురుచూస్తున్నాయి. అయితే వీటిలో తెలంగాణ జిల్లాల్లో బోరుబావులపై వ్యవసాయం అధారపడి ఉండడంతో వ్యవసాయ కనెక్షన్ల క్రమద్ధీకరణ కూడా తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటున్నది. ఉచిత విద్యుత్‌కు సబ్సిడీ భారం పెరిగిపోతుందనే నెపంతో వ్యవసాయ కనెక్షన్లకు సాంకేతిక అంశాలను అంటగడుతూ ఉచిత కరెంటుకు మంగళం పలికేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని తెలుస్తున్నది.
ఇందుకు సాంకేతికంగా 5హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 3వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నది. ప్రస్తుతం రైతులు 5హెచ్‌పీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వాడుతున్నారని, కొన్ని చోట్ల 15హెచ్‌పీ మోటార్లను కూడా వాడుతున్నారని, వాటి వల్ల విద్యుత్ వాడకం పెరిగిపోతుందని, తద్వారా సర్కారుపై సబ్సిడీ భారం పెరిగిపోతుందని చెబుతూ రైతన్నలపై సర్కారు నెపం వేస్తున్నది. ఈ క్రమంలోనే ఇకపై కేవలం 5హెచ్‌పీ కలిగిన 3సర్వీసులకు మాత్రమే ఉచిత విద్యుత్ వర్తించేలా మార్పులు తేవాలనుకుంటున్నది.
ఇకపై టీఓడీ చార్జీలు
మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు వంటి హెచ్‌టీ-కమర్షియల్ (కేటగిరి-2) సర్వీసులకు టైమ్ ఆఫ్ ది డే (టీఓడీ) విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు చేస్తున్నదని సమాచారం. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్) సాధారణ రేట్ల కన్నా కనీసం ఒక రూపాయి అదనంగా వసూలు చేసేందుకు టీఓడీ విధానం ఉపకరిస్తుంది. ముఖ్యంగా పీక్ అవర్స్ అంటే ఉదయం 6గం. నుంచి 9 గం. మధ్య, సాయంత్రం 6 గం. నుంచి రాత్రి 9 గం. మధ్య విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండడం వల్ల, ఆ సమయాల్లో విద్యుత్ వినియోగానికి అదనంగా ఒక రూపాయి వసూలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ భారాన్నిమోయలేని వారు ఆ సమయాల్లో కరెంటు వాడకాన్ని తగ్గించుకుంటారనేది విద్యుత్ సంస్థల ఆలోచన. ఇందు కోసం నేషనల్ బిల్లింగ్ ప్లాన్ (ఎన్‌బీపీ)లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎన్‌బీపీలో చదరపు గజానికి ఎంత లైటింగ్ ఉండాలి? ఆఫీసుల్లో పగటి వేళ ఎంత లైటింగ్ ఉండాలి? వాణిజ్య సముదాయాల్లో లైటింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా చార్టెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిల్లింగ్ సర్వీసెస్ ఇంజనీర్స్ (సీఐబీఎస్‌ఈ) అధ్యయనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
తాగునీటి పథకాలపై భారం?
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలపై మూడింతల కరెంటు భారం పెరగనుంది. నిర్దేశించిన దాని కంటే ఎక్కువ విద్యుత్ వాడకం జరుగుతుందని, ఫలితంగా ఎంతో విలువైన విద్యుత్ వృథా అవుతున్నదనే అభివూపాయంతో సర్కారు ఉంది. మైనర్ పంచాయితీల్లో తాగునీటి పథకాల(పీడబ్ల్యూఎస్)కు ప్రస్తుతం అమలు చేస్తున్న రేట్లను మూడింతలు పెంచే విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని సమాచారం. పీడబ్ల్యూఎస్ కరెంటు వాడకానికి ప్రస్తుతం యూనిట్‌కు 0.70పైసలు ఉండగా, దానిని కాస్తా రూ.2లకు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
వీధి దీపాల వెలుగులకు కత్తెర
పంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు వీధి దీపాల (కేటగిరీ-6) విద్యుత్ వినియోగంపై ప్రస్తుతం ఉన్న రేట్లను పునఃపరిశీలించాలని ప్రతిపాదిస్తున్నారు. వీధి దీపాల ఏర్పాటులోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదనేది విద్యుత్ సంస్థల అభివూపాయం. దీంతో ఎక్కడ పడితే అక్కడ, అవసరాలకు మించి లైటింగ్ అనే అంశాలపై ఒక కొలమానం ఉండాలనే కొత్త అంశాన్ని విద్యుత్ సంస్థలు తెరపైకి తీసుకువస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా కేంద్రా లు, గ్రేడ్‌ల వారీగా మున్సిపాలిటీలలో జనాభా ఆధారంగా వీధి దీపాల వినియోగం ఉండాలని సూచిస్తున్నాయి.
ప్రీ-పెయిడ్ మీటర్లకు స్వస్తి
సెల్ ఫోన్ సేవల మాదిరిగా వినియోగదారుల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసేందుకు ప్రి-పెయిడ్ మీటర్ సర్వీసెస్‌లు అందించలేమని విద్యుత్ సంస్థలు రెగ్యులేటరీ కమిషన్‌కు నివేదిస్తున్నాయి. సెల్‌ఫోన్ కంపెనీలకు ఉన్నటువంటి సదుపాయాలు డిస్కమ్‌లకు లేవని, అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఇప్పట్లో తాము సమకూర్చలేమంటూ చేతులు ఎత్తేస్తున్నాయి. బిల్లింగ్‌లో ప్రి-పెయిడ్ మీటర్ క్లాజ్‌ను తొలగించాలని ఈఆర్సీని కోరుతున్నాయి.
మున్ముందు కరెంటు మీటర్లకు అద్దెలు?
కరెంటు మీటర్ల అందించినందుకు వాటిపై నెలసరి అద్దెలు వసూలు చేసే అధికారం కల్పించాలని డిస్కమ్‌లు ఈసారి ప్రతిపాదిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఎల్‌టీ సర్వీసు కనెక్షన్ మంజూరుకు వసూలు చేస్తున్న రుసుము కేవలం దరఖాస్తు రుసుము, డెవలప్‌మెంట్ చార్జీలకే సరిపోతున్నదని, మీటర్ బిగించినందుకు డిస్కమ్‌లకు అదనపు ఆదాయం లేకపోవడంతో వాటితో నిమిత్తం లేకుండా మీటర్ రెంట్(మీటర్ అద్దె) వసూలుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. గృహ వినియోగదారుల నుంచి నెలకు రూ.10ల నుంచి రూ.15లు మీటర్ అద్దెగా వసూలు చేసుకునేందుకు, సీటీ మీటర్ సర్వీసులకు రూ.110లు, హెచ్‌టీ మీటర్ సర్వీసులకు రూ.700ల చొప్పున అద్దె వసూలు అధికారాలు కల్పించాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈఆర్సీని కోరనున్నాయని తెలిసింది.
Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
0 comments:
Post a Comment