హైదరాబాద్‌పై అటూ ఇటూ! ఏబీఎన్ ఓపెన్ డిబేట్‌లో ఎవరేమన్నారంటే..
సహృదయంతో సహకరించండి: హరీశ్
రాష్ట్రం విడిపోయే సమయం ఆసన్నమైన ఈ తరుణంలో సహృదయంతో సహకరించాలి. హైదరాబాద్ సమస్యను సృష్టించి తెలంగాణవాదుల్లో ఆందోళన రేపవద్దు. హరిరామ జోగయ్య వాదనను ఖండిస్తున్నాం. నెల్లూరువాళ్లు చెన్నైలో, బెంగళూరులో పెట్టుబడులు పెట్టారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టారు. అలా అని ఆ ప్రాంతాలపై హక్కులు కోరతారా? కోరగానే ఇస్తారా? గుజరాత్ విభజన సమయంలో ముంబై ఇవ్వాలన్నారు. ఇచ్చారా?
ముంబైలో పెట్టుబడి పెట్టినంత మాత్రాన హక్కులు రావని గుజరాత్ విభజన సమయంలోనే నెహ్రూ, అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. ఇది హైదరాబాద్‌కు కూడా వర్తిస్తుంది. హైదరాబాద్‌లో ఉంటున్న గుజరాతీలకు లేని భయం మీకెందుకొచ్చింది? రాజకీయంగా తెలంగాణను అడ్డుకోవడానికే అపోహలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించుకోం. కేంద్ర పాలిత ప్రాంతం అన్నది ఆచరణ సాధ్యం కాదు. కేంద్ర పాలిత ప్రాంతమైతే ఎమ్మెల్యేలుండరు.
అభివృద్ధి ఉండదు. సీమాంధ్రవారు కావాలనే అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నారు. మేం జాగో భాగో అన్నది తెలంగాణ వ్యతిరేకులను, దోపిడీదారులను. సామాన్యులకు వ్యతిరేకం కాదు. వ్యాపారాలు చేసుకునే వారికి వ్యతిరేకం కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాజ్యాంగబద్ధంగానే పాలన ఉంటుంది. మేం సామాన్య సీమాం«ద్రుల జోలికి రావడం లేదు. తెలంగాణను అడ్డుకునే పెట్టుబడిదారుల గురించే మాట్లాడుతున్నాం.
మీరు పెట్టుబడి పెట్టింది వ్యాపారం కోసం. మాపై ప్రేమతో కాదు. ఇక విభజన తథ్యం. ఏదో ఒక చోట ముగింపు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను విలీనం చేసుకున్నారు. కాబట్టి అదే తెలంగాణను ఇవ్వండి. మీకేమైనా అనుమానాలు ఉంటే తీరుస్తాం. హైదరాబాద్‌లో ఏ రకమైన రక్షణలు కావాలి? భారత రాజ్యాంగానికి లోబడి ఉంటాం. హైదరాబాద్ సమస్య కొందరిదే. సాగునీటి సమస్య తేలాలి. దానిపై చర్చలు అవసరం.
రిఫరెండం నిర్వహించాలి: జేసీ దివాకర్‌రెడ్డి
తెలంగాణవారు ఎవరో.. తెలంగాణేతరులు ఎవరో ముందు తేల్చాలి. అందుకు నిర్వచనం చెప్పాలి. 'ఆంధ్రావాలా భాగో' అని కేసీఆరే అన్నప్పుడు ఈజీగా ఎలా తీసుకుంటాం? హైదరాబాద్‌పై ఓటింగ్ పెట్టమనండి. రిఫరెండమ్ నిర్వహించాలి. ప్రజలు ఏది చెబితే దానినే పరిగణనలోకి తీసుకోండి. రాయలసీమలో పుట్టిన నన్ను పొమ్మంటే అర్థం ఉంటుంది. హైదరాబాద్‌లో పుట్టిన నా పిల్లలనూ పొమ్మనడంలో అర్థం ఉందా?
ఇక్కడినుంచి వెళ్లడం కుదరదు: కోడెల
ఒక పార్టీలో ఉన్నవాళ్లమే రకరకాలుగా మాట్లాడుతున్నాం. ఏడాదిగా రావణ కాష్టంలా రగులుతోంది. తేల్చాల్సిన వాళ్లు తేల్చడం లేదు. హైదరాబాద్‌లో పెట్టి పెరిగినవాళ్లు ఏం కోరుకుంటున్నారో వారి అభిప్రాయం తీసుకోండి. సీమాంధ్ర నుంచి వచ్చినవారు ఇక్కడ అడుక్కు తింటున్నారు. చెన్నై, బెంగళూరుల్లో ఇతర ప్రాంతాలవారు గౌరవంగా బతుకుతున్నారు. ఈ ప్రాంతాన్ని మనమంతా కలిసి అభివృద్ధి చేసుకున్నాం. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటే కుదరదు.
అభ్యంతరాలను పరిష్కరించాలి: రేవంత్‌రెడ్డి
ఇక్కడ పుట్టినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తే తెలంగాణకు వ్యతిరేకులే. వారిని ఇక్కడి పౌరుల కింద గుర్తించం. ఉద్యమం చివరి దశకు వచ్చింది. నిర్ణయం తీసుకునే ముందు అభ్యంతరాలకు రాజ్యాంగ రక్షణ ఇవ్వాలా? వద్దా? అని పరిశీలించాలి. విడిపోతున్న వారి అభ్యంతరాలను పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. పెట్టుబడిదారుడు ఏ దేశంలో అయినా పెట్టుబడి పెడతాడు. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టినవాళ్లు ఇక్కడి ప్రజలకు రాయితీలు ఏమైనా ఇచ్చారా? రాష్ట్ర విభజన కావాలి. మిగిలినవారి అభ్యంతరాలను పరిశీలించాలి. హైదరాబాద్‌ను కొంతకాలం వారికి కూడా రాజధానిగా ఉంచాలి. ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లకూడదంటే.. లగడపాటి, మేకపాటి, దగ్గుబాటి, రాయపాటి అనే పెట్టుబడిదారులకు ప్రజాస్వామ్యాన్ని కట్టబెట్టకూడదు.
నేను సమైక్యవాదిని: ఆనం వివేకానందరెడ్డి
నేను సమైక్యవాదిని. రాష్ట్ర రాజధాని అనే హైదరాబాద్ వచ్చాం. దీనిపై సెంటిమెంట్, ప్రేమ, అభిమానం ఉంది. హైదరాబాద్ నేతలకే సమస్య. 90 లక్షల జనాభా కలిగిన హైదరాబాద్‌ను నిర్ణయించేది మీరా ప్రజలా? ప్రజలతో ఓటింగ్ పెట్టండి.
తేల్చనిది కాంగ్రెస్, టీడీపీలే: వీరయ్య, సీపీఎం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా లేదా అనేదానిపై ఏకాభిప్రాయం రాదు. తెలంగాణపై తేల్చనిది కాంగ్రెస్, టీడీపీలే. ఏం చేయాలనుకుంటోందో కేంద్రం చెప్పాలి.
అన్నదమ్ముల్లా...: సాంబశివరావు, సీపీఐ
ఆరని చిచ్చులా ఎగసిపడుతోంది. దీనికి పరిష్కారం కావాలి. జాగో భాగోలు తప్పు. విశాలాంధ్ర కోసం నిలబడినవాళ్లు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విడిపోవడం మంచిది. గతంలోకి వెళ్లవద్దు. అన్నదమ్ముల్లా విడిపోదాం.
హైదరాబాద్ సమస్య కాదు: కోదండరామ్
విభజనకు అంగీకరిస్తే హైదరాబాద్ సమస్య కాదు. విభజనకు అంగీకరించడం లేదు కాబట్టే హైదరాబాద్‌ను సమస్యగా చూపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తే మిగతా సందేహాలను పరిష్కరించే సామర్థ్యం అందరికీ ఉంది. అది అప్రధానం. ప్రధాన సమస్య విభజనకు అంగీకరించడమే. ఇక్కడ ఉన్న ఇతర ప్రాంతాల ప్రజల ఆక్షేపణలను పరిశీలిస్తున్నాం
ఆస్తుల పంపిణీ జరగాలి: హరిరామజోగయ్య
1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను వ్యాపార ఒప్పందంగా చూడాలి. ఇద్దరు వ్యాపారుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవాలనుకుంటే ఎవరూ ఆపకూడదు. అయితే, విడిపోవాలని అనుకున్నప్పుడు ఆస్తుల పంపిణీ జరగాలి. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతంపై సీమాంద్రులకు హక్కు లేదు. కానీ హైదరాబాద్‌ను అడిగే హక్కు ఉంది. ఇక్కడ అనేకమంది సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టారు. విడిపోయే సమయంలో పెట్టుబడుల సమస్యను పరిష్కరించాలి. హైదరాబాద్‌ను ఎలా పంచుకోవాలో చర్చించుకోవాలి.
అన్నదమ్ముల్లా విడిపోదాం: నాయిని
1956లో ఏ ప్రాంతాన్ని కలిపారో దానినే విభజించాలని చెబుతున్నాం. అన్నదమ్ముల్లా విడిపోదామని అంటున్నాం. మీ ప్రాంతాన్ని మీరు.. మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుందాం.
రిఫరెండం ఎందుకు?: దిలీప్‌కుమార్, ఎమ్మెల్సీ
తట్టా బుట్టా పట్టుకొని ఎవరు వెళ్లమన్నారు? నెపాలుపెట్టి సాగదీయవద్దు. బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెడితే వాటికి కూడా హైదరాబాద్‌లో హక్కులు కల్పిస్తామా? రిఫరెండం ఏమిటి? ఎందుకు పెట్టాలి? అవకాశం లేని అంశాన్ని ముందుకు తీసుకురావడం మంచిది కాదు.
పౌరుల కమిటీ ఉండాలి: యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
అపోహలు సృష్టించే యంత్రాంగాన్ని ఓడించాలి. రాష్ట్ర విభజన జరిగితే ఎవరికీ ఎలాంటి హానీ జరగదని చెప్పేందుకు పౌరుల కమిటీ ఏర్పాటు చేయాలి. దీనివల్ల అనుమానాలు తీరడమే కాకుండా అపోహలూ తీరిపోతాయి.
ఇదో కుట్ర: శ్రావణ్, టీఆర్ఎస్
హైదరాబాద్ లేని తెలంగాణను ఇవ్వడం అంటే తల్లి స్తనాలను కోసి పాలు తాగమన్నట్లే. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర వారే ఆంధ్రా ప్రజలా? ఇతర జిల్లాల్లో ఉన్న ఆంధ్రా వారికి భయం లేదా? ఇదో కుట్ర. లేని అభద్రతా భావాన్ని కల్పిస్తున్నారు. పొట్టకొట్టాలనుకునే వారికే భయం. పొట్టకూటి కోసం వచ్చే వారికి భయం లేదు.
అందరి బాధ్యత: తీగల కృష్ణారెడ్డి, టీడీపీ
ప్రణబ్ కమిటీ ముందే టీడీపీ తన వాదన చెప్పింది. హైదరాబాద్‌ను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ.
రాజీకి సిద్ధపడితేనే..: కఠారి శ్రీనివాస్, లోక్‌సత్తా
హైదరాబాదే సమస్య అయితే కూర్చొని మాట్లాడుకుందాం. ఎంతో కొంత రాజీకి సిద్ధపడకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. హైదరాబాద్‌లోని కోటిమందికి అభివృద్ధి కుంటుపడని పరిష్కారం కావాలి. ఎమ్మెల్యేల కోసం ప్రాంత, ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టవద్దు.
ఏకాభిప్రాయానికి వచ్చాం: ప్రభాకర్, బీజేపీ
బీజేపీ పక్షాన అందరినీ ఒప్పించి ఒకే మాట మీదకు తీసుకొచ్చి ఏకాభిప్రాయానికి వచ్చాం. ఇది ప్రజా ఉద్యమంగా మారింది. విధ్వంసం, విద్రోహం, విద్వేషం లేని రాష్ట్రం తీసుకురావాలనేది మా లక్ష్యం.
వెళ్లిపొమ్మని చెప్పడం లేదు: విమలక్క
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే. ఎవరూ ఎవరినీ వెళ్లిపొమ్మని చెప్పడం లేదు. సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇక్కడ తిష్ట వేశారు. పెట్టుబడులు పెంచుకునేందుకు ఆలోచిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలకు, మాకు ఏ లొల్లి లేదు. పెట్టుబడిదారులతోనే లొల్లి.
ఉమ్మడి రాజధాని సహేతుకం కాదు: కవిత
ఉమ్మడి రాజధాని సహేతుకం కాదు. చండీగడ్ ఒప్పందం విఫలమైంది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని సీమాం«ద్రులు అపోహలు సృష్టిస్తున్నారు. ఉమ్మడి రాజధాని వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలకే ఉపయోగం. అభద్రతాభావానికి గురైన వారికి హక్కులు కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.
హైదరాబాద్ రెండో సమస్య: చలసాని శ్రీనివాస్
ఈ నగర నిర్మాణంలో తెలంగాణతోపాటు ఆంధ్రా ప్రాంత ప్రజల రక్తం ఉంది. మా ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ నగరంపై మాకు హక్కు ఉంది. సామాన్య ఉద్యోగస్తులు భయాందోళనలో ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలి. నీటిపారుదలే తొలి సమస్యే. హైదరాబాద్ రెండో సమస్య.
వివాదాస్పదం చేశారు: కుటుంబరావు, రియల్ ఎస్టేట్ పరిశీలకుడు
స్నేహపూర్వకంగా విభజించే అంశాన్ని వివాదాస్పదం చేశారు. రిఫరెండం అవసరం లేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం స్పందించాలి.
అపోహలు తొలగాలి: కిరణ్, సుచిరిండియా
హైదరాబాద్ అభివృద్ధి కావాలి. ఇలాంటి చర్చా వేదికలు మరిన్ని జరగాలి. అప్పుడే అపోహలు తొలగి .. సమస్య పరిష్కారం అవుతుంది.
ప్రాంతాలుగా విడిపోదాం: బాలలక్ష్మి, ఓయూ
హైదరాబాద్ మాది. ప్రాంతాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసుందాం.
Take By: Andhrajyothi
0 comments:
Post a Comment