తెలంగాణ బంతి మళ్లీ అసెంబ్లీకే
(సూర్య ప్రధాన ప్రతినిధి)తెలంగాణ బంతి ఢిల్లీ చుట్టూ తిరిగి మళ్లీ రాష్ట్ర శాసనసభకే చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేయాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ తాజాగా స్పష్టం చేయడంతో యుపీఏ సర్కారు వైఖరి తేటతెల్లమవుతోంది. తనను కలసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో.. శాసనసభలో తీర్మానం చేయవలిసి ఉం దని, ఆలోగా మీరు ఎలాంటి తొందరపాటు చర్యలకు దిగ వద్దని మొయిలీ పలికిన హితవులో ఎంతో గూడార్థం ఇమిడి ఉంది. ఇక దీనితో తెలంగాణ వ్యవహారం మళ్లీ శాసనసభ ముందు నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
నిజానికి ఇప్పటికే తెలంగాణపై సభలో తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభను ప్రతిరోజూ స్తంభింపచేస్తుండగా, తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సైతం అదే డిమాండ్‌తో ఆందోళన కొనసాగిస్తున్నారు. తీర్మానంపై సీపీఐ, బీజేపీ సైతం పట్టుపడుతున్నాయి. ఆ మేరకు ఆ పార్టీలు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాయి. అటు కేంద్రం వైఖరి కూడా శాసనసభలోనే తీర్మానం పెట్టాలన్న వాదనకు అనుకూలంగా ఉండటంతో రాష్ర్ట అసెంబ్లీలో తీర్మానంప్రవేశపెట్టడం అనివార్యంగానే కనిపిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గత కొద్దిరోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
తీర్మానం ప్రవేశపెడితే, సమైక్యాంధ్ర-తెలంగాణ వాదానికి శాసనసభలో ఎంత బలం ఉందో అధికారికంగా స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఆ ప్రక్రియపై ఇంకా నాన్చుడు వైఖరి అనవసరమని, ఆలస్యమయ్యే కొద్దీ వివాదాలు మరింత పెద్దవుతాయన్న అభిప్రాయం సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలలో ఉంది. తీర్మానం ప్రవేశపెడితే ఎవరి బలం ఎంతో స్పష్టమవుతుంది కాబట్టి, ఇక ఆ తర్వాత సభను సజావుగా నడిపించుకోవచ్చని, ప్రజా సమస్యలపైనా చర్చించే అవకాశం వస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సభ సజావుగా జరిగే పరిస్థితి లేదని, ఒక్క అంశంపైనా చర్చ జరగకుండా ప్రతిరోజు సస్పెన్షన్లు, ప్రతిబంధకాలు ఎదురవుతున్న వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల తమకు స్థానికంగా నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సభలో తీర్మానం ప్రవేశపెడితే ఆ తర్వాత టీఆర్‌ఎస్-తెలుగుదేశం సభ్యులకు ఇక అంశమే ఉండదని స్పష్టం చేస్తున్నారు. తీర్మానం ఫలితం వెలువడిన తర్వాత మళ్లీ ఆ అంశంపై మాట్లాడేందుకు వారు సైతం నైతికంగా-సాంకేతికంగా సాహసించరని చెబుతున్నారు. సభలో ఫలితం సమైక్యాంధ్రకు అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా ఆ తర్వాత దాని ఆమోదం-చర్చ అంతా ఢిల్లీకి చేరుతుందని వివరిస్తున్నారు. అప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని, తెలంగాణ-సమైక్యాంధ్ర కోరుకునే పార్టీలు ఇక ఢిల్లీలో ఉద్యమాలు, లాబీయింగ్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకత్వం నుంచి తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అనుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. మొయిలీ వ్యాఖ్యలు పరిశీలిస్తే.. కాంగ్రెస్ నాయకత్వ వైఖరి కూడా తీర్మానం ప్రవేశపెట్టేందుకే అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. చివరకు ప్రధాని మన్మోహన్‌సింగ్ సైతం.. తనను కలసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో ఏకాభిప్రాయం రావడం లేదని వ్యాఖ్యానించడం చూస్తే తెలంగాణ అంశం మళ్లీ శాసనసభ గడప తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.దీనికి సంబంధించి అధిష్ఠానం ముఖ్యమంత్రికి స్పష్టమైన విధాన నిర్ణయం నిర్దేశించనున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాల సమాచారం. శాసనసభలో తీర్మానం ప్రవేశపెడితే, అక్కడ తెలంగాణకు సానుకూలత లభించలేదు కాబట్టి, దానిపేరుతో తెలంగాణ అంశాన్ని మరికొంతకాలం సాగదీయవచ్చని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల తర్వాత అఖిలపక్షం
తెలంగాణ అంశంపై రాష్ట్రానికి చెందిన అఖిలపక్షంతో కేంద్రప్రభుత్వం చర్చలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అప్పటివరకూ తెలంగాణ అంశంపై దృష్టి సారించకూడదని ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. వచ్చేనెల 1న లోక్‌సభలో తెలంగాణపై చర్చ జరగనున్నందున, దాని కొనసాగింపు ప్రక్రియను మరికొంతకాలం సాగదీయవచ్చన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో అఖిలపక్షం ఏర్పాటుచేస్తే కొత్త సమస్యను కోరి తెచ్చుకున్నట్లేనని, దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించవలసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికీ అంత సమయం లేకపోవడం, సీనియర్ మంత్రులు బిజీగా ఉండటంతో పాటు.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అఖిలపక్షాన్ని పిలవడం వ్యూహాత్మకంగా సరైనది కాదని కాంగ్రెస్ నాయకత్వం కూడా భావిస్తున్నందున, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాతనే అఖిలపక్షం నిర్వహించవచ్చంటున్నారు.
0 comments:
Post a Comment