కాంగ్రెస్‌కు ‘పీఆర్పీ’ ఝలక్
అవిశ్వాస వేళ.. పరీక్ష పెట్టిన ‘చిరు’ కూటమి
- లాబీల్లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
- మమ్మల్ని గడ్డిపోచల్లా చూస్తున్నారు
- తొందరపడి విలీనం చేశామేమో
- పీఆర్పీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
- చిరంజీవి ఇంటికి వెళ్లిన బొత్స
- హైకమాండ్ హామీలపై మళ్లీ భరోసా
- చిరుకు ఫోన్ చేసిన ఆజాద్
- మెత్తబడిన చిరంజీవి టీమ్!
హైదరాబాద్, డిసెంబర్ 3 (): అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న వేళ.. కాంగ్రెస్‌లో విలీనమైన పీఆర్పీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అధికార పార్టీ తమను గడ్డిపోచల్లా చూస్తున్నదని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విషయంలో పునరాలోచన చేస్తామని హెచ్చరించారు. తమ నాయకుడు చిరంజీవికి సైతం ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి గుర్తింపునూ ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసతీర్మానంపై గట్టెక్కేందుకు జగన్ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ను ఉరుములేని పిడుగులా వచ్చిన పడిన ఈ వ్యవహారం కలవరపెట్టింది. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేసిన సందర్భంగా కనీసం మూడు మంత్రి పదవులతో పాటు చిరంజీవికి రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఉత్తమ స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ఇంత వరకూ ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే సరైన సమయమని పీఆర్పీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని సమాచారం.
పీఆర్పీ రేపిన కలకలంతో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఢిల్లీ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ కూడా చిరంజీవికి ఫోన్ చేసి, అభయమిచ్చారని సమాచారం. దీంతో ప్రస్తుతానికి ఈ వ్యవహారం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.
శనివారంనాడు శాసనసభ రెండవసారి అరగంట వాయిదా పడగానే ఎమ్మెల్యేలు పీఆర్‌ఎల్‌పీ నేత చిరంజీవిని లాబీలో ఉన్న తమ కార్యాలయానికి బలవంతంగా తీసుకువచ్చారు. తమ పరిస్థితిపై సుుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని ఆయన వద్ద వెళ్లగక్కారు. తాము ఎమ్మెల్యేలం కాకముందైనా పనులు చేయించుకోగలిగామని, ఎమ్మెల్యేలం అయ్యాక చిన్న పని కూడా చేయించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యాక గడ్డిపోచలుగా చూస్తున్నారని ఒక ఎమ్మెల్యే అన్నారు.
కాంగ్రెస్ నుంచి గెలిచి జగన్ గూటికి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే వారికి కోట్ల రూపాయల పనులు ఇస్తున్నారని, గౌరవంగా ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎలాంటి షరతు లేకుండా విలీనమైన తమకు కనీస విలువ ఇవ్వడం లేదని చిరంజీవి వద్ద వాపోయారు. తమ నేత అమాయకుడని, చంద్రబాబులాగా ఎత్తుగడలు వేయలేడని, అందుకే తమను ఆడుకుంటున్నారని ఒక నేత అన్నారు. తొందరపడి విలీనం చేసినట్లు వాపోయారు. మనకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చిరంజీవి కూడా వారి వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో సమావేశం అయిన తరువాత పీఆర్‌ఎల్‌పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన చిరంజీవి తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తమ మద్దతుతోనే ప్రభుత్వం మనగలుగుతోందని అన్నారు. తమ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. చిరంజీవి చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్‌లో కలవరం కలిగించింది.
చిరంజీవి అక్కడి నుంచి వెళ్లిన తరువాత పీఆర్పీ ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులను కలిసి తాము అవిశ్వాసంపై పునరాలోచిస్తామని ప్రకటించారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి సీఎం చిన్న పని కూడా చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్న విలువ తమకు ఇవ్వడం లేదన్నారు. తమ అవసరం వారికి లేనప్పుడు తామెందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని ఒక ఎమ్మెల్యే తమ ఆవేదనను వెళ్లగక్కారు. పీఆర్పీ ఎమ్మెల్యేలు కిరణ్‌కుమార్‌పై అసంతృప్తితో ఉన్నారని తెలియగానే టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, రేవంత్‌డ్డిలు పీఆర్‌ఎల్‌పీ కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు తాము ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆ తరువాత అసెంబ్లీ లాబీలోకి వచ్చిన పీఆర్పీ సీనియర్ నేత సీ రామచంవూదయ్య మాట్లాడుతూ ‘‘వాళ్లు బరస్ట్ అయ్యారు.
నేను కాలేదు అంతే’’ అన్నారు. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది వాస్తవమేనని తెలిపారు. ఈ పరిస్థితిలో రాబోయే ముప్పును గమనించిన కాంగ్రెస్.. చిరంజీవిని బుజ్జగించే పనిలో పడింది. ఈ మేరకు చిరంజీవిని బొత్స కలిశారు. ఇదే సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి పీఆర్పీ ఎమ్మెల్యే కన్నబాబుతో మాట్లాడారు. అవిశ్వాసం తీర్మానం నోటీస్‌ను అంగీకరించిన నేపథ్యంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు దూరమైతే ప్రభుత్వ పతనం ఖాయమని భావించిన ముఖ్యమంత్రి వారిని బుజ్జగించే పనిలో పడినట్లు సమాచారం. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు అవసరమైతే జగన్‌తో వెళ్లినా ఫర్వాలేదన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు వారు జగన్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Chiru
0 comments:
Post a Comment