చీకటి ఖండంలో భారత్ కబ్ఝా!
- ఇది ఇండియన్ ఇంపీరియలిజం!
- 80 పైగా భారత కంపెనీల పాగా
- సౌదీ, సౌత్ కొరియా వంటి దేశాలూ ఉన్నాయి..
- భారీగా వ్యవసాయ భూముల ఆక్రమణ
- లక్షల హెక్టార్లు.. ఏళ్ల తరబడి లీజులు
ఆఫ్రికా! చాలా కాలం వరకూ ఇది ఓ చీకటి ఖండం! అంతుపట్టని రహస్యం! కాలం గడిచే కొద్దీ అందులోని అమూల్యమైన, అపారమైన ఖనిజ సంపద, వనరుల సంగతి జగతికి విదితమైంది! వెలుగుల తోవలో అడుగు పెట్టిన ఆఫ్రికా అక్కడే మరోమారు చీకటి ఊబిలో కూరుకుపోయింది! ఆఫ్రికా ఖండంలోని వనరులపై కన్నేసిన అనేక దేశాలు.. దాన్ని తమ దోపిడీకి వనరుగా మార్చుకున్నాయి. కొన్ని దేశాలు ప్రత్యక్షంగా వలస రాజ్యాలు ఏర్పాటు చేసుకోగా.. కొన్ని దేశాలు పరోక్షంగా ఆఫ్రికా దేశాల వనరులను దోచు కుంటున్నాయి. విశేషం ఏమిటంటే.. ఒకప్పటి బ్రిటిష్‌వలస రాజ్యంగా ఉండి, వలస పాలన బాధలు అనుభవించిన భారత దేశం కూడా ఈ నయా వలస దోపిడీలో భాగస్వామి కావడమే!
సోమాలియాలో ఆకలికి అల్లాడుతున్న చిన్నారులను గుర్తు తెచ్చుకోండి! ఎముకలు తేలిన దేహం, లోపలికి పోయిన కళ్లు, బేల చూపులు! పెను ఆహార సంక్షోభానికి నిదర్శనాలు! వీరి ఆకలికి, వీరి పోషకాహార లేమికి కారణాలేంటి? తగినంత ఆహార ఉత్పత్తి లేకపోవడమా? ఉత్పత్తికి తగిన వనరులు లేకపోవడమా? కాదు. కానే కాదు. వీరితో ఆకలి కేకలు వేయిస్తున్నది దారిద్య్రం, అసమానతలే! కళ్ల ముందు ధాన్యం గరిసెలున్నా.. ఉత్పత్తి, పంపిణీలోని తారతమ్యాలే వారి పేగులను మలమల మాడిస్తున్నాయి. ఆఫ్రికాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది! వారూ వీరూ అనిలేదు. పెట్టుబడిదారీ సమాజం అమెరికా మొదలుకుని, సామ్యవాద దేశమైన చైనా వరకు.. పెట్టుబడిదారీ దేశాల దోపిడీ పదఘట్టనల కింద మార్కెట్‌లు కోల్పోయి నయా ఆర్థిక విధానాల మాయాజాల గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్న భారత్‌వంటి దేశాలు మొదలు.. చమురు సొమ్ముతో సకల విలాసాలు అనుభవిస్తున్న సౌదీ అరేబియా వరకు.. తిలా పాపం తలా పిడికెడు చందాన వ్యవహరిస్తున్నాయి. ఒక్క సూడాన్‌లోనే ఏడు లక్షల హెక్టార్లను దక్షిణ కొరియా లీజులకు తీసుకుంది. టాంజానియాలో సౌదీ అరేబియా ఐదు లక్షల హెక్టార్ల లీజులపై సంతకాలు చేసింది. 80కిపైగా భారతీయ కంపెనీలు 240 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ఇది ఆఫ్రికా అభివృద్ధికి సహకారమా? లేక భూకబ్జానా?
ఆఫ్రికాలో అపారమైన జల వనరులున్నాయి. అంతకు మించి అతి తక్కువ ఖరీదుకు సారవంతమైన వ్యవసాయ భూములు దొరుకుతాయి. భారత్‌లో అయ్యే ఖర్చులో సగమే ఇక్కడ అవుతుంది. ఇంకేం.. భారతదేశానికి చెందిన కంపెనీలు ఆఫ్రికాలో అడుగు పెట్టాయి. 2010 నాటికి వివిధ ఆఫ్రికా దేశాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు 80కిపైగా భారతీయ కంపెనీలు ఇథియోపియా, కెన్యా, మడగాస్కర్, సెనెగల్, మోజాంబిక్, టాంజానియా, ఉగాండా వంటి దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో వివిధ పంటల నిమిత్తం 240 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ మొత్తం ఉత్పత్తిని తిరిగి తమ దేశానికి లేదా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు ఉద్దేశించారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన లక్కీ అనే గ్రూపునకు చెందిన ఎస్‌ఎన్ పాండే ఏడాది క్రితం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘ఆవూఫికాలో వ్యవసాయ ఖర్చులు భారత్‌తో పోల్చితే దాదాపు సగం. ఇక్కడి పొలాల్లో పెద్దగా ఎరువులు, పురుగుమందులు వాడనవసరం లేదు. కూలీలు కూడా చౌకకు దొరుకుతారు.
వ్యవసాయ దిగుబడి అత్యధికంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇక్కడ కనీస వేతనం రోజుకు 8 బిర్‌లు. (ఒక బిర్ మన కరెన్సీలో సుమారు మూడు రూపాయలు). దీనికి తోడు పలు ఆఫ్రికా దేశాలు భారతీయ వ్యవసాయ కంపెనీలు పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను 50 ఏళ్లపాటు లీజుకు ఇస్తున్నాయి. మరికొన్ని అయితే ఏకంగా 99 ఏళ్ల లీజులు ఆఫర్ చేస్తున్నాయి. అది కూడా కారు చౌక ధరలకే. భారతదేశంలోని పంజాబ్‌లోని దోవాబా ప్రాంతంలో ఎకరం పొలం లీజుకు (కౌలుకు) ఇస్తే కనీసం 40వేల రూపాయలు చెల్లించాలి. కానీ.. ఆఫ్రికా దేశాల్లో అదే ఎకరం భూమికి కేవలం 700 రూపాయలు చెల్లిస్తే చాలు. అంటే పంజాబ్‌లో ఎకరం భూమిని కౌలుకు తీసుకునే బదులు ఆఫ్రికాలో 60 ఎకరాలను కైవసం చేసుకోవచ్చన్నమాట.
తమకు తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతోనో, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించే సామర్థ్యం లేకపోవడంతోనో, లాలూచీలు పడో ఆయా ఆఫ్రికా దేశాలు తమ భూములను లీజుకు ఇచ్చేస్తున్నాయి. ఈ లీజులాటలో దారుణంగా నష్టపోతున్నది మాత్రం స్థానికులే. ఇథియోపియా వంటి దేశాల్లో సమర్థవంతమైన ప్రభుత్వాలు లేకపోవడం, ప్రజాస్వామ్యం లేకపోవడంతో భూ సేకరణ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిర్వాసితులయ్యే స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వద్ద పెద్ద ఎత్తున పంటలు పండుతున్నా.. తిండికి నోచుకోక అలమటిస్తున్నారు.
పెల్లుబుకుతున్న నిరసన
అయితే ఇటీవలి కాలంలో విదేశీ భూ కబ్జాలపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల కారణంగా తమ పశువులకు మేత దొరకడం లేదని, నీళ్లు కూడా దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను పెద్ద ఎత్తున లీజులు పొందిన కంపెనీలు ఈ భూముల్లో విదేశీ పెట్టుబడుల వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలులభిస్తాయని, వారి జీవన స్థితిగతులు మెరుగై, స్థూల జాతీయోత్పత్తి పెరుగుతందని వాదిస్తున్నాయి. ఇథియోపియాలో మూడు లక్షలకుపైగా కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. కానీ.. పూర్తి యంత్ర పరిజ్ఞానంపై ఆధారపడి జరిగే వ్యవసాయ పనుల్లో కేవలం 20వేల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయని అంచనా.
లీజు వ్యవహారాలను వ్యతిరేకించినందుకు అనేక మంది స్థానికులు హత్యలకు గురయ్యారని, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయని ఇటీవల బీబీసీ పేర్కొనడం విశేషం. స్థానిక భూములను, నదీ జలాలను వెర్దాంత హార్వెస్ట్స్ బారి నుంచి కాపాడేందుకు పలు సంస్థలు ఇప్పటికే పోరాటాలు ప్రారంభించాయి. ఈ భూములను ఖాళీ చేయించి అక్కడ తేయాకు, సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం భూములను లీజులకు ఇస్తే దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అక్కడి పోరాట సంస్థలు వాదిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వారి మాటలను చెవికెక్కించుకోవడం లేదు. ‘‘గంబెలాలో ప్రస్తుతం జరుగుతున్నది న్యూఢిల్లీలో లేదా ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్, బిస్‌మార్క్, నార్త్ డకోటా వంటి ప్రాంతాల్లో జరిగితే ఏమవుతుంది? ఇది అనూహ్యం. ఆ దేశాలు ఇటువంటి సంస్థలను అనుమతించని పక్షంలో ఇథియోపియాలో ఈ లీజులను ఎలా సమర్థిస్తారు?’’ అని సాలిడారిటీ మూవ్‌మెంట్ ఫర్ న్యూ ఇథియోపియా ప్రతినిధి ఒబాంగ్‌మెథో ప్రశ్నిస్తున్నారు.
భారీ స్థాయి వ్యవసాయ క్షేత్రాల్లో పూర్తి యాంత్రిక పద్ధతుల్లో జరిగే వ్యవసాయం పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన అంటున్నారు. వీటికి పెద్ద ఎత్తున జల వనరులు వినియోగమవుతాయని, అది భూగర్భ నీటి మట్టాలపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఫలితంగా భూమి, నీటికి మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లొసుగుల ఒప్పందాలు
పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం ఒక ఐదు భారత కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బయటపెట్టింది. అయితే.. ఈ ఒప్పందాలన్నీ పూర్తిగా లొసుగులతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీజులు పొందిన కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని నదులపై ఆనకట్టలు కట్టుకోవడానికి కూడా అనుమతులు ఇస్తున్నారు. తమకు కావల్సినన్ని బోరుబావులు ఏర్పాటు చేసుకోవచ్చు. తమకు నచ్చిన పద్ధతిలో సాగునీటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నీటిని వాడుకున్నందుకు చెల్లింపుల సంగతి, ఎంత నీటిని, ఎంతకాలం వాడుకోవాలి అన్న విషయాల్లో మాత్రం ఒప్పందాల్లో ఎక్కడా నిర్దిష్టంగా లేదని విమర్శలున్నాయి. కార్మికులకు వేతనాలు, వారి హక్కులు, వారి పని పరిస్థితులపై కూడా ఎక్కడా నిర్దిష్టమైన షరతులు ఒప్పందాల్లో లేకపోవడం విశేషం. పైగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునే తీరు స్థానికులకు పరిచయం చేయాలన్న నిబంధనలు కూడా లేవు. దీనితో విదేశీ కంపెనీలు ఇక్కడ వ్యవసాయం చేయడం వల్ల దీర్ఘకాలంలో ఇథియోపియాకు ఒరిగే లాభమేంటని విదేశీ కంపెనీలను వ్యతిరేకిస్తున్న సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
4.5 కోట్ల హెక్టార్లు లీజులకు...
చైనా, సౌదీ అరేబియా, కువైట్, దక్షిణ కొరియా, ఐరోపా యూనియన్‌తో పాటు తాను సైతం అంటూ భారత దేశానికి చెందిన కంపెనీలు అనేక ఆఫ్రికా ఖండంలో వ్యవసాయ భూములను కారుచౌకగా కొట్టేస్తున్నాయి. పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేయడమే కాకుండా.. స్థానికుల కడుపు మాడ్చి, ఆహారాన్ని బయటి దేశాలకు ఎగుమతులు చేసుకుని సొమ్ములు మూటగట్టుకుంటున్నాయి. దీనికి మూలాలు 2008 నుంచే ఉన్నాయి. 2008, 2009 సంవత్సరాల మధ్య దాదాపు 4.50 కోట్ల హెక్టార్ల భారీ వ్యవసాయ క్షేత్రాల ఒప్పందాలు జరిగాయని సాక్షాత్తూ ప్రపంచబ్యాంకు తాజా నివేదిక పేర్కొన్నది.
సహకారమే : చైనా ఆఫ్రికా దేశాల్లో భూ కబ్జాలకు తాము పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలను చైనా ఖండించింది. ఆఫ్రికా వ్యవసాయ రంగ అభివృద్ధికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హోంగ్ లీ చెప్పారు. ఆఫ్రికా స్థానికులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. దీని ద్వారా వారి భూముల్లో వారే సమర్థవంతంగా వ్యవసాయం చేసుకునేందుకు దోహదం చేస్తున్నామని తెలిపారు. తమ చర్యలకు ఆఫ్రికా దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న విషయాన్ని గమనించాలని లీ కోరారు. ‘‘ఆవూఫికాలో నయా సామ్రాజ్యవాదం ఉన్న సంగతి నిజమే కానీ.. అది చైనా నుంచి కాదు’’ అని ఆయన చెప్పారు.
విదేశాల్లో వెంచర్లు ప్రారంభించే భారతీయ కంపెనీలు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ధోరణులను కొనసాగిస్తాయన్న భావన ఉంది. కానీ.. పేద దేశాలపై కొన్ని కంపెనీలు ఎలా తమ సామ్రాజ్యవాదకోరలను సాచి, పెద్ద ఎత్తున భూములు కబ్జాచేస్తున్నాయన్నది, ఆయాపేద దేశాల్లో స్థానికులకు చేస్తున్నదేంటన్నది పెద్దగా బయటికి వచ్చింది లేదు. అయితే రిక్ రాడెన్ అనే పరిశోధకుడు దీనిపై పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న వ్యవసాయ భూముల విషయంలో భారత పాత్ర ఏంటన్నదానిపై ఒక పత్రం విడుదల చేశారు. తమపై దారుణాలకు పాల్పడుతున్నాయంటూ పశ్చిమ దేశాలపై భారత్ పలుఅంశాల్లో విమర్శిస్తూ ఉంటుంది. అయితే..అదే స్థాయిలో ఆయా పేద దేశాలపై భారతకంపెనీల దోపిడీ కొనసాగుతుండటమే ఇక్కడ ఆశ్చర్యం కల్గించే అంశం. దీనికి ప్రభుత్వ అండదండలు ఉండటం మరో కీలకాంశం. ఇక్కడ
పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భారత ప్రభుత్వం రుణాలు కూడా మంజూరు చేస్తోంది. దీన్ని భారత ప్రభుత్వం కేవలం వ్యాపారంగానే చూస్తోంది.
కరుటూరి సామ్రాజ్యం
ఇథియోపియాలోని గంబెలా ప్రాంతంలో కరుటూరి ఆగ్రో ప్రొడక్ట్స్ అనే భారతీయ కంపెనీ భారీ లీజు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ కంపెనీ జికావో, ఇటాంగ్ జిల్లాల్లో లక్ష హెక్టార్ల భూమిని కౌలుకు తీసుకుంది. పామాయిల్ తోటలు, తృణధాన్యాలు పండించేందుకు ఈ భూమిని పొందింది. మరో రెండు లక్షల హెక్టార్లపైనా కన్నేసింది. రుచిసోయా ఇండవూస్టీస్ అనే కంపెనీ గంబెలా, బెనిషంగుల్ గుమెజ్ రాష్ట్రాల్లో లక్షన్నర హెక్టార్ల భూమిని పాతికేళ్లకు లీజుకు తీసుకుంది. ఇలాంటివి ఆఫ్రికా దేశాల్లో కోకొల్లలు. తమ దేశంలోని బంజరు భూములను అభివృద్ధి చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని ఇథియోపియా ప్రభుత్వం చెబుతున్నది. అయితే.. నిపుణులు మాత్రం ఇథియోపియాలో ఆ మాటకొస్తే మొత్తం ఆఫ్రికాలో బంజరు భూములు అనే మాటే లేదని తేల్చి చెబుతున్నారు.
మాది కేవలం వ్యాపారమే
తమపై వస్తున్న విమర్శలను మాత్రం ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయం చేస్తున్న భారతీయ కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. తాము నయా సామ్రాజ్యవాదులం కాదని, కేవలం ఇక్కడ వ్యాపారం మాత్రమే చేసుకుంటున్నామని చెబుతున్నాయి. తాము ఇక్కడి కార్మికులకు కనీసం వేతనం 8 బిర్‌లు ఇస్తున్నామని కరుటూరి గ్లోబల్‌వివరణ ఇచ్చింది. భారతీయ కరెన్సీలో ఒక బిర్‌కు 3 రూపాయలు. అంటే రోజుకు ఇథియోపియన్ కార్మికులకు దక్కుతున్న వేతనం కేవలం 24 రూపాయలు. ఇథియోపియా చట్టాలకు లోబడే పని చేస్తున్నామని, పర్యావరణ చట్టాలను అనుసరిస్తున్నామని పేర్కొంటోంది. తాము ఇప్పటికే 20వేల మందికి ఉపాధి కల్పించనున్నామని ఒక వార్తా పత్రికతో కరుటూరి గ్లోబల్ వ్యవస్థాపకుడు సాయి రామకృష్ణ చెప్పారు. ఆస్పత్రి, సినిమాహాల్, పాఠశాల, డేకేర్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇలాంటివేమీ ఏర్పడుతున్నట్లు సంకేతాలు లేవని సాలిడారిటీ మూవ్‌మెంట్ ఫర్ న్యూ ఇథియోపియాకు చెందిన ఒబాంగ్ మెథో అంటున్నారు.
ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుత పరిస్థితి అచ్చుగుద్దినట్లు మన దేశంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో విదేశీ కార్పొరేట్‌లు చేస్తున్నట్లే ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఉభయ దేశాల్లోని ప్రగతిశీలవాదులు ఐక్యంగా ఉద్యమించాలని మెథో అభివూపాయపడ్డారు. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌లతో స్థానికుల కడుపు నిండుతుందనుకుంటే పొరపా ఆయన అన్నారు. ఈ ఒప్పందాలు అవినీతి రాజకీయ నాయకులు, విదేశీ ఇన్వెస్టర్ల జేబుల్లోకి డాలర్లు నింపడం తప్ప మరోటి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఒప్పందాల్లో చాలా వాటిలో పాదర్శకత లేదని ఆయన విమర్శించారు.
Take By: T News : http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=4&ContentId=55067
0 comments:
Post a Comment