చిల్లర కొట్టేస్తారు! (FDI Retail)
ఎఫ్‌డీఐలు తథ్యమన్న ప్రధాని పార్లమెంటు నడుస్తుండగానే బయట తేల్చిచెప్పిన మన్మోహన్
- ఎఫ్‌డీఐలపై దద్దరిల్లిన పార్లమెంట్
- ఆరో రోజూ ఆగని విపక్షాల నిరసన
- అఖిలపక్ష సమావేశం విఫలం
- మన్మోహన్‌తో మాట్లాడి చెబుతా
- పార్టీల నేతలతో ప్రణబ్‌ముఖర్జీ
- ఈలోపే తెగేసి చెప్పిన ప్రధాని
- ఎఫ్‌డీఐలు వద్దే వద్దు
- విపక్షంతో గొంతు కలిపిన తృణమూల్
- మరో భాగస్వామి డీఎంకేదీ అదే మాట
‘ఇదేం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై అన్నీ ఆలోచించాం. ఎఫ్‌డీఐలు దేశానికి
లాభదాయకమని మేం గట్టిగా నమ్ముతున్నాం. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా సామాన్యుడికి ప్రయోజనం కలుగుతుంది. నిత్యావసరవస్తువులు చవకకే లభిస్తాయి.
ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంతేకాదు గ్రామీణ మౌలిక సదుపాయాలనుఅభివృద్ధి చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయోత్పత్తుల్లో వృథాను అరికట్టొచ్చు. రైతులు
తమ పంటలకు సరైన గిట్టుబాటుధరలు పొందొచ్చు’
- కాంగ్రెస్ యువ నేతల సదస్సులో ప్రధాని
మన్మోహన్
మన్మోహన్
భారత చిల్లర దుకాణ మార్కెట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇకపై చెల్లు చీటీ ఇచ్చేయనుంది. ఇప్పటికే సూపర్ మార్కెట్‌ల పేరుతో మరణశయ్యను సిద్ధం చేసిన సర్కారు.. ఇప్పుడు ఇదే రంగంలోకి ఎఫ్‌డీఐల రూపంలో దేశీయ చిల్లర వర్తకానికి ఉరి బిగించేందుకు సిద్ధమైంది. చిల్లర వర్తకంలో చిల్లర కొట్టేసేందుకు విదేశీ కంపెనీలకు రెడ్‌క్పాట్ పరచనుంది. పార్లమెంటులో విపక్షాలు వరుసగా ఆరో రోజూ ఎఫ్‌డీఐలను ముక్తకం వ్యతిరేకించినా.. అనంతరం ప్రణబ్ చొరవతో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ పునరుద్ఘాటించినా సర్కా రు ససేమిరా అన్నది. ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకూ సభను సాగనిచ్చేది లేదని అఖిలపక్ష సమావేశంలో అన్ని విపక్ష పార్టీలూ భీష్మించాయి. దీంతో ప్రధానితో మాట్లాడి మళ్లీ మీ వద్దకు వస్తానని ప్రణబ్ చెప్పిన కాసేపటికే మన్మోహన్ అత్యుత్సాహానికి పోయారు.
దాదాపుగా విధాన ప్రకటన అన్నంత స్థాయిలో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఎవరు కాదన్నా చిల్లర వర్తకంలోకి 51శాతం విదేశీ పెట్టుబడులు వచ్చి తీరుతాయని కాంగ్రెస్ యువ నేతల సదస్సులో సంకేతాలు ఇచ్చారు. ఇది ఎంతగానో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. పైగా ఇది సామాన్యులకు మేలు కల్గిస్తుందని, వస్తువులన్నీ చౌక ధరలకే లభిస్తాయని వాదించారు. ఈ విధానం దేశానికి లాభదాయకమని చెప్పారు. చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులపై సాక్షాత్తూ సొంత పార్టీ ఎంపీలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వారి మైండ్‌సెట్ మార్చేందుకు బుధవారం కాంగ్రెస్ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియా గాంధీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా యూపీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న తృణమూల్, డీఎంకేలు ఈ విషయంలో విపక్షంతో గొంతు కలిపాయి.
ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవల్సిందేనని స్పష్టం చేశాయి. ఇప్పటికే గత ఆరు రోజులుగా ఎఫ్‌డీఐల అంశంపై సభలో రగడ జరుగుతూ వస్తున్నది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలు వస్తే దేశవ్యాప్తంగా చిన్న దుకాణదారులు మాయమవుతారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధరలు కూడా ఆకాశానికి ఎగబాకుతాయని ఇతర దేశాల ఉదాహరణలను ప్రస్తావిస్తున్నాయి. ఇప్పటికే సూపర్ మార్కెట్‌ల పేరుతో దేశీయ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన అవకాశం చిల్లర వర్తకానికి తీవ్రంగా చేటు చేస్తోందని, అదే ఇప్పుడు విదేశీ కంపెనీలు సైతం అడుగు పెడితే చిల్లర వర్తకం దేశంలో మరణించడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ వర్తకులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అయినా ప్రభుత్వం మాత్రం మొండిపట్టుదలతో ఎఫ్‌డీఐలను స్వాగతించేందుకే సిద్ధపడుతున్నది. పలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు సైతం ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇది ఏ దిశగా మళ్లుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక గతంలో అణు ఒప్పందాన్ని ఆమోదించుకున్న తీరులోనే ఆరు నూరైనా ఎఫ్‌డీఐలను స్వాగతిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే!
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Parliament logjam, FDI in retail, Opposition parties
0 comments:
Post a Comment