మూడోరోజూ ధూంధాం
- లోక్‌సభలో ఆగని తెలం‘గానం’
- పోడియం వద్ద బైఠాయించిన కేసీఆర్, విజయశాంతి
- మద్దతు తెలిపిన టీ కాంగ్రెస్ ఎంపీలు
- తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన సభ
- టీ కాంగ్రెస్ ఎంపీలకు ప్రణబ్ మందలింపు
- తెలంగాణ ఇచ్చేదాకా ఇంతేనన్న నేతలు
న్యూఢిల్లీ, నవంబర్ 24 ():ప్రత్యేక తెలంగాణ అంశంపై లోక్‌సభ దద్దరిల్లింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పారీ ఎంపీ విజయశాంతి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నినాదాలతో ప్రతిధ్వనించింది. దీంతో మూడోరోజు గురువారం కూడా ఎలాంటి చర్చ జరగకుండానే లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. అధిక ధరలు, నల్లధనంపై చర్చకు అధికార, విపక్షాల మధ్య అవగాహన కుదిరినప్పటికీ, తెలంగాణ అంశంపై ఆ ప్రాంత ఎంపీలు పట్టువీడకపోవడంతో సభలో నిరసనల పర్వం కొనసాగింది. తెలంగాణ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని గురువారం సభ ప్రారంభం కాగానే కేసీఆర్, విజయశాంతిలు పట్టుబట్టారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నానని ప్రకటించగానే వారు స్పీకర్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్లకార్డులను ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో అధిక ధరలపై చర్చ జరపాలని ఎస్పీ, ఆర్‌జేడీ, బీఎస్పీ సభ్యులు సైతం వెల్‌లోకి చొచ్చుకుపోయారు.వామపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిలుచుని నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్పీకర్ సభను గంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు శాంతించలేదు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా కేసీఆర్, విజయశాంతితో సహా టీ కాంగ్రెస్ ఎంపీలు వెల్‌ల్లోనే నిరసన తెలిపారు. సభ మధ్యాహ్నం మరోసారి రెండుగంటల పాటు వాయిదా పడింది. అయితే భోజన విరామ సమయంలో స్పీకర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అధికధరలు, నల్లధనం అంశంపై అధికార, విపక్షాల మధ్య అవగాహన కుదిరింది. అధిక ధరలపై వామపక్షాలు ఇచ్చిన తీర్మానంపై గురువారం చర్చ చేపడితే, నల్లధనంపై సోమవారం నాడు బీజేపీ చర్చ నిర్వహించడానికి ఒప్పందం కుదిరింది. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే అధిక ధరలపై చర్చకు అనుమతిస్తున్నానని స్పీకర్ ప్రకటించారు. అయితే అత్యంత ప్రాధాన్యత గల తెలంగాణ అంశంపై ముందు చర్చ చేపట్టాలని నినాదాలు చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు, టీ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ప్రకటించేదాకా సభను నడవనియ్యమని నినదించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసిన్పటికీ ఫలితం లేకుండా పోయింది. అధిక ధరలపై చర్చ జరిగేలా సహకరించాలని సుష్మాస్వరాజ్, సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా, ఎన్డీయే కన్వీనర్ శరద్ యాదవ్ తదితరులు కేసీఆర్‌కు విజ్ఙప్తి చేశారు. వారి విజ్ఞప్తును కేసీఆర్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో సభ పూర్తిగా స్తంభించింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత ఇన్నర్‌లాబీల్లో, సెంట్రల్ హల్‌లోనూ కేసీఆర్‌ను కలిసిన విపక్ష నేతలు కనీసం శుక్రవారమైన సభను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ తెలంగాణ వచ్చే దాకా తమ వైఖరి మారదని వారికి స్పష్టం చేశారు.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, Lok sabha, KCR, Telangana Songs,
0 comments:
Post a Comment