ఒరిగిపోయిన పెద్దపులి
- మావోయిస్టు నేత మల్లోజుల ‘ఎన్‌కౌంటర్’
- కారడవుల్లో కిషన్‌జీ కాల్చివేత
- రెండ్రోజులుగా వెయ్యిమందితో వేట
- సంయుక్త బలగాల చక్రబంధం
- పాల్గొన్న సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, కోబ్రా
- మమత పాలనలో తొలి భారీ ఎన్‌కౌంటర్
- ముందురోజే పట్టి చంపారేమో: వరవరరావు
- కిషన్‌జీ గుర్తింపుకోసం బంధువును తీసుకెళ్ళాలని డిమాండ్
- ఎన్‌కౌంటర్‌పై హక్కుల సంఘాల అనుమానాలు
- ఘటనను ఖండించిన పలువురు నేతలు, మేధావులు
మావోయిస్టు ఉద్యమంలో పెను కుదుపు.. భారత విప్లవోద్యమానికి తీరని విఘాతం.. జంగల్ మహల్ అడవుల్లో ఆదివాసీలకు అండ దూరం..! కరీంనగర్ జిల్లా పెద్దపల్లి బిడ్డ.. బెంగాల్ ‘టైగర్’ మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు! తెలంగాణ తొలి ఉద్యమంలో పోరు కేక వేసిన గొంతు మూగబోయింది. తెలంగాణ నుంచి పోరు బావుటాను జంగల్‌మహల్‌దాకా విస్తరింప చేయడంలో కీలక భూమిక వహించిన ఉద్యమ దుర్గం ఒరిగిపోయింది. నిజమైన స్వాతంత్య్రాన్ని కాంక్షించి.. భారత విముక్తి కోసం రహస్యోద్యమాన్ని నిర్మిస్తున్న ఉద్యమకారుడి గుండెను సర్కారు తుపాకి గుళ్లు తూట్లు పొడిచాయి. 34 ఏళ్ల అజ్ఞాతవాసం ఆగిపోయింది. ఏళ్ల తరబడి సాగుతున్న వెతుకులాటలో.. నాలుగు రోజులుగా ముమ్మరమైన వేటలో సంయుక్త భద్రతాదళాలు ఎట్టకేలకు కిషన్‌జీని చంపాయి. మూడున్నర దశాబ్దాలుగా అనేక రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ శకం ముగిసిపోయింది. మార్క్సిస్టులు చేయలేని పనిని మమత సర్కారు పరిపూర్తి చేసింది. తెలంగాణ బిడ్డ ఇక లేడన్న విషయం తెలుసుకుని ప్రాంతం హతాశురాలైంది. ఏనాటికైనా కొడుకును చూస్తానని ఒకే ఒక్క ఆశతో ప్రాణం నిలుపుకొంటున్న ముసలి తల్లి.. కన్నీరు మున్నీరైంది!
కోల్‌కతా, నవంబర్ 24: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించిన మల్లోజుల కోటేశ్వరరావు మూడున్నర దశాబ్దాల కిందట (1975-76) అప్పటి విప్లవ విద్యార్థి సంఘం- రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరారు. అనంతరం పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. పొలిట్‌బ్యూర్, కేంద్ర కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడైన ఆయన మావోయిస్టు పార్టీలో మూడో స్థానంలో పనిచేశారు. రెండున్నర దశాబ్దాలకు పైగా జార్ఖండ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వహించారు. 2009 నుంచి ఆయన జంగల్‌మహల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. బెంగాల్‌లో ఇదివరకటి సీపీఎం ప్రభుత్వం, ఇప్పటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తూ వచ్చాయి. ఎన్నికలకు ముందు, గెలిచిన తర్వాత కొంతకాలం మావోయిస్టులతో మృదువుగానే వ్యవహరించిన ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇటీవల కఠినవైఖరి అవలంబించారు. మధ్యవర్తులతో చర్చలు కొనసాగిస్తామంటూనే, హింసను వీడకుంటే అణచివేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతను భద్రతాదళాలు హతమార్చడం సంచలనం కలిగిస్తోంది. తాజా పరిణామంతో బెంగాల్‌తోపాటు పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ కోసం ఎంతోకాలంగా వేటాడుతున్న భద్రతా దళాలు తాజాగా ఆయన సంచరిస్తున్నట్టుగా అనుమానిస్తున్న పశ్చిమబెంగాల్‌లోని అటవీ ప్రాంతాలను చుట్టుముట్టాయి. రెండురోజులుగా వెయ్యిమందితో కూడిన సంయుక్త బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఇందులో సీఆర్‌పీఎఫ్ 184వ బెటాలియన్, 207 కోబ్రా బెటాలియన్, బీఎస్‌ఎఫ్, బెంగాల్ రాష్ట్ర పోలీసులు పాల్గొన్నట్లు సీఆర్‌పీఎఫ్ ధ్రువీకరించింది. బుధవారంనాడే ఉత్కంఠ పరిస్థితులు నెలకొనగా, కిషన్‌జీ తప్పించుకుపోయినట్లు భద్రతాదళాలు ప్రకటించాయి. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బురిసోల్ అటవీవూపాంతంలో గురువారం జరిగిన ‘జంగల్‌మహల్ ఎన్‌కౌంటర్’ అనంతరం ఆయన మరణించినట్లు వెల్లడించాయి. కిషన్‌జీ, ఆయనతోపాటు ఉన్న సుచిత్ర మహతో (ఇదివరలో మరణించిన ఒక మావోయిస్టు నాయకుడి భార్య), మరికొందరు కుష్బోని అడవిలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించినట్లు తిరుగుబాటు కార్యకలాపాల నిరోధక దళం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కిషన్‌జీకి ఉన్న నాలుగంచెల భద్రతావలయాన్ని ఛేదించిన తర్వాత ఎన్‌కౌంటర్ జరిగినట్లు చెప్పారు. కుష్బోనికి దగ్గరలోని జంబోని పోలీసుస్టేషన్ పరిధిలో బురిసోల్ అడవిలో గురువారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఎన్‌కౌంటర్ అనంతరం అక్కడ కనిపించిన మృతదేహాన్ని.. ఏకే 47 ఆయుధాన్ని బట్టి కిషన్‌జీదిగా గుర్తించినట్లు చెప్పారు.
సుచిత్ర, మరికొందరు తప్పించుకుపోయారని తెలిపారు. అంతకుముందు సంయుక్త భద్రతాబలగాలు గొసాయిబంద్ గ్రామ సమీపంలోనుంచి ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్, కిషన్‌జీ, సుచిత్ర రాసిన కొన్ని లేఖలు, మరికొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. మావోయిస్టు పార్టీలో మూడో స్థానంలో ఉన్న కిషన్‌జీ చనిపోవడం నక్సలైట్లకు పెద్ద దెబ్బ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఇదివరలో ఇదే స్థానంలో ఉన్న మావోయిస్టు నేత చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఆంధ్రవూపదేశ్‌లోని ఆదిలాబాద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల క్రితమే అడవిబాట పట్టిన మల్లోజుల కోటేశ్వర్‌రావు (కిషన్‌జీ) ఎన్‌కౌంటర్‌తో ఆయన పురిటిగడ్డ కరీంనగర్ జిల్లా శోకసంవూదంలో మునిగిపోయింది. దేశంలో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా ఉలిక్కిపడే జిల్లావాసులు, మరణించినవారు మల్లోజుల సోదరులు కాదని తెలుసుకున్నాక స్థిమితపడేవారు. కానీ ఇప్పుడు చనిపోయింది కిషన్‌జీ అని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.ఎన్‌కౌంటర్‌పై హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బెంగాల్‌లో మధ్యవర్తిత్వం వహిస్తున్న సుజాతోభద్రో ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తమ బృందంతో చర్చించాక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. సంయుక్తదళాలు కిషన్‌జీని బుధవారమే బంధించి చంపేసి ఉండవచ్చని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అనుమానం వ్యక్తం చేశారు. మమతాబెనర్జీ ప్రభుత్వం శాంతిచర్చలను దెబ్బతీసిందని, మోసం చేసిందని ఆయన విమర్శించారు. కిషన్‌జీని గుర్తించడానికి ఆయన మేనకోడలు దీపను తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. కిషన్‌జీ పెద్దన్న తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన తల్లి చాలా వృద్ధురాలు క్యాన్సర్ పేషంటని తెలిపారు. అందువల్ల పెద్దపల్లిలో ఉంటున్న మేనకోడలు దీపను విమానంలో తీసుకెళ్ళేందుకు కేంద్రం, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు.
కిషన్‌జీ మృతి మావోయిస్టులపై పెద్ద ప్రభావమేమీ చూపదని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సూర్యకాంత మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఆయనను పట్టుకుంటే సంతోషించేవాడినని, ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. మావోయిస్టులకు ‘జాతి వ్యతిరేక’ శక్తుల మద్దతు ఉందని పేర్కొన్నారు. సంయుక్త దళాలకు ఇది పెద్ద విజయమని బెంగాల్ బీజేపీ శాఖ వ్యాఖ్యానించింది.
Take By: http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=47940
Tags: Telangana News, T News, hmtv, tv9, AP News, Political News, Kishenji death, Maoist leader, Suchitra Mahato, Jungalmahal encounter
0 comments:
Post a Comment