లంగాణ కోసం...!-వికలాంగుని ఒంటరి దీక్ష
ఎంజీఎం, అక్టోబరు 8: తెలంగాణ వచ్చేంత వరకు పచ్చి మంచి నీళ్లయినా ముట్టేది లేదని భీష్మించుకుని ఆమరణ దీక్షకు పూనుకున్న వికలాంగుడైన ఎల్లయ్య ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది.. గత ఆరు రోజులుగా అన్నపానియాలు ముట్టకుండా ఒంటరిగా తన ఇంటిలో ఆమరణ దీక్ష చేపట్టి తీవ్ర అస్వస్థకు గురై ఆస్పవూతిలో చేరిన ఎల్లయ్య భార్య ఎల్లమ్మ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. జఫర్‌గడ్ మండలానికి చెందిన కొక్కుల ఎల్లయ్య(45)కు భార్య, కూతురు, కుమారుడున్నారు.
కూలీ పనులు చేసుకునే ఎల్లయ్య తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ ఉద్యమిస్తున్నా.. ఆత్మబలిదానాలు చేసుకుంటున్నా కేంద్రం స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తుండటంతో ఎల్లయ్య మనసు గాయపడింది. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందని భావించి ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. భార్య పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి పండుగకు వెళ్లింది చూసి ఈనెల 2వ తేదీ నుంచి ఎల్లయ్య ఒక్కడే ఒంటరిగా తన ఇంటి వద్ద దీక్ష చేపట్టాడు. మెడలో టీఆర్‌ఎస్ కండువా ధరించి దీక్షకు ఉపక్షికమించాడు.
గత ఆరు రోజులుగా మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండటంతో అతని ఆరోగ్యం దెబ్బతింది. శనివారం భార్య పిల్లలు ఊరి నుంచి ఇంటికి చేరుకునే సరికే అతను తీవ్ర అస్వస్థకు గురై కనీసం మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. ఆనోట ఈనోట విషయం కాస్త బయటికి పొక్కడంతో స్థానిక నాయకులు అతని ఇంటికి చేరుకుని అస్వస్థకు గురైన ఎల్లయ్యను చికిత్స కోసం ఎంజీఎం ఆస్పవూతికి తరలించినట్లు అతని భార్య ఎల్లమ్మ ‘టీన్యూస్’కు తెలిపింది.
తాము అసలే పేదరికంతో బాధపడుతున్నామని, తన భర్తకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని రాష్ట్రం వస్తే తమలాంటి పేదలు బాగుపడతారని చెపుతుండే వారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తే.. తెలంగాణ రాష్ట్రం రావాలనే దీక్ష చేశానని, అప్పటి వరకు నీళ్లు కూడా ముట్టనని చెబుతున్న ఎ ల్లయ్య మరోమాట మాట్లాడటం లేదు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు..
0 comments:
Post a Comment