హైద్రాబాద్ జనజీవితం- ఉర్దూ సామెతలు - Hyderabad Urdu Shayari
పడ్ పడ్‌కర్ పాగల్ బన్‌గయా
నఖల్ మార్ కర్ నవాబ్ హో గయా
చదివి చదివి బుర్ర చెడగొట్టుకున్న వాడు పిచ్చివాడిగ మారితే, కాపీ కొట్టిన వాడు మాత్రం అధికారిగా మారినాడట. నేటి లోకరీతికి అద్దం పట్టే సామెత ఇది. అడ్డదారులు తొక్కేవారు అందలాలెక్కడం మనకు తెలిసిన సంగతే కదా!
దస్తర్ పే జౌర్ బిస్తర్ పే
షర్మానా నహీ,
ముస్లింలు భోజనానికి పరుచుకునే బట్టను ‘దస్తర్’ లేదా ‘దస్తర్ ఖానా’ అంటారు. బిస్తర్ అంటే పరుపు మరియు పక్కచుట్ట. భోజనం ముందు లేదా పడకపైన సిగ్గు పడరాదని ఇదొక హెచ్చరిక. ఈ రెండింటి ముందు సిగ్గుపడితే సుఖం దక్కదని ఈ సామెత సారాంశం
జాదా హుషారీ
మౌత్ కీ నిషానీ,
దీనికి దగ్గరి తెలుగు సామెత ‘చాలాకి పిట్ట నిన్ను నేలకేసి కొట్ట’. అతి తెలివి ప్రమాదాలకు, మృత్యువుకు దారితీస్తుందని దీని నీతి. చచ్చిన సింహానికి ప్రాణం పోసి చివరికి దానిచేతిలోనే తన ప్రాణాన్ని పోగొ ట్టుకున్న ఒక అతి తెలివివంతుడి కథ మనకు తెల్సినదే.
దలీందర్ జో హై దర్‌ఖాస్త్ దియేతో
ఖచేరీ ఖుద్ బర్కాస్ హో గయా
దరిద్రుడు ఇవ్వక ఇవ్వక ఒక రోజు విజ్ఞాపన పత్రం ఇచ్చేసరికి, అంత వరకూ అక్కడున్న ఆఫీసు అడ్రస్ లేకుండా మూత బడిందట. ‘దరిద్రుడి పెండ్లికి వడగండ్ల వాన’ అన్నట్లు దరిద్రుడు ఏ పని ప్రారంభించినా పురి ట్లోనే సంధి కొట్టినట్టు ముగుస్తుంది.
డూంఢె తో ఖుదా భీ మిల్తా హై
ప్రయత్నిస్తే ప్రతి పని సాధ్యమవుతుంది. ‘దేవులాడితే దేవుడు కూడా దొరుకుతడు బిడ్డా’ అని పెద్దలు పిన్నలకు హితవు చెప్పే సామెత ఇది. అన్వేషిస్తుంటే ఎదో ఒక రోజు సత్య సందర్శనం జరుగుతుందని దీని మతలబు.
గధా ఘోడా దో భీ బరాబర్
సర్కారీ నౌకరీలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. సర్కారీ దఫ్తర్ ల పనిచేసే వాడు, చెయ్యనివాడు ఇద్దరూ ఒక్కటేనని.. నెలాఖరుకు ఇద్దరికీ జీతం వస్తుందని ఈ సామెత సారాంశం. ‘ఏం పరేషాన్ భై నేనేమో మా ఆఫీసుల గాడిద లెక్క చాకిరి చేస్తుంటే, నా పక్క సీటోడు సీటీలు బజా యించుకుంట బజార్లపొంట తిర్గుతడు. మా ఆఫీసుల ‘గధా ఘోడా దో భీ బరాబర్ ’ అని అంగలార్చటం మనకు తెలిసిన సంగతే.
రాత్‌గయి - బాత్‌గయి
ఇచ్చిన మాట తప్పేటపుడు ఈ సామెత వాడి తప్పించుకుంటారు కొందరు మహానుభావులు. ‘అరే ఏందీ భై నిన్న నువ్వు ఈ రోజు నా అప్పు చెల్లిస్తనని మాట ఇస్తివి కదా!’ అని ఒక అమాయకుడు అడిగితే ‘అరే జా భే. రాత్‌గయి-బాత్ భీ గయి’ అని గడుసువాడు తప్పించుకుంటడు.
పాన్‌దాన్ ఖాన్‌దాన్
నైజాం కాలంలో ప్రజలందరూ పాన్ తినేవారు. ప్రతి ఇంటిలో పాన్‌దాన్ ఉండేది. అతిథులు రాగానే వారి ముందు పాన్‌దాన్ చాలా మర్యాదగా పెట్టేవారు. పాన్‌దాన్ ఆ ఇంటి వారి హోదా, అంతస్తును తెలిపేటట్టు ఉండేది. ధనికులు ఆడంబరమైన, నగీషీలు చెక్కిన, లతలు, పువ్వులతో అలంకరించబడిన వెండి పాన్‌దాన్ లు వాడితే సామాన్యులు సాదాసీదా పిత్తల్ పాన్‌దాన్‌లను వాడేవారు. అందుకే ‘షాదీ కా రిష్తా’ పక్కా చేసుకునే ముందు ‘పాన్‌దాన్ ఔర్ ఖాన్‌దాన్’ను పరిశీలించే వాళ్లు.
దర్ద్ హీ దర్ద్ కా దవా హై
ఇదొక తాత్విక భావన కల్గిన సామెత. ప్రేమకు, తియ్యటి విరహానికి ఈ సామెత సరిపోతుంది. దేవదాసు సీన్మాలోని ‘భాధే సౌఖ్యమనే... భావన రానీ వోయ్’ అన్న పాట ఈ సామెతకు దగ్గరగా ఉంటుంది. ‘ఊష్ణం.. ఉష్ణే శీతలం’ అన్నట్లు ప్రేమ రోగానికి ప్రేమే సరియైన మందు.
ఏక్ అనార్-సౌ భీమార్
ఒక ఖంజూస్ ఆద్మీ (పిసినారి) దవాఖానాల ఉన్న బీమారోల్లను (రోగులను) చూసేటందుకు పోతపోత ఒక అనార్‌ను (దానిమ్మ పండు) లింగు లింగుమని పట్టుక పోయిండంట. ఒళ్లు మండిన ఒక రోగి, బహుశా వాడు కవి కావచ్చు ‘ఏక్ అనార్ సౌ భీమార్’ అని హేళనగా వ్యాఖ్యా నించిండట. అట్ల ఈ సామెత చెలమణిలోకి వచ్చింది. ఇంట్లె తినేటోల్లు ఎక్కువగా ఉన్నప్పుడు, మిఠాయిలో, పండ్లో కూరగాయలో మనం తక్కువగా పట్కపోతే ‘ఎవని ముక్కుల పెట్టే తందుకు ఇవి పట్కొచ్చినవ్ రా’ అని అమ్మ కోప్పడటం ఈ సామెతను గుర్తు చేస్తది.
ఘర్ మే ఖానా
మామూ కే బక్రే చరానా
‘తినేది మొగని సొమ్ము పాడేదీ వేరొకని పాట’ అని తెలుగు సామెత. ‘మన ఇంట్లోని తిండి తింటూ పిల్లనిచ్చిన మామ మేకల్ని మేపినట్లు’ అని దీని అర్థం.
బాల్ బాల్ మే బచ్ గయే
వెంట్రుక వాసిలో గండం తప్పిపోవటం అన్నమాట. ‘అరే నిన్న రాత్రీల మోటర్ టక్కర్ అయ్యింది భై, కని బాల్ బాల్ మే బాచాయించి పోయిన’ అని జిగ్రీ దోస్తుల ముందు చెప్పుకోవటం మనం విన్న సంగతే.
పైసా హీ-పర్మాత్మా హై
గుజరాతీలు, మర్వాడీలు ఈ సామెతను ఎక్కువగా వాడుతుంటారు. ‘ధనం మూలం మిధం జగత్’ అన్న తెలుగు సామెత ఈ అర్థాన్నే స్ఫురి స్తుంది.డబ్బు జబ్బు కలిగిన వారు నిధిలోనే రాముని స‘న్నిధి’ ని చూస్తారని ఈ సామెత నిరూపిస్తుంది.
ఘర్ కీ ముర్గీ-దాల్ బరాబర్
ఇంటిలో పెంచుకునే కోడికి విలువ తక్కువ. దానిని ఎప్పుడంటే అప్పుడు కోసుకొని తినవచ్చు. కానీ అందులో రుచి తక్కువ. అది ప్రతి
రోజు తినే పప్పుతో సమానమే. అందుకే కొంతమంది ‘పొరుగింటి పుల్ల కూర రుచి మీద మనసు పారేసుకుంటారు. ఈజీ పనిల మజా ఉండదు. అట్లనే ‘పుకట్ కు దొరికే దానిల కూడా మజా దొరకదు’ అని దీని భావం.
జైసా కర్నా -వైసా భర్నా
‘చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా’ అనేది లేదా ‘మంచి కానీ చెడుకానీ ఎట్ల చేసుకుంటే అట్ల అనుభవిస్తం’ అనేవి దీనికి దగ్గరగా ఉండే తెలుగు సామెతలు. మన మాటలు మన చేతలే మన జీవితాలను నిర్ణ యిస్తాయి అని తెలియచేసేదే ఈ సామెత. కావున మన నడక, మన నడత సరిగ్గ ఉండాలె.
నియ్యత్ కిత్నా-బర్కత్ ఉత్నా
నియ్యత్ అంటే నీతి, నిజాయతీలు. బర్కత్ అంటే లాభం, సమృద్ధి, గిట్టుబాటు కావడం. మన నియ్యత్ సాఫ్‌గ ఉంటే బతుకు గూడ ఆనం దంగ ఉంటుందని ఈ సామెత చెప్పే నీతి.
హర్ దర్ద్ కా దవా జిందాతిలిస్మాత్
‘అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం’ అన్న అర్థంతో ఈ సామెతను వాడుతారు. పూర్వకాలంలో డాక్టరు వద్దకు వెళ్ళలేని గరీబులు కడుపునొప్పి, కాలినొప్పి, పంటినొప్పి, తుంటినొప్పి, వాంతులు విరేచ నాలతో సహా అన్నింటికీ సర్వరోగ నివారణిలా రెండు చుక్కల ‘జిందాతిలిస్మాత్’ ను వాడటం వలన ఈ సామెత ప్రచారంలోకి వచ్చింది. వర్తమాన తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అన్ని రుగ్మతలకు ప్రత్యేక రాష్ట్రమొక్కటే పరిష్కారమన్నట్లు!
నోట్లెపాన్-ఇంట్లె ఫోన్
ఇది కూడా పూర్వకాలం సామెతనే. ఫోన్ ఒకప్పుడు విలాసానికి, హుందాకు, హోదాకు చిహ్నం. హమేషా పాన్ నమలటం కూడా ‘ షాన్’ కు సంబంధించిన సంగతే. పాన్‌దాన్, ఒగల్‌దాన్ (ఉమ్మిపాత్ర) లాంటి వన్నీ రాచరిక భూస్వామ్య కాలంలో విలాసాలకు సంబంధించిన కులా సాలే! కావుననే అమీరును చూసిన మరో గరీబు ‘వానికేం భై నోట్లే పాన్ ఇంట్లె ఫోన్’ అని వ్యాఖ్యానించేవాడు. ఈ కాలంలో పాన్ లు తక్కువై ఫోన్ లు ఎక్కువైనాయి.
సర్కారీ బండీ మే కిత్నే చుహ్వే
చుహ్వే అంటే ఎలకలు. ధనికులను ‘సర్కార్ ’ అని పిలవటం ఒక రీతి రివాజ్. ఆ కాలంలో ఆటోలు లేవు కావున ధనికులు తమ ఆడపిల్లల్ని గూడులాగా నిర్మించిన ఎడ్లబండ్లల్లో పరదాలు కట్టి పాఠశాలలకు పంపే వారు. ఘోషా- పర్దాలు పాటించే కాలం అది. కొంటె కుర్రాళ్లు వాళ్లను బనాయించటానికి (ఏడిపించటానికి) ఆ బండి చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ ‘ సర్కారీ బండే మే కిత్నే చుహ్వే’ అని అరిచేవారు. ఆ సరదాల పరదాల వెనుక నలుగురు ఉంటే ‘చార్ చుహ్వే’ అని మిగిలిన మొగపిల్లలు కేకలేసేవారు. పరదాల వెనుక ఉన్న పూబోడుల సంగతేమో గానీ బండి వాడికి కోపం వచ్చి చేతిలోని కమ్చీని (కొరడా) ఆ కొంటె కుర్రాళ్లపై ఝుళిపించే సరికి కిస కిస నవ్వుకుంటూ వారు చెల్లాచెదరయ్యే వారు. ఈ సామెత ‘ఈవ్ టీజింగ్ ’గురించి తెలియచేస్తుంది.
ఊపర్ శేర్వానీ-అందర్ పరేషానీ
దీని వెనుక రెండు రకాల కథలు ఉన్నాయి. ఒక ఆడంబరుడు డాబు కోసం పైన ఖరీదైన శేర్వానీ వేసుకున్నాడు కానీ లోపల చొక్కా మాత్రం చింపులదే. ‘హంసలను అనుకరించే కాకి వోలె’ పైసలు లేకున్నా ఖరీదైన శేర్వానీ కొనుక్కున్నాడు. కానీ లోపలి లాల్చీకి పైసలు లేక చిరుగులదే వేసుకొని ఎవరైనా గమనిస్తారని దావత్‌ల పరేషాన్ పరేషాన్‌గ నిలబడ్డడు. ఆఖరికి ఎవడో ఒకడు గమనించి ‘ఊపర్ శేర్వానీ అందర్ పరేషానీ’ అని గుట్టురట్టు చేసిండు. దీనినే తెలుగుల ‘పైన పటారం లోన లొటారం’ అంటారు. మరో కథ. ఎండకాలం మిట్ట మద్యాహ్నం శేర్వానీ వేసుకుంటే చూసేటందుకు మీద బాగనే ఉంటది. కాని లోపల చెమటలు పట్టి పరే షాన్ అయితది. ‘ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత’ అన్న సామెత కూడా దీనికి దగ్గరగా ఉంటది.
బీబీసీ మే లీటర్ మీటర్
ఇది తాగుబోతులకు సంబంధించిన పక్కా హైదరాబాద్ సామెత? ‘ఏం రా పొద్దుమీకి బీబీసీల కల్సుకుని ఏమైనా లీటర్ మీటర్ హై యా నై’ అని సంకేతాలు ఇచ్చుకుంటరు. అమాయకులకు ‘బీబీసీ’ అంటే వార్తలు ప్రసారం చేసే ‘ఛానెల్’. కాని తెలివైనా వారి కోడ్ భాష వేరే. అది ప్రతి దినం వాళ్లు కల్సుకునే అడ్డాపేరు. నాంపల్లి చౌరస్తల ఇప్పటికీ బీబీసీ ఉంది. అంటే ‘బొంబై బార్ ఆండ్ కేఫ్’. లీటర్ అంటే ఫుల్ బాటిల్. మరి మీటర్ అన్న పదం యాడికెల్లి ఎందుకోచ్చిందో నాకైతే తెల్వది. పాఠకులకు అంత గనంగ ఖాయిష్ ఉంటే ఒక్కపాలి బీబీసీ మెహఫిల్ లకు కాలుబెట్టి ఆడ ఉండే ఉమర్ ఖయ్యాం లను అడుగాలె.
తాష్కెంట్ మే రాకిట్
ఇది సుత అసుంటి సామెతనే. తాష్కెంట్ అంటే వారి కోడ్ భాషలో కల్లు కాంపౌండ్. ఒక్కప్పుడు హైద్రాబాద్‌ల చాన చాన మషూర్ అయిన కల్లు కంపౌండ్లు ఉండేవి. సర్కారు వారు అవట్నీ ఇప్పుడు బందు పెట్టిన్రు. సాయంత్రం పూట కల్లుతోపాటు చిక్నా, బోటీ, కబాబ్, సీకులు, గుడాలు బొబ్బుడాలతోపాటు కొండొకచో కవిత్వాలు, షేర్‌షాయిర్లు కూడా వొలి కిపోయేటివి. అధో జగత్ సహోదరుల పెదాల మీద జానపద లల్లాయి గీతాలు అలవోకగా దొర్లిపోయేటివి. కల్సి తాగే మొగోల్లు ఆడోల్లకు కల్సి తాగే ఏర్పాటు ఉండేది గానీ అమ్మలకు, అక్కలకు తడికెలు గట్టిన సపరేట్ సెక్షన్ భీ ఉండెడ్ది. కష్టాలు కన్నీళ్లు వొలకబొసుకుంట ముచ్చట్లు సాగేవి. అది సరే.. రాకిట్ ఏందని అడుగుతుండ్రా? ఏం లే భై.రాకిట్ అంటే గుడుంబా సీసా. అది కడుపుల బడంగనే ఇంగ్లం వొలె మండి పానం రాకిట్ లాగ మొగలు మీదికి ఎగుర్తది. అందుకే రాకెట్ అని ముద్దుపేరు. సరే గని సముద్రంలోని ఉప్పుకు చెట్టుమీది ఉసరికాయకు ఏం సం బంధం? తాష్కెంట్‌కు కల్లు కాంపౌండుకు ఏం సంబంధం? అని ప్రశ్నల మీద ప్రశ్నలడిగి నా పానం తీయకుండ్రి
చల్నేదో బాల్‌కిషన్
ఈ మాట భీ ఏడికెల్లి ఇంపోర్ట్ అయ్యిందో బాషా శాస్త్రవేత్తలను అడుగాలె. గాని డ్బై దశకంలోప్రతివొక్కరి నోటిమీద ఈ మాటనే డాన్స్ చేసెడ్ది. ‘ఓకే బాస్, ఓకే భై’ అనే బదులు ‘చల్నేదో బాల్ కిషన్ ’అనేటోల్లు. బహుశా బాలకిషన్ పేరు హైద్రాబాద్‌ల సర్వనామమేమో? ఆమ్ ఆద్మీ లందరికీ ఆ పేరు ఎక్కువగా ఉండేదేమో? ఐందల్ ఐందల్ (ఏందో ఎమోగని) ఈ పదం కనిపెట్టినోడ్ని కనిపెట్టి పట్టుకుని వానికి నోబుల్ బహుమతి ఇవ్వాలె.
ఆలూ టమాటా-ఘీ కా పరాటా
ఒక వ్యక్తి హోదాను, అంతస్తును జీవితాన్ని సూచించే సామెత ఇది. పేదలు దండోల్ల (ధనికులు) గురించి మాట్లాడుకునేటప్పుడు అరే వాల్లకేం ది భై, ప్రతిదినం వాల్ల ఇండ్లల్ల ‘ఆలూ టమాట-ఘీ కా పరాటాలు’ అని ముక్తాయింపులు ఇచ్చేవారు.
చార్మినార్ భరండీ-మదీనా బిర్యానీ
ఒక యాభై సంవత్సరాల క్రితం హైద్రాబాద్ పాత నగరంలో ఒకే ఒక ‘బార్’ పత్తర్‌గట్టీలో ఉండేది. దాన్ని ఉర్దూలో ‘షరాబ్‌ఖానా’, ‘షరాబ్ కీ అడా’్డ అనేవారు. పైస గల్ల పోరలు అండ్ల తాగి ఎదురుంగ ఉండే మదీనా హోటల్‌లో కెల్లి బక్రీ కా బిర్యానీ, తందూరీ చికెన్‌లు తినేవారు. ఆ షరాబ్ ఖానా వలన పోరలు చెడిపోతుండ్రని ముసలొల్లకు కోపం. అవకాశం దొరికి నప్పుడల్లా ‘వాడు చార్మినార్ భరండీకి మదీనా బిర్యానీకి బాగా అలవాటయిండు’ అని తిట్టటంతో ఈ సామెత వచ్చింది.
గ్యారా కద్దూ బారా కోత్వాల్
జరిగిన ఒక నిజమైన సంఘటనలోనుంచి ఈ సామెత పుట్టింది. సుర వరం ప్రతాపరెడ్డి గారు ఈ సామెతను వివరిస్తూ ఆ నాటి సమాజ స్థితి గతులపై ఒక కథ కూడా రాశారు. అమాయకమైన గ్రామీణులు పొట్ట చేత పట్టుకుని పట్టణానికి వస్తే, పట్నంలోని ప్రతివాడు అధికారిని అని చెప్పి ఎట్లా మోసం చేశారో ఈ సామెత చెప్పే కథ. ఓ అమాయకుడు పదకొండు ఆనపకాయల్ని అమ్మటానికి పట్నం వచ్చి పుట్‌పాత్‌పై పరుచుకొని కూచుంటే ఎవరెవరో వచ్చి నేను ఈ నగరానికి కొత్వాల్‌ను, ఇక్కడ పర్మి షన్ లేకుండా కూచున్నందుకు ‘గిరఫ్తార్’ చేస్తా అని బెదిరించి ఒక కాయ ను పట్టుకొనిపోయాడు. ఇలాగే పదకొండు కాయలు మాయం అయి పోయాయి. పన్నేండో మనిషి వచ్చి నేనే అసలైన కోత్వాల్‌ను ఇక్కడ పని పాట లేకుండా ఖాళీగా ఎందుకు కూచున్నావ్ గిరఫ్తార్ చేస్తా అని బెది రించగా వాడు ‘గ్యారా కద్దూ బారా కోత్వాల్’ అని ఏడుస్తూ కథంతా చెప్పాడట. పేదలపై పోలీసుల జులుం కు ఈ సామెత మంచి ఉదాహరణ.
గధేకీ బిర్యానీ దోభీకా పరేషానీ
ఊపర్ సే నిజాం సర్కార్ కీ నిగ్‌రాని
షోయబుల్లాఖాన్ ప్రముఖ జాతీయవాది. పాత్రికేయుడు. తన ఉర్దూ పత్రిక ‘ఇమ్రోజ్’ లో పైఉదంతాన్ని వర్ణిస్తూ వ్యాసం రాసినందుకు నిజాం సర్కార్ ఆగ్రహానికి, రజాకార్ల దుర్మార్గానికి బలైనాడు. ఒక హోటల్ యజ మాని హైదరాబాద్ నగరంలో ప్రతి రాత్రి ఒక గాడిదను అపహరించి దాన్ని చంపి ఆ మాంసంతో బిర్యానీ వండి మేకమాంసం బిర్యానీ అని ప్రచారం చేస్తూ అతి తక్కువ ధరకు అమ్ముతుంటే.. ప్రజలు క్యూ కట్టి తిన సాగారు. నాలుగురోజులు గడిచేసరికి చాకలి వాళ్లల్లో గడ్‌బడ్ మొద లయ్యింది. తమ గాడిదలు మాయం అవుతున్నాయన్న విషయం నిజాం నవాబు దృష్టికి వెళ్లే సరికి ఆయన ‘ఖడే సక్త్ నిగ్‌రానీ’ పెట్టగా అసలు సంగ తి తెల్సింది. అట్ల ఒక నిజమైన సంఘటన హస్య సామెతకు దారి తీసింది.
ఉల్టాచోర్ కోత్వాల్ కో డాంటే
నిజాం నవాబుల కాలంలో తెలివైన దొంగలు కూడా ఉండేవారు. ఒక దొంగతనం కేసులో దొంగను గిరఫ్తార్ చేసి ‘అదాలత్’ల హాజరు పరిచే సరికి వాడు తన నేరాన్ని ఒప్పుకోకుండా ఉల్టా పల్టాయించిపోయి నగర కొత్వాలే తనను దొంగతనం చేయమని పురికొల్పి ప్రోత్సహించాడని, తామిద్దరు చెరిసగం వాటాలు పంచుకుంటున్నామనీ కావున కోత్వాల్ గారికి (పోలీసు కమిష్నర్) కూడా సగం జైలుశిక్ష వేయాలని అడ్డంగా వాదించాడు. ఇక అప్పట్నించి ఎవరైనా అడ్డ దిడ్డంగా వాదిస్తుంటే ఈ సామెతను ఉపయోగిస్తారు.
జబ్ మియా బీవీ రాజీ
తో క్యా కరేగా ఖాజీ
ఒక ఊర్లో మొగడూ పెళ్లాం గొడవ పడి తలాఖ్ కోసం ( విడాకులు) ఖాజీ వద్దకు వెళ్లారట. ‘సరే ఈ రోజు నేను బిజీ. రేపు నేనే మీ ఇంటికి వచ్చి తలాఖ్ నామా రాసి సంతకాలు తీసుకుంటా’నని చెప్పి మరునాడు ఆ దంపతుల ఇంటికి వెళ్లేసరికి వాళ్లు రాజీపడి హాయిగా నవ్వుకుంటూ ఉన్నారట. ఖాజీ గారు విసుక్కుంటూ.. అనవసరంగా వచ్చానని చింతిస్తూ తిరిగివెళ్లాడట. ఆ మాటనే సామెతగా మారింది.
Take By: T News -http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=5&ContentId=39528
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,
0 comments:
Post a Comment