- సమ్మెతో 780 కోట్ల వేతనాలు నష్టపోయాం
- మీరు ఆర్థికంగా నష్టపోయిందెంత?
- ఆకలిదప్పులతో ఉద్యోగులు
- వ్యాపారాల్లో రాజకీయ నేతలు
- ఉద్యమంపై ఎందుకీ ఉదాసీనత?
- ఉద్యోగుల కష్టాలు పట్టవా?
- 650 మంది బిడ్డలను కోల్పోయినకన్నతల్లుల ఆక్రందనలు సోకలేదా?
- రాజకీయ నేతల ద్రోహాన్ని వివరిస్తూ కన్నీరు పెట్టుకున్న ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్
- ఉద్యమంలో వెనకడుగు లేదని స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 14 : ‘‘ఉద్యోగులు సర్వస్వాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. జీతభత్యాలు లేకున్నా, పండుగలు పబ్బాలు చేసుకోకుండా, ఆకలి దప్పులతో అలమటిస్తూ, తీవ్ర ఇబ్బందుల మధ్య తెలంగాణ ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాడుతున్నారు. కానీ.. ఉద్యమంలో ముందు వరుసలో ఉండాల్సిన రాజకీయ నాయకులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు శిఖండి పాత్ర పోషిస్తున్నారు. ఎలాంటి త్యాగాలు చేయకుండా, తెలంగాణ ప్రజల ఘోష పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఉద్యమం పట్ల ఉదాసీనంగా ఉంటున్న రాజకీయ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు చరిత్ర నిండా సాక్ష్యాలున్నాయని గుర్తు చేశారు.
కాసేపు ధర్నాలో పాల్గొని తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నారని, వారి వ్యాపారాలకు, కాంట్రాక్టులకు, ఎలాంటి నష్టం జరుగకుండా చూసుకుంటున్నారని ఉద్యోగసంఘాల నేత ధ్వజమెత్తారు. ఉద్యోగులు 780 కోట్ల రూపాయలను నష్టపోయారని చెప్పిన స్వామిగౌడ్.. రాజకీయ నాయకత్వం ఆర్థికంగా వారు ఎంత మేరకు నష్టపోయిందని సూటిగా ప్రశ్నించారు. రాజకీయ నాయకుల ద్రోహాన్ని, ఉద్యోగుల ఇక్కట్లను వివరిస్తూ ఓ దశలో కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ ఐక్యవేదిక జూబ్లీహాల్‌లో శుక్రవారం రౌండ్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్షికమంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ రాజకీయ నాయకత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 17 నుండి మార్చి 4 వరకు జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంలో కూడా రాజకీయ నాయకత్వం శిఖండి పాత్రనే పోషించిందని ఆయన దుయ్యబట్టారు. 8 లక్షల మంది ఉద్యోగులు జీతభత్యాలను త్యాగం చేశారని స్వామిగౌడ్ అన్నారు.
తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉద్యోగ సంఘాల నాయకులపైన అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ఉద్యోగుల కష్టాలను, కన్నీళ్లను కనీస సానుభూతితో అర్థం చేసుకుంటున్న వారే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మెను సకల ఉద్యోగుల సమ్మెగా మార్చేందుకు, మొత్తం ఉద్యోగుల మీదనే బండరాయి పెట్టేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు. ఈ వైఖరిని రాజకీయ నాయకులు మార్చుకోవాలని, సకల జనులతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ కష్టాలకు, నష్టాలకు తమకు దుఃఖం రావడం లేదని, రాజకీయ నాయకత్వం శిఖండులుగా ఉన్నందుననే ఎక్కువ దుఃఖం వస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
అసలే అర్ధాకలితో ఉన్న లక్షన్నర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెబాటపట్టి నెలరోజులుగా ఆకలితో ఘోషపడుతున్నారని చెప్పారు. ఇన్ని నష్టాలు జరుగుతున్నా రాజకీయ నాయకుల మనసులు కరగడం లేదని ఆయన దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన ఎందుకు నిలిచి పోరాడటం లేదని ఆయన నిలదీశారు. 650 మంది బిడ్డలను పోగొట్టుకున్న తల్లుల ఆక్రందనలు రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. రాజకీయ ప్రతినిధులు ఇళ్లలోకి తాము వెళ్లి ఉద్యమంలోకి రావాలని వారిని బతిమిలాడామని చెప్పారు. ఎంతో బతిమిలాడితే కాసేపు ధర్నాలో పాల్గొని తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నారని, వారి వ్యాపారాలకు, కాంట్రాక్టులకు, ఎలాంటి నష్టం జరుగకుండా చూసుకుంటున్నారని ఉద్యోగసంఘాల నేత ధ్వజమెత్తారు.ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని చివరివరకు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆయన గద్గద స్వరంతో మాట్లాడుతున్నప్పుడు హాలులో చాలామంది నివ్వెరపోయారు.
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
0 comments:
Post a Comment