నవ్వే గాయం సింగరేణి
సింగరేణి అంటేనే నవ్వే గాయం. తిరగేసిన చెమ్మసు. ఎగురుతున్న సుత్తి కొడవలి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం 32 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం రాజ్యం నల్ల నేలను యుద్ధభూమిగా మార్చినా రాజీ పడడం లేదు. రాజ్యం విధానా ల ఫలితంగా ఎన్నో గాయాలు ఇప్పటికే ఉన్నప్పటికి, వాటిని పెద్దగా పట్టించుకోకుండానే ఉద్యమాలే ఊపిరిగా బతికే ఉద్యమ కెరటాలున్న నేల ఇది. నక్సలైట్ల పేరుమీద ఇప్పటి దాకా 69 మంది నేల బిడ్డలు ఎన్‌కౌంటర్‌ల పేరిట కాల్చివేతకు గురయ్యారు. 1942 నుంచి ఉద్యమిస్తున్న ఈ గడ్డలో అప్పటి శేషగిరి మొదలు మొన్నటి సికాస నేతలు రమాకాంత్, విశ్వనాథ్, కట్ల మల్లేష్, వరకు ఎన్‌కౌంటర్‌లలో మరణించారు. అలాగే గోదావరిఖనిలో జరిగిన రెండు అతి పెద్ద ప్రమాదాలపై కోర్టు ఆఫ్ ఎంకై్వయిరీ వేసి దాని విచారణను జస్టిస్ బిలాల్ నఖ్వీ చేపట్టి రిపోర్ట్ ఇచ్చినా దానిపై చర్యలు లేవు. అయినా ఉద్యమాలలో సింగరేణి కార్మికులు అన్ని దిగమింగుకుంటూనే ముందున్నారు.
123 సంవత్సరాల చరిత్ర గల సంస్థలో కేవలం 65 శాతం మందికే గృహ వసతిని యాజమాన్యం కల్పించింది. మిగతా వారంతా అద్దె ఇండ్లలో, స్వంత ఇండ్లలోనే ఉంటున్నారు. అక్కడ గడప, గడప మానవీయత ఉట్టిపడుతుంది.అసలు సిసలైన మట్టిమనుషులు జీవించే ప్రాంతమది. ఎదనిండ ఎన్నో వెతలు మోస్తూ మదినిండా మమతలు పంచే అమ్మకలక్కలు ఎంతో మంది దసరా పూట ఉద్యమంలో ఉన్నరు. 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం వీధులకు వీధులే కదిలి కదం కదం తొక్కుతున్నాయి. యాజమాన్యం రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసిన లొంగలేదు. గనులన్నీ పోలీసుల మయం చేసినా పట్టించుకోలేదు. మడిమతిప్పే మనస్తత్వం వారికి లేదు. ఓటమి ఎరుగని నల్ల నేల సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక పూజలాగా, ప్రార్థనలాగా ఎలాంటి శషభిషలు లేకుండా దినచర్యగా కొనసాగిస్తున్నా రు. దసర పూట కూడా సమ్మెలోనే ఉన్నారు... దసర నాడు సింగరేణి కార్మికుడికి జీతంతో కూడి న సెలవు దినం ఇస్తా రు.
ఈ సెలవు దినం దసర కన్నా ఒక రోజు ముందు లేదా దసర తరువాత దినం విధులకు హాజరయితేనే ఆ మస్టర్ దొరుకుతుంది... కాని కార్మికులు విధులకు హాజరు కాలేదు... అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు కూడా జీతంతో కూడిన సెలవు దినమే... అయినా ఆ రోజును కూడా త్యాగం చేశారు... ఇదం తా ప్రత్యేక తెలంగాణ కోసం. కులమతాలకు అతీతంగా అలయ్, బలయ్‌లు తీసుకునే రోజు. అయితే సమ్మె కారణంగా కొత్తబట్టలు లేవు. అయినా డోంట్ కేర్. ఫికర్ నహీ అంటున్నారు కార్మికులు.
తమ నేలలో తమ రాజ్యం ఉండాలని ఆకాంక్షతో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో రక్తసిక్తమయిన నల్ల నేల ఈ రోజు తమ నేల మీద తాము పరాయి మనుషులుగా బ్రతకడం ఇక అంగీకరించే ప్రసక్తే లేదని సమ్మె కట్టారు. బుక్కెడు బువ్వ కోసం భూమి పొరల్లో ఊపిరిసల్పని గర్మి ఫేసుల్లో బొగ్గు పెల్లలకు నెత్తు రు అద్ది లోకానికి వెలుగు పంచే చీకటి బతుకుల్లో రవ్వంత వెలుగు కోసం ఇదం తా ఆరాటం. తప్పదు పోరాటం అంటున్నారు కార్మికులు.
తమ త్యాగం 700 మంది దాకా తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన పిల్లలకన్నా ఏమంతా పెద్దది కాదని చెబుతున్నారు. సింగరేణి అధికారులు సమ్మె చేయకపోతే చేయకపాయే, సమ్మె విచ్ఛిన్నకారులుగా మారిపోయిండ్రు. షార్ట్ ఫైరర్ చేసే పని అండర్ మేనేజర్ చేస్తుండు. ఎలక్షిక్టీషియన్ చేసే పని ఇంజనీర్ చేస్తుండు. సూపర్‌వైజర్ చేసే పని జీఎం చేస్తుండు. సీమాంధ్ర అధికారుల కన్నా మిన్నగా మన పోలీసుల మాదిరే తెలంగాణ అధికారులే విర్రవీగుతున్నారు. ద్రోహులుగా ఇప్పటికే ముద్ర వేసుకున్నారు. 500 మందికి పైగా కేసుల్లో ఇరికించినప్పటికీ ఉద్యమం మాత్రం ఆగడం లేదు. తెలంగాణ వచ్చేదాకా సింగరేణి బిడ్డలలో ఈ పట్టుదల యథాతథంగా ఉంటుంది.
ఏది ఏమయినా 123 సంవత్సరాల సింగరేణి సుదీర్ఘ చరివూతలో ఇలా దసరా పండుగ ఒక ఉద్యమ వాతావరణంలో కనిపించడం ఇక్కడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నల్లనేల ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది... ఇప్పటికయినా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా తెలంగాణను ప్రకటించాల్సిన అవసరం ఉంది... ఒక జర్నలిస్టుగా పాతిక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల ఆరాట పోరాటాలను చూసిన వాడిగా..., ఇక్కడే పుట్టి పెరిగిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’గా ఈ నల్ల బంగారు నేలతో ఉన్న పేగు బంధంతోనయితేనేమి, ఇలాంటి ఉద్యమ దసరాను నేను చూసి ఎరుగను... ఏది ఏమయినా ఈ రోజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే కేంద్ర బిందువుగా తయారయిన బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలకు పాదాపాదాన పరిపరిదండాలు... బొగ్గు గని కార్మికుల, సంఘా ల ఐక్యత వర్ధిల్లాలి... జల్ జమీన్ జంగల్ వర్ధిల్లాలి... మా బొగ్గు బావులు మాకు కావాలి... మా తెలంగాణ మాకు ఇవ్వాలి... తెలంగాణ వచ్చేదాక కార్మిక సంఘాలన్ని ఐక్యంగా ముందుకు సాగాలి... 60 ఏండ్ల ఆకాంక్ష కోసం ఆమాత్రం సమ్మె పోరాటంలో కలిసి రాకుంటే, కలిసి ఉండకపోతే నవ్వేటోని ముంగట జారిపడ్డట్టు అవుతుంది.
Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
0 comments:
Post a Comment