దేశం’లో... బుసలు !
తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు మొదలయింది. తెలంగాణ తెలుగుదేశం నేతల ధిక్కార స్వరం పెరుగుతోంది. తెలంగాణపై పార్టీ అస్పష్ట వైఖరి వల్ల గందరగోళం ముదురు తోంది. మహానాడులో కూడా పార్టీ విధానం సవరించకపోవడం వల్ల తెలంగాణ నేతలు తమ పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల నేతలకు నచ్చచెప్పలేక సతమతమవుతున్నారు. ఇటు తన కళ్లెదుటేధిక్కారపర్వం కొనసాగిస్తున్న వారిపై చర్య తీసుకోలేక, అటు పూర్తిగా నియంత్రించలేక నలిగిపోతున్నారు.
సోమవారం శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షం లోనే సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి తెలంగానం వినిపిం చడం ఒకరకంగా పార్టీని ధిక్కరించి, తిరుగుబాటు చేయడం గానే భావిస్తున్నారు. సోమవారం నుంచి సభకు హాజరు కావాలని నిర్ణయించుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల ఫోరం నిర్ణయాన్ని అనుసరించి ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు. అయితే, నాగం జనార్దన్‌రెడ్డి హటాత్తుగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలన్న ప్లకార్డులు పట్టుకుని, పోడియం వద్దకు వెళ్లడం చర్చనీయాంశమయింది. నాగం నినాదాలు చేస్తున్నప్పుడు బాబు అక్కడే ఉండటం గమనార్హం.
కాగా, తెలంగాణ సమన్వయ కమిటీ ఎప్పుడో ఏర్పాటుచేసి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదని, కీలకమైన సమస్యలపైనా సత్వర నిర్ణయం తీసుకోకుండా, నాన్చివేత ధోరణి అవలంబిస్తే పరిణామాలు ఇదేవిధంగా ఉంటాయని ఓ సీనియర్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీలో కౌంటర్ మెకానిజం లేకుండా పోయిందని, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పార్టీ అధ్యక్షుడే రెండు ప్రాంతాల వారిని కలిపి కాకుండా, విడిగా సమావేశాలు జరిపే పద్ధతికి తెరదించినప్పుడే పార్టీలో వాతావరణం మారుతుందని స్పష్టం చేస్తున్నారు.
సభ నుంచి బయటకు వచ్చిన నాగం, తెలంగాణకు పార్టీ అనుకూల వైఖరి ప్రకటించకపోతే తన దారి తాను చూసుకుంటానని, తాను ఎవరికీ భయపడేది లేదని, తనకు ప్రజలే ముఖ్యమని పరోక్షంగా బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తనకే ఎక్కువమంది మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత లాయర్ల జేఏసీలోనూ పాల్గొన్న నాగం తనతో అంతా కలసిరావాలని పిలుపునిచ్చారు.
నాగం ధోరణి పార్టీపై తిరుగుబాటుగానే నేతలు భావిస్తు న్నారు. తెలంగాణ అంశంపై తమ అధినేత ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి కూడా నాగం ఆయన ఉన్నప్పుడే కావాలని నినాదాలు చేయడం బట్టి.. తెలంగాణ అంశంపై బాబుతో తాడోపేడో తేల్చుకునేందుకే నాగం సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది. ఆ తర్వాత బాబు పిలిచినా వెళ్లిపోయారంటే నాగం భవిష్యత్తు వేరుబాటగానే ఉండే అవకాశాలున్నా యంటున్నారు.
అదే సమయంలో నాగం జనార్దన్‌రెడ్డిపై మెజారిటీ తెలం గాణ తమ్ముళ్లు తిరుగుబాటు చేయటం చర్చనీయాంశమ యింది. నిజానికి, నాగం జనార్దన్‌రెడ్డికి సొంత మహబూబ్ నగర్ జిల్లా నుంచే కనీస మద్దతు లేదు. అన్ని పదవులూ ఆయనకే ఇవ్వడాన్ని సొంత జిల్లా నేతలు చాలాకాలం నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నా బాబు దానిని లెక్కపెట్టలేదు. ప్రస్తుతం ఆయన పీఏసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఒకవైపు తెలంగాణ గురించి మాట్లాడుతూ మరోవైపు సమైక్యాంధ్ర ద్వారా వచ్చిన పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా ఎలా కొనసాగు తారంటూ రేవంత్‌రెడ్డి వంటి యువ ఎమ్మెల్యేలు నేరుగా నిలదీశారు. నాగం తమను అడ్డుపెట్టుకుని, సొంతంగా ఎదిగేందుకు యత్నిస్తున్నారని, అసలు ఆయనను తాము ఫోరం చైర్మన్‌గా గుర్తించేది లేదంటూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డం తిరుగుతున్నారు. నాగం ఒక్కరే మీడియా పాయింట్‌కు వచ్చి మాట్లాడగా, ఆయనకు వ్యతిరేకంగా మోత్కుపల్లి నేతృత్వంలో మిగిలిన వారంతా హాజరయి నాగంపై ధ్వజమెత్తడం చూస్తే.. నాగం పార్టీలో ఒంటరి వారయ్యారన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
నాగం జనార్దన్‌రెడ్డి చాలాకాలం నుంచి సొంతబాటలోనే సాగుతున్నారు. ముగ్గురు, నలుగురితో భేటీ అయి, అదే నిర్ణయాన్ని ఫోరం నిర్ణయంగా ప్రకటించడాన్ని మెజారిటీ నేతలు అంగీకరించడం లేదు. ప్రధానంగా.. దేవేందర్‌గౌడ్ వర్గానికి, నాగం జనార్దన్‌రెడ్డికీ చాలాకాలం నుంచి పొగడం లేదు. గతంలో నాగం, పోచారం, కడియం, విజయరామారావు మాత్రమే భేటీ అయ్యేవారు. దానికి దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లిని ఆహ్వానించేవారు కాదు. నాగం ధోరణి.. తమను తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేస్తోందన్న ఆగ్రహం దేవేందర్‌గౌడ్ వర్గీయుల్లో చాలాకాలం నుంచి ఉంది. నాగం ఒక్కరే తెలంగాణ కోసం పోరాడుతున్నట్లు, తాము మాత్రం బాబు చెప్పినట్లు నడుచుకుంటూ, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు నాగం ధోరణి ఉందని దేవేందర్ వర్గం మండిపడుతోంది.
దీనిపై వారంతా బాబుకు అనేకసార్లు ఫిర్యాదు చేశారు.నాగం జనార్దన్‌రెడ్డికి మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చారని, అందుకే ఆయన ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. నాగం కంటే ముందు పార్టీలో చేరిన వారికే ఎక్కువ అన్యాయం జరిగిందని, అసలు నాగం ప్రతిపక్షంలో ఉండగా అన్ని పదవులు అనుభవించి, ఇప్పటివరకూ కనీసం నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక్క బహిరంగ సభ నిర్వహించలేదని గుర్తు చేస్తున్నారు.
నిజానికి తెలంగాణ ఉద్యమం తర్వాత నాగం వ్యక్తిగతంగా నష్టపోయిందేమీ లేదని, అనేక రకాలుగా లాభపడ్డారని వాటిని సమయం వచ్చినప్పుడు బయట పెడతామంటున్నారు. నాగం కంటే బడుగువర్గాలకు చెందిన షిండే లాంటి వారే ఎక్కువ నష్టపోయారని, అయినా వారంతా పార్టీ పక్షానే నిలిచారని గుర్తు చేస్తున్నారు. నాగం తానొక్కడినే తెలంగాణ కోసం పోరాడుతుంటే, పార్టీ నాయకత్వం, మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నట్లు ప్రవర్తించడం మెజారిటీ ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. దీనిపై సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ కూడా ఇటీవల నాగంతో విబేధించారు.
నాగం మాత్రం మళ్లీ పార్టీలో చేరిన దేవేందర్‌గౌడ్‌కు బాబు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, తన జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డిని తనకు వ్యతిరేకంగా ప్రోత్సహించడాన్ని సహించ లేకపోతున్నారు. తాను పార్టీ కోసమే మాట్లాడుతున్నానని, తాను తెలంగాణ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే పార్టీకి అంత లాభమని వాదిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా బాబు మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ, తన ప్రాధాన్యం తగ్గిస్తున్నారంటూ ఆయన ఇటీవలి కాలంలో తన సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, నాగం పార్టీని వీడి వెళ్లరని పార్టీ నేతలు చెబుతున్నారు. నాగం మనస్తత్వరీత్యా ఆయన మిగిలిన పార్టీలలో ఇమడటం చాలా కష్టమంటున్నారు.
కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆయనకు రాజకీయ గురువయినందున ఒకవేళ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్నందున ఆ పార్టీలో చేరరని మరికొందరు వాదిస్తున్నారు. ఇక తన కంటే జూనియర్లు ఉన్న టీఆర్‌ఎస్‌లో నాగం కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తారనుకోవడం లేదంటున్నారు. అయితే, ఆయనకు టీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేవలం ఉనికి కోసమే పోరాటం తప్ప, ఆయనలో పార్టీ వీడాలనే యోచన లేదని కొందరు నేతలు వాదిస్తున్నారు. నిజానికి నాగం కంటే పార్టీని నష్టపరిచేవారు చాలామంది ఉన్నారని, వారికంటే బోళాగా మాట్లాడే నాగం తక్కువ ప్రమాదకారని వ్యాఖ్యానిస్తున్నారు.
‘మా పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మిగిలిన పార్టీల్లో ఉండదు. నోరున్న మా లీడర్ల కార్లను ఉద్యమకారులు ధ్వంసం చేస్తే కొత్తకార్లు కొనిస్తుంది. మా వాళ్లెవరైనా ఆందోళన కార్యక్రమాలు చేస్తే వాళ్ల వెంట వచ్చే వారి తిండి ఖర్చులకూ పార్టీ నుంచి వసూలు చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినా వాళ్ల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగితే వాళ్లనూ నాయకత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది. ఎన్నికల్లో నిధులు కూడా ఇస్తుంది. ఇన్ని ఇచ్చి మళ్లీ పెద్ద పదవులిస్తుంది. ఇన్ని సౌకర్యాలు ఏ పార్టీ కల్పిస్తుంది చెప్పండ’ని ఓ సీనియర్ నేత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాగా, సాయంత్రం బాబుతో భేటీ అయిన తెలంగాణ నేతలు నాగం వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నివాసంలో జరిగిన తెలంగాణ ప్రాంత నేతల సమావేశానికి 19 మంది ఎమ్మెల్యేలు, నల్గురు ఎమ్మెల్సీలు, ఒక పార్లమెంటు సభ్యుడు హాజరైనారు. హాజరైన ఎమ్మెల్యేలు వరుసగా మోత్కుపల్లి నర్సింలు, రేవంత్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎర్ర శేఖర్, వై. ఎల్లారెడ్డి, ఊకే అబ్బయ్య, కేఎస్.రత్నం, సీతక్క, గంప గోవర్ధన్, ప్రకాశ్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, జైపాల్ యాదవ్, పి. రాములు, ఎస్. వేణుగోపాలాచారి, జోగి రామన్న, జి. నగేష్, పి. మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీల్లో బాలసాని లక్ష్మీనారాయణ, బి. వెంకటేశ్వర్లు, నర్సారెడ్డి, ఎంపి. రమేష్ రాథోడ్ ఉన్నారు. నాగం తెలంగాణ టీడీపీ మొత్తానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా వ్యవహరిస్తు న్నారని, ఆయనను నియంత్రించకపోతే తాము కూడా ఇబ్బందిపడవలసి వస్తుందన్నారు. సమన్వయ కమిటీ వేయాలని సూచించారు. మీకు చెప్పే చేస్తున్నానని మా దగ్గర చెబుతున్నారని, మీ దగ్గరోమాట, మాదగ్గరోమాట మాట్లా డుతున్నారని ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ, ఈ పరిస్థితిలో నాగం బయటకు వెళితే చెడు సంకేతాలు వెళతాయని, తాము ఆయనకు నచ్చచెబుతామని ఎమ్మెల్యేలు బాబుకు చెప్పారు. అందుకు ఆయన అంగీకరించారు. మీరంతా కలసి పార్టీని కాపాడతామంటే నేనెందుకు వద్దంటాను. వెళ్లి పరిస్థితి వివరించండి. నేను మీ స్వేచ్ఛకు అడ్డురావడం లేదు. ఆయనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చానో మీకూ తెలుసు. కానీ పార్టీ ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దానితో సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, వేణుగోపాలచారి, మహేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ సమావేశం ముగిసిన తర్వాత నాగం ఇంటికి వెళ్లారు.
మీ నాయకత్వంలోనే తెలంగాణ కోసం పోరాడదామని వారంతా జనార్దన్‌రెడ్డికి నచ్చచెప్పారు. ఫోరం ఆధ్వర్యంలోనే పోరాటాలు జరుపుదామని, చిన్న చిన్న విబేధాలు పక్కకుపెట్టి అంతా కలసి పోరాడదామన్నారు. మిమ్మల్ని దూరం చేసుకోవాలన్న యోచన పార్టీకి గానీ, తమకు గానీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఉదయం జరిగిన ఘటనలపై నాగం మనస్తాపం వ్యక్తం చేశారు. తనను అవమానించారని వ్యాఖ్యా నించినట్లు సమాచారం. తాను పార్టీ కోసమే పోరాడుతున్నానని చెప్పారు. తాను పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. దానితో నాగం కథకు తాత్కాలికంగా తెరపడినట్టయింది.
Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images
0 comments:
Post a Comment