తెలంగాణపై నిర్ణయం ‘సరైన సమయంలో’..!
సోనియా, మన్మోహన్ సహా పెద్దల మల్లగుల్లాలు
మొదట... ఇరు ప్రాంతాల నేతలను బుజ్జగించడం, తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రచారం చేయడం... తాత్కాలికంగా గట్టెక్కే ఫార్ములా
ఇక రెండో దశలో తెలంగాణకు స్వయం ప్రతిపత్తి... అభివృద్ధికి ప్రత్యేక నిధులు
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: కొరకరాని కొయ్యలా మారిన ప్రత్యేక తెలంగాణ గండం నుంచి తాత్కాలికంగా గట్టెక్కేందుకు సరికొత్త ఫార్ములాకు కాంగ్రెస్ తెర తీస్తోంది! శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రత్యామ్నాయాలనూ కాచి వడపోసి మరీ పార్టీ వ్యూహకర్తలు దానికి తుది మెరుగులు దిద్దుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది! ముందుగా శ్రీకృష్ణ నివేదికను బుట్టదాఖలు చేయడం, ప్రస్తుతానికి తెలంగాణకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం, ప్రత్యేక రాష్ట్ర సమస్యపై ‘అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అంటూ ఇరు ప్రాంత నేతలనూ బుజ్జగించడం, త్వరలో తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ప్రజల్లో ప్రచారం చేయాల్సిందిగా ఆ ప్రాంత ఎంపీలను పురమాయించడం, సమస్యపై 2013 దాకా వేచిచూసే ధోరణి అవలంబించడం... ఇవి తాజా ఫార్ములాలోని కీలకాంశాలని సమాచారం. తద్వారా ‘కర్ర విరగకుండా, పామూ చావకుండా’ తీరులో ఏ ప్రాంతం నేతలనూ నొప్పించకుండా, రాష్ట్రంలో రాజకీయంగా ముప్పు లేకుండా బయట పడాలన్నది అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం ఆయన నివాసంలో సమావేశమైంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, పి.చిదంబరం, ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం విషయంలో ట్రబుల్ షూటర్ ప్రణబ్ సారథ్యంలో రూపొందుతున్న కొత్త ఫార్ములాపైనే వారంతా రెండు గంటలకు పైగా తీవ్రంగా చర్చించినట్టు తెలిసింది. ఫార్ములాను దశలవారీగా ఎలా అమలు చేయాలన్న దానిపై కూడా మల్లగుల్లాలు పడ్డట్టు సమాచారం. ‘‘తొలి దశలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఫార్ములాపై ఒప్పించాలి. యథాతథ స్థితి ప్రస్తుతానికిలాగే కొనసాగుతుందని స్పష్టం చేయాలి. అదే సమయంలో, ప్రత్యేక రాష్ట్రం విషయంలో అన్ని అవకాశాలనూ తెరిచే ఉంచామని చెప్పడం ద్వారా ఇరు ప్రాంతాల నేతల్లో నెలకొన్న భయాలను తొలగించాలి. బహిరంగ వ్యాఖ్యలు, ప్రకటనలు చేయకుండా కట్టడి చేయాలి. వీలైతే మెరుగైన పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించాలి. కొత్త ఫార్ములాకు వారిని ఒప్పించాకే తెలంగాణపై రాష్ట్రంలోని 8 పార్టీలతో రెండో దఫా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
రెండో దశలో తెలంగాణకు స్వయంప్రతిపత్తి ప్రకటించాలి. ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు, అధికారాలతో ప్రాంతీయ మండలిని, విడిగా సాగునీటి ప్రణాళికను ఏర్పాటు చేయాలి. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా తెలంగాణకే ఇవ్వాలి. ఆ ప్రాంత నేతల సూచనల మేరకు అభివృద్ధి పథకాలను రూపొందించి అమలు చేయాలి. ఇతర వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలకు కూడా అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలి. ఇలా 2013 దాకా కొనసాగించి, అవసరమైతే పరిస్థితుల ఆధారంగా అప్పుడు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకోవాలి’’ అని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. తెలంగాణ విషయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా దేశవ్యాప్తంగా తనకు పెను సమస్యగా మారుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.
గూర్ఖాలాండ్, బోడోలాండ్, విదర్భ, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, హరితప్రదేశ్ తదితర డిమాండ్లు ఊపందుకుని అంతిమంగా పార్టీకి పెను ముప్పుగా పరిణమిస్తాయని అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పాలని కోర్ కమిటీ నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎంపీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న వైనం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. జరిగింది కేవలం సర్దుబాటే తప్ప విస్తరణ కాదంటూ వారిని బుజ్జగించాలని నిర్ణయించారు. ఏఐసీసీ కూర్పులో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చల్లబరచాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ పనితీరును ఇకపై మరింత నిశితంగా పరిశీలించాలని, కొత్త ఫార్ములా అమలులో గవర్నర్‌కు చురుకైన పాత్ర అప్పగించాలని అధిష్టానం పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
0 comments:
Post a Comment