కాసేపు హీరో మరికాసేపు జీరో
తీవ్రమైన అసహనం... అశాంతి. కాసేపు తనకు తానే గొప్ప... మరి కాసేపటిలో
తీవ్రమైన న్యూనతాభావం కలిసి టీనేజిలోకి ప్రవేశించిన వారి మానసిక
పరిస్థితిలో సంచలన మార్పు వస్తుంది. టీనేజర్ల అంతరంగమేమిటో అవలోకిద్దాం.
టీనేజ్‌కి
ముందు పిల్లలు తమ తల్లిదండ్రులు అందించిన సహాయ సహకారాల మీద పూర్తిగా
ఆధారపడతారు. అయితే టీనేజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు తమ వ్యక్తిత్వం
మీద నిలబడాలనే తపనతో తల్లిదండ్రుల సహాయాన్ని స్వీకరించటానికి ఇష్టపడరు. అదే
సమయంలో తమకు తాము అడ్జెస్ట్ కావటమూ చాతకాదు.
ఎవరిని నిందించాలో తెలియక, అసలు కారణం అంతుపట్టక సహాయానికి రాబోయిన తల్లిదండ్రుల మీద విసుగు చెందుతారు.
పైగా
వీళ్ళను సినిమాలలోనూ పత్రికలలోనూ కనిపించే ప్రకటనలు ఈ దుస్తుల్ని ధరించు,
ఆ సబ్బును వాడు, ఈ చెప్పులను వేసుకో, ఇలా ప్రవర్తించు, అలా ప్రవర్తించు
అంటూ రెచ్చగొడుతుంటాయి.
ఆ బాపతు ప్రకటనలు అందించే అంచనా లకూ వాస్తవ
జీవితంలో లభించే సౌకర్యాలకూ పొత్తు కుదరకపోవటం కూడా వాళ్ళు బోరు చెందటానికి
ఒక కారణంగా ఉం టుంది.
ఇది నాణానికి ఒకవైపు మాట!
రెండో వైపున -
వాళ్ళు ఇప్పుడిప్పుడే బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగు పెడుతుంటారు.
ఎంతో వైవిధ్యంతో కూడుకున్న జీవితాను భవాలు ఎదురుగా ఉంటాయి.
కాలేజీకి
వెళ్ళటం, ఫలానా కోర్సు చదవటం, చదువులో లేక ప్రేమలో తోటివాళ్ళతో పోటీ,
మనస్సును ఆకట్టుకునే క్రీడా ప్రపంచం, ఉద్వేగాల్ని వశీకరించుకునే సినిమా
ప్రపంచం, వీటన్నిటి మధ్యా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.
ఒక్క క్షణాన తమకు తాము ఎంతో ప్రాముఖ్యత కలవాళ్ళుగా భావిస్తారు. మరుక్షణమే తమనెవరూ పట్టించుకోవటం లేదని బాధ చెందుతుంటారు.
భవిష్యత్తులో
తానేదో సూపర్‌స్టార్ అయిపోవా లనీ, గొప్ప క్రీడాకారుడు కావాలనీ ఆశలు
పెంచుకుంటారు. అనుకోకుండా ఎక్కడ నుంచో ఆస్తి వచ్చి పడుతుందని కలలు
కంటుంటారు.
కానీ వాటిలో ఏ ఒక్కటీ ఎన్నాళ్ళు గడిచినా జరగవు. (ఏడాది
రెండేళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో ఎక్కువ కాలమేనన్న సంగతి మర్చిపోవద్దు!)
ఫలితంగా జీవితం ‘బోర్’ అనిపిస్తుంది.
టీనేజర్స్ మీద తోటివాళ్ళ ప్రభావం
అధికంగా ఉంటుందన్న సంగతి ముందే చెప్పుకున్నాం.
తోటివాళ్లు తనను
మెచ్చుకోవాలని ఉంటుంది లోలోపల. కానీ వాళ్ళు తనను లెక్కచేయటం
లేదనిపించినప్పుడు, నిర్లక్ష్యం చేస్తున్నారనిపించి నప్పుడు వాళ్ళు బోర్‌గా
కనిపిస్తారు.
పిల్లలు స్కూలు బోరు కొడుతోందని అంటున్నారంటే స్కూలులో
వాళ్ళు రాణించలేక పోతున్నారనీ, చదువులో వెనకబడుతున్నారనీ అర్థం. అక్కడ
వాళ్ళకు పాఠాలు సరిగ్గా అర్థం కావటం లేదనో లేక మరేదో అసౌకర్యానికి
ఫీలవుతున్నారనో అనుకోవాలి.
చాలా అరుదైన సందర్భాలలో మాత్రం కొందరు బ్రిలియంట్ స్టూడెంట్స్ తమ తెలివితేటలకు తగ్గ చదువు స్కూలులో లభించక పోయినా బోరు చెందుతారు.
కారణం
ఏమైనప్పటికి టీనేజర్లలో బోర్ ఫీలింగ్‌ను గమనించి వారికో వ్యాపకం కల్పించే
ప్రయత్నం చేయాలి. లేకపోతే వారిలో క్రమేపి నిరాశ ఏర్పడే ప్రమాదముంది. మొత్తం
మీద టీనేజర్ల అంతరంగం అంతా పలు ఆలోచనలతో నిండి స్థిరంగా ఉండదు. వారి
అంతరంగాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.
0 comments:
Post a Comment