సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు
సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు
- సగానికి పైగా శిథిలావస్థలో
- కానరాని కనీస సౌకర్యాలు
- పలుచోట్ల కనిపించని మరుగుదొడ్లు
- 29 కాలేజీల్లో ప్రయోగశాలలు కరువు
- 20 చోట్ల ప్రహరీలూ లేవు
- 300కు పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీ
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- ఆందోళనలో విద్యార్థులు
దాహమేస్తే ఓర్చుకోవాలి..
మంచినీళ్లు దొరకవు గనుక..!
మూత్రమొస్తే ఆపుకోవాలి..
మరుగుదొడ్లు లేవుగనుక..!
వర్షమొస్తే బయటకు పరిగెత్తాలి..!
పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు గనుక..!
పందులు, పశువులకూ ప్రవేశముంది..
ప్రహరీలు లేవుగనుక..!
కాలేజీకి రాకపోయినా ఫర్వాలేదు..
లెక్చరర్లే లేరుగనుక..!
సర్కారీ
ఇంటర్ కళాశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి..! సగానికిపైగా శిథిలావస్థకు
చేరుకొని బంజరుదొడ్లను తలపిస్తున్నాయి..! పాఠాలు చెప్పే అధ్యాపకులే కాదు..
కాగడా వేసి వెతికినా కనీస సౌకర్యాలు కానరావడం లేదు..! వర్షమొస్తే ఎప్పుడు
కూలుతాయో తెలియని పైకప్పుల కింద చదువులు కొనసాగించే పరిస్థితి లేదు..!
దీంతో పదోతరగతి పాసై, ఎన్నో ఆశలతో కాలేజీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు
వాస్తవ పరిస్థితిని జీర్ణించుకోలేక లబోదిబోమంటున్నారు..!
జిల్లావ్యాప్తంగా
71 ప్రభుత్వ ఇంటర్ కళాశాలలున్నాయి. వీటిలో 5 ప్రభుత్వ జూనియర్
కళాశాలలు(50- బాలురు, -బాలికలు),11 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు
(బాలురు-, బాలికలు-3), రెండు గిరిజన సంక్షేమ గురుకుల కళాలలు(బాలురు-1,
బాలికలు-1) ఎనిమిది ప్రైవేటు కో-ఆపరేటివ్ కళాశాలలున్నాయి. మారుమూల మండలాలు
మినహా దాదాపు మండలానికో జూనియర్ కళాశాల ఉంది. వీటిలో సగానికి పైగా కళాశాలలు
శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీ వర్షమొస్తే గదుల పైకప్పులు, గోడలు
కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 21 కళాశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో
కొనసాగుతున్నాయి.
చాలా చోట్ల బెంచీలు, బల్లలు లేవు. విరిగిపోయి
మూలపడ్డవాటికి మరమ్మతులు చేయించేవారు లేరు. 300కు పైగా జూనియర్ లెక్చరర్ల
పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకువస్తున్నారు.
పది కళాశాలలకు ప్రిన్సిపాళ్లు కూడా లేరు. 25 మందికన్నా తక్కువ
విద్యార్థులుంటే సెక్షన్ ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించడంతో దాదాపు 10
కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా కాలేజీల్లో చేరిన
విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 20 కళాశాలకు ప్రహరీలు లేకపోవడంతో
పశువులు, పందులు లోపలికి వస్తున్నాయి.
దీంతో చదువులకు ఆటంకం కలుగుతోంది.
పదింట్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో మూత్రం వస్తే బయటకు
పరిగెత్తాల్సి వస్తోంది. చాలా చోట్ల మంచినీటికీ ఇక్కట్లు పడాల్సి వస్తోంది.
29కి పైగా కళాశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు లేవు. లైబ్రరీయన్లు లేకపోవడంతో
గ్రంథాలయాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. 50 దాకా పీడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో
క్రీడల అడ్రస్ లేకుండా పోయింది.
Take by: T news
0 comments:
Post a Comment