చిరుకు కేంద్ర మంత్రి పదివి ఇప్పట్లో లేనట్లే!
- మెగాస్టార్‌కు 3 నెలల నిరీక్షణ తప్పదు
- రాష్ట్రం నుంచే రాజ్యసభకు
- మార్చిలో ఎన్నికయ్యే అవకాశం
- ఆచీతూచీ అడుగులేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
హైదరాబాద్, డిసెంబర్ 18 (): తన సొంత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కూడా ఇంకా పీఆర్పీ అధినేతగానే నెట్టుకొస్తున్న తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి అధికార పార్టీలో తగిన హోదా, గుర్తింపు ఇంకొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీని కోసం ఆయన ఇంకా కనీసం మూడు నెలలు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రివర్గంలో చిరుకు స్థానం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ ఘడియ కోసం ఆయన ఫిబ్రవరి లేదా మార్చి వరకు వేచి చూడక తప్పదంటున్నారు. రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు నెల, రెండు నెలల ముందుగా లేదా, రాజ్యసభకు ఎన్నికైన వెంటనే చిరుకు కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
అప్పటి వరకు ఆయన కాంగ్రెస్‌లో సినీగ్లామర్ కలిగిన నేతగానే కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందర్ని తన వర్గంగా మలుచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతానంటూ ఒక వైపు జగన్ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటే, ఆ సర్కార్ కూలిపోకుండా తాను నిలబెడతానంటూ చిరంజీవి అధికార పార్టీకి భరోసా ఇచ్చి అండగా నిలిచారు. దీంతో పీఆర్పీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల మద్ధతుతో కిరణ్ ప్రభుత్వానికి కొండత ధైర్యం లభించింది. ఇందుకు ప్రతిఫలంగా పీఆర్పీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. సోనియాగాంధీ ఆహ్వానం మేరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనంవేసిన చిరుకు కాంగ్రెస్‌లో కీలక గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రి పదవులు, మిగతా వారిలో కొందరికి నామినే డ్ పదవులు అప్పగించే యోచనలో ైహైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
చిరుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలంటే ముఖ్యమంవూతిని చేయడం లేదా పీసీసీ పగ్గాలు అప్పగించడం. ఈ రెండు ఇప్పట్లో హైకమాండ్‌కు సాధ్యమయ్యేలా లేవంటున్నారు. అదిలేకుంటే ఆ స్థాయిలోనే గుర్తింపు లభించే మరో హోదాను కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనేది ఆ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే చిరుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. మన రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలంటే మరో మూడు నెలల వేచి చూడాలి. తొలుత కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన ఒక దశలో అధిష్ఠానానికి వచ్చినా, చిరుకు రాజకీయ, పరిపాలన అనుభవం లేక పోవడం, తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నేరుగా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావించే హైకమాండ్ వెనకడుగు వేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.
దాసరి స్థానంలో చిరు ఎంపిక !
రాజ్యసభ దై్వవార్షిక ఎన్నికల్లో భాగంగా మార్చిలో రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో కాంగ్రెస్ 4 స్థానాలను కచ్చితంగా గెలుచుకునే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కేశవరావు, దాసరి నారాయణరావు, సంజీవడ్డి, రషీద్ అల్వీ, టీడీపీ నుంచి మైసూరాడ్డి, సీపీఐకి చెందిన అజీజ్‌పాషా రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ఖాతాలో వచ్చే నాలుగు స్థానాల్లో ఒకటి చిరంజీవి కోసం అధిష్ఠానం రిజర్వ్ చేసినట్లు ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే రెండు మార్లు దాసరి నారాయణరావుకు రాజ్యసభ అవకాశం కల్పించినందున, ఆయన స్థానంలో ఈ సారి అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో హైకమాండ్ ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపికైన కొత్త అభ్యర్థుల పదవీ కాలం మే నుంచి వర్తిస్తుంది. అయితే చిరును రాజ్యసభకు ఎంపిక చేసిన వెంటనే కేంద్రంలో చోటు కల్పించాలనే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అప్పటికీ ఆలస్యమవుతుందని అనుకుంటే రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల ముందుగానే కేంద్రం మంత్రివర్గంలో తీసుకుని స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Take By: T News
0 comments:
Post a Comment