సమన్వయంతో అణిచేద్దాం!
కాంగ్రెస్ సమన్వయ కమిటీ అసలు కోణం ఇదే!
- ప్రత్యేకవాదం వినిపించేందుకు ఒక్కరూ లేరు
- తెలంగాణ నుంచి ముగ్గురున్నా..ముగ్గురివీ వ్యక్తిగత ప్రయోజనాలే!
- కమిటీ ఏర్పాటులో ముందు జాగ్రత్త
హైదరాబాద్, డిసెంబర్ 23 ():‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు వెనుక తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాలు దాగి ఉన్నాయా? తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆకాంక్షలను కట్టడి చేయడానికే ఈ కమిటీని ముందుకు తీసుకువచ్చారా? తెలంగాణకు బద్ధ వ్యతిరేకులను, తెలంగాణపై గట్టిగా మాట్లాడని వారిని కమిటీలోకి తీసుకోవడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏంటి? తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించే ఏ ఒక్క నాయకుడికీ ఈ కమిటీలో ఎందుకు స్థానం దక్కలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఉద్దేశించినట్లు చెబుతున్న సమన్వయ కమిటీ విషయంలో ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలివి!
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తలోదారిన నడుస్తున్నారు కనుక, అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసేందుకు అంటూ సమన్వయ కమిటీని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చైర్మన్‌గా ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలోకి సభ్యులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏ పదవీ లేదని రుసరుసలాడుతున్న చిరంజీవిని తీసుకోవడంతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ కావూరి సాంబశివరావును తీసుకున్నారు. గతంలో ఈ కమిటీలో ఉన్న జానాడ్డి, కేవీపీ రామచందర్‌రావు, గీతాడ్డిని ఈ సారి పక్కనపెట్టారు. మొత్తంగా ఈ కమిటీలో తెలంగాణ అంశాన్ని గట్టిగా వినిపించే నాయకుడుకానీ, ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తే గట్టిగా అడ్డుకునే నేత లేకపోవడంపై ప్రత్యేక రాష్ట్ర వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షను అడ్డుకునేందుకు, అణచివేసేందుకు ముందు జాగ్రత్తగా రూపొందించిన పక్కా పథకమని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకులైన వారిని ఈ కమిటీలో నియమించడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలంగాణవారే అయినా.. వీరు ముగ్గురూ అంత గట్టిగా తెలంగాణవాదం వినిపిస్తున్న వారు కాదు.
డీ శ్రీనివాస్ తెలంగాణపై ఏదో ఒకటి చెబుతున్నా ఆయన లక్ష్యం అంతా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద ఆశీస్సులు పొందటం కోసమేనన్నట్లు కనిపిస్తోందని విమర్శలున్నాయి. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ అగుపించటం లేదు. ఏ పదవీ లేనపుడు అంతో కొంతో తెలంగాణ అంటూ మాట్లాడిన డీఎస్ తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కటంతో ఇతరత్రా పదవుల కోసమే అంగలారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ అభివృద్ధి మండలిని కేంద్రం వేస్తే.. దానిపై ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏనాడూ తెలంగాణవాదిగా మాట్లాడకపోవటం గమనార్హం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ పదవిని వాడుకుంటున్నారు తప్పితే తెలంగాణవాదాన్ని వినిపించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయటం లేదని పలువురు తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత కావడంతోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించింది. దీని ద్వారా రాష్ట్రంలో కీలకమైన హోం శాఖను తెచ్చుకునేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ శాఖ కోసం పట్టుబట్టిన ఆయన.. అధిష్ఠానం వద్ద ఇప్పటికే తన అభ్యర్థనను ఉంచినట్లు తెలుస్తోంది. ఇక, షబ్బీర్‌అలీ కూడా తెలంగాణకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్‌తో సన్నిహితంగా ఉండి ఈ కమిటీలో స్థానం పొందారని అంటున్నారు.
ఆయన కూడా తెలంగాణ వాణిని గట్టిగా వినిపించిన దాఖలాలు బహు అరుదు. కాగా, కమిటీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారందరూ తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తున్నవారే. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణవాదుల ముందు మాత్రం తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని చెబుతున్నా ఈ మేరకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా సమైక్యవాదిగానే వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవటం లేదు. కరడుగట్టిన సమైక్యవాదిగా చెప్పుకునే చిరంజీవికి ఈ కమిటీలో ప్రాతినిథ్యం లభించింది. ఆయన తెలంగాణను నేరుగా వ్యతిరేకిస్తున్నారు.
ఆయనకంటే కావూరి సాంబశివరావు మరో రెండు అడుగులు ముందుకు వేసి.. తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ లాబీయింగ్ విస్తృతస్థాయిలో ఉందని, దీనికి జాతీయ నాయకులు కూడా ప్రలోభాలకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సమైక్యవాదులకు పెద్ద పీట వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం పట్ల తెలంగాణవాదుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కీలక సమయాల్లో కట్టడికే!
తెలంగాణ ఉద్యమం సంధికాలాన్ని దాటుకుని మరోసారి విజృంభించే పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. ఉద్యోగ జేఏసీలు మొదలుకుని సింగరేణి తదితర చోట్ల నుంచి కూడా తెలంగాణ కోసం మరోసారి మహోద్యమానికి సిద్ధమన్న సంకేతాలు అందుతున్నాయి.రాజకీయ పోరాటాలు కూడా మరింత ఉధృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలపైన, ఉద్యమాలపైన సర్కారు గతంలో అనుసరించిన పద్ధతులనే ఈ సారీ అనుసరించవచ్చు. గతంలో 42రోజులపాటు వీరోచితంగాసాగిన సకల జనుల సమ్మెసందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు జులుం ప్రదర్శించారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తీవ్రంగా వేధించారు. దీనికి టీ కాంగ్రెస్ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతలు పెల్లుబికాయి. మళ్లీ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే సమన్వయ కమిటీలో మాట్లాడుకుంటాం.. అన్న మాట చెప్పి ప్రభుత్వం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
దీంతో టీ కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూయించడానికి, వారు కూడా తమపై ఒత్తిళ్లను సమన్వయ కమిటీపైకి నెట్టేసేందుకు వీలు కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది. పైగా టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిన పక్షంలో వారిపై కేసుల విషయంలో సర్కారు తానుఅనుకున్నదే చేసేందుకు సమన్వయ కమిటీని ఉపయోగించుకోవచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 2014 దాకా తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ సాగదీస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శలదాడి నుంచి తప్పించుకోవడానికే ఈ కమిటీని ఉద్దేశించారని అంటున్నారు.
కిరణ్ వ్యూహమా?
సమన్వయ కమిటీ ఏర్పాటులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా ప్రధాన భూమికను వహించినట్టు తెలుస్తోంది. ఆజాద్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్న కిరణ్.. రాష్ట్రంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఈ కమిటీ నిర్మాణానికి చొరవ తీసుకున్నారని, ఈ మేరకు ఆజాద్‌ను ఒప్పించారని చెబుతున్నారు.రాష్ట్రంలో వైఎస్ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించానని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించేలా పథకాల రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తున్నట్టు కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నట్టు తెలిసింది. దీంతో జగన్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని, వైఎస్‌కున్న పలుకుబడి క్షీణించిందని, దీనివల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని మేలు జరుగుతుందని కిరణ్‌కుమార్‌డ్డి రాష్ర్ట్ర ఇన్‌చార్జి వద్ద గట్టిగా వాదించి, రాష్ట్రంలో తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా కమిటీ నిర్మాణం జరిగేందుకు విజయవంతంగా కృషి చేసినట్టు చెబుతున్నారు.
వైఎస్ అత్యధిక ప్రచారం చేసుకున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకం, రాజీవ్ ఉద్యోగశ్రీ, పావలా వడ్డీకే రుణాలు తదితర కార్యక్షికమాలు పూర్తిస్థాయిలో మార్చివేసి, వైఎస్ పథకాలు రాష్ట్రంలో లేకుండా చేసినట్టు ఆయన అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నారని అంటున్నారు. వాటి స్థానంలో రూపాయికే కిలో బియ్యం, రాజీవ్ ఉద్యోగ కిరణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తూ వాటిని కాంగ్రెస్ పథకాలుగా రాష్ట్ర ప్రజలు గుర్తించేలా ప్రచార కార్యక్షికమాన్ని ముమ్మరం చేసినట్టు కూడా కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానానికి వివరించినట్టు సమాచారం.
దీంతో కిరణ్‌కుమార్‌డ్డి అభీష్టం మేరకే సమన్వయ కమిటీ ఏర్పాటైందని, పీసీసీ అధ్యక్షుని హోదాలో కమిటీ సభ్యునిగా ఉన్న బొత్స సత్యనారాయణ మినహా ఇతరుపూవరూ కిరణ్‌కుమార్‌డ్డికి ప్రతికూలంగా మాట్లాడే అవకాశం లేదని, దీంతో ముఖ్యమంత్రి తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా కమిటీకి రూపకల్పన జరిగిందని భావిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అధ్యక్షతన జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో ఆజాద్ ముందు బొత్స సత్యనారాయణ పెద్దగా నిరసనలు తెలిపే అవకాశాలుండవని, అంతా తూతూమంవూతంగా జరుగుతుందనే అభివూపాయం వ్యక్తమవుతోంది.
Take By: T News
0 comments:
Post a Comment