నేడు ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణపై జాతీయ, ప్రాంతీయ నేతలతో భేటీ
హైదరాబాద్, నవంబర్ 20 (): టీఆర్‌ఎస్ అధినేత, పార్లమెంట్ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న జాతీయ పార్టీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమవనున్నారని సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో మద్దతు తెలిపే పార్టీలతో కలిసి పార్లమెంటులో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయంపై ఇందులో చర్చిస్తారని తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం టీ ఉద్యోగులు 42 రోజులు సకల జనుల సమ్మె చేసినా.. కేంద్రం పూర్తి స్థాయిలో స్పందించలేదు. దీనికి తోడు తెలంగాణ వాదులు, టీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. తెలంగాణకు అనుకూలంగా 30కి పైగా పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవల సొంత పార్టీ నేతలతో తెలంగాణ విషయంపై చర్చలు జరిపింది. ప్రస్త్తుతం మరికొన్ని పక్షాలతో కూడా చర్చల ప్రక్రియ కొనసాగిస్తోంది. కాగా, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకుండా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణవాదులు మండి పడుతున్నారు.
ఇదే సమయంలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండటం, బీజేపీ తెలంగాణ విషయంలో సావధాన తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ పార్లమెంట్‌లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ముందుగా బీజేపీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో తెలంగాణవాదులపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించినా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎత్తివేయక పోగా.. టీ ఉద్యమకారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్‌లో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంట్ సమావేశాలు కూడా వాడివేడిగా సాగే అవకాశం ఉంది.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, KCR,
0 comments:
Post a Comment