తిరుగులేని మాయాస్త్రం విభజనం
-కామ్ ఖతం.. ఖేల్ షురూ
- యూపీ విభజన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
- ప్రతిపక్షాల ‘అవిశ్వాసం’ ముందుకు రాకమునుపే
పావులు కదిపిన సీఎం మాయావతి
- సభలో గందరగోళం.. స్పీకర్‌పైకి కాగితపు ఉండలు
- మూజువాణితో తీర్మానం ఆమోదం
- ఇది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం: మండిపడ్డ ప్రతిపక్షాలు
- జనం కోసమే.. ఆకాంక్షల మేరకే: తిప్పికొట్టిన సీఎం
- ఎన్నికల్లో ప్రజలు ప్రతిస్పందిస్తారని వ్యాఖ్య
లక్నో, నవంబర్ 21:ఉత్తరవూపదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం ప్రతిపక్షాలను ఊహించనిరీతిలో దెబ్బకొట్టారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాలు భావించగా, రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విడదీయాలన్న తీర్మానాన్ని ఆమె సోమవారం శాసనసభలో మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదావేయడంతో ప్రతిపక్షాలు బిత్తరపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ముఖ్యమంత్రి చర్య దారుణమని, రాజ్యాంగ నియమాలను అనుసరించలేదని ములాయం సహా కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ, బీజేపీ నేత ముఖ్తార్ అబ్వాస్ నక్వీ తీవ్రంగా ప్రతిస్పందించారు.
మాయావతి చర్యను ప్రజాస్వామ్య హత్యగా, రాజకీయ డ్రామాగా, పక్కదారిపట్టించే ఎత్తుగడగా అభివర్ణించారు. సభ కార్యకలాపాలను రద్దుపరచి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అందుకు ఒక విధానాన్ని అనుసరించాలని పలు పార్టీలు పేర్కొన్నాయి. విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న మాయావతికి అనూహ్యంగా ఎస్పీ మాజీ నేత, ములాయం మాజీ సన్నిహితుడు అమర్‌సింగ్ నుంచి మద్దతు లభించింది. ఆయన మాయావతి పక్షం నిలిచారు. సోషలిస్టు రాంమనోహర్ లోహియా కూడా చిన్న రాష్ట్రాలవైపేనని పేర్కొన్నారు. ములాయం వ్యాఖ్యలతోపాటు ప్రతిపక్షాల విమర్శలను మాయావతి తోసిపుచ్చారు. వీటికి ఎన్నికల్లో ప్రజలు ప్రతిస్పందిస్తారని, సరైన బదులిస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చిన్న రాష్ట్రాల డిమాండ్‌కు అనుకూలంగా మాయావతి ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
ఉత్తరవూపదేశ్‌ను పూర్వాంచల్ (తూర్పు యూపీ), హరిత్ ప్రదేశ్ (పశ్చిమ యూపీ), బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్ (మధ్య యూపీ) అనే నాలుగు రాష్ట్రాలుగా విడదీయాలని ఆమె నిర్ణయించుకున్నారు. తన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోనందునే ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఉదయం శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రతిపక్షాల నినాదాలు, కేకల మధ్య ఉద్రిక్త పరిస్థితిలో ప్రారంభమయ్యాయి.
మాయావతి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు బీజేపీ, ఎస్పీ ప్రయత్నించాయి.బీజేపీ సభ్యులు స్పీకర్ ముందుకు దూసుకురాగా, ఎస్పీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి సభలో పూర్తి మెజారిటీ ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి లాల్జీ వర్మ ప్రకటించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. గందరగోళం మధ్య స్పీకర్ సుఖ్‌దేవ్ రాజ్‌భర్ ప్రశ్నోత్తరాల కార్యక్షికమాన్ని మధ్యాహ్నం 12.20 వరకు వాయిదా వేశారు. సభ మళ్ళీ ప్రారంభం కాగానే, ముఖ్యమంత్రి మాయావతి సమక్షంలో ఎస్పీ, బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టారు. సభ మధ్యలోకి దూసుకొచ్చారు. సభ్యులు స్పీకర్‌పైకి కాగితపు ఉండలు విసురుతుంటే మార్షల్స్ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో సభ 2012-13 సంవత్సరానికి సంబంధించిన మొదటి నాలుగు నెలల ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదం పొందింది. ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత ప్రమోద్‌తివారీ ఆరోపించారు.
ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరగాలనే విభజనను కోరుతున్నట్లు ముఖ్యమంత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రాన్ని విడదీసే తీర్మానం ఆమోదం పొందింది. ఇది బీఎస్పీ రాజకీయ ప్రతిపాదన కాదు. మా ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోనందునే మేమిలా చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రయోజనార్థం విడదీసే చర్య చేపట్టి ఉత్తరవూపదేశ్ శాసనసభ తన విధిని నిర్వర్తించింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘సముచిత రీతిలో ఉత్తరవూపదేశ్, ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం అవసరం’’ అని ఆమె స్పష్టం చేశారు. తన ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్న సమాజ్‌వాదీ, బీజేపీల వాదనను ఆమె తోసిపుచ్చారు.
అది ఆధారరహితమని కొట్టిపడేశారు. ‘‘బీఎస్పీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శ రాజకీయ దురుద్దేశపూరితమైనది. బలహీనపరచాలనే ప్రయత్నమది. చీలికను ప్రతిపక్షాలు అంగీకరించవు.. ఎందుకంటే- అవి రాష్ట్ర ప్రగతిని కోరుకోవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అక్కడ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామాలిచ్చారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం కూడా మైనారిటీలో పడిందని అనందుకుని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మాయావతి మండిపడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ఎంపీలు అవినీతి ఆరోపణలతో జైలు ఊచల వెనుక ఉన్నారు. కాంగ్రెస్‌గానీ, ఇతర పక్షాలుగానీ కేంద్రంలోని ప్రభుత్వం మైనారిటీలో ఉందని అనడం లేదు’’ అని ఆమె అన్నారు.
రాష్ట్రాన్ని విడదీయాలన్న ప్రతిపాదన రాజకీయపరమైనదన్న ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. శాంతిభవూదతల క్షీణత, అభివృద్ధి మందగమనం నుంచి దృష్టి మళ్ళించేందుకే ఇలా చేశారన్న విమర్శలను ఆమె కొట్టి పడేశారు. ‘‘ఉత్తరవూపదేశ్ ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు బదులిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.
నియంతృత్వం.. మాయావతి హిట్లర్
ఉత్తరవూపదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విడదీయాలన్న తీర్మానాన్ని మాయావతి ప్రభుత్వం మూజువాణి ఓటుతో ఆమోదింపజేయడాన్ని, శాసనసభను నిరవధికంగా వాయిదా వేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆమె నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ ఈ పరిణామంపై ప్రతిస్పందిస్తూ మాయావతిని హిట్లర్‌తో పోల్చారు. మాయావతి నియంతృత్వ పాలనాతీరుకు ఇది మరో దృష్టాంతమని బీజేపీ నేత సిద్ధార్థ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. తీర్మానాన్ని ఆమోదించడం దిగ్భ్రాంతికరమైన చర్య అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయమంత్రి ఆర్‌పీఎన్ సింగ్ పేర్కొన్నారు. మాయావతి ముందుగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిందని వ్యాఖ్యానించారు.
యూపీ చీలితే.. లాభమెవరికి? నష్టమెవరికి?
ఉత్తరవూపదేశ్ విడిపోతే రాజకీయంగా లబ్ధి పొందేది, నష్టపోయేది ఏయే పార్టీలనేది ఇప్పుడు చర్చనీయమవుతోంది. బీఎస్పీ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మాయావతి లబ్ధిపొందుతారనేది స్పష్టం. ఆమెకు బలమైన ఓటు బ్యాంకయిన దళితులు రాష్ట్రమంతా సమంగానే విస్తరించి ఉన్నారు. అందువల్ల ఆమె భారీగా లాభపడే అవకాశముంటుంది.
ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి కీలకమైనవి 8.7శాతం ఉన్న యాదవుల ఓట్లు. అవి అన్ని ప్రాంతాల్లో సమంగా లేవు. తూర్పు యూపీలో, ఎటావాలో ఎక్కువున్నాయి. రాష్ట్రీయ లోక్‌దళ్ పశ్చిమ యూపీలో హరిత్ ప్రదేశ్‌ను కోరుకుంటోంది. జాట్లు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆ పార్టీ ప్రయోజనం పొందవచ్చు. బీఎస్పీలాగే కాంగ్రెస్‌కు కూడా అన్ని ప్రాంతాల్లో ప్రభావమున్నప్పటికీ, అది చాలా స్వల్పం. అందువల్ల లబ్ధి చేకూరకపోవచ్చు. తూర్పు యూపీలో రాజ్‌పుత్, బ్రాహ్మణుల కారణంగా బీజేపీ ప్రభావముంటుంది.
ఏ పార్టీ బలమెంత?ఉత్తరవూపదేశ్‌లోని మొత్తం 404 అసెంబ్లీ స్థానాల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 219 సీట్లున్నాయి. ఎస్పీకి 88, బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 20, ఆర్‌ఎల్‌డీకి 10, ఆర్‌ఎస్‌పీకి 1, ఇండిపెండెంట్లకు 9స్థానాలున్నాయి. మరో 8 ఖాళీగా ఉన్నాయి.
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, Uttar Pradesh Assembly, Mayawati,
0 comments:
Post a Comment